సంపాదకీయం

హరిత సమన్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోతులు కొలువుతీరి ఉండడం మహానగరాల్లోని ‘వివిధ అంతస్థుల భవనాల’ పైకప్పులపై ఆవిష్కృతమవుతున్న దృశ్యమాలిక. అడవుల్లోను, గ్రామీణ ప్రాంతాల్లోని తోటల్లోను ఉండవలసిన ఈ మర్కట సముదాయాలు నగరాల్లోకి వచ్చి తిష్ఠ వేసి చాలా ఏళ్లయింది. ఇందుకు ఏకైక కారణం అడవులు, గ్రామాల్లోని తోటలు హతమారిపోయి ఉండడం. ఉన్న అడవుల్లో సైతం పండ్లు కాని, కాయలు కాని, పిందెలు కాని లేకపోవడం. అలాంటి చోట్ల కొనే్నళ్లు ఆకులను చిగుళ్లను నమిలిన కోతులు ఆ తర్వాత విసుగుపుట్టి గ్రామాల్లోని పొలాల్లోకి చొరబడినాయి. సజ్జ కంకులు, జొన్న కంకులు గ్రామాల్లో కన్పించడం లేదు. విష రసాయన నిహితమైన పత్తికాయలను- బాసిలస్ తురిన్‌జెన్సిస్- బీటీ- పత్తికాయలను కోతులు కాని, పక్షులు కాని భోంచేయవు. ఈ ‘బీటీ’ పత్తికాయలను భోంచేయడానికి ‘బ్రహ్మ’ సృష్టిలోని ప్రాణులు పనికిరావు. అందువల్ల విశ్వామిత్రుడు పూనుకొని తెల్లని ఈగలను, అందమైన పెద్ద పెద్ద గులాబీరంగు పురుగులను సృష్టించాడు! ఈ ఈగలు, ‘గులాబీ’లు ‘బీటీ’ పత్తికాయలను భోంచేసి పోతుండడం వేఱు కథ. కందికాయలను మాత్రం కోతులు ఒలుచుకొని తినగలవు. కానీ ఇటీవల కందికాయలను కాని, దోసకాయలను కాని, తోటల్లోని పండ్లను కాని కోతులు తినడం లేదు. వాటిని వాసన చూసి అసహ్యంతో పళ్లు ఇకిలించి పారిపోతున్నాయట! ఎందుకంటె పిందె దశ నుంచి గింజ ఏర్పడిన దశ నుంచి వాటిపై క్రిమిసంహారక రసాయన విషాల- పురుగు మందుల-ను అనేకసార్లు పిచికారీ- స్ప్రే- చేస్తున్నారు. ఇలా పురుగుల మందులను పిచికారీ చేయడానికి మాత్రమే ఎకరం కందిపంటకు ఐదువేల రూపాయల కంటె ఎక్కువ ఖర్చవుతోందట.. ఎఱువుల, విత్తనాల పెట్టుబడులు కాక..! తెలియని నాగరికులకు తెలిసిన గ్రామీణులు చెపుతున్నారు. ఈ ‘పిచికారీ’లను కొట్టవలసినన్ని సార్లు కొట్టాలి. ఒక్కసారి మానివేసినప్పటికీ పెద్ద పెద్ద పురుగులు కందికాయలను మాత్రమే కాదు సజ్జకంకులను సైతం నమిలి మింగేస్తున్నాయట! అందువల్ల విషాల పిచికారీకి గురైన పంటలను, పండ్లను, కాయలను కోతులు తినడం లేదు. అందువల్ల మనుషులతో పాటు కోతులు కూడ నగరాలకు వలస వచ్చేశాయి. గుంపులు గుంపులుగా అంతస్థుల భవనాలపై సంచరిస్తున్నాయి. ఒక భవనం నుంచి మరో భవనం పైకి దూకుతున్నాయి. ఇన్నాళ్లూ వీధికుక్కలపై పోరాడి వాటిని హత్య చేసినవారు, చేయించినవారు ఇప్పుడు కోతులపై దృష్టి సారించవలసి వస్తోంది!
