సంపాదకీయం

చంద్రబాబు చాతుర్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ‘తెలుగుదేశం పార్టీ’ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ‘్భరత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో గురువారం ఢిల్లీలో చర్చలు జరుపడం గొప్ప చారిత్రక ఘటన.. ఇది ‘సంఘటన’ కావచ్చు, ‘దుర్ఘటన’ కావచ్చు! తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కలసి పోటీచేస్తున్న కాంగ్రెస్‌కూ ‘తెదేపా’కూ మధ్య ‘స్థానాల పంపిణీ’ ఒక కొలిక్కి వచ్చిందన్న సమాచారం ‘చంద్రబాబు- రాహుల్’ సమావేశానికి సమాంతర పరిణామం! జాతీయ స్థాయిలో భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు నడుం బిగించి ఉండడం రాహుల్ గాంధీతో ఆయన చర్చలు జరపడానికి ప్రాతిపదిక! ప్రచారం జరుగుతోంది. అందువల్ల ‘తెలంగాణ శాసనసభ’ ఎన్నికలలో తమ పార్టీకి మరిన్ని ‘సీట్లు’ రాబట్టుకోవాలన్న సంకుచిత ప్రాంతీయ ప్రయోజనం చంద్రబాబు నాయుడి ఢిల్లీయాత్రకు ప్రాతిపదిక కాలేదు. ‘‘విస్తృత జాతీయ ప్రయోజనం దృష్ట్యా, ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యాడు..’’-అని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ‘తెదేపా’కు మధ్య తెలంగాణలో కుదిరిన ‘ఎన్నికల పొత్తు’ ఆంధ్రప్రదేశ్‌కు సైతం విస్తరించనున్నది మరి. అదీ విస్తృత జాతీయ ప్రయోజనం. ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన పార్టీ ‘ప్రాంతీయ రాజకీయ పక్షం’, ప్రయోజనం ప్రాంతీయ ప్రయోజనం. ఒకటి కంటె ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించిన పార్టీ ‘జాతీయ పక్షం’, ప్రయోజనం జాతీయ ప్రయోజనం! ఇది ‘ఎన్నికల సంఘం’ వారి నిబంధనావళికి అనుగుణంగా లేకపోవచ్చు. కనీసం నాలుగు రాష్ట్రాలలోనైనా ఉనికి ఉన్న పార్టీని మాత్రమే ‘ఎలక్షన్ కమిషన్’ వారు జాతీయ పక్షంగా గుర్తిస్తారు. అది ‘రాజ్యాంగ ప్రక్రియ’! కానీ ‘రాజకీయ ప్రక్రియ’లో నిర్వచనాలు మారిపోతూ ఉంటాయి. మారిపోతాయి కనుకనే కుటుంబ వారసత్వ రాజకీయాలకు ప్రతినిధులైన శరత్ పవార్, ఫరూక్ అబ్దుల్లా వంటివారు గురువారం ఢిల్లీలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఉటంకించారు. ఈ సంప్రదాయాలకు, వ్యవస్థలకు భారతీయ జనతాపార్టీ వల్ల భంగం జరిగిపోతోందన్నది చంద్రబాబు నాయుడితో సమావేశమైన తరువాత ఈ ఇద్దరు మహాపురుషులు చెప్పిన మాట! శరత్ పవార్ నాయకత్వంలోని ‘జాతీయతా కాంగ్రెస్ పార్టీ’లోను ఫరూక్ అబ్దుల్లా వారి ఆధ్వర్యంలోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’లోను వారి ‘తనయ’లు, ‘తనయు’లు నిభాయిస్తున్న కీలక పాత్రలు జనమెరిగిన వాస్తవాలు! ఈ తరహా ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఆదర్శం. కుటుంబ పాలనకు జవహర్‌లాల్ నెహ్రూ 1950వ దశకంలోనే శ్రీకారం చుట్టాడు. 1958లో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడం ఈ శ్రీకారం! చరణ్‌సింగ్, దేవీలాల్, ఎమ్.కరుణానిధి, కేరళలో కరుణాకరన్, కర్నాటకలో దేవగౌడ, మహరాష్టల్రో బాల్ థాకరే, ఒడిశాలో బిజూ పట్నాయక్, ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్, బిహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ లాంటివారు ఈ కుటుంబ ‘ప్రజాస్వామ్య’ స్ఫూర్తిని కొనసాగించిన కొందరు మాత్రమే! ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలలో ఈ ‘కుటుంబ’ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటిస్తూ ఉండడం నడుస్తున్న చరిత్ర! ఈ ‘కుటుంబ’ స్ఫూర్తి స్పర్శలేని ‘్భరతీయ జనతాపార్టీ’ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి పారేస్తోందని గురువారం నాటి ఢిల్లీ ‘మాధ్యమ’ సమావేశంలో చంద్రబాబు, రాహుల్ గాంధీ ఉద్ఘోషించడం అందువల్ల సహజ పరిణామం!
