సంపాదకీయం

‘భాష’రాని బాలలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగ్యనగరంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులలో అనేక మందికి తగినంత భాషా పరిజ్ఞానం లేదన్నది ప్రభుత్వం వారు కొత్తగా కనిపెట్టిన వాస్తవం. దేశమంతటా అన్నిస్థాయిల విద్యార్థులలోను అత్యధికులకు భాషా పరిజ్ఞానం లేదన్నది పాతపడిపోయిన వాస్తవం, అందరికీ తెలిసిన రహస్యం. బోలెడు అక్షర దోషాల- స్పెల్లింగ్ మిస్టేక్స్-తో ఆంగ్లభాషను బీభత్సశైలిలో వ్రాసేస్తున్న న్యాయవాదులు, పత్రికా రచయితలు, ప్రభుత్వ అధికారులు, వృత్తి విద్యానిపుణులు, ఆంగ్లం బోధిస్తున్న అయ్యవార్లు దేశం నిండా ఉన్నారు. ఇది తెలిసిన వ్యవహారం. వీరందరూ తెలుగును కాని ఇతర భారతీయ భాషలను కాని ఎలా వ్రాస్తున్నారు? అన్న విషయం బ్రహ్మకు తెలియదు, చదువుల తల్లి సరస్వతీదేవికి కూడ తెలియదు. ఎందుకంటే ఈ విద్యాధికులు తెలుగులో కాని భారతీయ భాషలలో కాని వ్రాయరు. వ్రాయడం మానేసి ఏళ్లు గడిచాయి. ఎందుకు వ్రాయరంటే అలవాటులేదు కనుక.. అలవాటు లేకపోవడానికి కారణం ఈ విద్యాధికులకు తెలుగు లిపితో కాని భారతీయ భాషల లిపితో కాని పరిచయం లేదు! పాఠశాలలో చదివిన తెలుగు అక్షరాలను, భారతీయ భాషలలోని అక్షరాలను ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, ఉద్యమాలు చేస్తున్నవారు, సమాజ సేవ చేస్తున్నవారు గుర్తుపట్టడం లేదు. చదవమంటే అతి కష్టం మీద అక్షరాలను గుర్తుకు తెచ్చుకొని కూడి కూడి చదువుతారు, వ్రాయడం మాత్రం రాదు. వ్రాయాలంటే ఎదురుగా అక్షరం కన్పించదు- చదివినప్పటివలె! అందువల్ల ‘ఏమీ రామాయణమ’ని తెలుగును, భారతీయ భాషలను పూర్తిగా పరిత్యాగం చేసి కూర్చున్నారు. తెలుగు పద్యం కాని, పాట కాని, పదాలు కాని చదవవలసిన అనివార్యం ఏర్పడినప్పుడు ‘లావణ్య సంచారవాణి’- స్మార్ట్ మొబైల్ ఫోన్- తెర-స్క్రీన్-మీద ‘రోమన్ లిపి’- ఇంగ్లీషు భాషకు వాడే లిపి- మాధ్యమంగా మాత్రమే చదువుతున్నారు. దేవాలయాలకు వెళ్లి పారాయణలు చేస్తున్న యువ విద్యాధికులు స్తోత్రాలను పద్యాలను శ్లోకాలను చివరికి వేదమంత్రాలను సైతం ఈ ‘రోమన్ లిపి’ మాధ్యమంగా ‘లావణ్య సంచారవాణి’ తెరపైకి తెచ్చుకొని పఠిస్తున్నారు, గానం చేస్తున్నారు. తెలుగు అక్షరాలు కాని, నాగర లిపిలోని అక్షరాలు కాని ఇతర భారతీయ భాషల లిపి కాని తమకు రానందుకు ఈ భారతీయ మేధావులు సిగ్గుపడడం లేదు, ఆందోళన చెందడం లేదు, తమ దుస్థితిని అసహ్యించుకొనడం లేదు. ఇదీ ఆధునిక భారత భాషా ప్రహసనం. తెలుగు భాష రాకపోవడం ఈ విస్తృత దౌర్భాగ్య స్థితిలో భాగం! అందువల్ల దేశమంతటా నెలకొని ఉన్న దుస్థితికి భాగ్యనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలలోని పదవ తరగతి విద్యార్థులకు తెలుగు రాకపోవడం కేవలం ఒక ఉదాహరణ. ‘ఊరందరికీ తెలిసిన రహస్యాన్ని ఊలప్ప కొత్తగా చెవులలో చెప్పనక్కరలేదు.’
హైదరాబాద్‌లోని నూట ఎనబయిరెండు ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారట. వీరిలో దాదాపు వెయ్యిమందికి పరీక్షలను వ్రాయడానికి అవసరమైన తెలుగు భాషా పరిజ్ఞానం లేదన్నది ప్రభుత్వం వారు కనిపెట్టిన ‘మహా విషయం’. ఒకటవ తరగతి నుంచి తెలుగు మాధ్యమంగా చదివి పదవ తరగతి విద్యార్థులకు తెలుగులో పరీక్షలు వ్రాయడానికి తగిన భాషా పరిజ్ఞానం లేదట.. అందువల్ల వీరి భాషా పరిజ్ఞాన పాటవాలను పెంచడానికి ప్రభుత్వం వారు పది రోజులపాటు ‘శిక్షణ శిబిరాల’ను నిర్వహించనున్నారట. పదేళ్లపాటు చదివినప్పటికీ రాని తెలుగు పది రోజుల ‘శిక్షణ’తో వస్తుందన్నది ప్రభుత్వం వారి అభిప్రాయం. హైదరాబాద్ నగరానికి పరిమితమైన వైపరీత్యం కాదిది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో తెలుగు భాష గురవుతున్న క్రూరమైన నిర్లక్ష్యానికి ఇది ప్రతీక మాత్రమే! ఈ క్రౌర్యం దశాబ్దుల తరబడి తెలుగు భాషను హత్య చేయడానికి కృషిచేసిన ప్రభుత్వాలది, పాఠశాలలలో తెలుగును కాని ఇతర విషయాల- సబ్జెక్టుల-ను కాని బోధించడం మాని వ్యాపారాలను, జీవిత బీమా పథకాలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులది. తాము తెలుగు మాధ్యమ ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్నప్పటికీ తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వేతర పాఠశాలలకు తోలించిన ‘టీచర్’లది. ఈ క్రౌర్యం మాతృభాష పట్ల, భారతీయ భాషల పట్ల మమకారం లేని తల్లిదండ్రులది!
