సంపాదకీయం

డొనాల్డ్ దురాగ్రహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి ప్రచ్ఛన్న యుద్ధాన్ని- కోల్డ్‌వార్- ప్రారంభించడానికి అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యత్నిస్తున్నారన్న భావం కలుగక మానదు. ఈ అభిప్రాయం తప్పుకావచ్చు, ఒప్పుకావచ్చు. ఎందుకంటె ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించడానికి యత్నిస్తున్న అమెరికా, రష్యాల అసలు లక్ష్యాలు వేఱు. ఈ అసలు లక్ష్యాలు ‘వాణిజ్య ప్రపంచీకరణ’తో ముడివడి ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు తమ మిత్రదేశాలైన ఐరోపా వారిని హడలుగొడుతున్నాడు, రష్యా చైనా వారి అడుగులకు మడుగులొత్తుతోంది. అందువల్ల 1950వ, 1990వ దశకాల మధ్య ఆధిపత్యం కోసం అమెరికా, సోవియట్ రష్యాల మధ్య జరిగిన రాజకీయ ప్రచ్ఛన్నయుద్ధానికి ఇప్పుడు ప్రాధాన్యం లేదు. 1990వ దశకం నాటికే సోవియట్ రష్యా ఆర్థికంగా దివాలా తీసింది. పదిహేను దేశాల ‘సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌ల కూటమి’- యుఎస్‌ఎస్‌ఆర్- విచ్ఛిన్నమైంది. ‘యుఎస్‌ఎస్‌ఆర్’ రాజకీయ వారసత్వం లభించిన రష్యా దివాలా తీసింది. 2008లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలు మనడం, అమెరికా వాణిజ్య సామ్రాజ్యం కుప్పకూలడం చరిత్ర. ఇలా ఆర్థికంగా దివాలా తీసిన అమెరికా కాని, రష్యా కాని మళ్లీ రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధవ్యూహాన్ని అమలుజరిపే స్థితిలో లేవు. ఇప్పుడు వాణిజ్య ప్రచ్ఛన్నయుద్ధం మొదలైపోయింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ప్రధాన ప్రత్యర్థులు ఐరోపా సమాఖ్య, చైనా! ఈ కఠోర వాస్తవాన్ని గ్రహించినందువల్లనే అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు అసహనంతో అల్లాడిపోతున్నారు. లేని ప్రాధాన్యాన్ని తమకుతాము స్వయంగా ఆపాదించుకుంటున్నారు. ‘ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి’- నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్- నాటో- సభ్య దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచాలని ట్రంప్ నిబంధన విధించడం ‘లేని ప్రాధాన్యాన్ని’ కల్పించుకొనడంలో భాగం. నాటో దేశాలు తమ స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- లో నాలుగు శాతం రక్షణకు కేటాయించాలన్నది ట్రంప్ విధించిన నిబంధన. బ్రస్సెల్స్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ నిబంధనను విధించాడు. ఫలితంగా ఐరోపా సమాఖ్యలోను, ‘నాటో’లోను భాగస్వామిగా ఉన్న దేశాలవారు తమ సైనిక వ్యయాన్ని రెట్టింపు చేయవలసి వస్తోంది. ఇలా రెట్టింపు చేయకపోయినట్టయితే ‘నాటో’ నుంచి తమ దేశం తప్పుకుంటుందని కూడ ట్రంప్ ఐరోపా దేశాలను హెచ్చరించాడు. తన బెదిరింపునకు ఐరోపా దేశాలు లొంగిపోయాయని ట్రంప్ గురువారం ప్రకటించడం దురహంకార చిహ్నం..
వాణిజ్యం వల్ల అంతర్జాతీయ ఏకత్వం సాధ్యం కాదన్నది మరోసారి ధ్రువపడింది. అమెరికా నాయకత్వంలోని ‘ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి’ దేశాల మధ్య విభేదాలు వికృతంగా ప్రస్ఫుటిస్తూ ఉండడం ఈ ధ్రువీకరణకు ప్రాతిపదిక! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న వైయక్తిక అహంకారం ఈ విభేదాలకు కారణం. ఈ వైయక్తిక దురహంకారాన్ని అమెరికా ప్రజలు సైతం అసహ్యించుకొంటుండడం నడుస్తున్న చరిత్ర. ‘ట్రంప్ దొర నోరు ఎక్కడ తెరుస్తాడో..’ అని అమెరికా ప్రజలు మాత్రమే కాదు, మిత్ర దేశాలవారు సైతం హడలిపోతున్నారు. ‘తెరిచిన నోటిలోకి ఆయన కాలుపెట్టుకుంటాడన్నది’ అందరికీ ఏర్పడిపోయిన అభిప్రాయం. ప్రపంచీకరణ వల్ల, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ-వల్ల, కృత్రిమ అంతర్జాతీయ అనుసంధానం వల్ల ఇతర దేశాలను ప్రధానంగా వర్ధమాన దేశాలను తాము కొల్లగొట్టవచ్చునన్నది ముప్పయి ఏళ్లక్రితం అమెరికా దురాశ, ఐరోపా అత్యాశ. అందువల్ల ‘వాణిజ్యం, పన్నుల సాధారణ అంగీకారం’- జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారిఫ్- గ్యాట్- ప్రాతిపదికగా ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-ను వ్యవస్థీకరించడానికి అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు నడుములను బిగించాయి. ‘గ్యాట్’ ప్రపంచ వాణిజ్య సంస్థగా అవతరించింది. కానీ గత పదేళ్లుగా ఈ ‘ప్రపంచీకరణ’ ఐరోపాకు, అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. చైనా వాణిజ్య సంస్థలు అన్ని దేశాలలోను చొరబడిపోవడం నడుస్తున్న చరిత్ర. అందువల్ల ఐరోపా దేశాలు, అమెరికాతో కలసి చైనావారి వాణిజ్య విస్తరణను వ్యతిరేకిస్తున్నాయి. ఈ పడమటి దేశాలు ప్రస్తుతం తమ తలుపులను మూసుకుంటున్నాయి..
