సంపాదకీయం

బ్యాలెట్ వీడి.. బుల్లెట్‌తో రాజ్యాధికారమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ ప్రత్యర్థులను నిర్మూలించి రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు ప్రపంచ చరిత్రలో కొత్తేమీకాదు. మహానేతలు అబ్రహాం లింకన్, కెన్నడీ వంటి వారెందరో హత్యా రాజకీయాలకు బలైపోయారు. మన దేశానికి సంబంధించినంతవరకు శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారెందరో ఉగ్రవాదానికి ప్రాణాలు కోల్పోయారు. అయినా మానవ సమాజం గుణపాఠాలు నేర్చుకోలేదు. బ్యాలెట్ ద్వారా కాకుండా బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం సంపాదించాలని మావో ప్రతిపాదించాడు. ‘పవర్ ఫ్లోస్ త్రూ బారల్ ఆఫ్ ది గన్’ అనే సిద్ధాంతాన్ని జీహాదీ ఉగ్రవాదులు, మావోయిస్టులు తమ ప్రత్యర్థులను అంతం చేసేందుకు అతి కిరాతకంగా అమలు చేస్తున్నారు.
ఇటీవల మహారాష్టల్రో పూణె పోలీసులు కొందరు ఉగ్రవాదులను అరెస్టు చేసి విచారిస్తుండగా వారికి కొంత రహస్య సమాచారం లభించింది. వారి లాప్‌ట్యాప్‌లలో కొన్ని లేఖలు లభించాయి. అందులో ఒకటి 2017 ఏప్రిల్ 18న ప్రకాశ్ రానా విల్సన్‌కు వ్రాసింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....
* రాజీవ్ గాంధీని రోడ్ షో సందర్భంగా ఎల్‌టిటిఇ తీవ్రవాదులు హత్య చేశారు. అదే తరహాలో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీని- ఎన్నికల ప్రచారం సందర్భంగా రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు హత్య చేయాలి.
* కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు (ప్రస్తుత ఉప రాష్టప్రతి), రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖ నాయకులను హత్య చేయాలి.
* ఈ హత్యలకు అవసరమైన తుపాకులు, భారీగా పేలుడు సామగ్రిని కొనేందుకు నిధులు అందుతున్నాయి. వాటిని కాంగ్రెస్ పార్టీ మనకు సమకూరుస్తుంది.
* భావసారూప్యం గల ఇతర పార్టీలతో సంప్రదించి సాయుధ పోరాటం సాగిద్దాం.
* దళితోద్యమాలను ముసుగులుగా వాడుకుందాం. దేశవ్యాప్తంగా అరాచకం సృష్టిద్దాం.
* అడవిలోని ‘అన్న’లతోబాటు అర్బన్ (పట్టణ) ‘అన్న’లు, మానవ హక్కుల సంఘాల నాయకులు మనకు సహకరిస్తారు.
* ప్రొఫెసర్ సాయిబాబా వంటి మావోయిస్టు సానుభూతిపరులను విడిపించేందుకు పూర్తి ఆర్థిక సహాయం, న్యాయ సహాయం అందచేయబడుతుంది.
* విప్లవ గీతాలు పాడి.. జనాన్ని ఆకర్షించండి. (ఈ లేఖలో కొన్ని మరాఠీ గీతాలు ఉన్నాయి.)
కాగా, పూణె పోలీసులకు లభించిన లేఖలపై వివిధ ప్రసార మాధ్యమాలలో జరిగిన చర్చలలో సునీల్ చోప్రా, ప్రొఫెసర్ విశే్వశ్వరరావువంటి ప్రముఖులు ఇదంతా పోలీసుల అభూతకల్పనలేనని కొట్టిపారేశారు. ఆదివాసులకు మానవ హక్కులు ఉండవా? అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిని హత్యచేయాలనుకోవటం తగునా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా- ‘ఇది కేవలం రాజకీయ స్టంట్.. మోదీకి తగ్గిపోతున్న పాపులారిటీని పెంచుకోవటం కసమే ఈ నాటకం’ అన్నారు.
