సంపాదకీయం

పొంతన లేని వాగ్దానాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారం కోల్పోయి అసహనంతో ఉన్నపుడు మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకొనే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయవచ్చు.. ‘‘చందమామను కిందికి దించి మీ ఇంటి ప్రాంగణంలో శాశ్వతంగా ప్రతిష్ఠాస్తాము!’’ అని ప్రతి వోటరును నమ్మించడానికి యత్నించవచ్చు! అధికారపు అందలమెక్కి ఊరేగుతున్నవారు దిగడానికి ఇష్టపడరు. దిగకుండా నిరంతరం ఊరేగడానికి వీలుగా ఎన్నికల సమయంలో ప్రజల మద్దతును కూడకట్టుకోవచ్చు.. ‘‘ఇదిగో నిచ్చెన! దీనె్నక్కి మీరు అంతరిక్షంలోని అందాల సీమలకు వెళ్లి స్థిరపడవచ్చు, హాయిగా విహరించవచ్చు!’’ అని వోటర్లను మురిపించి మైమరపించవచ్చు. కానీ ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో పాల్గొంటున్నవారు జాతీయ వౌలిక వాస్తవాలకు విరుద్ధమైన వాగ్దానాలు చేయరాదు, చేసినట్టయితే జనం నమ్మరు.. నమ్ముతున్నారని ‘వాగ్దానకర్తలు’ భ్రాంతికి గురి కావచ్చు! రాజ్యాంగ నిబద్ధతను ప్రకటించిన రాజకీయ పక్షాలవారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన వాగ్దానాలను వెళ్లగక్కరాదు.. ఈ ‘వమనక్రియ’ను జనం అసహ్యించుకొంటారు, వోట్లు మాత్రం వేయరు. ఇదంతా అన్ని రాజకీయ పక్షాలకూ వర్తించే సామాజిక స్వభావం, ఎన్నికల వాస్తవం! కానీ కొన్ని రాజకీయ పక్షాలవారు ఈ వాస్తవాన్ని గుర్తించడం లేదు.. లేదా గుర్తించడానికి వారికి తగిన సామర్థ్యం లేదు! ఎవరు గుర్తించినప్పటికీ, ఎవరు గుర్తించనప్పటికీ వాస్తవం వాస్తవమే... వాస్తవం అబద్ధం కాదు, అబద్ధం వాస్తవం గానూ మారదు. సూర్యుని వెలుగును వెలుగుగా గుర్తించడం విచక్షణ... వివేకం! సూర్యుడి వెలుగును నిరసించడం, చూడలేక పోవడం ‘గుడ్లగూబతనం’.... తాత్కాలికమైన ఎన్నికల విజయం కోసం శాశ్వతమైన జాతీయ అస్తిత్వాన్ని కించపరచడం, వ్యతిరేకించడం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన వాగ్దానాలు చేయడం రాజకీయ పక్షాలకు తగదు....
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ శాఖల నిర్వహణను నిషేధించనున్నట్టు కాంగ్రెస్ వారు వాగ్దానం చేయడం జాతీయ అస్తిత్వానికి విరుద్ధమైన వ్యవహారం. తాము ఈ శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినట్టయితే కాంగ్రెస్ వారు ఇలా నిషేధాన్ని అమలు జరుపుతారట. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శాఖలకు, సమావేశాలకు హాజరు కావచ్చునన్న ‘ప్రభుత్వ ఉత్తరువు’ను కూడ తాము రద్దు చేయనున్నట్టు కాంగ్రెస్ తన మధ్యప్రదేశ్ ఎన్నికల వాగ్దాన పత్రంలో పొందుపరచిందట.. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’లో భాగస్వాములు కారాదన్నది కాంగ్రెస్ కంటున్న కల! రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం- ‘సంఘం’- రాజకీయ సంస్థ కాదు, దేశ వ్యతిరేక కలాపాలను సాగిస్తున్న బీభత్ససంస్థ కాదు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సంస్థలలోను దేశ వ్యతిరేక బీభత్స సంస్థలలోను సభ్యులు కారాదని నిషేధించవచ్చు. కానీ ‘సంఘం’ కుల మత భాషా ప్రాంత వైవిధ్యాలకు అతీతంగా స్వజాతీయ ప్రజలను సంఘటితం చేస్తున్న సాంస్కృతిక సంస్థ! ఇలాంటి జాతీయ సాంస్కృతిక సంస్థను వ్యతిరేకించడం స్వజాతీయులను వ్యతిరేకించడమే! అందువల్ల స్వజాతీయులు ఈ చర్యను హర్షించరు, వ్యతిరేకిస్తారు, ఇలాంటి చర్యకు పూనుకున్న వారిని ఎన్నికలలో విజయం సాధించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరోధిస్తారు!
