సంపాదకీయం

‘గోడ’కు అటూ, ఇటూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం లోపల విద్రోహుల కలాపాలు, దేశం వెలుపల దౌత్య దౌర్జన్యాలు మన భద్రతా కుడ్యాన్ని భగ్నం చేయడానికి దోహదం చేస్తుండడం నడుస్తున్న వైపరీత్యం.. ‘కన్నాల’ను పూడ్చడానికి మన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు కొత్త కన్నాలను కొట్టడానికి అంతర్గత విద్రోహులు, అంతర్జాతీయ విస్తరణవాదులు యత్నిస్తూ ఉండడం ఆవిష్కృతవౌతున్న వికృత దృశ్యం! పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స సంస్థ ‘ఐఎస్‌ఐ’తో మన రక్షణ ఉత్పత్తుల రంగానికి చెందిన ఇంజనీర్ ఒకడు కుమ్మక్కు కావడం అంతర్గత భద్రతా ఛిద్రాలకు సరికొత్త సాక్ష్యం.. చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు కలసికట్టుగా ఏర్పాటుచేస్తున్న ‘ఆర్థిక ప్రాంగణం’- ఎకనమిక్ కారిడార్-లో భాగస్వామ్యం వహించడానికి మన ‘మిత్ర దేశమైన’ సౌదీ అరేబియా సిద్ధమైపోవడం దౌత్య దౌర్జన్యానికి మరో నిదర్శనం. ఇలాంటి దౌత్య దౌర్జన్యకాండకు కొన్ని దేశాలు ప్రత్యక్షంగా పాల్పడుతున్నాయి, మరికొన్ని దేశాలు పరోక్షంగా దౌత్య బీభత్సం సాగిస్తున్నాయి! ఇరాన్, సౌదీ అరేబియా, రష్యా వంటి ‘మిత్ర దేశాలు’ మనకు వ్యతిరేకంగాను పాకిస్తాన్‌కు చైనాకు అనుకూలంగాను కార్యక్రమాలను అమలుచేస్తుండడం ఈ ప్రచ్ఛన్న దౌత్య బీభత్సం.. పాకిస్తాన్ చైనాలు నిర్మిస్తున్న ‘ఎకనమిక్ కారిడార్’ మన జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ గుండా సాగుతోంది! ఈ దుశ్చర్యకు చైనావంటి శత్రు దేశం పూనుకొనడంలో ఆశ్చర్యం లేదు, సౌదీ అరేబియా వంటి ‘మిత్ర దేశం’ పూనుకొనడమే విస్మయకరం!! దశాబ్దుల తరబడి అంతర్జాతీయ దురాక్రమణ వ్యూహాలు, ప్రతివ్యూహాలు అమలు జరుగుతున్నాయి. ఈ చదరంగ క్రీడలో ఎప్పటికప్పుడు మన దేశానికి వ్యతిరేకమైన ‘ఎత్తుగడ’లు ఏర్పడిపోతున్నాయి. పాకిస్తాన్, చైనాల కలసికట్టు దురాక్రమణకు వ్యతిరేకంగా మనవైపున దృఢంగా నిలబడగల దేశం ఏది? అన్నది ప్రశ్నార్థకమై ఉంది. మైత్రి పేరుతో అమెరికా ప్రభుత్వం మన వాణిజ్య వ్యవహారాలలోను రక్షణ వ్యవహారాలలోను అక్రమ ప్రమేయం కొనసాగిస్తోంది. ‘ఇరాన్ నుంచి మనం ఇంధనం కొనరాదు, రష్యా నుంచి ఆయుధాలు కొనరాదు’.. ఇదీ అమెరికా మనకు నిరంతరం చేస్తున్న హెచ్చరిక! అమెరికాను