సంపాదకీయం

కల్లోల ‘గాంధారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్ఘానిస్థాన్‌లో ఆరుగురు భారతీయులు అపహరణకు గురికావడం విస్తరిస్తున్న పాకిస్తాన్ బీభత్స వ్యూహంలో భాగం. 2014లో అమెరికా దళాల ఉపసంహరణ మొదలైన తరువాత అఫ్ఘానిస్థాన్‌లో చైనా ప్రమేయం పెరుగుతోంది. దాదాపు పదిహేనేళ్లుగా అఫ్ఘానిస్థాన్ పునర్ నిర్మాణానికి మన దేశం వేల కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ పథకాలను అమలుచేస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లో మన ఉనికిని వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ బీభత్సకారులను ఉసిగొలిపి మన రాయబార కార్యాలయంపైన, మన దౌత్యవేత్తలపైన దాడులు చేయిస్తుండడం ఈ పదిహేనేళ్ల సమాంతర చరిత్ర! గతంలోనూ అనేకసార్లు జిహాదీలు అఫ్ఘానిస్థాన్‌లోని మన పౌరులపై దాడులు చేశారు, అపహరించుకొని వెళ్లారు. ఈ బీభత్స కలాపాలకు కొనసాగింపు ఆదివారం మన దేశానికి చెందిన ఆరుగురు ఇంజనీర్ల అపహరణ. ‘కెఇసి’ అన్న మన దేశానికి చెందిన వాణిజ్యసంస్థ అఫ్ఘానిస్థాన్‌లో విద్యుత్ సరఫరా వ్యవస్థలను నిర్మిస్తోంది. ఈ వ్యవస్థల ద్వారా అఫ్ఘానిస్థాన్‌లోని ‘్భగియా’ ప్రాంతంలోను ఇతరచోట్ల విద్యుత్ సరఫరా జరుగుతోంది. ‘్భగియా’ ప్రాంతం మన జమ్మూ కశ్మీర్‌లోని గిల్గిత్, పాకిస్తాన్‌లోని ‘వాయువు సరిహద్దు’ ప్రాంతం, తజికిస్థాన్ దేశపు సరిహద్దులకు సమీపంలో విస్తరించి ఉంది. గిల్గిత్ ప్రస్తుతం పాకిస్తాన్ దురాక్రమణలో కొనసాగుతోంది. గిల్గిత్‌లోని దాదాపు ఆరువేల చదరపుకిలోమీటర్ల మన భూమిని 1963లో పాకిస్తాన్ చైనాకు అప్పగించింది. ఈ ప్రాంతం గుండా చైనా రహదారులను నిర్మించి తన అధీనంలో ఉన్న టిబెట్‌నూ, సింకియాంగ్- ఝింజియాంగ్-నూ అనుసంధానం చేయగలిగింది, గిల్గిత్ తదితర పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్- పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్- పిఓకె- గుండా చైనా ఆర్థిక ప్రాంగణాన్ని నిర్మిస్తోంది. పాకిస్తాన్ నైరుతి ప్రాంతంలోని బెలూచిస్థాన్ నుంచి ‘ఝింజియాంగ్’ వరకూ ఈ ఆర్థిక ప్రాంగణం నిర్మాణం అవుతోంది. ‘్భగియా’ ప్రాంతంలోను, అఫ్ఘానిస్థాన్‌లోను మన వాణిజ్య సంస్థల కార్యకలాపాలు విస్తరించడం చైనాకు, పాకిస్తాన్‌కు నచ్చని వ్యవహారం. ‘్భగియా’లో పనిచేస్తున్న ‘కెఇసి’ ఇంజనీర్లను, ఆ సంస్థకు చెందిన ఒక అఫ్ఘానీ పౌరుడిని ఆదివారం దుండగులు అపహరించుకొని వెళ్లడానికి ఇదీ నేపథ్యం. ‘్భగియా’ ప్రాంతం రాజధాని ‘పుల్ ఏ ఖీమెరే’ సమీపంలో ‘బాగ్ ఏ షామల్’ గ్రామం నుండి జిహాదీ దుండగులు మన ఇంజనీర్లను అపహరించుకొని వెళ్లారు. ఇలాంటి బీభత్స ఘటనల వల్ల భారతీయ సంస్థలు, భారతీయ పౌరులు భయవిభ్రాంతికి గురై, క్రమంగా అప్ఘానిస్థాన్ నుంచి నిష్క్రమించాలన్నది చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉసిగొల్పుతున్న ‘జిహాదీ’ల లక్ష్యం!!