కోతులు విచ్చలవిడిగా నగర సంచారం చేస్తుండడానికి, ఇళ్లలోకి సైతం చొరబడడానికి యత్నిస్తుండడానికి గల కారణాలను విశే్లషించడం తెలంగాణ ప్రభుత్వం వారి విజ్ఞతకు నిదర్శనం. ఈ సమస్య పరిష్కారానికి వీలుగా పండ్ల చెట్లను పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు సూచించారట. హరితహారంలో భాగంగా నాటుతున్న మొక్కలలో కనీసం ఇరవై ఐదు శాతం ఫలప్రదాతలు కావాలన్నది ఆయన చెప్పినమాట. అంటే గత నాలుగేళ్ల హరితహారం కార్యక్రమంలో పండ్ల మొక్కలను విరివిగా నాటలేదన్నది ఇప్పుడు ధ్రువపడిన వాస్తవం. కనీసం ఇరవై ఐదు శాతం మొక్కలు కూడ పండ్ల జాతులు కాలేదు. అసలు నాటకపోవడం కంటె ఆలస్యంగానైనా వాటిని నాటడానికి పూనుకొనడం అభినందనీయం. కానీ హరితహారంలో భాగంగా నాటుతున్న ప్రతి వంద మొక్కలలో ఇరవై ఐదు పండ్ల మొక్కలే ఎందుకుండాలి? డెబ్బయి ఐదు శాతం ఇంకా ఎక్కువ శాతం పండ్ల మొక్కలు ఎందుకు నాటరాదు? భారతదేశంలో అనాదిగా పుట్టి పెరిగిన ప్రతిరకం మొక్క ఒక ‘ఓషధి’. ఈ మొక్కల ద్వారా వాటి ఆకుల ద్వారా పండ్ల ద్వారా పువ్వుల ద్వారా తేనెల ద్వారా పరిమళాల ద్వారా ప్రకృతి ప్రభావితం అయింది. ఆరోగ్యంగా మనుగడ సాగించింది. మానవులు, జంతువులు, పక్షులు ప్రకృతిలో భాగం. బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన కాలంలో అటవీ విధ్వంసం మొదలైంది. అడవుల్లోని చెట్లు ఖండితమై కలపగా మారి ఓడల్లో ఐరోపాకు తరలిపోయాయి. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం సమయంలో స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటన్ ప్రభుత్వం కొనసాగించిన అటవీ హననాన్ని అడ్డుకోవడం చరిత్ర. కార్యకర్తలు చెట్లను కౌగిలించుకొని ‘చెట్టు కంటె ముందు నన్ను నఱుకు..’ అని నినాదాలు చేయడం చరిత్ర. ఈ చరిత్ర బ్రిటన్ విముక్త భారత్‌లో ఇప్పటికీ కొనసాగుతోంది...
ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న కృత్రిమ ప్రగతికి చెట్లు బలైపోతుండడం కొనసాగుతున్న చరిత్ర. ప్రత్యేక ఆర్థిక మండలి- స్పెషల్ ఎకనామిక్ జోన్- సెజ్- వెలసిన చోటల్లా వేల ఎకరాల అడవులు ధ్వంసం అయిపోయాయి. ఇలా హరితవనాలు ‘సిమెంటు అడవులు’గా మారడం వల్ల లక్షలాది ఎకరాల్లోని వందల కోట్ల చెట్లు హతమైపోయాయి. అడవుల్లో ఆహారం దొరకని ఏనుగులు ఊర్లలో చొరబడి ఊరేగుతున్నాయి. ఊర్లలో పండ్లు కాని కాయలు కాని దొరకని ఉడుతలు అంతరించిపోయాయి. చిలకలు కొరికిన జామకాయల కథ గతం, వివిధ రకాల పక్షులు హతం! జంతుజాలం మనుగడ వృక్షజాలం మనుగడతో ముడివడి ఉంది. పండ్ల చెట్లంటే, పూల చెట్లంటే మానవులు తినగలిగిన పండ్లనిచ్చే చెట్లు మాత్రమే కాదు, మానవ ఉపయుక్తమైన పువ్వులనిచ్చే మొక్కలు మాత్రమే. మానవులు తినని, చూడని, వారికి తెలియని వందల జాతుల అడవి పండ్లను కోతులు తింటాయి, పక్షులు తింటాయి. అడవుల్లోని వానరాలు పువ్వులను, ఆకులను కూడ తింటాయి. తేనెటీగలు వేయిరకాల పువ్వుల నుంచి తేనెను సేకరిస్తాయి. అడవుల్లోని గాలి తేనెమయం. అందుకు కారణం సంప్రదాయ భారత జాతీయ జీవనం మధుమయమైంది! ‘గాలి తేనెలతో నిండాలన్నది భారతీయుని అనాది నాదం’! ‘మధువాతారుతాయతే’! అందువల్ల అడవుల్లోను, పల్లెల్లోను, పట్టణాల్లోను, నగరాల్లోను, బాటల పక్కన, బావుల పక్కన, చెరువుల పక్కన, చెలమల పక్కన పెంచవలసింది కేవలం భారతదేశంలో అనాదిగ పుట్టిన మొక్కలను మాత్రమే! విదేశాల నుంచి చొరబడిన చేదు మొక్కల వల్ల, హైబ్రిడ్ మొక్కల వల్ల, భూగర్భాన్ని శుష్కింపచేసే పిచ్చి మొక్కల వల్ల నిజమైన ‘హరితహారం’ ఏర్పడబోదు. అనంతగిరి అడవుల్లో అనాదిగా పెరిగిన చెట్ల వల్ల పశువులకు, పక్షులకు, మనుషులకు, ప్రకృతికి ఆరోగ్యం సమకూడినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పి ఉన్నాడు. ‘హరితహారం’లో భాగంగా వందశాతం ఇలాంటి సంప్రదాయ వృక్షాలను పెంచాలి. కోతులు నగరాల్లోకి, పొలాల్లోకి చొరబడవు..
కేరళ అడవుల్లోకి ఎలాగో చేరిన విదేశాల విషపు మొక్కలు అనేక చదరపు కిలోమీటర్లు విస్తరించాయి. మిగిలిన మొక్కలన్నింటినీ ఈ విషపు మొక్కలు చంపేశాయి, చంపేస్తున్నాయట! జీవ వైవిధ్య పరిరక్షణకు ఇది పాఠం కావాలి. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో యాబయి శాతాన్ని ఆకుపచ్చదనంతో నింపనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించి ఉన్నారు. తెలుగు ప్రాంతంలోనే కాదు దేశమంతటా ఇలా యాబయి శాతం మేర అడవులు, ఆకుపచ్చదనం విస్తరించాలి!