గతంలో తిరుపతిలోని అలిపిరి వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును, నెల్లూరు జిల్లా వాకాడు వద్ద కాంగ్రెస్ నాయకుడు నేదురుమల్లి జనార్దన రెడ్డిపైనా హత్యాప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ నేత మాగంటి సుబ్బరామిరెడ్డి, పోలీస్ ఉన్నతాధికారి కెఎస్ వ్యాస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి వంటి వారెందరో ఉగ్రవాదానికి బలైపోయారు. అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ, అభివృద్ధి మంత్రం వంటివన్నీ శుద్ధ దండగ- అని ఉగ్రవాదులు నమ్ముతున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇజ్రత్ జహానా అనే బిహార్ ఉగ్రవాద నాయకురాలు హత్యాప్రయత్నం చేసి ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. ఈ హంతకులకు కాంగ్రెస్ సీనియర్లు దిగ్విజయ్‌సింగ్ వంటివారు మద్దతు ఇచ్చారు.
పూణెలో పోలీసులకు లభించిన లేఖలలో బ్రదర్ ఆనంద్, మనోజ్, వరవరరావు వంటి పేర్లు కనిపించాయి! యుఎస్‌డిఎఫ్ అనే నిషిద్ధ విద్యార్థి సంస్థ పేరు ఇందులో ఉంది. ‘మోదీ జగన్నాథ రథాన్ని ఆపివేయండి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘మోదీని నూటొక్కసార్లు కాల్చి చంపండి’ అని సిపిఐ నాయకుడు కె.నారాయణ ఆమధ్య రాజమండ్రిలో పత్రికా విలేఖరుల సమావేశంలో చేసిన బహిరంగ ప్రకటన గుర్తుచేసుకోవలసి ఉంటుంది. ఇటీవల కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే లోక్‌సభలో మాట్లాడుతూ, ‘రక్తపాతం సృష్టింపబడుతుంది’ అనడం గమనార్హం. ఆయన కర్నాటక ప్రాంతానికి చెందిన లింగాయత్ వీరశైవ దళిత నాయకుడు. రాహుల్ గాంధీని ఎంతకైనా తెగించి ప్రధానమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నాడు.
సునీల్ చోప్రా, స్వామి అగ్నివేశ్, జిగ్నేశ్ మెమాని (గుజరాత్ ఆయుధాల బ్రోకర్) అరుంధతి రాయ్ (కేరళ) వంటివారు ఈ హత్యా రాజకీయాలకు బహిరంగంగా మద్దతును ప్రకటించారు. పూణెలో పోలీసులు అరెస్టు చేసిన నేతలు భీం, కోరేంగాం అల్లర్ల సందర్భంగా విచారణను ఎదుర్కొంటున్నారు. సుధీర్ ధావాలే, సురేంద్ర గాడ్జింగ్, మహేశ్ రౌత్, సోమా సేన్, రోనా విల్సన్ వంటివారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. ఆధునిక మారణాయుధాల సేకరణకు ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం అంటూ రోనా విల్సన్ అనే వ్యక్తి ప్రకాశ్‌కు ఈ లేఖ వ్రాసినట్లు పోలీసు వర్గాల సమాచారం. ‘నా పేరు అనవసరంగా ఇరికించారు. భారత ప్రధానిని చంపేటంత సామర్థ్యం మావోయిస్టులకు ఎక్కడిది?’ అని ‘విరసం’ నాయకుడు వరవరరావు అన్నారు. తెలంగాణలోనూ కొందరు ప్రముఖ నేతలకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న అనుమానాలు లేకపోలేదు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పదవీ భ్రష్టుణ్ణి చేస్తాను’ అని తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించటం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోదండరాంను ఆయుధంగా ఉపయోగించుకొని తెరాస ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటున్నట్లు కొన్ని వార్తలు సూచిస్తున్నాయి.