జూడిత్ డిసౌజా అన్న మన దేశానికి చెందిన మహిళను అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో 2016 జూన్ తొమ్మిదవ తేదీన దుండగులు అపహరించుకొనిపోయారు. ‘ఆగాఖాన్ ఫౌండేషన్’లో సాంకేతిక సలహాదారిణిగా ఉన్న ఈ మహిళను నలబయి మూడు రోజుల తరువాత వదలి పెట్టారు. అఫ్ఘానిస్థాన్ తూర్పుప్రాంతంలో ఉన్న జలాలాబాద్‌లోని మన దౌత్య కార్యాలయం- కాన్స్యులేట్- భవనంపై 2016 మార్చిలో జిహాదీలు దాడిచేసి పేల్చివేయడానికి యత్నించారు. దాదాపు రెండుగంటలపాటు ఎడతెరిపి లేకుండా జరిగిన దాడిలో బీభత్సకారులు పదమూడు వందలకు పైగా బాంబులను, ‘పేలుడు గోళాల’ను ప్రయోగించారు. ఈ దాడిలో ఎనిమిది మంది పౌరులు, ఒక భద్రతా అధికారి హతులయ్యారు. అప్ఘానిస్థాన్‌లోని ‘మఝార్ ఏ షరీఫ్’ లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని పేల్చివేయడానికి 2016 జనవరిలో జిహాదీలు విఫలయత్నం చేశారు. జలాలాబాద్‌లోని మన దౌత్య కార్యాలయాన్ని పేల్చివేయడానికి 2007 నుంచి మొత్తం నాలుగుసార్లు ‘జిహాదీ’ ముష్కరులు యత్నించడానికి ఏకైక కారణం అఫ్ఘానిస్థాన్‌లో మన ‘ఉనికి’ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుండడం, 2007లోనే జలాలాబాద్‌లోని మన కార్యాలయంపై రెండుసార్లు దుండగులు దాడిచేశారు. 2013లో మరోసారి పెద్దఎత్తున దాడులు చేశారు. 2015 మే 14వ తేదీన రాజధాని కాబూల్‌లోని ఒక హోటల్‌లో జరిగిన భారతీయుల సమావేశం సందర్భంగా, అప్ఘానిస్థాన్‌లోని మన రాయబారి అమర్‌సిన్హాను హత్యచేయడానికి ‘తాలిబన్’ జిహాదీలు విఫల యత్నం చేశారు. ఈ సమావేశంలో పాల్గొనవలసి ఉండిన అమర్‌సిన్హా చివరి క్షణంలో తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు. ఆ హోటల్ సమావేశంపై జరిగిన దాడికి నలుగురు భారతీయులు, పదిమంది అఫ్ఘానీ పోలీసులు బలైపోయారు..