తెలుగు మాధ్యమంలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివిన వారికే తెలుగు వ్రాయడం చేతకానప్పుడు, ‘కేజి’- శిశుస్థాయి- నుంచి ఆంగ్ల మాధ్య విద్యను అభ్యసిస్తున్నవారికి తెలుగు భాష వ్రాయడం, చదవడం ఎలా వంటబడుతుంది? భాష మాధ్యమం మాత్రమే. భాషా మాధ్యమంగా చిన్న పిల్లలకు వంటబట్టే భావజాలం లక్ష్యం! తెలుగు భాషా మాధ్యమంగా తరతరాలుగా తెలుగు పిల్లలకు భారతీయ భావజాలం వంటపట్టింది. తెలుగు నేలపై మాత్రమే కాదు, దేశమంతటా మాతృభాషల మాధ్యమంగా చిన్నపిల్లలకు భారతీయ భావజాలం వంటపట్టింది. విదేశీయులైన బ్రిటన్ సామ్రాజ్యవాదుల దురాక్రమణ మన దేశంలో కొనసాగిన సమయంలో సైతం చిన్న పిల్లలకు దేశమంతటా మాతృభాషల మాధ్యమంగానే విద్యాబోధన జరిగింది. ఎనిమిదవ తరగతి నుంచి లేదా తొమ్మిదవ తరగతి నుంచి మాత్రమే విద్యార్థులకు ‘ఇంగ్లీషు’ మాధ్యమంగా బోధన జరగడం చరిత్ర. దేశంలోని అధికాధిక విద్యావంతులు భారతీయ భావజాలబద్ధులుగా మనగలగడం బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన నాటి చరిత్ర. ఈ భావజాలం సంస్కృతి. అందువల్ల భారతీయ సంస్కృతి పునాదులపై ప్రాథమిక మాధ్యమిక విద్యాసౌధం వెలసింది. ఎనిమిదవ తరగతి వరకు లేదా పదకొండవ తరగతివరకు మాత్రమే చదివినవారు భారతీయ భాషలలో నిష్ణాతులయ్యారు, భారతీయులుగా జీవించారు. ఆపైన కళాశాలలలో చదివిన వారిలోను, ఇంగ్లాండుకు వెళ్లి చదివి వచ్చినవారిలోను అధిక శాతం ఐరోపా భావజాలగ్రస్తులు కావడం కూడ బ్రిటన్ దురాక్రమణ నాటి చరిత్ర! దేశమంతటాగల వేలాది ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల్లో వ్యాకరణయుక్తంగా మాతృభాషలను నేర్పించారు, ఆయా భారతీయ భాషలలోని సాహిత్యాన్ని మప్పారు. తెలుగునాట క్రీస్తుశకం 1930వ, 1940వ దశకాలలో ఎనిమిదవ తరగతి చదివిన వారికి ‘మొల్ల రామాయణం’ పూర్తి గ్రంథం పాఠ్యాంశంగా ఉండేదట! అందుకే ఆంగ్లంలో ‘ఏబిసిడి’ రానివారు సైతం తెలుగు భాషలో నిష్ణాతులయ్యారు. దేశమంతటా ఇదే స్థితి..
ఒకటవ, రెండవ తరగతి పిల్లలకు ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకు గల అరవై సంవత్సరాల పేర్లను మప్పేవారు. పనె్నండు నెలలు, ఆరు ఋతువులు, రెండు ‘అయనాల’ గురించి చెప్పేవారు. ఇరవై ఏడు నక్షత్రాలను, ముప్పయి తిథులను, రెండు పక్షాలను వల్లె వేయించేవారు. రెండవ తరగతి వరకు చదివి మానేసిన గ్రామీణులు వందల పద్యాలను కంఠస్థం చేసిన చరిత్ర మనది. సుమతీ శతకం, వేమన శతకం, నరసింహ శతకం, దాశరథీ శతకం..! ఇప్పుడు‘కెజి’నుంచి ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నవారికి తెలుగు పద్యం రాదు, పదం రాదు! శిశుస్థాయి నుంచి కనీసం ఎనిమిదవ తరగతివరకు భారతీయ భాషల మాధ్యమంగా మాత్రమే అన్ని ప్రభుత్వ,ప్రభుత్వేతర పాఠశాలలలో అన్ని విషయాలను, పాఠ్య ప్రణాళికను బోధించాలని నిర్దేశిస్తూ జాతీయస్థాయిలో చట్టం చేయాలి. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి. లేనట్టయితే అంతరించి పోవడానికి సిద్ధంగా ఉన్న భారతీయ భాషలు మరికొన్ని ఏళ్లలో అంతరించి పోవడం ఖాయం.