సంపాదకీయం

ఏరువాక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏరువాక పౌర్ణమి వ్యవసాయ మహోత్సవం! ఉభయ తెలుగు రా ష్ట్రాల ప్రభుత్వాలకు వ్యవసాయ ధ్యాస పెరుగుతుండడం హర్షణీయ పరిణామం. వ్యవసాయం నీటితో ముడివడి ఉంది. నీరు వర్షంతో ముడివడి ఉంది. ‘పర్జన్యాత్ అన్న సంభవః.’- ‘మేఘం వల్ల అన్నం ఉత్పత్తి అవుతోంది’- అన్నది సృష్టిస్థిత వాస్తవం- ‘దేవ మాతృకలు’ కావచ్చు, ‘నదీ మాతృకలు’ కావచ్చు అవి హరిత శోభలకు ఆలవాలం కావడానికి, సస్యభరితం కావడానికి నీరు వౌలిక ఆధారం. తడి తగలనిదే మడి పండదు. నీరు పంటలకు ప్రాణం, సకల జీవజాలానికి నీరు జవం కలిగించే అమృతం. కేవలం వర్షం నీటితో పండుతున్న భూములు ‘దేవమాతృకలు’. వర్షం వల్ల ఏర్పడుతున్న జలాశయాల నీటి ద్వారా పండుతున్న వ్యవసాయ క్షేత్రాలు ‘నదీ మాతృకలు’. ఈ ‘జలాశయాలు’- చెఱువులు, బావులు, కుంటలు, గొట్టపుబావులు.. ఏవైనా కావచ్చు వర్షం వల్లనే ఇవి ఏర్పడుతున్నాయి. అందువల్లనే మేఘానికి ఇంత ప్రాధాన్యం.. కురుస్తున్న వర్షం నదుల రూపంలో పంట పొలాలకు చేరడం ప్రాకృతిక ప్రక్రియకు ఫలశ్రుతి. ‘కాళేశ్వరం’ వంటి నీటి పారుదల పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం, ‘పోలవరం’ నిర్మాణానికి నడుం బిగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ‘్ఫలశ్రుతి’ని ప్రస్ఫుటింపచేయడానికి యత్నిస్తుండడం నిరాకరింపజాలని నిజం! ‘కాకతీయ ఉద్యమం’ ద్వారా తెలంగాణలోను, నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోను సతత హరిత సస్యక్షేత్రాలు సమకూరుతున్నాయి, సమకూరనున్నాయి. మానవ ప్రయత్నం సఫలం కావడానికి ప్రకృతి సహకారం అనివార్యం. ఈ ప్రాకృతిక సహాయం పర్జన్యం.. వర్షం! వర్షాల ఆరంభం రైతులకు ఆనందకరం. ‘వర్షం కర్షకులకు హర్షం’ అన్నది సామెత కాదు, జీవన వాస్తవం. అందువల్లనే తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురుచూస్తారు, జలాశయాలు ఎదురుచూస్తాయి, ఎండిన బీడు భూములు ఎదురుచూస్తాయి, వ్యవసాయ భూములు ఎదురుచూస్తాయి. ‘ముంగారు’ లేదా ‘తొలకరి’ అందువల్లనే వ్యవసాయపు పండుగ, నాగళ్ల పండుగ, ‘మడక’-నాగలి-తో భూమిని దునే్న ఎద్దుల పండుగ. ‘పర్జన్యాత్ అన్న సంభవః’అని యదుకుల కృష్ణుడు ద్వాపర యుగంలో కురుకుల అర్జునునికి చెప్పడం వ్యవసాయ ప్రాధాన్యానికి ప్రతీక, ‘ఏరువాక’ ఈ వ్యవసాయ సంప్రదాయ హరిత రథానికి ‘పతాక’..
ఏఱు-అని అంటే నది, ఏరు-అని అంటే ఎద్దుల సహాయంతో భూమిని దున్నడానికి సిద్ధమైన ‘నాగలి’ లేదా ‘మడక!’ తొలకరి జల్లులతో ‘ఏఱులు’ ప్రవహించడానికి సిద్ధమయ్యే సమయంలోనే, పొలాన్ని దున్నడానికి ‘ఏరులు’ సిద్ధమవుతున్నాయి. ‘ఏరువాక’ అంటే భూమిని దున్ని దుక్కి చేయడానికి ప్రారంభం! ‘ఏరువాక సాగారో రన్నా చిన్నన్నా..’ అన్న చలనచిత్ర గీతంలో ప్రసిద్ధ కవి కొసరాజు దశాబ్దుల క్రితం ఈ తొలకరి గ్రామీణ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించి ఉన్నాడు! ఏరువాక సాగడం ‘ఆర్ద్ర’ కార్తెలో తరతరాలుగా రైతులు జరుపుతున్న భూమి పూజ, పంచభూతాల సమారాధన, ప్రకృతికి నీరాజనం. ‘‘పంచభూత భాసితమైన ప్రకృతి కళ’’ను రాయప్రోలు సుబ్బారావు వివరించి ఉన్నాడు. ఈ పంచభూతాల- నింగి, గాలి, అగ్ని, నీరు, నేల- సమాహారమైన ప్రకృతిలో మానవులు భాగం. పంచభూతాల వల్ల ఏర్పడిన జీవజాలం ఆ పంచభూతాల సహాయం వల్లనే జీవిస్తోంది. జీవజాలంలో శ్రేష్ఠుడైన మానవుడు పంచభూతాలకు కృతజ్ఞతను చెప్పే సందర్భాలు అనాదిగా హైందవ జాతీయ ఉత్సవాలు. ‘ఏరువాక’ అలాంటి జాతీయ ఉత్సవం. నిరంతరం మేలుచేసి బతికించి మనుగడను సాగింపచేస్తున్న పంచభూతాల పట్ల నిరంతరం కృతజ్ఞతాబద్ధులై ఉండడం ఈ జాతీయుల సంస్కారం! అన్నదాతలైన కర్షకులు ఈ జాతీయులలో అత్యధికులు. అందువల్లనే అత్యధికులైన ఈ గ్రామీణుల సంస్కారాల సమాహారం అనాదిగా జాతీయ సంస్కృతిగా వికసించింది. ‘ఏరువాక’ సాగించడం ‘హల ప్రవాహం’- ‘హల చాలనం’- ‘నాగలితో దున్నడం’- ద్వారా నేల తల్లికి భూమిపుత్రులు సమర్పించే వందనం..
