సంపాదకీయం

బీభత్సానికి అభిశంసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయంకర జిహాదీ బీభత్సకాండకు బలి అవుతున్న మన దేశానికీ, ఈ బీభత్సకాండను ఉసిగొలుపుతున్న పాకిస్తాన్‌కూ మధ్య మరోసారి జరగవలసి ఉండిన మంత్రిత్వస్థాయి చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడం ముదావహం. మన విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ అతి త్వరలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా చలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు ముఖ్‌దూమ్ షా మహ్మూద్ ఖురేషీతో సమావేశం కానున్నట్లు శుక్రవారం ప్రచారం జరిగింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ’ సమావేశాలకు హాజరవుతున్న ఉభయ దేశాల మంత్రులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలన్నది పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చెలామణి అవుతున్న మరో పరోక్ష బీభత్సకారుడు ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను మన ప్రభుత్వం మొదట అంగీకరించడం, ఆ తరువాత రద్దు చేయడం నిలకడ లేని మన విధానానికి నిదర్శనం. ఇలా మొదట రంగం సిద్ధం కావడం పాకిస్తానీ జిహాదీ బీభత్స రాజ్యాంగ వ్యవస్థ నిర్లజ్జకు, మన ప్రభుత్వం వారి బుద్ధిహీనతకు సాక్ష్యం. 1947లో అఖండ భారత విభజన జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగా జిహాదీ బీభత్సకాండను కొనసాగిస్తోంది, జిహాదీ హంతకులకు శిక్షణనిచ్చి మన దేశంలోకి ఉసిగొలుపుతోంది. 1947లోనే పాకిస్తానీ ప్రత్యక్ష బీభత్సకారులు, ప్రచ్ఛన్న బీభత్సకారులైన సైనికులు మన జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడినారు, భయంకర హత్యాకాండ సాగించారు, జమ్మూ కశ్మీర్‌లోని మూడవ వంతు ఇప్పటికీ పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఉండడం అప్పటి నుంచీ కొనసాగుతున్న జిహాదీ బీభత్సకాండకు చిహ్నం. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్- పీవోకే-లో అనాదిగా నివసించిన దాదాపు మూడున్నర లక్షల మంది హిందువులలో అరవై వేల మందిని 1947 చివరి నాటికి జిహాదీలు హత్యచేశారు. మిగిలిన హిందువులు నిర్వాసితులై మన అధీనంలో మిగిలిన జమ్మూ కశ్మీర్‌కూ దేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చేశారు! పాకిస్తాన్ ప్రభుత్వం 1947 నుంచీ కశ్మీర్ లోయలో సాగించిన జిహాదీ హత్యాకాండ ఫలితంగా ‘లోయ’ ప్రాంతంలోని హిందువులందరూ నిర్మూలనకు గురయ్యారు, హత్యలకు గురయ్యారు, జమ్మూ ప్రాంతానికీ దేశంలోని ఇతర ప్రాంతాలకు శరణార్థులై వచ్చేశారు! ఇదంతా పాకిస్తాన్ నడిపిస్తున్న జిహాదీ బీభత్సకాండ ఫలితం! పాకిస్తాన్ తన బీభత్సకాండను విడనాడనంత వరకూ ఆ ప్రభుత్వంతో చర్చలను జరిపే ప్రసక్తిలేదని మన ప్రభుత్వం 1993లో దావూద్ ఇబ్రహీం ముఠా ముంబయిలో జరిపిన భయంకర బీభత్సకాండ తరువాత స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం అప్పటి నుంచీ తన ‘విధానం’ మార్చుకోలేదు, తన ‘బాట’ మార్చుకోలేదు, మన దేశంలోకి జిహాదీ హంతకులను ఉసిగొల్పడం ఆపలేదు. మన ప్రభుత్వం మాత్రం ప్రతి రెండు మూడేళ్లకోసారి ‘మాట’ మార్చుతోంది, బీభత్సకాండను విడనాడని పాకిస్తాన్‌తో మళ్లీ మళ్లీ చర్చలకు సిద్ధం అవుతోంది...
