సంపాదకీయం

‘స్వచ్ఛంద’ బీభత్సం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానం మరోసారి చీవాట్లు పెట్టింది, బిహార్ ప్రభుత్వాన్ని అభిశంసించింది. బిహార్‌లో జరిగిన లైంగిక బీభత్సం ‘ప్రతీక’ మాత్రమే. దేశంలోని అన్ని ప్రాంతాలలోను యువతులపై, బాలికలపై, ఆడ శిశువులపై నిరంతరం పైశాచిక లైంగిక అత్యాచారాలు జరిగిపోతుండడం ఏళ్లతరబడి కొనసాగుతున్న బీభత్స చరిత్ర. బిహార్‌లోని ఒక ‘ఆశ్రయ గృహం’లో అనేకమంది బాలికలు లైంగిక అత్యాచారాలకు, వేధింపులకు గురయ్యారన్న దిగ్భ్రాంతి తొలగకముందే ఉత్తరప్రదేశ్‌లోని మరో ‘ఆశ్రయ గృహం’- షెల్టర్ హోమ్-లోని బాలికల విషాద వృత్తాంతం మరింత దయనీయంగా ఆవిష్కృతమైంది. ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో దాదాపు ప్రతి నగరంలో- దేశమంతటా- లైంగిక బీభత్సకారులు వికృత తాండవం చేస్తున్నారు, మాతృరూపాలైన మహిళలపై బాలికలపై నిరంతరం అత్యాచారాలను సాగిస్తున్నారు. తెలుగు ప్రాంతాలు అపవాదం కాదు, కామాంధ పిశాచాలు మనుషుల రూపమెత్తి కోరలు విసురుతున్న కథలు ప్రతిరోజూ ప్రచారవౌతున్నాయి. నిజామాబాద్‌లోని ఒక కళాశాలకు చెందిన విద్యార్థినులు కొందరు లైంగిక, మానసిక హంసకు గురయ్యారన్నది ఉక ఉదాహరణ మాత్రమే. విద్యార్థినులను వేధించిన అభియోగంపై డి.సంజయ్ అనే వ్యక్తిపై పోలీసులు ‘నిర్భయ’ చట్టం కింద అభియోగం నమోదు చేయడం నడుస్తున్న చరిత్ర. ఈ సంజయ్ అనే రాజకీయవేత్త గతంలో ‘నగర అధ్యక్ష’- మేయర్- పదవిని నిర్వహించాడట! బిహార్‌లోని ‘శరణ్’ అన్నచోట ఒక ప్రభుత్వేతర పాఠశాల ప్రాంగణంలోనే అనేకమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక బాలికను రోజుల తరబడి లైంగిక అత్యాచారానికి గురిచేశారట! గత డిసెంబర్ నుంచి కొనసాగిన ఈ రాక్షస కృత్యం ఇటీవల బయటపడింది. ఈ విద్యార్థిని తండ్రి జైలు నిర్బంధంలో ఉన్నాడట. అందువల్ల ఆ బాలికకు ‘చెప్పుకునే దిక్కులేకపోయింది’. చివరికి ఆమె పాఠశాల ప్రధాన అధ్యాపకునికి ఫిర్యాదు చేసిందట! ఆ తరువాత ఆ ప్రధాన ఉపాధ్యాయుడు- ప్రిన్సిపాల్- కూడ ఆమెపై లైంగిక అత్యాచారం జరిపాడట...
‘‘నరుల రూపపు ముసుగులో, దా
నవుల చేష్టలు సాగుతున్నవి,
మానవత్వపు ప్రాంగణంపై
‘విబుధ’ మృగములు దూకుచున్నవి!’’
ఈ ప్రిన్సిపాల్‌ను, మరో పదిహేడు మందిని రెండురోజుల క్రితం పోలీసులు నిర్బంధించారట! మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో సోమవారం నాలుగేళ్ల పసికందును ఒక దుర్మార్గుడు లైంగిక అత్యాచారానికి బలిచేశాడన్నది పైశాచిక పరాకాష్ఠ. అక్షరాలలో వ్రాయజాలని భావాలతో వ్యక్తం కాని ‘్భయంకర ఖేద తమాల వాటిక’ విస్తరించిపోతోంది. దుర్మార్గం దండనకు గురవుతున్నకొద్దీ మరింత దుర్మార్గం చెలరేగుతోంది. ‘‘చదువుకున్నవారు’’ సమాజాన్ని హత్యచేయడానికి పూనుకుంటున్నారు, దేశ విద్రోహానికి ఒడిగడుతున్నారు, నీతిని నిప్పులపాలు చేస్తున్నారు, సంస్కృతికి క్షతిని కలిగిస్తున్నారు.
