సంపాదకీయం

బడి బరువు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల్లో పుస్తకాల బరువు సగానికి సగం తగ్గించి వేయాలన్నది ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పిన మాట.. బడిపిల్లలు పుస్తకాల భారంతో క్రుంగిపోతుండడం దశాబ్దుల ‘్భతిక’ దృశ్యం. పెద్దపెద్ద సంచులు నిండిన పుస్తకాలను వీపులపై మోసుకొనిపోతున్న ‘బుడుతలు’ గృహ ప్రాంగణాలలోను విద్యాలయ ప్రాంగణాలలోను నిరంతరం దర్శనమిస్తున్నారు. అనవసరమైన బోధనలతో అర్థం లేని, భారతదేశానికి అన్వయం కాని భావజాలాన్ని చిన్నారుల బుర్రలకు ఎక్కిస్తుండడం బౌద్ధిక వైపరీత్యం! మూడేళ్ల ప్రాయం నుంచి పదేళ్ల వయసు వరకు ఉన్న పిల్లలకు మన దేశంతోకాని మన సంస్కృతితో కాని జీవన విధానంతో కాని సంబంధం లేని మహా విషయాలను బలవంతంగా మప్పుతున్నారు. ‘పరిమాణ’- భౌతిక- భారంతోపాటు ‘పరిణామ’- బౌద్ధిక-్భరాన్ని కూడ సగానికి సగం తగ్గించి శిశువులను బాల బాలికలను సహజంగా ఎదగనివ్వాలన్నది దశాబ్దులుగా మేధావులు చెబుతున్న మాట. ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు, అధికారులు కూడ అప్పుడప్పుడు ఈ సహజ విద్యావికాస క్రమాన్ని పునరుద్ధరించవలసిన అనివార్యం గురించి పదే పదే నొక్కివక్కాణిస్తుండడం చరిత్ర. ఇప్పుడు ఉప రాష్టప్రతి స్వయంగా ‘‘ఈ చదువుల భారం యాబయి శాతానికి తగ్గిపోవాలని’’ సూచించడం చిన్నారుల శారీరక బౌద్ధిక మానసిక సహజ వికాస క్రమం పట్ల సమాజంలో పెరిగిన ప్రాధాన్యానికి నిదర్శనం! పుస్తకాల పరిణామం తగ్గాలి, తరగతి గదులలో బోధనాంశాల నిడివి తగ్గాలి, ‘బోధన’ సమయం తగ్గాలి. పిల్లలు ప్రకృతిలో-ఆరుబయట- స్వేచ్ఛగా విహరించగల కాలవ్యవధి పెరగాలి!.. ద్వితీయ సర్వోన్నత రాజ్యాంగ పదవీ నిర్వాహకుడు పునరావిష్కరించడం వల్ల ఈ ‘‘చదువుల మోత’’ సమస్య గురించి ప్రభుత్వాలు, విద్యావేత్తలు మరింత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటె సమస్యపై ఇనే్నళ్లుగా చర్చలు, విశే్లషణలు జరుగుతున్నప్పటికీ పరిష్కారం మాత్రం లభించలేదు. మూడేళ్ల శిశువులు, పదేళ్ల బాలలు పుస్తకాలను మోస్తూనే ఉన్నారు. తరగతిలోను క్రీడామైదానంలోను ‘సమగ్ర విద్యావికాస ప్రక్రియ’ మళ్లీ మొదలుకావాలన్నది ఇరవై నాలుగవ తేదీన ‘్భగ్యనగరం’లోని భారతీయ విద్యాభవన్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఉప రాష్టప్రతి వ్యక్తం చేసిన ఆకాంక్ష! పాఠశాలల బోధన సమయంలో సగభాగం తరగతి పాఠాలకు మిగిలిన సగభాగం ‘క్రీడా ప్రాంగణ’ ప్రకృతి పాఠాలకు కేటాయించాలన్నది ఆయన చెప్పిన మాట!! ఈ అభిభాషణకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను ఇప్పుడైనా మొదలుపెట్టవచ్చు.. నిజానికి దశాబ్దుల క్రితమే ఈ చర్యలు ఆరంభమయి ఉండాలి! అతి ప్రధానమైన కొన్ని జీవన పాఠాలను క్రీడా ప్రాంగణాలలోనే నేర్చుకోగలమన్నది ఉప రాష్టప్రతి గుర్తుచేసిన సనాతన - శాశ్వత-వాస్తవం! పరిజ్ఞానం పొందడం, సంస్కారవంతుడు కావడం సమగ్ర విద్యార్జన లక్ష్యమన్నది ఉప రాష్టప్రతి ప్రసంగంలో ధ్వనించిన సారాంశం.. ‘మోత’ తగ్గితే కానీ ఈ సమగ్ర విద్యా వికాసం జరగదు..