మనం లక్ష్యపెట్టలేదు, ‘ఎస్-400’ రకం ‘ట్రయంఫ్’ అత్యాధునిక క్షిపణులను కొనుగోలు చేయడానికి మన ప్రభుత్వం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐదు ‘క్షిపణి’ సమూహాల ధర దాదాపు నలబయి వేల కోట్ల రూపాయలు! రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ రీపుతిన్ మన దేశానికి వచ్చిన సందర్భంగా గత ఐదవ తేదీన ఈ ఒప్పందం కుదిరింది. కానీ రష్యా పాకిస్తాన్‌తో కూడ ‘రక్షణ’ సహకారం కొనసాగిస్తోంది, పాకిస్తాన్‌కు ఆయుధాలను విక్రయిస్తోంది, 2014వరకు పరస్పరం శత్రు దేశాలుగా ఉండిన పాకిస్తాన్ రష్యాల మధ్య మైత్రి వికసించడానికి మాధ్యమం చైనా ప్రభుత్వం.. 2014 నవంబర్‌లో రష్యాకు పాకిస్తాన్‌కు మధ్య ‘రక్షణ సహకారం’ కుదరడం మన భద్రతకు భంగకరమైన పరిణామం. పాకిస్తాన్‌తో కలసి రష్యా ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది.. 1990 వరకు రష్యాకు చైనా శత్రు దేశం. ప్రపంచీకరణ మొదలైన తరువాత రష్యా ప్రభుత్వం చైనాకు ‘తోక’గా మారింది..
ఇరాన్ మనకు సన్నిహిత ‘మిత్ర’దేశం... అని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో చైనా తిష్ఠవేసి ఉంది. బలూచిస్థాన్‌లో ‘గ్వాడార్’ ఓడరేవును చైనా ఆధునీకరించింది. చైనా యుద్ధనౌకలు ‘గ్వాడార్’లో తిష్ఠవేసి ఉన్నాయి. దీనివల్ల మన సముద్ర భద్రతకు భంగం వాటిల్లుతోంది. అరేబియా సముద్ర ప్రాంతంలోను పర్షియా సింధుశాఖ ప్రాంతంలోను, ఎఱ్ఱ సముద్ర ప్రాంతంలోను చైనా పాకిస్తాన్ నౌకల ‘ఉమ్మడి’ యుద్ధవిన్యాసాలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా ఖండంలోని ‘జిబౌటీ’ చైనా యుద్ధనౌకల స్థావరం ఏర్పడడం మన పశ్చిమ తీరానికి ముంచుకొస్తున్న మరో ముప్పు. చైనా వారి వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి వీలుగా ఇరాన్‌లోని ‘చౌబహార్’ ఓడరేవును ఆధునీకరించి నిర్వహించడానికి మన ప్రభుత్వం పూనుకొంది, ఇరాన్‌తో ఒప్పందం కూడ కుదుర్చుతుంది. ఈ ఓడరేవు ద్వారా మన ప్రభుత్వం అప్ఘానిస్థాన్‌కు ఆహార పదార్థాల ఎగుమతిని కూడ ఆరంభించింది. కానీ ఇరాన్ ప్రభుత్వం ఆ తరువాత ‘చౌబహార్’ ఓడరేవు ప్రాంగణంలో చైనావారు స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి అనుమతినిచ్చిన రహస్యం రట్టయింది.. ఇరాన్ మనకూ చైనాకు మధ్య సమానదూరం పాటిస్తోంది..
