సంపాదకీయం

పంతులులేని బడి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నది సరికొత్త సమాచారం. ఈ ‘ఖాళీల’లో పదిలక్షల పదివేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని అధ్యాపకులకు సంబంధించినవి. ఉన్నత పాఠశాలల్లో లక్షకు పైగా అధ్యాపక పదవులు ఖాళీగా ఉన్నాయట. మిగిలిన ఖాళీలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించినవి. ప్రభుత్వేతర రంగంలో విదేశీయుల పెట్టుబడుల వల్ల ఉపాధి ఉద్యోగావకాశాలు నిరంతరం విస్తరించిపోతున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించని దినం లేదు. ప్రతి నిముషం కనీసం నలబయి నలుగురు దారిద్య్ర విముక్తులవుతున్నారట. అంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ‘రేఖ’ను దాటి పైకెక్కి వస్తున్నారట. కనిపెట్టినవారు ఆవిష్కరిస్తున్నారు.. మన దేశం అమితవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి. మన స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ- చైనా వారి ‘ఉత్పత్తి’ కంటే వేగంగా పెరుగుతోంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ధ్రువీకరించిన వాస్తవం ఇది. ఫ్రాన్స్ దేశపు జీడీపీ పరిమాణం కంటె మన దేశపు జీడీపీ పరిమాణం పెద్దదైపోయింది. ఇంత ప్రగతి జరుగుతున్న సమయంలో మన రూపాయి విలువ మాత్రం- అమెరికా ‘డాలర్’ ప్రాతిపదికగా నానాటికీ తగ్గిపోతుండడం ఎందుకన్నది జనాలకు అర్థం కాని వ్యవహారం. ఇరవై నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఎందుకని ఖాళీగా ఉంచారన్నది కూడ- ప్రగతి సమాచారంతో మురిసిపోతున్న- సామాన్య ప్రజలకు అంతుపట్టని వ్యవహారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు వివరించవలసిన అంశం ఇది. ప్రభుత్వాలు తరచూ ‘కొత్తగా ఈ రంగంలో ఇన్ని వేల లేదా ఇన్ని లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు’ ప్రకటించడం పరిపాటి. ఇది ప్రచారం అవుతున్న వ్యవహారం. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇన్నాళ్లుగా ఎందుకని ఖాళీగా ఉన్నాయన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వాలు సమాధానం చెప్పడం లేదు. పరిష్కారాలు ప్రచారం అవుతున్నాయి కాని అపరిష్కృత సమస్యల గురించి మాత్రం ‘ప్రస్తావన’ ఉండడం లేదు. సమస్యలను ‘ప్రధానంగా ప్రస్తావించి’ ప్రజలను నిరాశా నిస్పృహలకు గురిచేయరాదన్నది ప్రభుత్వాల విధానం. ఖాళీగా పడి ఉన్న ఉద్యోగాల గురించి ప్రభుత్వాలు ప్రస్తావించవు. అందువల్ల ప్రభుత్వ బడుల్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు తగినంతమంది లేరన్న సాకుతో ప్రభుత్వ స్కూళ్లను అనేక గ్రామాల్లో మూసివేస్తున్నారు. నిర్బంధంగా ఉచితంగా విద్యను పొందే హక్కుకు రాజ్యాంగ ప్రతి లభించిన తర్వాత మరిన్ని ప్రభుత్వ బడులను ప్రారంభిస్తారని, మరికొంతమంది అధ్యాపకులను నియమిస్తారని ప్రచారమైంది. కానీ ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను తగ్గిస్తుండడం గ్రామాల్లో నెలకొన్న దృశ్యం. ఈ ‘కుదింపు’ కార్యక్రమాన్ని అమలు జరుపడంలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వాలకు అధ్యాపకుల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ధ్యాస సహజంగానే కరవైంది. దేశవ్యాప్తంగా పదిలక్షలకు పైగా అధ్యాపక పదవులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం వారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నకు ఇదీ నేపథ్యం...