నిలకడలేని ఈ విధానం వల్ల మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వానికి ‘లోకువ’ అయిపోయింది, అంతర్జాతీయ సమాజంలో ‘తేలిక’ అయిపోయింది. ఇప్పుడు మొదట చర్చలకు అంగీకరించడం ఆత్మహత్యా సదృశమైన విధాన వైపరీత్యం. చివరి నిమిషంలోనైనా రద్దు చేసుకోవడం విజ్ఞత వికసిస్తోందనడానికి నిదర్శనం. ‘బీభత్సకాండ, సంభాషణలు- టెర్రర్ అండ్ టాక్స్- సమాంతరంగా కొనసాగజాలవు..’ అన్నది మన ప్రభుత్వం దశాబ్దులుగా చెబుతున్న మాట! 1993 నుంచి కనీసం ఎనిమిదిసార్లు మన ప్రభుత్వం- ‘బీభత్సకాండను విడనాడే వరకు పాక్ ప్రభుత్వంతో చర్చలు జరుపబోము’ అని ప్రకటించింది. రెండు మూడు ఏళ్లవరకు ఈ విధానానికి కట్టుబడింది. ఈ కాలవ్యవధిలో పాకిస్తాన్ మన దేశంలోకి జిహాదీలను ఉసిగొలపడం ఆపలేదు. అయినప్పటికీ మన ప్రభుత్వం మళ్లీ చర్చలకు సిద్ధమైపోయింది. ఇలా ‘చర్చల తెగతెంపులు’, ‘మళ్లీ చర్చల ప్రారంభం’ - ఈ ప్రహసనం 1993 నుంచి పునరావృత్తవౌతూనే ఉంది. 2008లో ముంబయిలో బీభత్సకాండను జరిపించిన పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం చర్చలను ఆపివేసింది. ‘ముంబయి హంతకులను, ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘జమాత్ ఉద్ దావా’ ముఠాల ముష్కరులను, వారిలో పేరుమోసిన హఫీజ్ సరుూద్ వంటివారిని పట్టి మాకు అప్పగించాలి.. అంతవరకూ చర్చలు ఉండబోవు’ అని మన ప్రభుత్వం 2009లో స్పష్టం చేసింది. పాకిస్తాన్ హఫీజ్ సరుూద్‌ను అప్పగించలేదు. ‘ముంబయిలో హత్యాకాండ జరిపించిన వారిని నిర్బంధించి మీ దేశంలోనే శిక్షించండి.. అంతవరకూ మీతో చర్చలు జరుపబోము..’ అన్న స్థాయికి మన ప్రభుత్వం దిగివచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం దోషులను నిర్బంధించలేదు, శిక్షించలేదు. కానీ 2010లో పాకిస్తాన్‌తో మన ‘సమగ్ర చర్చలు’- కాంపోజిట్ డైలాగ్-, ‘విశ్వాస నిర్మాణ చర్యలు’- కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్- సిబిఎమ్స్- మళ్లీ మొదలైపోయాయి!
