సంపాదకీయం

వడ్డీల ‘వైచిత్రి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలకు దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ప్రాధాన్యం లభించింది. రిజర్వు బ్యాంకు వారు ‘వడ్డీ’ శుల్కాన్ని- ఇంటరెస్ట్ రేట్- రిపోరేట్-ను పెంచారు. వడ్డీ రేట్లు పెరగడం వల్ల ధరలు తగ్గుతాయన్నది వౌలిక ఆర్థిక సూత్రం. ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇందుకు వ్యతిరేకంగా వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ధరలు, ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతాయట! ద్రవ్యోల్బణం, ధరలు ఆకాశమెత్తునకు లేచినపుడల్లా వాటిని తగ్గించడానికై రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం వారు వడ్డీరేట్లను పెంచుతున్నారు. దశాబ్దుల తరబడి కొనసాగుతున్న తతంగం ఇది. ద్రవ్యోల్బణాన్ని, ధరలను అదుపు చేయడానికి మన ఆర్థిక వ్యవస్థలో నిహితమై ఉన్న ఏకైక పరిష్కార ప్రత్యామ్నాయం వడ్డీని పెంచడం. ఇప్పుడు పెట్రోలు ధరలు, అనుబంధ ఇంధనం ధరలు అంబరాన్ని పట్టుకొని వేలాడుతున్నాయి, ససేమిరా దిగనంటున్నాయి. 2014 నుంచి నిరంతరం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వు బ్యాంకు వారు నాలుగేళ్ల తర్వాత వడ్డీని పెంచారు. ఇలా పెంచడానికి బహుశా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉంటుంది- విధిలేని పరిస్థితిలో! వడ్డీరేట్లను తగ్గించడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండడం ఏళ్ల తరబడి నడుస్తున్న చరిత్ర. ఎందుకంటే వడ్డీరేట్లు తక్కువగా ఉండడం వల్ల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుందట! తద్వారా ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగి ‘స్థూల జాతీయ ఆదాయం’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ- పెరుగుదల శాతం వేగవంతం అవుతుందట! ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడాని కంటే జీడీపీ పెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. జీడీపీ పెరగడం వల్ల అంతర్జాతీయంగా మన ప్రతిష్ఠ పెరుగుతుంది.. పరపతి నిర్థారక సంస్థలైన ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటివి మన ‘పరపతి స్థాయి’ పెరిగినట్టు ప్రకటిస్తాయి! తద్వారా విదేశాల నుంచి తండోపతండాలుగా వాణిజ్యపు తండాలు తరలివచ్చి మన దేశాన్ని పెట్టుబడులతో ముంచెత్తుతాయి. జీడీపీ మరింత పెరుగుతుంది.
పెట్టుబడులు పెరగడానికి వీలుగా వడ్డీలను తగ్గించాలన్నదే ప్రభుత్వాల విధానం. వడ్డీలు తగ్గడం వల్ల బ్యాంకుల్లో ‘జమ’ చేయడం తగ్గిపోయింది. బ్యాంకుల్లో జమకాని ఈ డబ్బు పెట్టుబడి రూపంలో చెలామణిలో ఉంటుంది. వడ్డీ తగ్గడంతో మదుపరులు ఉత్సాహంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని పెట్టుబడులు పెడతారు. ఫలితంగా పెట్టుబడులు, సమాజంలో ద్రవ్యం చెలామణి పెరుగుతాయి. కానీ ద్రవ్యం చెలామణి పెరగడం వల్ల వస్తువులను ధారాళంగా కొనేవారి సంఖ్య పెరిగి కూరగాయల నుండి బంగారం వరకు, పప్పుల నుంచి పెట్రోలు వరకు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. పెరిగినప్పటికీ ఫరవాలేదు, పెట్టుబడులే ప్రధానం అన్నది ప్రభుత్వాల విధానం. అందువల్లనే వడ్డీని తగ్గించి తీరాలని 2004-2014 సంవత్సరాల మధ్య కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, 2014 మే 26 తర్వాత భాజపా ప్రభుత్వం రిజర్వు బ్యాంకును పదే పదే పురికొల్పాయి. 2014 నుంచి దాదాపు ఏడుసార్లు వడ్డీని తగ్గించిన రిజర్వు బ్యాంకు వారు ఇప్పుడు వడ్డీని పెంచడం ఆశ్చర్యకరం..
