సంపాదకీయం

‘మాల్‌దీవుల’ విజయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్‌దీవులలో మతోన్మాద నియంతృత్వాన్ని వ్యవస్థీకరించడానికి ఆరు ఏళ్లకు పైగా ప్రయత్నించిన అబ్దుల్లా యమీన్ పరాజయం పాలయ్యాడు. ఆరేళ్లకు పైగా కొడిగట్టి ఆరిపోవడానికి సిద్ధమై ఉన్న ప్రజాస్వామ్య జ్వాల సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాలతో మళ్లీ సముజ్వల శోభను సంతరించుకొంది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో ఇతర ప్రతిపక్షాలు బలపరచిన ‘మాల్‌దీవుల డెమొక్రాటిక్ పార్టీ’- ఎమ్‌డిపి- అభ్యర్థి ఇబ్రహీం మహమ్మద్ సోలీ ఘన విజయం సాధించడం ఊహించని శుభ పరిణామం, ప్రపంచ ప్రజాస్వామ్య శక్తులకు ఆనందకరం. గత కొన్ని ఏళ్లుగా అధ్యక్షుడుగా చెలామణి అయిన అబ్దుల్లా యమీన్ ఈ ఎన్నికలలో గెలువనున్నట్టు గత కొన్ని నెలలుగా ప్రచారం జరిగింది, మన ప్రభుత్వం ఆందోళనకు గురి అయింది. చైనా ప్రభుత్వం తన కుట్ర కొనసాగుతున్నందుకు సంతసించింది. జిహాదీ శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడైన అబ్దుల్లా యమీన్‌ను పాకిస్తాన్ కూడ బలపరుస్తోంది. అందువల్ల మతోన్మాది అయిన, నియంత అయిన అబ్దుల్లా యమీన్ భారత వ్యతిరేకి కావడం సహజం. గత ఆరేళ్లుగా యమీన్ చైనా తొత్తుగా, పాకిస్తానీ బంటుగా వ్యవహరించడం చరిత్ర. అందువల్ల యమీన్ ఈ ఎన్నికలలో అక్రమ పద్ధతుల ద్వారా మళ్లీ విజయం సాధించగలడని అంతర్జాతీయంగా జరిగిన ప్రచారం మన ప్రభుత్వానికి ఆందోళనను కలిగించడం సహజం. చిన్న దేశమయినప్పటికీ మాల్‌దీవులు హిందూ మహాసముద్రంలో అతి కీలకమైనచోట నెలకొని ఉంది. మన లక్ష ద్వీపాలకు దక్షిణంగాను, శ్రీలంకకు పశ్చిమంగాను నెలకొని ఉన్న ‘మాల్‌దీవుల’ నైసర్గిక స్థితి మన దేశపు దక్షిణ సరిహద్దుల భద్రతతో ముడివడి ఉంది. మన లక్ష ద్వీపాలకు మాల్ దీవులకు మధ్య నెలకొని ఉన్న ఇరుకైన జల మార్గం గుండా ఇటీవలి కాలంలో చైనా యుద్ధ నౌకల సంచారం ఎక్కువ కావడానికి మాల్‌దీవులతో చైనాకు పెరిగిన సాన్నిహిత్యం దోహదం చేస్తోంది. ఇండోనేసియాలోని సుమత్రా ద్వీపానికీ మన అండమాన్ ద్వీపానికి మధ్య మొదలైన ఈ ఇరుకైన జలమార్గం మన దేశపు తూర్పు తీరాన్ని, శ్రీలంకను చుట్టి లక్ష ద్వీపాలకు మాల్‌దీవులకు మధ్యగా సాగి అరేబియా సముద్రంలోకి హిందూ మహాసాగరంలో నౌకలను చేరవేస్తోంది. మాల్‌దీవులలోని నిర్జన ‘లంక’లలో దశాబ్దుల తరబడి పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన జిహాదీ బీభత్సకారులు స్థావరాలను ఏర్పాటుచేసుకొని ఉన్నారు. ఓడ దొంగలకూ, జిహాదీలకు మధ్య అనుసంధానం ఏర్పడడంతో మన లక్ష ద్వీపాల భద్రతకు ప్రమాదం ఏర్పడి ఉంది. ఓడ దొంగలను అరికట్టే నెపంతో అరేబియా సముద్రంలో తిష్ఠవేసిన చైనా నౌకాదళం అసలు లక్ష్యం మన పడమటి సముద్ర తీరాన్ని కనిపెట్టి ఉండడం. ఈ వ్యూహాత్మక చైనా దురాక్రమణను గత ఆరేళ్లుగా అబ్దుల్లా యమీన్ ప్రోత్సహించాడు, భారత వ్యతిరేకతను బాహాటంగా వెళ్లగక్కాడు. యమీన్ ఓటమి, ఇబ్రహీం సోలీ విజయం అందువల్ల మనకు ఊహించని వ్యూహాత్మక విజయం, చైనా పాకిస్తాన్‌ల ఉమ్మడి దురాక్రమణ వ్యూహానికి ఎదురైన ‘కన్నం.’....
