సంపాదకీయం

‘తోడేలు’కు కొత్త కోరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాటిమాటికీ ఉల్లంఘిస్తుండడానికి ప్రధాన కారణం మన రక్షణ నీతిని మళ్లీ ఆవహించిన మెతకతనం. 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2013 నుంచి పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. 2014 తరువాత ఈ ఉల్లంఘనలు దాదాపు నిత్యకృత్యమయ్యాయి. మంగళవారం, బుధవారం మధ్య రాత్రి- జమ్మూ కశ్మీర్‌లోని ‘సాంబా’ ప్రాంతంలోని రామ్‌గఢ్ సమీపంలో పాకిస్తాన్ ప్రభుత్వ మూకలు జరిపిన కాల్పులలో మన సరిహద్దు భద్రతా దళానికి- బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు- చెందిన నలుగురు సైనికులు అమరులు కావడం మన ప్రభుత్వం పాకిస్తాన్‌ను విశ్వసించిన ఫలితం! కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్టు పదే పదే ప్రకటించడం, మళ్లీమళ్లీ ఉల్లంఘించడం పాక్ విధానమైంది. ఇస్లాం మతస్థుల పండుగ నెల రంజాన్ సందర్భంగా జిహాదీ బీభత్సకారులను గాలించే చర్యలను, వారిని పట్టుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మన ప్రభుత్వం ప్రకటించింది. జిహాదీలు మాత్రం మన భద్రతా దళాలపైన, సైనికులపైన దాడులు ఆపలేదు. రంజాన్ నెల పొడవునా జిహాదీ ఉగ్రమూకలు మన భద్రతాదళాలపై దాడులు జరపడం ప్రభుత్వం గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసిన ఫలితం. కశ్మీర్‌లోని ఫుల్వామా, అనంతనాగ్ జిల్లాలలో మంగళవారం జిహాదీలు జరిపిన దాడులకు ఇద్దరు పోలీసులు బలైపోయారు. ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. జిహాదీలపై సైనికులు, పోలీసులు ‘నెల’ పొడవునా దాడులు జరుపబోరని అయితే- టెర్రరిస్టు దాడులు చేస్తే తిప్పికొడతారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ‘దాడుల విరమణ’ భద్రతాదళాలలో గందరగోళాన్ని సృష్టించినట్టుంది. దాడులు చేస్తున్న జిహాదీలను భద్రతా దళాలు తిప్పికొట్టడం లేదు. బలి అవుతున్నారు. ఫుల్వామాలోని ఒక న్యాయస్థానం ప్రాంగణంలోనే ‘టెర్రరిస్టులు’ ఇద్దరు పోలీసులను హత్య చేయడం సరికొత్త సాక్ష్యం. హతులైన పోలీసుల తుపాకులను జిహాదీలు అపహరించుకొని పోయారు. అదే సమయంలో అనంతనాగ్ జిల్లాలో బీభత్సకారులు ఆరుగురు పోలీసులను గాయపరిచారు.
ఇలా రంజాన్ నెల పొడవునా పాకిస్తాన్ మూకలు ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి- వెలుపలి పాకిస్తాన్ ప్రభుత్వ మూకలు చొరబడి మన దళాలపై దాడులు జరపడం, ‘అధీన రేఖ’ లోపల ‘జిహాదీ’లు పేట్రేగిపోవడం జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న బీభత్స దృశ్యాలు! ఇలా ‘అధీన రేఖ’ ఆవల నుంచి ప్రచ్ఛన్న బీభత్సకారులైన పాకిస్తాన్ సైనికులు- రేంజర్‌లు-, ఈవల ప్రత్యక్ష బీభత్సకారులు చేస్తున్న దాడులను ‘హురియత్’ ముఠాల వారు బహిరంగంగా సమర్ధిస్తున్నారు. ఈ ముఠాలవారు- మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్ నడిపిస్తున్న ‘మెతక’ ముఠావారు, సయ్యద్ షా అలీ జీలానీ పెత్తనం వహిస్తున్న ‘ముదురు’ ముఠావారు- కశ్మీర్ నుంచి మన సైనిక దళాలను ఉపసంహరించాలని కోరుతున్నారు. సైనిక దళాల ఉపసంహరణ జరిగితే కశ్మీర్‌ను మన దేశం నుంచి విడగొట్టాలన్న ‘పాకిస్తాన్ పన్నాగం విజయవంతం కాగలదన్న’ది హురియత్ ముఠాల అంతరంగం. ఇలాంటి ముఠాలను కేంద్ర ప్రభుత్వం దశాబ్దులుగా నియంత్రించకపోవడం కశ్మీర్ కల్లోలకాండకు మరో ప్రధాన కారణం! న్యాయస్థానాలలో దోషులుగా నిర్ధారితమై కటకటాల వెనుక నిలబడి ఉండవలసిన ‘హురియత్’ ముఠాలవారు వేదికలపై నిలబడి నిర్భయంగా, నిర్లజ్జగా దేశవిద్రోహాన్ని ప్రచారం చేస్తున్నారు. తాము భారత రాజ్యానికి నిబద్ధులం కామని, జమ్మూ కశ్మీర్ భారత్‌లో భాగం కాదని వివాదగ్రస్త ప్రాంతమని 1949 నాటి ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ‘కశ్మీర్’లో జనాభిప్రాయ సేకరణ జరగాలని హురియత్ ముఠాల వారు పదే పదే ప్రకటిస్తున్నారు. దురాక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైదొలగాలని, ఆ తరువాత జనాభిప్రాయ సేకరణ జరగాలని 1949 నాటి ‘సమితి’ తీర్మానం నిర్దేశించింది. దురాక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైదొలగలేదు. ‘సమితి తీర్మానం’ అమలు జరగలేదు. 1972 నాటి ‘సిమ్లా ఒప్పందం’ ప్రకారం 1949 నాటి సమితి తీర్మానం రద్దయిపోయింది. ఇలా రద్దయిపోయిన తీర్మానాన్ని అమలు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుడప్పుడు పిచ్చిగా కలవరిస్తోంది, ఈ కలవరింతలు హురియత్ ముఠాల నోట ప్రతిధ్వనిస్తున్నాయి!