ఈ వ్యవసాయ సంప్రదాయంలో ఉపకరణాలను- కాడి, మేడి, మడక, గుంటుక, గూటవ దంతి, కర్రు వంటివి- పూజించడం భాగం, పొలాన్ని దున్నుతున్న బసవన్నలను పూజించడం ప్రధానం. అందుకే ‘ఆర్ద్ర’-ఆరుద్ర- ఆరుద్దల- కార్తెలో పౌర్ణిమ నాడు లేదా నిర్దిష్ట శుభదినం నాడు ఎద్దులను పూజిస్తారు. ఈ వృషభ పూజ- ఎద్దుల పండుగ- ‘ఏరువాక’లో భాగం! విదేశీయుల దురాక్రమణ సమయంలో సైతం సజీవంగా కొనసాగిన ఈ ‘ఏరువాక’ సంప్రదాయం గత కొన్ని దశాబ్దులుగా కొడికట్టిపోవడానికి కారణం పాశ్చాత్య వికృతులు ‘రాహుకేతువుల’వలె భారతీయ వ్యవసాయ ‘సూర్యుడి’ని దిగమింగుతుండడం. ‘చాంద్రమానం’- చంద్రుడు భూమి చుట్టూ తిరగడం-వల్ల పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి, ఏకాదశి వంటి తిథులు ఏర్పడుతున్నాయి. సౌరమానం- భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇరవై కార్తెలు. ఆరు ఋతువులు, పనె్నండు సంక్రాంతులు, రెండు ‘అయనాలు’ ఏర్పడుతున్నాయి! వ్యవసాయం కార్తెలతో ముడివడి ఉంది! ఈ వ్యవసాయ విజ్ఞానం గురించి ‘అక్షరాస్యులు’ క్రమంగా ధ్యాసను కోల్పోయారు. కానీ రైతన్నలు గుర్తు ఉంచుకున్నారు. ‘అశ్వని’ నుండి ‘రేవతి’ వరకు గల ‘కార్తెలు’ భారతీయ కర్షకులకు అనాదిగా కంఠస్థం. ‘్భరణి కార్తె’లో తొలిజల్లులు కురుస్తాయి. లేదా ‘కృత్తిక’ కార్తెలో వర్షం కురిసి తీరుతుంది. ‘కృత్తిక’ పేరుతోనే కార్తె ఏర్పడింది. ఋతుపవనాలు ఆరంభమైన తరువాత ‘ఆర్ద్ర’ కార్తెలో భూమి వర్షంతో తడిసిపోతుంది- ‘ఆర్ద్రం’ అయిపోతుంది! అందుకే ‘ఆర్ద్ర’కార్తెలో ఏరువాక సాగుతోంది, దీనికి సంబంధించిన ‘చాంద్రమాన’ సంకేతం జ్యేష్ఠ మాసపు పున్నమి!
‘అశ్వని కురిస్తే అంతా నష్టం’, ‘్భరణి కురిస్తే ధరణి పండును’, ‘రోహిణి ఎండలకు రాళ్లు-రోళ్లు- పగులును’, ‘‘మృగశిర చిందిస్తే మిగిలిన కార్తెలు అందుకుంటాయి’, ‘ఆర్ద్ర కురిస్తే దారిద్య్రం లేదు’, ‘ఉత్తరను చూసి ఎత్తర గంప’, ‘స్వాతి వానలకు సముద్రాలు నిండును’, ‘అనూరాధ కార్తె కురిస్తే మనోరోగాలు మాయం’-వంటి సామెతలు తెలుగు ప్రజల వ్యవసాయ విజ్ఞాన సజీవ సాక్ష్యాలు. ‘ఆర్ద్రీ’ కురిస్తే సకాలంలో వ్యవసాయం సాగుతుంది. ఉత్తర కార్తెలోగా వర్షం కురవకపోతే కరవుకాటాకాలు తప్పవు. అందువల్లనే ‘ఉత్తర’లో కూడ వర్షం రాకపోతే గ్రామీణులు ‘గంప’లెత్తుకొని ఇతర ప్రాంతాలకు వలసపోతారు. స్వాతి కార్తెలోని ‘చినుకులు’ చిప్పలలో పడి ముత్యాలుగా మారుతాయి. ‘చిప్పలోన పడ్డ చినుకు ముత్యంబౌను’ అన్నాడు వేమన యోగి. మరుగున పడిన ఈ వ్యవసాయ విజ్ఞానం మళ్లీ స్ఫురించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధికారికంగా నిర్వహిస్తున్న ‘ఏరువాక’ శుభంకరమైన మాధ్యమం..