ఐరోపా వారి దాస్యానికి శతాబ్దులు బలిఅయిన మాల్ దీవులు అఖండ భారత్‌నుంచి విడిపోవడం చరిత్ర. బ్రిటన్ ముష్కరులు 1965లో మాల్‌దీవుల నుంచి నిష్క్రమించారు. కానీ స్వతంత్ర ‘మాల్ దీవులు’ దశాబ్దుల తరబడి నియంతృత్వ పాలనకు గురి అయింది. దశాబ్దుల తరబడి ఏకపక్ష పాలన సాగించిన వౌమూన్ అబ్దుల్ గయూమ్ 2008లో ‘బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి అంగీకరించవలసి వచ్చింది. మహమ్మద్ నషీద్ వంటి ప్రజాస్వామ్య ఉద్యమకారులను గయూమ్ కారాగృహ నిర్బంధంలో ఉంచడం 2008వరకు నడచిన కథ. 2008 అక్టోబర్‌లో మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలలో ‘నియంత’ అబ్దుల్ గయూమ్‌ను మహమ్మద్ నషీద్ ఓడించాడు. మహమ్మద్ నషీద్ ప్రభుత్వం మన దేశం పట్ల మైత్రిని వహించింది, తమ దేశపు రాజధాని మాలేలోని విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మన దేశానికి చెందిన ఒక వాణిజ్య సంస్థకు అప్పగించింది. కానీ పదవీచ్యుతుడైన గయూమ్ ‘సవతి’ సోదరుడు అబ్దుల్లా యమీన్ తదితర జిహాదీ శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయడానికి కుట్ర చేశాయి. ఈ కుట్ర చైనా ప్రభుత్వ ప్రేరణతో జరిగిందన్నది ఆ తరువాత ధ్రువపడిన వాస్తవం. 2011వరకు మాల్ దీవులలో చైనాకు దౌత్యకార్యాలయం లేదు. 2011 నవంబర్‌లో మాల్ దీవుల ప్రభుత్వం తమ దేశంలో చైనా రాయబారి కార్యాలయం ఏర్పాటునకు అనుమతినిచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహమ్మద్ నషీద్ ప్రభుత్వం చేసిన చారిత్రక మహాపరాధం ఇది...