తెలంగాణలోని మానుకొండూరులో ‘ప్రజా యుద్ధనౌక’ గద్దర్ మాట్లాడుతూ ‘బహుజనాల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు’ అని ఆరోపించారు. ఈ సమావేశం టి.మాస్ మద్దతుతో జరిగింది. లోగడ క్రైస్తవ మత ప్రచారకుడు కంచె ఐలయ్యకు సైతం టి.మాస్ సంఘీభావం ప్రకటించింది. బిఎల్‌ఎఫ్- టి.మాస్ కన్వీనర్ జాన్‌వెస్లీ, రాష్ట్ర కన్వీనర్ నాగయ్యలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వార్తలను విశే్లషిస్తే.. దళితులు, దళిత క్రైస్తవులు, కమ్యూనిస్టులు- కలిసి ఉద్యమం నడుపుతున్నారని తెలుస్తున్నది. ‘జూన్ 25 నుండి కలెక్టరేట్లను ముట్టిడిద్దాం, రాజ్యాధికారం సాధిద్దాం’ అని గద్దర్ మానుకొండూరు సభలో పిలుపునిచ్చారు.
‘దేశంలో అల్లకల్లోలం సృష్టించండి’ అని కూడా పూణె పోలీసులకు లభించిన రహస్య లేఖలో ఉంది. తదనుగుణంగా బ్యాంకు సమ్మెలు, ఆర్‌టిసి సమ్మెలు, తూత్తుకుడి కాల్పులు, భారత్ బంద్‌లు, రైతుయాత్రలు మొదలైనాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు మరీ భయంకరంగా మారే సూచనలు కన్పడుతున్నాయి. గుజరాత్‌లో జిగ్నేశ్ మెమానీ, ఢిల్లీలో కేజ్రీవాల్, బెంగాల్‌లో మమతాబెనర్జీ, కేరళలో పినరయి విజయన్, కోజికోడ్ బాలకృష్ణ వంటివారిని ప్రభుత్వాలు ఎలా ఎదుర్కోబోతున్నాయి?
గుజరాత్‌లో పాటీదార్ ఉద్యమం నేత హార్ధిక్ పటేల్‌తో కలిసి ఆయుధాల వ్యాపారి జిగ్నేశ్ మెమన్ పనిచేయటం ఇటీవలి సంఘటనయే. ‘హిందూ సామాజిక కార్యకర్తలను హత్యచేసి ఉప్పుబస్తాలల్లో కట్టి కాలువల్లో పడేయండి’-అని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం నేత విజయన్ ప్రకటించాడు. ‘్భరతదేశాన్ని ముక్కలు చేయండి’ అని జెఎన్‌యు (న్యూఢిల్లీ) విద్యార్థి నాయకుడు కన్నయకుమార్ గతంలో జరిగిన ఊరేగింపులో బహిరంగంగా ప్రకటిస్తే దానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఏచూరి సీతారాం వంటి నేతలు మద్దతు ఇచ్చారు. అంటే భారతదేశాన్ని ఇటు చైనా అటు పాకిస్తాన్ ప్రత్యక్షంగా శాసిస్తున్నాయని అర్థమవుతూ వుంది. కరాచీ పోర్టు నుండి చిట్టగాంగ్ ద్వారా జీహాదీ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ఉగ్రవాది మెమన్ సోదరుడి వల్ల వెల్లడైంది. ఈ సంకట స్థితిని భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది?
వాటికన్ కుట్ర...