ఇలా ఎక్కడికక్కడ చైనా దురాక్రమణ ‘వ్యూహం’ మన దేశానికి నలువైపుల నుంచి విస్తరించిపోతోంది. ఇరాన్ నుంచి మన దేశానికి ‘గొట్టపు మార్గం’-పైప్‌లైన్- నిర్మించడానికి కుదిరిన ఒప్పందం పదేళ్లపాటు అమలు జరగలేదు, ఈ ‘పైప్‌లైన్’ పాకిస్తాన్ భూభాగం గుండా కొనసాగాలన్నది ఒప్పందం! ఈ ‘గొట్టపు మార్గం’ గుండా మన దేశానికి ఇంధన వాయువును సరఫరా చేయడానికి ఇరాన్ 2003లో అంగీకరించింది. ఈ ‘ఇరాన్ పాకిస్తాన్ ఇండియా’- ఐపిఐ- గొట్టపుమార్గం పథకం 2012లో రద్దయింది, ఇరాన్ పాకిస్తాన్ కలసికట్టుగా రద్దుచేశాయి. ‘గొట్టాన్ని’ పాకిస్తాన్ వరకూ నిర్మించాలని ఈ రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ ‘గొట్టం’ గ్వాడార్ నుంచి చైనాలోని ‘సింకియాంగ్’వరకూ కొనసాగాలన్నది చైనా వ్యూహం! బలూచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ దమనకాండను దశాబ్దులుగా నిరసిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర బలూచిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది వారి ఆకాంక్ష! ఈ స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయడానికి వీలుగా పాకిస్తాన్ ప్రభుత్వం చైనాతో కలసి ‘ఆర్థిక ప్రాంగణాన్ని’ నిర్మిస్తోంది. ఈ ఆర్థిక ప్రాంగణం ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’ గుండా కొనసాగుతోంది. గ్వాడార్ నుంచి సింకియాంగ్‌లోని ‘కష్‌గఢ్’వరకూ సాగే ఈ ప్రాంగణాన్ని బలూచి ప్రజలు నిరసిస్తున్నారు. చైనా ఉనికివల్ల తమ స్వతంత్ర బలూచిస్థాన్ ఉద్యమానికి భంగం వాటిల్లుతుందన్నది వారి భయం. ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’- పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్- పీఓకే- లో ఆర్థిక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయరాదన్న మన ప్రభుత్వపు హెచ్చరికను చైనా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా కూడ ‘పీఓకే’లోని ‘ఆర్థిక ప్రాంగణం’- ఎకనామిక్ కారిడార్-లోకి చొరబడిపోతోంది..
అంతర్గత శత్రువులు చెలరేగుతుండడానికి ఈ బాహ్య ప్రమాదాలు నేపథ్య భూమికలు. ‘రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ’- డిఆర్‌డివో- వారు తనకు ‘ఉత్తమ యువశాస్తవ్రేత్త’ పురస్కారాన్ని ప్రదానం చేసినట్టు ప్రకటించుకున్న నిశాంత అగర్వాల్ అనే ఇంజనీర్‌ను సోమవారం నాగపూర్‌లో పోలీసులు అరెస్టు చేయడం ఈ ‘అంతర్గత శత్రువులు’ ప్రబలుతున్నారన్న వాస్తవానికి సరికొత్త సాక్ష్యం. ‘బ్రహ్మా ఎయిర్‌స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు చెందిన ఇతగాడు పాకిస్తాన్ ప్రభుత్వం వారి బీభత్స సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’-ఐఎస్‌ఐ-కు కీలకమైన సమాచారాన్ని చేరవేశాడట! చదువుకున్నవారు ఇలా దేశద్రోహులుగా మారుతుండడం దశాబ్దులుగా విస్తరిస్తున్న విష జాడ్యం. మాతృభూమి పట్ల విరోధాన్ని పెంచుకుంటున్న విబుధదైత్యులు ఇంకా ఎంతమంది ఉన్నారో? బయటి నుంచి దాడి చేస్తున్న ప్రమాదాల కంటె ఇలా దేశంలోనే తయారవుతున్న ప్రమాదాలు మరింత భయంకరమైనవి. ఈ నిశాంత అగర్వాల్ అనే వాడికి సహకరించిన మరికొందరు ‘పాకిస్తానీ తొత్తుల’ గురించి కూడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు ఆరాతీస్తున్నారట.. ‘డొంక’ కదలుతుందా??
*