సంపాదకీయం

వైరుధ్యాల ‘ఏకత్వం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల ‘సమైక్య సంఘర్షణ’కు కేంద్ర బిందువు కావడం నడుస్తున్న రాజకీయం. భాజపాకు వ్యతిరేకంగా ‘ఏర్పాటు కావలసి ఉన్న’ ప్రతిపక్షాల కూటమికి తానే నాయకురాలినన్న భావాన్ని లేదా భ్రాంతిని దేశవ్యాప్తంగా కల్పించడానికి మమత గత కొన్ని నెలలుగా నిర్విరామ కృషి చేస్తుండడం పెద్దగా ప్రచారానికి నోచుకోవడం లేదు. భాజపాకు పశ్చిమ బెంగాల్‌లో నిరంతరం ప్రజాదరణ పెరుగుతుండడం మమత నిద్రాహారాలు మాని శ్రమిస్తుండడానికి కారణం. సామాన్యంగా పార్లమెంటు సమావేశాలు జరుగని సమయంలో అధికార పక్షానికి వ్యతిరేకంగా జరిగే రాజకీయ సమావేశాలను విపక్షాల వారు ఢిల్లీలో నిర్వహిస్తుంటారు. అధికార పక్షాల వారు సైతం తమ అభివృద్ధి శంఖారావాలను వినిపించడానికి సభలను, సమావేశాలను ‘పార్లమెంటు జరుగని’ సమయంలోనే ఏర్పాటు చేయడం ఆనవాయితీ. కానీ ఈ సంప్రదాయాలకు భిన్నంగా మమత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే బుధవారం పనికట్టుకొని ఢిల్లీకి వచ్చింది. భాజపా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి మమత పడుతున్న ‘తపన’కు, ‘చిత్తశుద్ధి’కి ఇలా ‘అకాలం’లో సైతం ఆమె ఢిల్లీకి రావడం నిదర్శనం. ‘పది పదకొండు’ రాజకీయ పక్షాల ప్రముఖులతో ఆమె బుధవారం చర్చలు జరిపిందట. ఈ ప్రముఖులలో అత్యధికులు పార్లమెంటు సభ్యులు. బుధవారం నాటి ‘ఏకత్వ చర్చల’లో పాల్గొన్నందున ఆ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేదు. పార్లమెంటు సమావేశాలను సైతం పరిత్యజించి ఈ ప్రముఖులు- ‘తమ కార్యంబు పరిత్యజించి పరహిత సంప్రాప్తకుల్ సజ్జనుల్’ అని అన్నట్టుగా మమతతో కలసి విపక్షాల ఐక్యత గురించి ముచ్చటిస్తూ కూర్చోవడం- భాజపాను 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత గద్దె దింపడానికై వారు పెంపొందించుకున్న నిష్ఠకు నిదర్శనం..
వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడం ఈ సంవత్సరపు ‘గొప్ప’ చతురోక్తి! మూర్ఖత్వం, అహంకారం సమపాళ్లలో మూర్త్భీవించిన ఇలాంటి ‘రాజకీయ విదూషక శిఖామణి’ నూట ముప్పయి మూడేళ్ల చరిత్ర కల జాతీయ రాజకీయ పక్షానికి అధ్యక్షుడుగా ఉండడం దేశ ప్రజలకు అంతుపట్టని వ్యవహారం. ఈ ‘చారిత్రక’ ప్రకటన వెలువడిన వారం రోజులకే కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయవలసి వచ్చింది. కర్నాటక శాసనసభలో తమ పార్టీ కంటె తక్కువ స్థానాలు తెచ్చుకున్న మరుగుజ్జు పార్టీ ‘ లౌకిక జనాదళ్’ మహానేత హెచ్‌డి కుమారస్వామి గౌడకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టవలసి వచ్చింది. కర్నాటకలో భాజపాను అధికారానికి దూరంగా ఉంచడం లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మహా పదవీ పరిత్యాగానికి సిద్ధపడింది. తమకు ‘ప్రధానమంత్రి పదవి సైతం వద్దని’ కాంగ్రెస్ వారు ఇటీవల ప్రకటించడం జాతీయ రాజకీయ వాస్తవాలకు అనుగుణమైన పరిణామం. రాహుల్ అధినేతగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌కు లోక్‌సభలో ‘సంఖ్యా బాహుళ్యం’ లభించబోదన్నది ఈ రాజకీయ వాస్తవం. కనీసం అతి పెద్ద పార్టీగానైనా కాంగ్రెస్ లోక్‌సభలో అవతరించడం కల్ల అన్నది కాంగ్రెస్ కార్యకర్తల్లో నెలకొని ఉన్న భయం..