ఆశ్చర్యకరమైనప్పటికీ ఇలా ఇప్పుడైనా వడ్డీ పెరగడం హర్షణీయం. 2014 జనవరి 29న రిజర్వు బ్యాంకు వడ్డీని పెంచింది. ‘రిపో’ను ఇరవై ఏదు వౌలిక బిందువుల- బేసిక్ పాయింట్స్- మేర పెంచడం వల్ల వడ్డీ ఎనిమిది శాతానికి చేరింది. రిజర్వు బ్యాంకు వద్ద వాణిజ్య బ్యాంకులు తీసుకునే నిధులపై రిజర్వు బ్యాంకుకు లభించే వడ్డీని ‘రిపో’ అంటున్నారు. రిజర్వు బ్యాంకు వద్ద వాణిజ్య బ్యాంకులు అట్టిపెట్టే నిధులపై వాణిజ్య బ్యాంకులకు రిజర్వు బ్యాంకు చెల్లించే వడ్డీని ‘రివర్స్ రిపో’ అంటున్నారు. ఈ ఆంగ్ల పదజాలానికి భారతీయ భాషల్లో సమానమైన పదజాలం ఏర్పడక పోవడం దశాబ్దులుగా అర్థం కాని ఆర్థిక ప్రహేళికలో భాగం! ద్రవ్యోల్బణం తగ్గడానికి వడ్డీ రేట్లు పెంచడం తప్ప మరో మార్గం ఇంతవరకు కనపడకపోవడం అంతర్జాతీయ అనుసంధానం ఫలితం. అలా వడ్డీ రేట్లు పెంచితే పెట్టుబడులు తగ్గిపోవడం, జీడీపీ తగ్గడం... ‘పెళ్లి కుదిరితే కాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కాని పెళ్లి కుదరదు’. రెండూ కుదిరేలా ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం ఎందుకని ఏర్పడలేదు? దశాబ్దులుగా ఈ ఆర్థిక సమన్వయం ఎందుకు సిద్ధించలేదు? వడ్డీరేట్లు తగ్గించడం.. ఫలితంగా పెట్టుబడులు పెరిగిన భ్రాంతి ఏర్పడడం, ధరలు-ద్రవ్యోల్బణం పెరగడం.. మళ్లీ వడ్డీ రేట్లు పెంచడం.. ద్రవ్యోల్బణం, ధరలు తగ్గడం, పెట్టుబడులు తగ్గాయన్న గోల ప్రారంభం కావడం.. ‘పునరపి మరణం పునరపి జననం..’- మళ్లీ మరణించడం.. మళ్లీ జన్మించడం- అన్నట్టుగా దశాబ్దుల తరబడి కొనసాగుతున్న ప్రహసనం ఇది. ద్రవ్యోల్బణం, ధరలు పెరగని రీతిలో పెట్టుబడులు, ఉత్పత్తులు, ఎగుమతులు, జీడీపీ పెరిగేలా మన ఆర్థిక వ్యవస్థ ఎందుకని సమగ్ర వికాసం సాధించలేదు? బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగడం వల్ల పొదుపుఖాతాల్లో జమకట్టే కోట్ల రూపాయల వల్ల మరింత మంది ఖాతాదారులకు మేలు కలుగుతుంది. 2014 నుంచి వడ్డీ ఎనిమిది శాతం నుంచి ఆరు శాతానికి పడిపోవడం నాలుగేళ్ల వైపరీత్యం. పోస్ట్ఫాసులలో జమ అవుతున్న చిన్న మొత్తాలపై సైతం కేంద్రం గత ఏడాది వడ్డీని తగ్గించింది. ఇలా వడ్డీని తగ్గించడం వల్ల ఇళ్లు కట్టుకునే వారికి తక్కువ వడ్డీలపై రుణాలు లభించడం హర్షణీయం. కానీ పొదుపు ఖాతాల్లో చిన్న మొత్తాలను జమచేస్తున్న వారితో పోలిస్తే గృహరుణాలను పొందేవారి సంఖ్య చాలా తక్కువ. పొదుపు ఖాతాల్లో జమ చేస్తున్నవారికి, కాలవ్యవధి ముగిసేవరకూ బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో డబ్బును దాచుకుంటున్న వారికి- టర్మ్ డిపాజిట్ హోల్డర్స్‌కు ఎక్కువ శాతం వడ్డీలను చెల్లిస్తూనే గృహ నిర్మాణం కోసం మధ్య తరగతి, పేదవర్గాల వారికి అతి తక్కువ వడ్డీపై రుణాలను ప్రదానం చేసేలా సమన్వయ వ్యవస్థను ఎందుకు ఇంతవరకు ఏర్పరచుకోలేదు? ఇప్పుడు రిజర్వు బ్యాంకు వడ్డీని పెంచాక కూడ 2014 నాటితో పోలిస్తే వడ్డీ శాతం చాలా తక్కువ. 2014లో 8 శాతం.. ఇప్పుడు పెరిగిన తరువాత ఆరుంబావు శాతం!
మన ఆర్థిక వ్యవస్థ మన అంతర్గత అవసరాలకు అనుగుణంగా స్వజాతీయ పద్ధతులతో రూపొందించక పోవడం ఈ వైపరీత్యానికి కారణం. కోట్ల మంది వ్యవసాయదారుల కలాపాల ప్రాతిపదికగా గాక, స్టాక్ మార్కెట్లలోని వేలమంది దళారుల ప్రయోజనాల ప్రాతిపదికగా ఆర్థిక సూచికలు, గణాంకాలు రూపొందుతున్నాయి. ‘రూపాయి’ ప్రాతిపదికగా గాక అమెరికా డాలర్ ప్రాతిపదికగా ఆర్థిక ఆర్భాటం నడుస్తోంది..!