సంపాదకీయం

ఎవరి కోసం డిసెంబరులో ఎన్నికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఎక్కడ చూచినా ముందస్తు ఎన్నికల గురించిన చర్చలే జరుగుతున్నాయి- పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు వార్తలను వండి వార్చి వడ్డిస్తున్నారు. 2019 ఏప్రిల్‌లో జరుగవలసిన లోక్‌సభ ఎన్నికలు 2018 డిసెంబరులోనే జరుగుతాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తండ్రి, మాజీ భారత ప్రధాని హెచ్.డి.దేవగౌడ మరొక అడుగు ముందుకు వేసి ‘‘బీజేపీ కార్యకర్తలకు ముందస్తుకు సంబంధించి అమిత్‌షా ఉప్పు అందించాడు’’ అని ఒక ప్రకటన 28-6-2018నాడు చేశారు. తృతీయ ఫ్రంట్‌ను వేగిరం చేయాలని అదే నోటితో ఆయన అన్నారు.
ఇప్పుడు మనం కొంచెం తార్కికంగా ఈ ఊహాగానాలలోని వాస్తవాలను సాధ్యాసాధ్యాలను విచారిద్దాం. ప్రస్తుతం మనకున్న ఎలక్ట్రానిక్ తంతులు జమిలి ఎన్నికలకు సరిపోవు. కాబట్టి వాటి సంఖ్యను ద్విగుణీకృతం చేయాలి. లేదా పాత పద్ధతిలో బ్యాలట్ ప్రవేశపెట్టాలి. కర్ణాటక, గుజరాత్, యూపీల్లో మొన్ననే ఎన్నికలు జరిగాయి. ఆ శాసనసభలను రద్దుచేయటంలోని సాధ్యాసాధ్యాలేమిటి? బీజేపీ ఇచ్చిన హామీలు అమలుకావటానికి మరికొంత సమయం అవసరం. అలాంటప్పుడు ఏడాది ముందుగానే ఎన్నికలకు పోవటంలోని లాభాలేమిటి? 2004లో అటల్‌బిహారీ వాజపేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారం కోల్పోయాడు. ఈ దుర్గతి బిజెపికి పట్టబోతున్నదా? ఈ అంశాలను లోతుగా విశే్లషించాలి. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతోబాటు పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరపాలి అనేది ఇందలి ప్రధానాంశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు కూడా 2019లో ఎన్నికలు జరపాల్సిందే. ఇక జమ్మూకాశ్మీర్ శాసనసభ సుప్తచేతనావస్థలో ఉంది. కాని కాశ్మీరీ రాజ్యాంగం ప్రకారం వారికి 2020వరకు ఎన్నికలు జరుపనక్కరలేదు. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ఎన్నికలు ఆలస్యమైనకొద్దీ బీజేపీ ప్రతిష్ట పలుచబడటం, తృతీయ కూటమి బలపడటం జరుగుతుంది అనేది కొందరి వాదం. ఇందుకు వారు గోరఖ్‌పూర్ ఫూల్‌పూర్ ఖైరానావంటి చోట్ల జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమిని ఉదాహరణగా చూపుతున్నారు. పెద్ద నోట్ల రద్దు జీఎస్‌టీ వంటివి బీజేపీకి కలిసి రాలేదనేది వీరి వాదం. బీజేపీ తాను చేసింది- చేయవలసింది ఏమిటి? స్వచ్ఛ్భారత్, మేకిన్ ఇండియా, జనధన్ యోజన వంటి చాలా ప్రణాళికలు ఎంతో మంచివి. చాలావరకు అవి విజయవంతమైనాయి కూడా. తెలంగాణాలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలుచేశాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య క్షీర భాగ్య, అన్నభాగ్య పథకాలూ ఉత్తమమైనవే. ఐతే ప్రజలు ఆ పథకాలను చూచి మాత్రమే ఓట్లు వేస్తారా?? ‘త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. శక్తి యాప్‌లో కార్యకర్తలుగా పేర్లు నమోదుచేసుకోండి’ అంటూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. బీజేపీ చేస్తున్న ప్రతి పనిని నకారాత్మక దృక్పథాలతో ఎదుర్కొంటున్నది. సర్జికల్ స్ట్రైక్ (మెరుపు దాడి) జరుగగానే లేదు అన్నారు- వారు మొన్న వీడియో విడుదలచేస్తే ఇది రాజకీయ లబ్ధికోసం బిజెపి చేసింది- అని కాంగ్రెసు అధికార ప్రతినిధి రణదీప్ సుర్జివాలా వ్యాఖ్యానించాడు.