కానీ కాంగ్రెస్ ఇలా ప్రధానమంత్రి పదవిని- ‘అందని ద్రాక్ష పండ్లు పుల్లన’ అన్న చందాన- సైతం వదలుకొనడానికి సిద్ధపడడం మమతా బెనర్జీ వంటి ప్రాంతీయ నేతలకు ఆనందకరమైన పరిణామం. ‘కూటమి’కి నాయకత్వం వహించి భాజపాను ఓడించి విపక్షాల తరఫున ప్రధానమంత్రి పదవిని దక్కించుకోవచ్చునన్న ఆశలు ఈ ప్రాంతీయ నేతల్లో చిగురించడానికి ‘పోటీ’ నుంచి కాంగ్రెస్ వారి మహాభినిష్క్రమణం దోహదం చేసింది. మమత వెంటనే ఢిల్లీకి చేరుకుని చర్చలు జరపడానికి ఇదీ నేపథ్యం.
పశ్చిమ బెంగాల్ శాసనసభకు 2016లో జరిగిన ఎన్నికల్లో మమత పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ‘వామ కూటమి’- లెఫ్ట్‌ఫ్రంట్- కలసికట్టుగా పోటీ చేశాయి. ఈ సంగతి ఇప్పుడు మమత చేస్తున్న ప్రతిపక్ష ఏకత్వ కృషి వెనక నుంచి తొంగిచూస్తోంది! పశ్చిమ బెంగాల్‌లో తన పార్టీకి ప్రధాన శత్రువుగా భాజపా అవతరిస్తోందన్న భయం ఆ ఎన్నికల సందర్భంగా మమతకు పుట్టుకొచ్చింది. 2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో- కమ్యూనిస్టు మార్కిస్టు పార్టీ తదితర వామపక్షాలతో జట్టుకట్టినందుకు - కాంగ్రెస్‌ను తిట్టిపోసిన మమత ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పదే పదే చర్చలు జరుపుతోంది. మమత కాంగ్రెస్‌తో తరచూ చర్చలు జరపడం, బుధవారం కూడ మళ్లీ చర్చలు జరుపడం ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బహుశా నచ్చని వ్యవహారం. ఎందుకంటె భాజపా కాని, కాంగ్రెస్ కాని లేని ‘జాతీయ రాజకీయ కూటమి’ని ఏర్పాటు చేయడం కేసీఆర్ లక్ష్యం. గత మార్చి మూడవ తేదీన ఆయన ఈ లక్ష్యాన్ని సమావిష్కరించాడు. వెంటనే అందిపుచ్చుకున్న మమత ఈ కూటమి స్వరూప స్వభావాలను మార్చి వేయడానికి యత్నిస్తుండడం నడుస్తున్న చరిత్ర. బుధవారం నాడు ఢిల్లీలో మమత కాంగ్రెస్ నేతలతోను, ఇతర ప్రముఖ పక్షాలతోను చర్చలు జరిపింది. కానీ తెరాస ప్రతినిధులతో ఆమె చర్చలు జరిపినట్టు ప్రచారం కాలేదు. కాంగ్రెస్‌తో కూడిన కూటమికి తెరాస దూరంగా ఉండగలదన్నది మొదటి నుంచీ- మార్చి మూడవ తేదీ నుంచి- కొనసాగుతున్న అభిప్రాయం. మార్చి పంతొమ్మిదవ తేదీన కలకత్తాకు వెళ్లి మమతతో చర్చలు జరిపిన సందర్భంగా కూడ కేసీఆర్ ‘కాంగ్రెస్ లేని’ భాజపా వ్యతిరేక కూటమి గురించి మాత్రమే ముచ్చటించాడు. పదిరోజుల తర్వాత మార్చి 28న మమత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలను కలసి ‘సమాఖ్య కూటమి’- ఫెడరల్ ఫ్రంట్- గురించి చర్చించింది. ఈ చర్చలు కేసీఆర్ రూపొందించ దలచిన ‘సమాఖ్య కూటమి’ స్ఫూర్తికి విరుద్ధం..
మమత అతి ఉత్సాహంగా భాజపా వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నించడం, తెరాస అధినేత కేసీఆర్ ‘వ్యూహాత్మక వౌనం’ వహిస్తుండడం సమాంతర పరిణామాలు. బుధవారం ఢిల్లీలో తెదేపా, వైకాపా ప్రతినిధులు ‘పోటీపడి’ మరీ మమతను కలసి చర్చలు జరిపారు. తెరాస వారు ఈ ‘పోటీ’లో పాల్గొనలేదు. మమత ఏర్పాటు చేయదలచిన కూటమిలో కాంగ్రెస్‌కు చోటుంది. ఈ కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, జాతీయతా కాంగ్రెస్ పార్టీలు చేరవచ్చు. కేసీఆర్ ‘కూటమి’లో బహుశా కాంగ్రెస్, జాతీయతా కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ పార్టీలు ఉండవు.. ప్రతిపక్షాల ఏకత్వ సాధనకు అవరోధంగా మారుతున్న వైరుధ్యాలు ఇవి. ‘ఏకత్వం’ ఎలా సాధ్యం?