దేశమంతటా కుల సంఘాలు, మత సంఘాలు ఏర్పడి ఉండడం నిరాకరింపజాలని నిజం! ఇలాంటి కుల సంఘాలలోను, మత సంస్థలలోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు సభ్యులుగా ఉంటున్నారు. ఇలా ఉండడం రాజ్యాంగం ప్రసాదించిన వౌలిక అధికారం. దేశ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా సభలను, సమావేశాలను ఏర్పాటు చేయడానికి సంఘాలుగా ఏర్పడడానికి రాజ్యాంగం అనుమతినిస్తోంది. పంతొమ్మిదవ అధికరణం స్ఫూర్తి ఇది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ‘కుల సంఘం’కాని, ‘మత సంఘం’కాని కాదు. వివిధ కులాల మతాల భాషల ప్రాంతాల ఇతర అనేకానేక వైవిధ్యాల ప్రజలందరినీ సుసంఘటితం చేసి శక్తిమంతులుగా సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతున్న జాతీయతా సంస్థ! కులాల సంఘాలలోను, మతాల సంఘాలలోను ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉంటున్నారు. విస్తృతమైన సమగ్ర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయతా సంస్థలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకని సభ్యులుగా ఉండరాదు? మన దేశం అనాదిగా ఒక జాతిగా వికసిస్తోంది, ఈ వికసనానికి వౌలిక ప్రాతిపదిక మాతృభూమి! మాతృభూమి పట్ల కల మమకారం వైవిధ్య జన సముదాయాలను ఒకే జాతిగా రూపొందడానికి దోహదం చేసింది. ఈ దేశంలోని మతాలు భాషలు ఇతర వైవిధ్యాలు- ఇవన్నీ ఈ అద్వితీయ జాతీయతలో భాగం! మతాలు పుట్టాయి గిట్టాయి, మళ్లీ కొత్త మతాలు పుట్టాయి, విదేశాల నుంచి ఇతర మతాలు వ్యాపించాయి. కానీ ఈ మతాలు పుట్టకముందునుంచీ, విదేశాల మతాలు ఇక్కడికి వ్యాపించక పూర్వం నుంచీ తరాలుగా యుగాలుగా ఈ ‘జాతి’ ఉంది. అద్వితీయ ‘జాతి’లో అందువల్ల అన్ని మతాలవారు సమాన భాగస్వాములు! సకల వైవిధ్యాల సర్వ సమగ్ర సంపుటం ఈ ‘జాతి’, మాతృభూమి పట్ల మమకారం ఈ జాతీయ సంస్కృతి! ఈ ‘జాతి’ అనాదిగా సనాతన జాతి, భారత జాతి, హిందూ జాతి.. ‘్భరతీయత’ లేదా ‘హిందుత్వం’ భరతమాతను తల్లిగా భావించే అన్ని మతాలవారి, భాషల వారి ప్రాంతాల వారి, అనేక వైవిధ్యాల వారి జాతీయత! అనాదిగా అలరారిన ఇలాంటి అద్వితీయ జాతి విదేశీయ బీభత్సకారుల దురాక్రమణ ఫలితంగా, శతాబ్దులపాటు ముక్కలు చెక్కలు అయింది; స్వజాతీయులు విఘటితమయ్యారు, ఫలితంగా దేశం బలహీనమైపోయింది. దేశ ప్రజలను మళ్లీ సంఘటితం చేసి సమైక్యశక్తిని పునరుద్ధరించి, దేశాన్ని మళ్లీ ప్రగతి శిఖరాలకు చేర్చడం లక్ష్యంగా ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ అవతరించింది. భారతదేశం మళ్లీ శక్తిమంతం కావడం ఇష్టం లేని బ్రిటన్ ‘దొరలు’ అందువల్లనే ‘సంఘం’పై ఆంక్షలు విధించారు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ స్వజాతీయ సంస్థలో చేరరాదని నిర్దేశించారు. బ్రిటన్ దుండగులు నిష్క్రమించిన తరువాత కూడ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నవారు మాత్రమే ‘సంఘం’పై ఇప్పుడు కూడ ఆంక్షలను విధించడానికి యత్నిస్తున్నారు! విదేశీయ బీభత్స వారసత్వం కొనసాగాలా? స్వజాతీయత వికసించి పరిమళించాలా? - సమాధానం ప్రజలకు తెలుసు!
ఇలా జాతీయతా సంస్థలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మతాలను మాత్రం రెచ్చగొట్టి మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోంది. మతం పేరుతో, ఇతర మతాల వారికి లేని సదుపాయాలను రక్షణలను హక్కులను అధికారాలను కేవలం ఒక మతం వారికి కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. పదహైదవ అధికరణం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కానీ క్రైస్తవ మతస్థులకు ‘అనుసూచిత కులాల’- షెడ్యూల్డ్ కాస్ట్స్- వారితో సమానంగా ‘ఆరక్షణల’- రిజర్వేషన్స్-ను కల్పించడానికి తెలంగాణలో కాంగ్రెస్ వాగ్దానాలను గుప్పిస్తోంది. ఇస్లాం మతస్థులకు మత ప్రాతిపదికపై ‘రిజర్వేషన్ల’ను కల్పించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గతంలో విఫలయత్నం చేశాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన యత్నం కూడ సఫలం కాలేదు.. ఇందుకు ఏకైక కారణం మతం పేరుతో ‘రిజర్వేషన్ల’ను కల్పించడం రాజ్యాంగ విరుద్ధం! తెలిసి తెలిసీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి శుష్క వాగ్దానాలను ఆవిష్కరిస్తోంది.. ఎవరిని ఎవరు వంచించారు? ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు....??