ఇప్పుడు నిష్పక్షపాతంగా నిరపేక్షంగా అంశాన్ని విశే్లషించాలి.
ముందస్తు ఎన్నికల వలన ఎవరు లాభపడుతారు? ఎన్నికలలో ఒకవేళ బీజేపీ ఓడిపోతే అది నరేంద్రమోడీ నాయకత్వంపై తీర్పుగా భావింపవలసి వస్తుంది. మోడీ ప్రభుత్వం కాశ్మీరులో 370 అధికరణాన్ని రద్దుచేయలేదు. ఆక్రమిత కాశ్మీరును ఇండియాలో కలుపలేదు. బెలూచిస్థాన్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించలేదు. ఆక్రమిత కాశ్మీరులో చైనా నిర్మించిన రోడ్లను ధ్వంసం చేయలేదు. ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకం రెట్టింపు చేసింది. మోడీ ప్రభుత్వం ఆ మాత్రం చొరవ కూడా చూపించలేదు. శశిధరూర్, మణిశంకర్ అయ్యర్, రాహుల్‌గాంధీ (నేషనల్ హెరాల్డ్ కేసు) పి.చిదంబరం, కార్తి చిదంబరం, నళిని, మమతాబెనర్జీ (శారదా చిట్‌ఫండ్ స్కాం) వంటి వారెవరూ జైలుకుపోలేదు. ఓటుకు నోటు కేసు ఏమయింది? వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మీద పెట్టబడిన అక్రమాస్తుల కేసులన్నీ హుష్‌కాకి అన్నట్లు మాయమైనాయా? మోడీ ప్రభుత్వం చంద్రబాబునాయుడును వదిలిపెట్టి జగన్ పార్టీపట్ల సానుభూతి చూపిస్తున్నదని తెలుగుదేశం పార్టీవారు ఆరోపిస్తున్నారు. నిజమేనా?
భీం-కోరేగామ్ అల్లర్ల సందర్భంగా అరెస్టు చేయబడిన వారి నుండి లభించిన సమాచారం ప్రకారం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని ‘రాజీవ్‌గాంధీ’ని ఎల్‌టిటిఇ వారు చంపిన పద్ధతిలో ఆత్మాహుతి - మానవ బాంబుల ద్వారా నిర్మూలించాలని పథక రచన చేసినట్లు బయటపడింది. తెలంగాణాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ పార్టీనుండి నిధులు అందుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేరస్థులను శిక్షించకుండా, ఉగ్రవాదాన్ని నిర్మూలించకుండా ఎన్నికలకు పోవటం బీజేపీకి ఆత్మహత్యా సదృశమవుతుంది. ప్రజలకు కావలసింది ఎన్నికలు కాదు- దేశ భద్రత- ఉపాధి. ఉద్యోగం-విద్య- వైద్యం. నేడు రూపాయి విలువ పూర్తిగా పడిపోయింది. డాలరులో మారకం విలువ 70 రూపాయలకు చేరింది. నిన్న యుఎన్‌లోని అమెరికన్ రాయబారి శ్రీమతి హేలీ మాట్లాడుతూ ‘పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల దేశంగా మారింది. దానిని శిక్షించకపోతే ప్రపంచ శాంతికి భంగం’ అని (28-6-2018) అన్నారు. మరి ఈ కర్తవ్యాన్ని భారత్ విస్మరింపజాలదు. కాబట్టి చేయవలసిన పనులు పూర్తిచేయకుండా ఎన్నికలకు తొందరపడటం కూడదు. ఇంగ్లీషులో బూమరాంగ్ అని ఒక పదం ఉంది. అంటే ఈ వ్యూహం బెడిసికొట్టవచ్చు. ఇంతకూ బీజేపీకి వచ్చిన ప్రధాన సమస్య ఏమిటి? మహారాష్టల్రో శివసేన నుండి బెదిరింపులు వస్తున్నాయి. మరి ముందస్తు ఎన్నికల వలన శివసేన బలహీనపడుతుందనే గ్యారంటీ ఏమీలేదు. యూపీలో అఖిలేష్‌యాదవ్, మాయావతి, కాంగ్రెస్ కలిస్తే బీజేపీ ఓటమి ఖాయం. తెలంగాణాలో కేసీఆర్‌ను గద్దెదించడానికి ప్రొఫెసర్ కోదండరామ్‌కు పలు సంస్థలనుండి సహాయ సహకారాలు అందుతున్నాయన్న వాదాలు వినవస్తున్నాయ. బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవచ్చునేమో కాని, అధికారంలోకి రావటం అసాధ్యం. ఇక ఏపీలో బీజేపీ తనకు ఉన్న స్థానాలు కూడా కోల్పోతున్నది. ఈ దశలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పొందే లాభం ఏమీలేదు. అలాంటప్పుడు ఈ ముందస్తు ఎన్నికలు ఎందుకు? రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు ఆరునెలలలోగా జరగాలి. కాబట్టి డిసెంబరు 2018నాటికి యంపి, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంలలో ఎన్నికలు జరపాలని ఆశిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే వాటి ప్రభావం లోక్‌సభ ఎన్నికలమీద పడుతుందని కేంద్రంలోని వ్యూహకర్తల అభిప్రాయం. ఇందులో నిజం ఉంది. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి?? మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో కొద్దికాలం గవర్నర్ పాలన పెట్టవచ్చు. 2019 జనవరిలో ప్రజామోదంగల బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఈ లోపల అటు ఆక్రమిత కాశ్మీరులోను ఇటు భారతదేశంలోను గల ఉగ్రవాద సంస్థలను నిర్మూలింపవచ్చు. స్విస్ బ్యాంకు, పనామా బ్యాంకు, వర్జిన్ ఐలండ్, సింగపూర్, దుబాయి వంటి ప్రాంతాల్లోని నల్లధనాన్ని వెనుకకు తెప్పించవచ్చు. అయోధ్యలో రామాలయాన్ని మధురలో భవ్యమైన శ్రీకృష్ణదేవాలయాన్ని చట్టబద్ధంగా నిర్మించవచ్చు. అప్పటికి సుప్రీంకోర్టు తీర్పులుకూడా వస్తాయి. అవసరమైతే ఆక్రమిత కాశ్మీరులో మరిన్ని సర్జికల్ స్ట్రైక్‌లు (మెరుపుదాడులు) నిర్వహింపవచ్చు. అక్కడ 200 ఉగ్రవాద స్థావరాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పెరిగేటట్లు చేయవచ్చు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, విశాఖ ప్రత్యేక రైలుజోన్ ఇస్తే కేంద్రానికి ఎట్టి నష్టమూ లేదు. తమిళనాడులో రజనీకాంత్ కాబోయే ముఖ్యమంత్రి అని తెలుస్తున్నది. అలాగే కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం తన తప్పిదాలకు తానే బలి అయిపోతుంది. అప్పుడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ పెట్టవలసి వస్తుంది. కేరళలో విజయన్ ప్రభుత్వాన్ని రద్దుచేసినా అక్కడ ఐసిస్ ముస్లింలీగ్ వంటి ఉగ్రవాద సంస్థల మద్దతుతో అతడు తిరిగి అధికారంలోకి వస్తాడు. త్రిపురలో మళ్లీ బిజెపి గెలుస్తుందనే నమ్మకం లేదు. కాబట్టి 2019 ఏప్రిల్ నెలలోనే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించటం శ్రేయస్కరం. ఈ లోపల ఫెడరల్ ఫ్రంట్ ఇంకా బలహీనపడుతోంది. ప్రాంతీయ పార్టీల పేరుతో కేంద్రాన్ని నిర్లక్ష్యంచేసే వారిని బలహీనపరిచి-కేంద్రాన్ని బలపరచి ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అనే నినాదాన్ని 2019 ఏప్రిల్-మే నెలల్లో అమలుచేయండి. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ బలవంతునిదే రాజ్యం- నిన్న సిరియాపై రష్యా విమాన దాడులు నిర్వహిస్తే ప్రపంచమంతా హర్షించింది. పాకిస్తాన్‌పై ఇండియా విమాన దాడులుచేస్తే అగ్రరాజ్యం ఎందుకు అభ్యంతరం చెప్పాలి??
కాశ్మీరులో మెహబూబాముఫ్తి, సైఫుద్దీన్ సోజ్, గులాం నబీ ఆజాద్, షబ్నంలోనీ వంటి వారిపై చర్యతీసుకోండి. లక్షలాది కాశ్మీరీ పండిట్లకు పునరావాసం, ఓటు హక్కు కల్పించండి- ఇవేవీ లేకుండా ఎన్నికలు ఎన్నికలు అంటే ఎవరిని సంతోష పెట్టడంకోసం? లేదా టి.విలల్లో ‘బ్రేకింగ్ న్యూస్’ కోసమా?? ‘ముందస్తు ఎన్నికలు’ అనే పేరుతో నరేంద్రమోడీ పదవీ కాలాన్ని ఆరునెలలు తగ్గించటం కోసం ఎవరెవరో కుట్ర పన్నుతున్నారా? అనే అనుమానం కూడా కలుగుతున్నది.
బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ ‘‘మూడు సంవత్సరాల క్రితమే నేను జూరిక్‌లోని బ్యాంకులో రాహుల్ గాంధీ నల్లధనాన్ని గురించి సమాచారం అందించాను. ఐనా దర్యాప్తు ఎందుకు జరగలేదు?’’ అని సూటిగా ప్రశ్నించారు. 2019 తర్వాత ఎవరి జాతకాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ఈ పది నెలల కాలాన్ని బిజెపి కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని విదేశాలలోని నల్లధనాన్ని భారతదేశానికి తెప్పించి దేశ ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేస్తుందని ఆశిద్దాం. రాబర్ట్‌వాద్రా 25కోట్ల పన్నుల ఎగవేత వెలుగులోకి వచ్చింది. పి.చిదంబరం కార్తి చిదంబరం, నళినీ చిదంబరం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కర్ణాటకలో శివకుమార్ అక్రమాస్తులపై దాడులు జరిగాయి. గుజరాత్‌లో జుగ్నెశ్‌మెమానీ, హార్దిక్ పటేల్‌పై కేసులు ఒక కొలిక్కి రాలేదు. మరికొంత సమయం తీసికొని ఆర్థిక ఉగ్రవాదులను ప్రజలముందు దోషులుగా నిరూపించి ఎన్నికలకు వెళ్లటం మేలు.
తెలంగాణాకు సంబంధించినంత వరకు ప్రస్తుతం బిజెపి సంస్థాగతంగా బలంగా ఉంది. అట్లని ఈ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుందని ఈ వాక్యానికి అర్థం కాదు. ప్రస్తుతం తెలంగాణాలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కేసీఆర్‌ను ఓడించి తీరాలని పట్టుపట్టారు. తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ పార్టీ, అర్బన్ నక్సలైట్లు కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
ఎంతకైనా తెగించండి - ఢిల్లీలో మోదీని, హైదరాబాద్‌లో కేసీఆర్‌ను ఓడించండి - అని సోనియాగాంధీ నుండి తమ కార్యకర్తలకు స్పష్టంగా ఆజ్ఞలు అందాయి. సీమాంధ్రలో బీజేపీ, తెలుగుదేశం రెండూ సంకట స్థితిలో ఉన్నాయి. సత్వర ఎన్నికలు ఈ రెండు పార్టీలకు ఆత్మహత్యా సదృశం.
కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అప్పుడే బలహీనపడింది. సార్వత్రిక ఎన్నికలు మరికొంచెం ఆలస్యమైతే ఈ ప్రాంతీయ ప్రభుత్వం పడిపోవటం ఖాయం. అన్ని పార్టీలలోని లింగాయతులంతా కలిసి ఒక్కటిగా సామాజికవర్గ పాలనపై తిరుగుబాటు చేస్తున్నారు.
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ దృష్ట్యా పెట్రోలు ధరలు పెరగటం జరుగుతోంది. డాలరు రూపాయి మారకం విలువ కూడా పెట్రోలు ధరలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఇరాన్ నుండి భారత్ చమురు కొనకూడదని అంటూ అమెరికా ఆంక్షలు విధించింది. మరి పాకిస్తాన్‌లో జరిగే ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా తన ఆయుధ సంపత్తిని ఇండియాకు అనుకూలంగా మోహరిస్తుందా? అందుకు శ్రీమతి నిక్కీ హేలీ యుఎన్‌లో మద్దతు నిస్తుందా?
పెట్రోలు ధర లీటరుకు వంద రూపాయలకు చేరుతుంటే ఎన్నికలపై ఇది పాలక పక్షాల విపక్షాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఏకవాక్యంలో సారాంశం: ఏ విధంగా చూచినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్ చంద్రబాబు మోదీలకు వ్యతిరేక ఫలితాలు రావచ్చు. ‘లా’ కమిషన్ రికమండేషన్స్ తరువాత దానిని లోక్‌సభ ఆమోదించవలసి ఉంటుంది. ఆపైన చట్టప్రకారం రాజ్యాంగ సవరణకు ఏకాభిప్రాయం గానీ, బహుజన ఆమోదం గానీ కావాలి. ఇది పూర్తిగా న్యాయశాస్త్ర పరమైన ప్రక్రియ. ఇది ఏదీ లేకుండా ఏ రాజకీయ నాయకుడు తన స్వీయ లబ్ధి కోసం ఎన్నికల ప్రక్రియను మార్చజాలడు.