సంపాదకీయం

జీవ ఇంధన విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవ ఇంధనం- బయో ఫ్యూయెల్- తో గగన శకటాలను నడపడం స్వచ్ఛ భారత పునర్ నిర్మాణ ప్రస్థానంలో విప్లవాత్మక పరిణామం. ఈ శుభ పరిణామం, సోమవారం సంభవించింది. ‘స్పయిస్ జెట్’ విమానం ఒకటి డెహ్రాడూన్ నుంచి బయలుదేరి ఢిల్లీవరకు ‘జీవ ఇంధనం’ సహాయంతో గగనయాత్ర చేయడం ఈ చారిత్రక పరిణామం. విమాన రంగంలో ఇది వినూతన విప్లవమని కేంద్ర ప్రభుత్వం వారు అభివర్ణించడం ‘బయో ఫ్యూయెల్’ ప్రాధాన్యానికి సరికొత్త సమ్మానం. వాహనాలకు ప్రధానంగా ఆకాశంలో పయనించే వాహనాలకు జీవ ఇంధనాన్ని ఉపయోగించడంవల్ల వాతావరణ కాలుష్యం తగ్గిపోవడం మాత్రమే కాదు ఈ హరిత ఇంధనం- గ్రీన్ ఫ్యూయెల్- పరిసరాలను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దడానికి దోహదం చేస్తుందట. పెట్రోలియం శుద్ధి ప్రక్రియ ద్వారా తయారయ్యే నిర్జీవ ‘గగనయాన ఇంధనం’- ఏవియేషన్ ఫ్యూయెల్- కంటె ఈ స‘జీవ’ హరిత ఇంధనం ఉత్పాదక వ్యయం బాగా తక్కువ అన్నది ప్రభుత్వం చెప్పిన మాట. 2025నాటి దేశంలోని అన్ని విమానాలు- కనీసం అత్యధిక శాతం- జీవ ఇంధనానికి ఉపయోగించడానికి ప్రభుత్వం బృహత్ పథకాన్ని సిద్ధం చేస్తోందట. డెహ్రాడూన్ నుంచి వచ్చిన ‘జీవ ఇంధన చోదిత’ విమానానికి స్వాగతం చెప్పిన సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రి వెల్లడించిన ఈ బృహత్ పథకంవల్ల లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
పెట్రోలియం నుండి తయారయ్యే ‘గగన యాన ఇంధనం’ కంటె మొక్కల నుంచి, గడ్డినుంచి, వృక్ష నిర్యాసాల నుంచి, చెత్తనుంచి తయారయ్యే ‘జీవ ఇంధనం’ ధరలు కనీసం ఇరవై శాతం తక్కువగా ఉండబోతున్నాయి. అందువల్ల భవిష్యత్తులో విమానయానం శుల్కాలు- ఛార్జెస్- తగ్గిపోనున్నాయన్నది మరో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వ్యక్తం చేసిన ఆకాంక్ష. ప్రపంచీకరణ ఫలితంగా దేశంలో చొరబడిపోయిన విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలవారు నిరంతరం ధరలను, శుల్కాలను పెంచుతున్నారు- ఫలితంగా ప్రజల జీవన వ్యయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విమానయానం సమీప భవిష్యత్తులో సామాన్య ప్రజలకు సైతం సాధ్యం అవుతుందన్న సమాచారం మిక్కిలి హర్షణీయం. ‘హవారుూ చెప్పుల’ను ధరించే అతి సామాన్యులు ‘హవారుూ జహాజ్’- వాయునౌక- విమానం-ను ఎక్కగలరన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్వప్నం’ సాకారం కావడానికి ఈ ‘జీవ ఇంధనం’ దోహదం చేయగలదన్నది హర్షవర్ధన్ వ్యక్తంచేసిన విశ్వాసం. సమీప భవిష్యత్తులో కాకపోయినప్పటికీ సుదూర భవిష్యత్తులోనైనా ఈ కమ్మటి కల నిజం కావడానికి జీవ ఇంధన ఉత్పాదక ప్రక్రియ తప్పక దోహదం చేయగలదు.
ఈ జీవ ఇంధన చోదిత విమాన యాన ప్రారంభోత్సవానికి డెహ్రాడూన్‌లో ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి హాజరయ్యాడట. ఇరవై ఐదు నిముషాల తరువాత ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఈ గగన శకటానికి సురేశ్‌ప్రభు, హర్షవర్ధన్‌లతోపాటు మరో ముగ్గురు కేంద్ర మంత్రులు నితిన్ గడ్గరీ, ధర్మేంద్రప్రధాన్, జయంత్ సిన్హా స్వాగతం చెప్పారు. స్వచ్ఛ, హరిత జీవ ఇంధనం ఉత్పత్తికి, ఉపయోగానికి మన ప్రభుత్వం ఇస్తున్న ప్రాథమ్యానికి, ప్రాధాన్యానికి ఈ మంత్రుల ఉప స్థితిని దర్శనం. జీవ ఇంధనం, సౌర విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెరిగినకొద్దీ, వీటి వాడకం విస్తరించినకొద్దీ అంతర్జాతీయ ఇంధన వాణిజ్య స్వరూప స్వభావాలు మారిపోనున్నాయి. పెట్రోలియం ఇంధన తైలాన్ని, ఇంధన వాయువును ఎగుమతి చేస్తున్న దేశాల వాణిజ్య దౌత్య దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయడానికి జీవ ఇంధనం, సౌర ఇంధనం వంటివి దోహదం చేయనున్నాయి. ఈ రెండు కూడ భారీగా ఉత్పత్తిచేయడానికి వలసిన వనరులు మన దేశంలో మెండుగా ఉన్నాయి. పెట్రోలియం ఆధార ఇంధన ఉత్పత్తి ప్రక్రియలో కాలుష్యం వెలువడుతోంది. ఈ కర్బన కాలుష్యం ఈ ఇంధన వినియోగ ప్రక్రియలో మరింతగా విస్తరిస్తోంది. మహానగరాల వాయు మండలం విష పూరితం కావడానికి ప్రధాన కారణం పెట్రోలియం ఇంధన చోదిత వాహనాలు నిరంతరం వెళ్లగక్కుతున్న కర్బన ధూమం! పరిశ్రమల నుంచి వెలువడుతున్న వేడి పొగలు, ప్లాస్టిక్ పదార్థాలు ఇతర కారణాలు. ఈ కాలుష్యం కారణంగా హిమాలయ పర్వతాలు కరిగిపోతున్నాయి, శిలాశకల సమూహాలు బయటపడుతున్నాయి. సముద్ర చరాలకు ఊపిరి ఆడని రీతిలో కాలుష్యం స్వచ్ఛతను కబళిస్తోంది. ఈ వైపరీత్యాల నిరోధానికి, నివారణకు ప్రత్యామ్నాయం జీవ ఇంధనం. వాయు ఇంధనం, సౌర ఇంధనం. అందువల్లనే సోమవారం ప్రయోగాత్మకంగా ‘జీవ ఇంధన’ గగన యానం జరగడం వినూతన చరిత్రకు శ్రీకారం.