ఇటీవల హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘హురియత్’ ముఠాలతో చర్చలు జరుపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి ప్రకటించడం ‘రంజాన్ కాల్పుల’ విరమణకు సమాంతర పరిణామం. యథావిధిగా ఈ ద్వైపాక్షిక చర్చలను జీలానీ తిరస్కరించాడు. పాకిస్తాన్‌ను కూడ కలుపుకొని త్రైపాక్షిక చర్చలను జరపాలన్నది జీలానీ వంటి విద్రోహుల ‘కోరిక’! తద్వారా ‘్భరత్, పాకిస్తాన్‌ల వలె జమ్మూ కశ్మీర్ కూడ మరో ప్రత్యేక దేశం’ అన్న తమ విద్రోహ విషాన్ని జీలానీ మళ్లీ వెళ్లగక్కాడు. జైళ్లలో ఉండవలసిన బీభత్సకారులైన జీలానీ, ఉమర్ ఫారూక్, యాసిన్ మాలిక్ వంటి వారిని యథేచ్ఛగా తిరగనివ్వడం, వారితో చర్చలు జరపాలని భావించడం మన ప్రభుత్వం వారి దశాబ్దుల మెతకతనం! జమ్మూ కశ్మీర్‌లో ఉన్నది ఒక్కటే సమస్య.. అది బీభత్సకాండ. జిహాదీ బీభత్సకాండను అణచివేయడం ఒక్కటే సమస్యకు పరిష్కారం. అధీన రేఖకు ఆవల ఉన్న ‘పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్’ను మళ్లీ స్వాధీనం చేసుకోవాలని 1994లో మన పార్లమెంటు తీర్మానించింది. ఈ తీర్మానం ప్రకారం 1947 నాటి జమ్మూ కశ్మీర్‌ను ఏకీకృతం చేయడానికి మన ప్రభుత్వం యత్నించాలి. ఏకీకృత కశ్మీర్ అనాదిగా మన దేశంలో భాగం. 1947 అక్టోబర్ 26 నాటి విలీనం ఒప్పందం ఈ అనాది వాస్తవానికి ఆధునిక ధ్రువీకరణ! వాస్తవాన్ని అంగీకరించని వారితోను, వాస్తవాన్ని వమ్ముచేయడానికి యత్నిస్తున్నవారితోను ‘చర్చల’ వల్ల ఒనకూడే ప్రయోజనం శూన్యం. ‘చర్యల’ వల్ల మాత్రమే కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొంటుంది. క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది నాటి మహాకవి కాళిదాసు చెప్పినట్టు, ‘ఎంత ఉపకారం చేసినప్పటికీ దుర్జనుడు అపకారం చేయడం మానడు. అపకారానికి దీటుగా అపకారం చేసినప్పుడు మాత్రమే దుర్జనుడు అణగిపోతాడు’’
‘శామ్యేత్ ప్రతి అపకారేణ
న ఉపకారేణ దుర్జనః
ఈ సూత్రాన్ని మన ప్రభుత్వం 2014 నుంచి కొంతకాలం అమలు జరిపింది. 2016 సెప్టెంబర్‌లో మన సైనికులు ‘అధీన రేఖ’ను దాటి వెళ్లి పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోని బీభత్సపుబట్టీలను ధ్వంసం చేసి వచ్చారు. ఈ సాయుధ చికిత్స-సర్జికల్ స్ట్రయిక్- తరువాత జిహాదీ బీభత్సకారులకు, పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న తోడేళ్లకు నడుము విరిగినట్టయింది. మన ప్రభుత్వం ఈ కరకుతనాన్ని మళ్లీ సడిలించింది. బీభత్సకాండను విడనాడే వరకు పాకిస్తాన్‌తో చర్చలు జరుపబోమని మన ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్‌తో కలసి ‘షాంఘయి’ కూటమిలో చేరడం ద్వారా మన ప్రభుత్వం మరోసారి ‘పట్టు’ సడలించింది. పదకొండవ తేదీన చైనాలోని ‘క్షింగ్‌డావో’లో జరిగిన ‘షాంఘయి’ కూటమి సమావేశంలో మన ప్రధాని మోదీ పాకిస్తాన్ అధ్యక్షుడు మామ్‌నూన్ ఉస్సేన్‌తో కరచాలనం చేస్తుండిన సమయంలో సైతం పాకిస్తాన్ దళాలు అధీనరేఖ వద్ద కవ్వింపుకాల్పులు జరిపాయి. ఈ ఏడాది ఇంతవరకు వందసార్లకు పైగా పాకిస్తానీ ముష్కరులు అధీనరేఖ వద్ద మన దళాలపై కాల్పులు జరిపారు. మే 18న ఈ కాల్పులకు నలుగురు పౌరులు కూడ బలికావడం పాకిస్తాన్ బీభత్స స్వభావానికి నిదర్శనం. నిరాయుధులపై హత్యాకాండను సాగించే సైనికులు బీభత్సకారులు.