పాఠశాలలకు పిల్లలు తీసుకొని వెళ్లే సంచుల- స్కూల్ బాగ్స్- బరువు తగ్గాలని ‘కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి’- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- సిబిఎస్‌సి-వారు 2016 సెప్టెంబర్‌లో పాఠశాలల యాజమాన్యాలను కోరారు. కానీ ఈ ‘సిబిఎస్‌ఇ’ మార్గదర్శక నియమాలను పాటిస్తున్న ప్రభుత్వేతర, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య చాలా తక్కువ. ఒకటవ, రెండవ తరగతుల బడి పిల్లలు ఏ సంచిని కాని పాఠశాలలకు ‘మోసుకొని’ రానక్కరలేదన్నది మార్గదర్శక నియమం. ఒకటవ, రెండవ తరగతి పిల్లలకు ‘ఇంటి పని’-హోమ్‌వర్క్- చెప్పరాదు. ప్రతి బడిలోను మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పిల్లలు పెద్ద నీటి సీసాలను మోసుకొని రావడాన్ని దీనివల్ల నిరాకరించవచ్చు. పుస్తకాలను విధిగా పాఠశాలలకు మోసుకొని వెళ్లనక్కరలేదు. పాఠ్య పుస్తకాలు తీసుకొని రాలేదన్న కారణంగా అధ్యాపకులు విద్యార్థులను శిక్షించరాదు. ప్రాథమిక పాఠశాలలన్నింటిలోను ఇలా ‘బరువు’ను ‘మోత’ను తగ్గించడానికి ‘సిబిఎస్‌ఇ’ జారీచేసిన మార్గదర్శకాలను అధికాధిక యాజమాన్యాలు పట్టించుకొనడం లేదు. అందువల్ల చిన్నపిల్లలు వీపులపై ‘బరువుల మోత’ తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగా ఉన్న ‘వాణిజ్య పాఠశాలల’- కార్పొరేట్ స్కూల్స్-కు సైతం ఇలాంటి నిబంధనలను వర్తింపచేయాలి! బడిపిల్లల సంచుల బరువును తగ్గించవలసిన అవసరం గురించి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు, మంత్రులు తరచు ప్రకటనలను గుప్పిస్తున్నారు. కానీ బరువుమాత్రం తగ్గడం లేదు. అన్ని పాఠశాలలను సాయంత్రం నాలుగున్నర గంటలలోపు మూసివేయాలని 2013 సెప్టెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆదేశించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ నిబంధనను ఎన్ని పాఠశాలలు పాటిస్తున్నాయి..?