తెలంగాణలో ఇటీవల బదిలీలు జరిగాక పద్దెనిమిది వందల బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడ లేని దుస్థితి ఏర్పడిందట. ఎందుకు ఇలా జరిగిందని ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యం ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారట. వాస్తవ స్థితిపై వివరణ కోరారట. తెలంగాణ ప్రభుత్వం ఈ పద్దెనిమిది వందల స్కూళ్లకు ఉపాధ్యాయులను నియమించవచ్చు. అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దేశవ్యాప్తంగా పదిలక్షలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీకాకుండా ఉండడం విస్తృత సమస్య. గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల- కళాశాలలు, విశ్వవిద్యాలయ ప్రతిపత్తి కల సంస్థలు-లో అధ్యాపకుల సంఖ్య కూడ తగ్గిపోతోందట. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంతుళ్ల సంఖ్య అయ్యవార్ల సంఖ్య అధ్యాపకుల సంఖ్య ఆచార్యుల సంఖ్య పెరగడం విద్యారంగం సమగ్ర ప్రగతికి ఏకైక ప్రాతిపదిక కాకపోవచ్చు. ‘రాసి’తో పాటు ‘వాసి’ కూడ పెరగాలి. స్వరూప విస్తరణతో పాటు స్వభావ వికాసం ప్రస్ఫుటించాలి. భౌతిక ప్రగతికి దోహదం చేయడం మాత్రమే కాక బౌద్ధిక మానసిక సంగతికి కూడ దోహదం చేయగలిగేది సమగ్ర విద్య. అక్షరాస్యులు సంస్కారవంతులు కావాలి. కానీ ఈ సమగ్ర వికాస క్రమంలో తగినంత మంది బోధకులు నియుక్తి కావడం వౌలిక అవసరం. గత మూడేళ్లలో దేశంలోని కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకుల ఉపన్యాసకుల ఆచార్యుల సంఖ్య రెండు లక్షల ముప్పయి నాలుగు వేల మేర తగ్గిపోయిందట! 2015-2016 విద్యా సంవత్సరంలో ఈ ఉన్నత ఉన్నతోన్నత అధ్యాపకులు, ఆచార్యులు పదహైదు లక్షల పద్దెనిమిది వేల మంది ఉండేవారట. ఈ సంఖ్య గత విద్యా సంవత్సరం- 2017- 2018- లో కేవలం పనె్నండు లక్షల ఎనబయి నాలుగు వేలట..
అధ్యాపకులు తగినంతమంది ఉన్న స్కూళ్లలో కూడ ఐదవ- పదవ సంవత్సరాల మధ్య వయస్సు కల విద్యార్థులు బౌద్ధిక మానసిక శారీరక వికాసానికి నోచుకోలేక పోతున్నారు. బడికి ఆలస్యంగా వచ్చిన నేరానికి ఆరేళ్ల పిల్లలను చెంపలు పగులకొట్టే పంతులమ్మలు, పంతుళ్లు ఉన్నారు. ఆలస్యంగా వచ్చినందుకు లేదా మరేదో ఘోరమైన నేరం చేసినందుకో ‘బుడుతల’ను అరగంట సేపు ఆగకుండా పరిగెత్తించే పంతుళ్లు ఉన్నారు. ఒక పంతులమ్మ ఇటీవల వెలగబెట్టిన ఇలాంటి నిర్వాకం వల్ల రెండవ తరగతి విద్యార్థి ఒకడు స్పృహతప్పి పడిపోయాడట! ఎండలో నిలబెట్టడం, బల్లపై నిలబెట్టడం, గోడకుర్చీలు వేయించడం, ఒకరితో ఒకరికి గట్టిగా ‘ముక్కు చెంపలు’ కొట్టించడం ఇవన్నీ పాతకాలం పంతుళ్లు చేసేవారని ప్రచారం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు పంతులమ్మలు చేయిస్తున్నారు, ప్రచారం తక్కువ! పాతకాలం పంతుళ్లకు విద్యార్థులపై వాత్సల్యం ఉండేది. కొత్తకాలం ‘టీచర్ల’కు అది మాత్రం లేదు. అదీ తేడా! మానవీయ సంస్కారాలు లేని విద్యావంతులు ‘నితాంత అపార భూతదయ’ అన్న భారతీయ స్వభావం గురించి తెలియనివారు అధ్యాపకులుగా నియుక్తులవుతున్నారు. అందువల్ల ప్రభుత్వ బడుల్లోని అయ్యవార్లు, పంతులమ్మలు అధిక శాతం పిల్లలకు పాఠాలు చెప్పడం లేదు. ‘నిఘా’ తక్కువగా ఉన్న పల్లెల్లోని అధ్యాపకుల్లో ఎక్కువ మంది ఎక్కువ రోజులపాటు బడులకే వెళ్లరు. వెళ్లినప్పటికీ ‘బుడుతల’తో ముఖాముఖీగా ముచ్చటించరు. అయ్యవార్లు పరస్పరం ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు ముచ్చటించుకొంటారు. గ్రామ ప్రముఖులతో స్థానిక సమస్యలపై చర్చిస్తారు..
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న ప్రాథమిక విద్యార్థుల్లో సగం మందికి పైగా వాచకాలను చూసి చదవలేకపోతున్నారట. చూసి వ్రాయించడం, చెప్పి వ్రాయించడం, పద్యాలను శ్లోకాలను కంఠస్థం చేయించడం గతం.. ఆధునిక పద్ధతులు వచ్చాక పద్యాలను కంఠస్థం చేయించరాదట! ప్రభుత్వేతర కానె్వంట్లలో మాత్రం విదేశీయ సాహిత్యానికి సంబంధించిన పద్యాలను పాటలను ‘బుడుతల’ చేత బట్టీ పట్టిస్తున్నారు. అధికాధిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్య పుస్తకాల్లోనే ఉండిపోతోంది, పిల్లల మస్తకాలకు ఎక్కడం లేదు. ప్రభుత్వేతర బడుల్లో భారతీయ శిశువులను పాశ్చాత్య స్వభావులుగా తీర్చిదిద్దే సాహిత్య రీతులను మప్పుతున్నారు.