ఈ చరిత్రను రానున్న దశాబ్దులలో మన దేశం లిఖించబోతోంది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలోని ఐదువందల వ్యవసాయ కుటుంబాల వారు ఈ నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు. మొక్కలనుంచి, చెట్లనుంచి, గడ్డి నుంచి జీవ ఇంధనం తయారుచేసే ప్రక్రియ మన దేశంలోను ఇతర దేశాలలోను దశాబ్దులుగా కొనసాగుతోంది. ఆహార ధాన్యాలను, ఇతర ఆహార పదార్థాలను పండించే భూములను జీవ ఇంధనం మొక్కలను పెంచడానికి ఉపయోగించరాదన్నది ‘హరిత సమన్వయం’ సాధించడానికి వౌలిక సూత్రం. పొగాకు వంటి హానికరమైన పంటలను పండించడం ఈ ‘హరిత సమన్వయం’ ఇప్పటికే దెబ్బతినింది. పత్తిని పండించవలసిన భూములలో పొగాకును పండిస్తున్నారు. ఫలితంగా ఆహార ధాన్యాలను పండించిన భూములలో పత్తిని పండించవలసి వస్తోంది. అందువల్ల ‘బయో ఫ్యూయల్’ మొక్కలను పెంచడానికి ‘ఆహార’ వ్యవసాయ క్షేత్రాలను కేటాయించరాదు. ‘ఆహార’ వ్యవసాయ క్షేత్రాలలో ఉత్పత్తి అయ్యే పంటల గడ్డిని ఇతర వ్యర్థాలను మాత్రమే ‘జీవ ఇంధనం’ తయారీకి ముడి సరుకుగా వాడాలి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ ఐదువందల కుటుంబాలవారు ఇలా గడ్డిని, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఈ ‘బయో ఫ్యూయల్’ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నారట. డెహ్రాడూన్‌లోని ‘్భరతీయ ఇంధన పరిశోధక సంస్థవారు’ రూపొందించిన ఈ ‘బయోఫ్యూయల్’ను ఈ ‘స్పయిస్‌జెట్’ విమానానికి ఉపయోగించారట! అటవీ ఉత్పత్తులను, ఆహార ధాన్యాలు పండించడానికి పనికిరాని వ్యవసాయ క్షేత్రాలలో పెరిగే మొక్కలను గడ్డిని మాత్రమే జీవ ఇంధన తయారీకి ఉపయోగించాలి. అంతేకాని ఆహార వ్యవసాయ క్షేత్రాలను ‘హరిత ఇంధనం’ మొక్కల పెంపకం కోసం కేటాయించరాదు. ‘జీవ ఇంధనం’ ఉత్పత్తి పేరుతో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడానికి అవకాశం ఇవ్వరాదు.
అమెరికా, చైనా తదితర సంపన్న దేశాలకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ‘జీవ ఇంధనం’ తయారీలో అగ్రగాములు. అయితే ఈ సంస్థలు తమ దేశాలలోకాక ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోని వర్ధమాన దేశాలలో ప్రధానంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వందల వేల ఎకరాలలో ‘జీవ ఇంధనం’ మొక్కలను పెంచుతున్నారు. ఆఫ్రికా ఖండంలోని యాబయి శాతం వ్యవసాయ భూమిని సంపన్న దేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు ఆక్రమించుకొని ఉండడానికి ఒక ప్రధాన కారణం జీవ ఇంధనం! ఫలితంగా ఈ దేశాలలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిపోయింది. ఇలాంటి దుస్థితి మన దేశంలో ఏర్పడరాదు. అందువల్ల ‘జీవ ఇంధన’ ఉత్పాదక రంగంనుండి విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలను మినహాయించాలి. ఈ రంగంలోకి విదేశీయ సంస్థలు చొరబడకుండా ప్రభుత్వాలు జాగ్రత్తవహించాలి. లేనట్టయితే మన దేశంలో కూడ ఆహార ధాన్యాల కొరతను సృష్టించడంలో విదేశీయ సంస్థలు కృతకృత్యలు కాగలవు. ఆహార ధాన్యాల సమృద్ధికి భంగం కలుగని రీతిలో మాత్రమే ‘జీవ ఇంధనం’ ఉత్పత్తి జరగాలి.