పాఠశాల, బోధన కాలాంశాలు ముగిసిన తరువాత ‘అధ్యయన కాలాంశం’ - స్టడీ అవర్- పేరుతో వాణిజ్య పాఠశాలలలో పిల్లలను ఆరు గంటల వరకు, రాత్రి ఏడుగంటల వరకు బందీ చేస్తున్నారు. ఇలా జరగని చోట్ల తల్లిదండ్రులే పిల్లలను మళ్లీ ‘ట్యూషన్’కు పంపిస్తున్నారు. ఈ ‘ట్యూషన్’లు రాత్రి ఎనిమిది గంటల వరకు సాగుతూనే ఉన్నాయి! ఒకటవ తరగతి నుంచి విద్యాబోధన జరగడం ఏళ్లతరబడి కొనసాగిన సంప్రదాయం. ఈ సంప్రదాయానికి ప్రాతిపదికగా అనాదిగా దేశంలో అమలు జరిగిన బోధన విధానం. నాలుగు ఏళ్ల నాలుగు నెలలు నిండిన తరువాత ఐదవ రోజున అక్షరాభ్యాసం చేయాలన్నది సంప్రదాయం. ఇలా అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలు ఐదేళ్లు నిండిన తరువాత మాత్రమే లాంఛనంగా విద్యాభ్యాసం మొదలుపెట్టాలి. ఐదేళ్లు నిండిన తరువాతనే ఒకటవ తరగతిలో చేర్చుకోవాలన్న నిబంధనకు ఇదీ ప్రాతిపదిక! కాని ‘కార్పొరేట్’ పాఠశాలలు మొదలైన తరువాత రెండేళ్లు నిండిన పిల్లలను సైతం- అక్షరాభ్యాసం చేయించి- ‘కానె్వంట్’లకు తోలేస్తున్నారు. ‘నర్సరీ’, ‘ఎల్‌కెజి’, ‘యూకేజి’ వంటి విచిత్రమైన పేర్లతో ఐదేళ్లలోపు పిల్లలను ‘కానె్వంటు’ కారాగృహాలలో నిర్బంధిస్తున్నారు. మాతృభూమికి సంబంధం లేని, మాతృ సంస్కృతికి సంబంధం లేని భావాలు నిండిన పదాలను పద్యాలను శ్రుతిలయ- రైమ్-లను ఈ పిల్లలకు బోధిస్తున్నారు. ‘చైత్రమాసం’ అంటే తెలియనివారు పదవ తరగతిలో ఉత్తీర్ణులైపోతున్నారు. ఇదంతా విదేశీయ, దేశ వ్యతిరేక భావజాలపు మోత! ఈ విద్యావిధానం వల్ల భారతీయ స్వరూపాల వారు ఐరోపా స్వభావులుగా, అమెరికా సంస్కృతి నిబద్ధులుగా తయారవుతున్నారు. ‘‘వావ్!’’ అని ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు, ‘‘యా..’’ అని ఆమోదం తెలుపుతున్నారు..
ఐదేళ్లు నిండిన తరువాత మాత్రమే పిల్లలను బడికి పంపాలి. అంతవరకూ వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. ఈ పద్ధతిని పునరుద్ధరించడం వల్ల చిన్నపిల్లల మనస్సులకు ‘మోత’ తగ్గుతుంది, వారి బుద్ధికి ‘్భరం’ తగ్గుతుంది. భౌతికమైన భారంతోపాటు బౌద్ధికమైన ‘్భరం’ కూడ తగ్గాలి. కానీ ‘ప్రపంచీకరణ’.. ‘్భరతీయత’ను దిగమింగుతోంది, తల్లిదండ్రులు పోటీలు పడి రెండేళ్ల పిల్లలను ‘కానె్వంట్’లకు పంపి ఐదేళ్లు వచ్చేసరికి వారికి మాతృభాష పట్ల, మాతృదేశం పట్ల మమకారం లేకుండా చేస్తున్నారు. ఉప రాష్టప్రతి చెప్పినట్టు ‘‘్భరం తగ్గాలంటే’’ దేశమంతటా ఈ ‘కానె్వంటుల’ను మూసివేస్తూ చట్టం చేయాలి. ఐదేళ్లు నిండేవరకు పిల్లలను బడికి పంపరాదన్న నిబంధన విధించాలి. ఇందుకోసం అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి. పెళ్లిళ్లకు వయస్సును నిర్ణయిస్తున్నప్పుడు విద్యాభ్యాస ప్రారంభానికి వయో నిబంధన ఎందుకు విధించరాదు..? పిల్లల స్వేచ్ఛను ఎందుకు రక్షింపరాదు??