ప్రఖ్యాత రచయిత్రి అరుంధతీ రాయ్ (కేరళ), జాన్‌దయాళ్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నాయకులు భారత్ దుర్మార్గపు దేశం అని చెపుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? అంటే 1947లో భారత్ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందింది. 2019లో మోదీని ఓడిస్తే తిరిగి ఈ దేశాన్ని వాటికన్ చేతిలోకి తీసుకొని పోవచ్చు. అందుకు చైనా సహాయం చేస్తున్నది. రాబోయే రోజులలో రాజకీయాధికారం కోసం జిగ్నేశ్ మెమానీ, పినరయి విజయన్, మమతాబెనర్జీలు రాజకీయంగా విద్వేషాలను ప్రోత్సహించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. దీనిని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం గమనించవలసి ఉంది. ‘మనం ఎంతకైనా తెగించి మోడీని ఓడించి రాహుల్‌గాంధీని గెలిపించుకోవాలి’ అని సోనియాగాంధీ స్పష్టంగా తన అనుచరగణానికి సందేశం పంపింది.
9 జూన్ 2018 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, తనకు ఉగ్రవాదులనుండి బెదిరింపు ఉత్తరాలు వచ్చినట్లు చెప్పారు. ప్రముఖ ఇంగ్లీషు న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్న యాంకర్ ఆర్ణవ్ గోస్వామికి కూడా ఉగ్రవాదుల నుండి బెదిరింపులు వచ్చాయి. ప్రధానమంత్రి మోదీకి భద్రత పటిష్టం చేస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ జమ్మూలో చెప్పారు. లోగడ రాజీవ్‌గాంధీకి భద్రత లేకపోవటం వల్లనే హతుడైనాడా? ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకుడే కాల్చి చంపాడు.
సారాంశం ఏమంటే ‘ఉగ్రవాదం’ అనే భావం మానవ సమాజంలో లేకుండా చూడాలే కాని భద్రతాదళాలను వీవీఐపీల చుట్టూ అదనంగా పెంచినందువల్ల ప్రయోజనం ఉండదు. ఇండియాను మరొక సిరియాలా, ఆప్ఘనిస్థాన్‌లా మార్చాలని బీజింగ్- ఇస్లామాబాద్‌లు నిర్ణయించాయి. ‘పూణె పోలీసులకు లభించిన ఈ ఉత్తరాలన్నీ అసత్యాలు- మమ్మల్ని ఇరికించటం కోసం పోలీసులే సృష్టిస్తున్నారు’ అని పౌర హక్కుల సంఘాల వారు అంటున్నారు. ఉత్తరాలు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. పూర్తి నిజానిజాలు కోర్టు విచారణలో తేలవచ్చు. ఒక హిందీ ఉత్తరం, రెండు ఇంగ్లీషు ఉత్తరాల్లో చాలా పేర్లు కన్పడుతున్నాయి. ‘అంబేద్కర్‌ను ముసుగులా వాడుకోండి. దళితులను రెచ్చగొట్టి ఉద్యమాలు, అల్లర్లు సృష్టించండి’- అనేది ఈ ఉత్తరాల సారాంశం.
గత ఐదు సంవత్సరాల్లో ఈశాన్య ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థలు కొంత అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, తెలంగాణ ప్రాంతాల్లో చైనా ప్రేరేపిత ఉగ్రవాద దళాలు సక్రియాత్మకంగా ఉన్నాయి. ఇందులో అండర్‌గ్రౌండ్ (్ఫరెస్ట్) దళాలు, అర్బన్ ప్రాంతాల్లో సంచరించే దళాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు ఉలిక్కిపడి పూణెలో లభించిన ఉగ్రవాద లేఖలపై దర్యాప్తు మొదలుపెట్టింది. గత కొన్ని దశాబ్దాలుగా జెఎన్‌యు, ఎఎంయు వంటి ప్రముఖ విద్యాసంస్థలను ఉగ్రవాద స్థావరాలుగా మారుస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు జాగ్రత్త వహించలేదు? సాహిత్య, సంగీత అకాడమీలు, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లు ఉగ్రవాద కళాకారుల స్వాధీనంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోలేదు?

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668