అస్తిత్వ పరిరక్షణ రాజకీయ పక్షాలకు వౌలిక లక్ష్యం. అస్తిత్వం మిగిలి ఉంటే అధికారాన్ని సాధించుకోవచ్చు. అందువల్ల తెలంగాణలో ‘తెదేపా’ తన అస్తిత్వాన్ని రక్షించుకొనడానికి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం చారిత్రక అనివార్యమైంది. ‘తెదేపా’ చరిత్రలో ఇది గతంలో ఊహించని మహాపరిణామం! ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ అస్తిత్వం ఏర్పడడానికి ‘తెలుగుదేశం పార్టీ’తో జట్టుకట్టడం తప్పనిసరి. అందువల్ల ఉభయ పక్షాలు ఈ అన్యోన్య సహకారానికి నడుములను బిగించడంలో తప్పు లేదు. ‘గతం’ గురించి తాము మాట్లాడబోమని ‘వర్తమానం’ గురించి, ‘్భవిష్యత్’ గురించి మాత్రమే తాము ఆలోచిస్తున్నామని రాహుల్ గాంధీ ఢిల్లీలో గురువారం చంద్రబాబు నాయుడుతో కలసి నిలబడి ఉద్ఘాటించాడు! గతంలో కాంగ్రెస్, ‘తెదేపా’ బద్ధశత్రువులు. కాంగ్రెస్ పట్ల విరోధంతో నందమూరి తారక రామారావు ‘తెదేపా’ను ఆరంభించిన నాటిది ఈ ‘గతం’.. కాంగ్రెస్ వారు నాదెండ్ల భాస్కరరావును ఉసిగొలిపి 1984లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును గద్దె దింపగలిగిన నాటిది ఈ శత్రుత్వం.. అందువల్ల ‘గతం’ గురించి ప్రస్తావించినట్టయితే ఎన్.టి.రామారావు ఆత్మక్షోభించవచ్చు.. అందువల్ల ‘కిరిచేదు’ గతాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించనంటున్నాడు.. కానీ చంద్రబాబు నాయుడికి ఈ ‘గతం’ ఏమంత ‘చేదు’ కాదు, పైపెచ్చు గత మాధుర్యపు స్మృతులు ఆయనను కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి పురికొల్పి ఉండవచ్చు!!
చంద్రబాబు నాయుడు 1983వ సంవత్సరానికి పూర్వం కాంగ్రెస్‌లో ఉండడం ఈ ‘గత మాధుర్యాని’కి ప్రాతిపదిక! ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాలలోను ఉభయ పార్టీల ఉమ్మడి ప్రయోజనాలకు ఈ ‘ద్వైపాక్షిక’ అన్యోన్య సహకారం దోహదం చేయగలదు. గురువారం నాడు మాధ్యమాలలో కూడ కాంగ్రెస్‌కు, తెదేపాకు మధ్య ‘‘పొత్తు’’ కుదిరిందని మాత్రమే ప్రచారమైంది. ఇదీ వౌలిక వాస్తవం! కానీ చంద్రబాబు నాయుడు ఈ వౌలిక ప్రాంతీయ ప్రయోజన వాస్తవానికి ఢిల్లీకి వెళ్లి ‘‘జాతీయ హోదా’’ను కల్పించే ప్రయత్నం చేశాడు. అదీ ఆయన చాతుర్యం. ఈ రాజకీయ చాతుర్యం అభినందనీయం. ‘్భజపా’కు విరుద్ధమైన రాజకీయ పక్షాలన్నింటినీ కూడగట్టి జాతీయస్థాయిలో ‘బృహత్ కూటమి’ని ఏర్పాటు చేయడమే చంద్రబాబు తన లక్ష్యంగా ప్రచారం చేస్తుండడం ఈ ‘చతుర వ్యూహం’లో భాగం! తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’, ‘్భజపా’పరస్పరం విరోధం వహించి పోరాడుతున్నాయి. అందువల్ల 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తున్న ‘్భజపా’ వ్యతిరేక జాతీయ కూటమిలో చంద్రబాబు ‘తెరాస’ను చేర్చగలడా? అన్న ప్రశ్న ఉదయించడం సహజం! రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొనడానికి ‘బహుజన సమాజ్ పార్టీ’ మొదట యత్నించింది. కానీ, పొత్తు కుదరలేదు. ‘బహుజన సమాజ్’ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆ తరువాత కాంగ్రెస్‌ను తిట్టిపోసింది. గత వారం మాయావతితో చంద్రబాబు చర్చలు జరిపాడట. ఈ మూడు రాష్ట్రాలలోను కాంగ్రెస్‌కు బహుజన సమాజ్‌కు మధ్య సయోధ్యను కల్పించగలిగాడా?
సంకీర్ణ రాజకీయాల వల్ల, మిశ్రమ మంత్రివర్గాల వల్ల కేంద్రంలో రాజకీయ సుస్థిరత కాని దేశంలో ఆర్థిక సౌష్టవం కాని ఏర్పడడం సాధ్యం కాదన్నది చరిత్ర నిరూపించిన సత్యం. 1989 సంవత్సరం వరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ‘కూటమి’ ఏదీ విజయవంతం కాలేదు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతాపార్టీ అవతరించింది. అప్పటినుంచి- 1990వ దశకం నుండి ‘్భజపా’ వ్యతిరేక ‘కూటము’లు ఏర్పడడం ‘రాజకీయ విలాసం’- పొలిటికల్ ఫ్యాషన్-గా మారింది! ‘‘పాము పడగ నీడలో కప్ప నిద్రిస్తోంది, నెమలి పింఛం నీడలో పాము విశ్రాంతి తీసుకొంటోంది. పరస్పరం విరోధం కల ఇవన్నీ ఒకచోట చేరి జట్టుకట్టడానికి కారణం ఉమ్మడి శత్రువు.. ఆ శత్రువు నడి వేసవిలోని మధ్యాహ్నపు సూర్యుడు..’’- మహాకవి కాళిదాసు రెండు వేల యాబయి సంవత్సరాలకు పూర్వం చెప్పిన మాట ఇది. వర్తమాన భారత రాజకీయాలలో కప్పలు, పాములు, నెమళ్లు ఎవరు? చండ ప్రచండుడైన మధ్యందిన మార్తాండుడు ఎవరు..?? అందరికీ తెలిసిన రహస్యాన్ని ఎవరూ వివరించనక్కరలేదు..