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ‘నాటో’ ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ-జపాన్‌ల కూటమిలోని దేశాలకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్, రష్యా తదితర మిత్రదేశాలు పోరాడాయి. ‘జర్మనీ జపాన్’ నాయకత్వంలోని ‘అక్షరాజ్యాల’ - యాక్సిస్ పవర్స్- కూటమిపై అమెరికా రష్యా- యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్- యుఎస్‌ఎస్‌ఆర్- నాయకత్వంలోని ‘మిత్ర దేశాల కూటమి’- అల్లీడ్ పవర్స్ విజయం సాధించాయి. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు ఐరోపా దేశాలలో ‘కమ్యూనిస్టు’ నియంతృత్వ వ్యవస్థలు ఏర్పడినాయి. రష్యా నాయకత్వంలోని కమ్యూనిస్టు సామ్రాజ్య విస్తరణ పడమటి వైపుగా జరుగకుండా నిరోధించడానికై పశ్చిమ ఐరోపాలోని ‘ప్రజాస్వామ్య’ దేశాలతోను కొన్ని ఇతర దేశాలతోను కలసి అమెరికా ‘నాటో’ను స్థాపించింది. సోవియట్ రష్యా నాయకత్వంలో తూర్పు ఐరోపా దేశాలు ‘వార్సా’ కూటమిగా ఏర్పడడం సమాంతర పరిణామం. 1989లో తూర్పు ఐరోపా దేశాలలోను 1991లో సోవియట్ రష్యాలోను ‘కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థలు కూలిపోయేవరకు ఉభయ ‘కూటము’ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం నడిచింది. కానీ ‘కమ్యూనిస్టు’ సామ్రాజ్యం విచ్ఛిన్నం అయిపోవడంతో ‘వార్సా’ కూటమి అంతరించింది. ‘వార్సా’ నగరం పోలెండ్ దేశపు రాజధాని. కమ్యూనిజాన్ని వదిలించుకున్న మొదటి ఐరోపా దేశం పోలెండ్. ‘వార్సా’ కూటమి, కమ్యూనిస్టు సామ్రాజ్యం అంతరించడంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఏర్పడింది, ప్రచ్ఛన్నయుద్ధం గతమైంది. అందువల్ల ‘నాటో’కూటమి తూర్పు ఐరోపాకు వ్యతిరేకంగా చేయదగిన యుద్ధం లేదు. తూర్పు ఐరోపాలోని మాజీ వార్సా కూటమి దేశాలు ‘నాటో’లో చేరిపోవడం చరిత్ర..
మరి ‘నాటో’ కూటమి రక్షణ వ్యయం పెంచాలన్న ‘ట్రంప్’ ఒత్తిడి అర్ధం లేనిది. అమెరికా వద్ద రష్యా వద్ద నిలువ ఉన్న అణ్వస్త్రాలు ఇప్పటికే గుదిబండలుగా తయారయ్యాయి. త్వరలో హెల్సంకీ నగరంలో సమావేశం కానున్న పుతిన్, ట్రంప్ ఈ గుదిబండలను వదిలించుకోవడానికి వీలుగా అంగీకారాలను కుదుర్చుకోనున్నారు. అయినప్పటికీ ఐరోపా దేశాలు మాత్రం రక్షణ వ్యయం పెంచాలని ట్రంప్ కోరుతున్నాడు. ఇలా ఐరోపా దేశాల రక్షణ వ్యయం పెరగడం వల్ల వాటి ఆర్థిక ప్రగతి మందగించాలన్నది ట్రంప్ అసలు వ్యూహం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా ఆధిపత్యం తగ్గింది, అమెరికా ప్రాబల్యం పెరిగింది. ‘ప్రపంచీకరణ’ బెడిసిన తరువాత అమెరికా ఆధిపత్యం తగ్గి ఐరోపా ఆధిపత్యం పెరుగుతోంది. ఇదీ ట్రంప్ అర్థం లేని బెదిరింపులకు కారణం...