ఇలా చైనా మాల్ దీవులలో చొరబడిన తరువాత మూడు నెలలు తిరగకముందే మహమ్మద్ నషీద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసుల- సైనికుల- తిరుగుబాటు జరిగింది. చైనా, పాకిస్తాన్‌ల మద్దతుదారులైన జిహాదీలు, గయూమ్, యమీన్ వంటి ప్రచ్ఛన్న బీభత్సకారులు ఈ తిరుగుబాటును నిర్వహించారు. మహమ్మద్ నషీద్ ప్రభుత్వం వారు నషీద్ నాయకత్వంలోని ‘ఎమ్‌డిపి’వారు తిరుగుబాటును అణచివేయడానికి వీలుగా సైనిక సహాయం చేయమని మన ప్రభుత్వాన్ని పదేపదే అభ్యర్థించారు. 2012 ఫిబ్రవరిలో జరిగిన ఈ కిరాయి తిరుగుబాటును మన ప్రభుత్వం జోక్యం చేసుకొని అణచివేసి ఉండినట్టయితే 2012వ సంవత్సరం నుండి మాల్‌దీవులలో కొనసాగిన భయంకర భారత వ్యతిరేకత అంకురించి ఉండేది కాదు, చైనా ప్రాబల్యం మాల్ దీవులలోను హిందూ మహాసాగర ప్రాంతంలోను విస్తరించి ఉండేది కాదు. 1988లో అబ్దుల్ గయూమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిరాయి గూండాలు తిరుగుబాటు చేశారు. గయూమ్ ప్రభుత్వం మన ప్రభుత్వ సహాయం కోరింది. మన నౌకాదళం వారు మాల్‌దీవులకు వెళ్లి తిరుగుబాటును అణచివేశారు, గయూమ్ ప్రభుత్వం కొనసాగింది. 1988లో చూపిన దౌత్య విజ్ఞతను మన ప్రభుత్వం 2012లో చూపకపోవడం మన ప్రభుత్వం చేసిన హిందూ మహాసాగరమంత తప్పిదం.. ఇలా నషీద్ ప్రభుత్వం 2011లోను మన ప్రభుత్వం 2012లోను చేసిన పొరపాట్లవల్ల మాల్‌దీవులలో చైనా ప్రాబల్యం విస్తరించింది. 2012 ఫిబ్రవరి ఏడవ తేదీన నషీద్ పదవీచ్యుతుడయ్యాడు. 2008లో ప్రభవించిన ప్రజాస్వామ్య వ్యవస్థ గ్రహణగ్రస్తమైంది. ఆ గ్రహణం ఇప్పటికి కాని వదల లేదు. ఈ మధ్యకాలంలో 2013 సెప్టెంబర్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 2012 ఫిబ్రవరిలో పదవీచ్యుతుడైన నషీద్ 2013 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలలో పోటీచేసి గెలిచాడు. కానీ మాల్‌దీవుల సుప్రీంకోర్టు ‘నియంతల’ పక్షం అవలంబించింది. ఫలితంగా నషీద్ ఎన్నిక రద్దయింది. అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడయ్యాడు. ఐదేళ్ల తరువాత ఇప్పుడు జరిగిన ఎన్నికలలో యమీన్ ఓడిపోయాడు, నషీద్ పార్టీకి చెందిన ఇబ్రహీం సోలీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం దివ్యశక్తి ప్రచోదిత ప్రజాస్వామ్య అద్భుతం. సోలీకి ‘పోలైన’ వోట్లలో యాబయి తొమ్మిది శాతం- లక్షాముప్పయి ఐదు వేల వోట్లు- లభించాయి. యమీన్‌కు నలబయి ఒక్క శాతం- తొంబయి ఆరువేల వోట్లు- లభించాయి!!
2012లో నషీద్ పదవీచ్యుతుడైన తరువాత చైనా చోదిత మాల్‌దీవుల ప్రభుత్వం ‘మాలే విమానాశ్రయ అభివృద్ధి’ పథకాన్ని భారతీయ వాణిజ్య సంస్థనుండి లాక్కుంది, చైనా సంస్థకు అప్పగించింది. అది ప్రారంభం. మాల్‌దీవులలో ఉచితంగా, మన ఖర్చుతో రక్షణ బాధ్యతలను నిర్వహిస్తుండిన రెండు సమర గగన శకటాల- హెలికాప్టర్స్-ను గత జూలైలో మన ప్రభుత్వం ఉపసంహరించుకోవలసి రావడం సరికొత్త ఉదాహరణ. ఈ గగన శకటాలను వెనక్కి తీసుకోవాలని యమీన్ పట్టుపడ్డాడు. ఈ మధ్యకాలంలో- 2012 నుంచి 2018 వరకు- యమీన్ ప్రభుత్వం చైనాతో చేతులుకలిపి మనపై బహిరంగంగా విషం కక్కడం చరిత్ర! అందువల్ల యమీన్ ఓటమి చైనా ఓటమి! నషీద్ చెప్పినట్టు మాల్‌దీవులకు మన దేశం నిజమైన ఆధారం..