హీరట్ నగరంలోని మన దౌత్య కార్యాలయంపై 2014 మే 23న జరిగిన దాడిని మన భద్రతాదళాల వారు- భారత టిబెట్ సరిహద్దు పోలీసులు- తిప్పికొట్టారు. కాబూల్‌లోని మన రాయబార కార్యాలయంపై 2008లో దాడులు జరిగాక మన ప్రభుత్వం అఫ్ఘానిస్థాన్‌లోని మన దౌత్య కార్యాలయాల వద్ద ‘్భరత్ టిబెట్ సరిహద్దు పోలీసుల’- ఐటిబిపి-ను నియమించింది. 2016 ఏప్రిల్‌లో మఝార్ ఏ షరీఫ్‌లోని మన దౌత్య కార్యాలయంపై జరిగిన దాడిని కూడ ‘ఐటిబిపి’ సైనికులు తిప్పికొట్టగలిగారు. అఫ్ఘానిస్థాన్‌లో ఇరాన్ సరిహద్దు వరకు గల రహదారిని మన సంస్థలు వెడల్పుచేసి ఆధునీకరించాయి. 2008లో ఈ రహదారిపై ‘జిహాదీలు’ మూడుసార్లు మన ‘ఐటిబి’ పోలీసులపై దాడులు చేశారు. 2010లో కాబూల్‌లోని ‘ఆర్య’ అతిథి గృహంపై ‘తాలిబన్లు’ జరిపిన దాడిలో ఆరుగురు భారతీయులు బలైపోయారు. 2009లో కాబూల్‌లోని మన రాయబారి కార్యాలయంపై రెండవసారి జరిగిన దాడికి పదిహేడు మంది భారతీయులు, అఫ్ఘానీ పౌరులు బలైపోయారు. ప్రహరీ గోడలు ధ్వంసమయ్యాయి. ఈ బీభత్స చరిత్రలో అత్యంత భయంకరమైన ఘతన 2008లో కాబూల్‌లోని మన రాయబారి కార్యాలయంపై జరిగిన దాడి. తాలిబన్ ‘ఆత్మాహుతి దళం’ కారులో దూసుకొనిపోవడంతో కార్యాలయం ప్రాంగణంలో పైశాచిక విధ్వంసం జరిగింది. మన వరిష్ఠ సైనిక అధికారి రవి దత్తమెహతా, విదేశాంగ మంత్రిత్వశాఖకు చెందిన వి.వెంకటేశ్వరరావులతో సహా యాబయి ఎనిమిది మంది ఆ దాడికి బలయ్యారు. నూటనలబయి మందికి పైగా అఫ్ఘానీ, భారతీయ పౌరులు గాయపడ్డారు..
ఇలా మన ‘ఉనికి’ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీ’లు అఫ్ఘానిస్థాన్ జరుపుతున్న దాడులలో భాగం ఆదివారం జరిగిన ఇంజనీర్ల అపహరణ! ‘హక్కానీ’, ‘అఫ్ఘానీ తాలిబన్’, ‘అల్ ఖాయిదా’, ‘పాకిస్తానీ తాలిబన్’- ఇలా పేర్లు ఏమైనప్పటికీ వీటిని మన దేశానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నది మాత్రం ‘ఐఎస్‌ఐ’! పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచార్య విభాగంగా పేరుమోసిన ‘ఐఎస్‌ఐ’ నిజానికి ‘అంతర్జాతీయ బీభత్స బృందాల’ను దశాబ్దులుగా అనుసంధానం చేస్తోంది. ‘తాలిబన్’, ‘అల్ ఖాయిదా’ తండాలు ధ్వంసం చేసిన అఫ్ఘానిస్థాన్‌ను పునర్ నిర్మించే కార్యక్రమంలో మన ప్రభుత్వం చురుకుగా పాల్గొంటోంది! 2016 వరకూ దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన దేశం నుండి అఫ్ఘానిస్థాన్‌కు తరలాయి. అఫ్ఘానిస్థాన్‌కు నూతన పార్లమెంటు భవనాన్ని మన దేశం నిర్మించి ఇచ్చింది. ‘తోడేళ్లతో కలసి తరమడం- కుందేళ్లతో కలసి పారిపోవడం’ చైనా విధానం. అఫ్ఘానిస్థాన్‌లో మనతో కలసి ‘ఉమ్మడి ఆర్థిక పథకాల’ను అమలుజరపడానికి చైనా అంగీకరించింది, వారం రోజులు పూర్తికాకమునుపే మన ఇంజనీర్ల అపహరణ జరిగింది. వీరికి విముక్తి ఎప్పుడు? అఫ్ఘానిస్థాన్ ఒకప్పటి ‘అఖండ భారత్’లోని గాంధారం, యోన ప్రాంతం..