సర్వోన్నత న్యాయస్థానం బిహార్ ప్రభుత్వాన్ని మంగళవారం తీవ్రంగా మందలించడానికి ఇదంతా నేపథ్యం. ‘ఆశ్రయ గృహాల’- షెల్టర్ హోమ్స్- పేరుతో ప్రభుత్వేతర సంస్థలు, ‘స్వచ్ఛంద సంస్థ’- నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్- ఎన్‌జిఓ-లు నడిపిస్తున్న ‘వసతుల’లో వివిధ నేరాలు జరిగిపోతున్నాయి. ఇలాంటి ‘ఎన్‌జిఓ’లకు బిహార్ ప్రభుత్వం ఎందుకు నిధులను ప్రదానం చేస్తోంది? అన్నది సర్వోన్నత న్యాయస్థానం సంధించిన ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్నకు దేశంలోని ప్రభుత్వాలన్నీ సమాధానం చెప్పవలసి ఉంది. ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఎందుకని స్వచ్ఛంద సంస్థలకు ప్రదానం చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులను స్వాహా చేయడం లక్ష్యంగా దేశంలో లక్షల కొలదీ ‘ఎన్‌జిఓ’లు ఏళ్లతరబడి పుట్టుకొచ్చాయి. ప్రజాసేవ చేస్తున్న ‘ఎన్‌జిఓ’ల సంఖ్య చాలా తక్కువ. ప్రజాధనం స్వాహా చేస్తున్న నకిలీ స్వచ్ఛంద సంస్థల సంఖ్య చాలా ఎక్కువ. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఏళ్లతరబడి ‘ఆశ్రయ గృహం’ నిర్వహించిన నకిలీ స్వచ్ఛంద సంస్థ దుర్మార్గం- బాలికలను లైంగిక హింసకు, అత్యాచారాలకు గురిచేయడం- గురించి 2013 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఈ దుర్మార్గసంస్థకు నిధులను సమకూర్చింది. ‘షెల్టర్ హోమ్’ను నడిపిన వ్రజేశ్ థాకూర్ అనేవాడు ఘరానా రాజకీయవేత్త కావడమే ఇందుకు కారణం కావచ్చు. బిహార్‌లో ఇలా అక్రమాలకు ఒడిగట్టిన పదిహేను నకిలీ సంస్థలపై ప్రభుత్వం చర్యకు పూనుకోకపోవడం సర్వోన్నత న్యాయస్థానం వారి ఆగ్రహానికి కారణం..
షెల్టర్ హోమ్స్‌లో నివసిస్తున్న బాలికలు అత్యాచారాలకు గురికాకుండా భద్రత కల్పించడానికై తీసుకుంటున్న చర్యలను గురించి సర్వోన్నత న్యాయమూర్తులు బి.మదన్ లోకుర్, దీపక్ గుప్తా, కెఎమ్ జోసెఫ్ కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం దేశవ్యాప్తంగా పుట్టలు పగిలిన నకిలీ స్వచ్ఛంద సంస్థలకు నిదర్శనం. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ పేరుతో ప్రజల ధనాన్ని దోచుకోవడం అనేకమంది ‘చదువుకున్న’ వారికి, ప్రముఖులకు, ‘ఉద్యమకారుల’కు, ఘరానా రాజకీయవేత్తలకు సమాంతర వ్యాపార వృత్తిగా మారింది. అనేకమంది ప్రజాప్రతినిధులు ఇలాంటి నకిలీ స్వచ్ఛంద సంస్థలను నిర్వహిస్తున్నారు. ‘ట్రస్టు’ ‘్ఫండేషన్’ వంటి పేర్లతో వెలసిన అనేక ‘సంస్థల’ లక్ష్యం దొడ్డిదారిన పన్నులు ఎగవేయడం, ఆదాయం పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు పొందడం.. ‘పెద్ద’వారి నల్లధనం తెల్లధనంగా పరివర్తన కావడానికి ప్రమాదంలేని మాధ్యమం- అనేక సందర్భాలలో- స్వచ్ఛంద సంస్థ! చిత్తశుద్ధితో ప్రజాసేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంస్థలు ప్రభుత్వాల నిధులు పొందినప్పటికీ, పొందనప్పటికీ తమ సేవా ప్రకల్పాలను, పథకాలను అమలుచేస్తూనే ఉన్నాయి. అందువల్ల ‘ఎన్‌జిఓ’లకు ప్రభుత్వ నిధుల నిచ్చే విధానం పూర్తిగా రద్దుకావాలి. ప్రభుత్వాల నిధులు లభించవని తెలిసినట్టయితే నకిలీ స్వచ్ఛంద సంస్థలు తక్షణం మూతపడిపోతాయి. నిజమైన ప్రజాసేవకులు ప్రజల ఆర్థిక సహకారంతోనే తమ సంస్థలను నిర్వహించుకుంటారు.
బిహార్‌లోని ముజఫర్‌పూర్ భయంకర లైంగిక బీభత్స కథనాలు కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని దేవారియా పట్టణంలోని మరో ‘షెల్టర్‌హోమ్’లోని బాలికలు లైంగిక చిత్రహింసలకు గురవుతున్నట్టు వెల్లడైంది. ఈ ‘ఆశ్రయ గృహం’ నుండి తప్పించుకోగలిగిన పదేళ్ల పాప పోలీస్‌స్టేషన్ వరకు ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ దురంతం బయటపడింది. ఇరవై నాలుగు మంది బాలికలను ఈ ఆశ్రయ గృహనిర్బంధం నుంచి పోలీసులు తప్పించగలగడం దైవ ఘటన. కానీ ‘చదువుకున్న’ వారు దేశమంతటా ఇలాంటి వివిధరకాల దురాగతాలు చేస్తూనే ఉన్నారు. అవినీతిపరులలో అత్యధిక పరులు ‘చదువుకున్నవారు’గా ‘విజ్ఞులు’గా ‘విద్యాధికులు’గా చెలామణి అవుతున్నవారు. విద్యాలయాలలో ‘విజ్ఞానం’ నేర్పిస్తున్నారు, మానవీయ విచక్షణను వివేకాన్ని మప్పడం లేదు, భౌతిక రసాయన శాస్త్రాలను ఆర్థిక వాణిజ్య రాజకీయ శాస్త్రాలను బోధిస్తున్నారు... మానవుడు మానవుడుగా జీవించడానికి అవసరమైన సౌశీల్యాన్ని సంస్కారాలను నేర్పడం లేదు. అందువల్లనే ‘విబుధ దైత్యులు’- చదివిన రాక్షసులు- రూపొందుతున్నారు. ‘అపవాదాలు’ చాలా తక్కువ!!