పాకిస్తాన్ బీభత్స విధానం 1947 నుంచీ మారడం లేదు. ‘చర్చల’ విషయమై మన విధానం మాత్రం మాటిమాటికీ మారిపోతోంది. ఈ ‘నిలకడ’ లేని మన విధాన వైపరీత్యానికి ఇప్పుడు న్యూయార్క్‌లో జరగవలసి ఉండిన పునరావృత్తి జరగకపోవడం హర్షణీయం. పాకిస్తాన్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మన దేశంలో జిహాదీ బీభత్సకాండను జరిపించడం మానుకున్నట్టయితే ఆ దేశంతో మైత్రిని పెంపొందించుకొనడం మన దేశంలోని నూటఇరవై ఐదు కోట్ల ప్రజల అభీష్టం. పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవడం కల్ల. ‘జాయిష్ ఏ మహమ్మద్’ ముఠాకు చెందిన కరడుకట్టిన జిహాదీ బీభత్సకారుడు అఝార్ మసూద్‌కు వ్యతిరేకంగా చర్య తీసుకొనక పోవడం ఈ ‘విధాన నిబద్ధత’కు ఒక ఉదాహరణ మాత్రమే! ‘బీభత్సం, సంభాషణలు సమాంతరంగా సాగవు..’. బీభత్సకాండను పాకిస్తాన్ విడనాడడం లేదు. అందువల్ల మన ప్రభుత్వం చర్చలను విడనాడాలి. లేనట్టయితే ‘బీభత్సం, చర్చలు సమాంతరంగా కొనసాగనున్నాయి’. ఇందుకు మన ప్రభుత్వమే దోహదం చేసినట్టు అవుతోంది! పాకిస్తాన్ బీభత్సకాండను మన ప్రభుత్వం మాన్పించలేకపోవచ్చు, కానీ పాకిస్తాన్ తన బీభత్సకాండను విడనాడేవరకు చర్చలను మానుకోవడం మన ప్రభుత్వం తీసుకోగలిగిన చర్య.. పదేళ్లుకావచ్చు, వంద ఏళ్లు కావచ్చు! చర్చలు జరిపినప్పటికీ, చర్చలు జరుపనప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్సకాండను జరిపిస్తూనే ఉంటుంది. ఇక ‘మాటల’ వల్ల ప్రయోజనం ఏమిటి? తమ దేశాన్ని బద్దలుకొట్టడానికి యత్నిస్తున్న బీభత్స ప్రభుత్వాలతో ఇజ్రాయిల్ వంటి చిన్న దేశాలు సైతం చర్చలు జరుపడం లేదు. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేసే, ప్రపంచపటం నుంచి ఇజ్రాయిల్‌ను చెఱపివేసే బీభత్స విధానాన్ని ఈజిప్ట్ ప్రభుత్వం 1978లో విడనాడింది. అప్పటినుంచి మాత్రమే ఇజ్రాయిల్ తన పొరుగు దేశంతో చర్చలను జరుపుతోంది. మిగిలిన అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ ఇప్పటికీ చర్చలను జరపడం లేదు....
చిన్న దేశమైన ఇజ్రాయిల్ అవలంబిస్తున్న ఈ దృఢమైన విధానాన్ని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎందుకు అవలంబించజాలదు? 2014 ఆగస్టులో మన ప్రభుత్వం బీభత్స పాకిస్తాన్‌తో ఇలా చర్చలను రద్దుచేసింది. అప్పటికీ, ఇప్పటికీ పాకిస్తాన్ బీభత్సకాండ ఆగలేదు. పాకిస్తాన్ ప్రధాని ‘చర్చలు’ కోరిన సమయంలోనే పాకిస్తాన్ ప్రచ్ఛన్న బీభత్సకారులైన సైనికులు మన సైనికుణ్ణి చంపి శరీరాన్ని ముక్కలు చేశారు. సుషమా స్వరాజ్ పాకిస్తానీ మంత్రితో సమావేశం కానున్నదని మన ప్రభుత్వం ప్రకటించిన తరుణంలోనే కశ్మీర్‌లో ముగ్గురు మన పోలీసులను ‘జిహాదీ’లు హత్యచేశారు! ఈ హత్యాకాండకు నిరసనగా మన ప్రభుత్వం న్యూయార్క్ సమావేశాన్ని రద్దు చేసుకోవడం హర్షించదగ్గ పరిణామం. పాకిస్తాన్ జిహాదీలు ప్రత్యక్ష బీభత్సకారులు, పాకిస్తాన్ సైనికులు, రాజకీయవేత్తలు పరోక్ష- ప్రచ్ఛన్న- బీభత్సకారులు..