సంపాదకీయం

నాయక స్వామ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తచరణ్‌దాస్ అనే కాంగ్రెస్ నాయకునికి వ్యతిరేకంగా క్యామ మల్లేశ్ అనే మరో స్థానిక కాంగ్రెస్ నాయకుడు అవినీతి ఆరోపణలు చేయడం ‘పరాకాష్ఠ’.. ‘టిక్కెట్ల’ పంపిణీ ప్రహసనం కారణంగా తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలలో కొనసాగుతున్న ‘కుమ్ములాటల’కు ఇది పరాకాష్ఠ! తనకు ‘్ఫలానా’ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోరాడడానికి వీలుగా ‘టిక్కెట్టు’ రాకపోవడం ఈ క్యామ మల్లేశ్‌కు జరిగిన ఘోరమైన అన్యాయం. ఈ అన్యాయాన్ని గురించి ఆయన బహిరంగంగా నిరసించడంలో అన్యాయం లేదు, ఆశ్చర్యం లేదు. ఆయన వలెనే టిక్కెట్లు దక్కనివారు అన్ని రాజకీయ పార్టీలలోను రుసరుస లాడుతున్నారు. అసంతృప్తి, ఆగ్రహం, నిరసన, ‘నిరశన’, ‘్ధర్నా’లు, ప్రదర్శనలు, రాజీనామాలు, పార్టీ కార్యాలయాలలోకి చొరబడిన ‘కార్యకర్తలు’ విధ్వంసకాండకు, దహనకాండకు పాల్పడడాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు! ‘‘అనుశాసన బద్ధతకు సైద్ధాంతిక నిబద్ధతకు, పదవులకు అతీతంగా ప్రజాసేవ చేయాలన్న కటిబద్ధతకు, సంస్థాగత ప్రజాస్వామ్య నిష్ఠ’’కు తమ పార్టీ నిలువుటద్దంగా భాసిస్తోందని ప్రచారం చేసుకుంటున్న భారతీయ జనతాపార్టీ వారు కూడ ‘రచ్చ’ల మీద నిలబడి పరస్పర దూషణ తిరస్కారాలను ఆవిష్కరిస్తున్నారు, తమ కార్యాలయాలలోని కుర్చీలను ఇతర సామగ్రిని తామే ధ్వంసం చేసుకున్నారు! నెలల ముందుగానే ‘శాసనసభకు పోటీచేయగల అభ్యర్థుల’ను ఎంపికచేసి కట్టుదిట్టమైన వ్యూహంతో ఎన్నికల సమర రంగంలో దూసుకొని పోతున్నట్టు ప్రచారానికి నోచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడ ‘టిక్కెట్లు’ రానివారు కస్సుబుస్సుమంటూ అంతర్గత కలహాలను ప్రజలందరికీ వినిపిస్తున్నారు. ‘టిక్కెట్’ ఆశించి భంగపడినవారు దాదాపు ప్రతి నియోజకవర్గంలోను ‘టిక్కెట్టు’ తెచ్చుకున్న తమ పార్టీవారిని ఓడించడానికి నడుమును బిగిస్తుండడం రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరమ్ రాష్ట్రాలన్నింటిలోను ఆవిష్కృతమతున్న విచిత్ర దృశ్యాలు.. తమ ప్రత్యర్థి రాజకీయ పక్షానికి చెందిన శాసనసభ అభ్యర్థి కంటె, సొంత పార్టీలోని ప్రత్యర్థి తనకు ప్రబల శత్రువని టిక్కెట్ దక్కనివారు నిరూపిస్తున్నారు. అందువల్ల ఆయా పక్షాల అభ్యర్థుల దుర్గుణ గణాలను, అవినీతిని, నేర చరిత్రను, అవకాశవాదాన్ని ప్రత్యర్థి పక్షాల వారు ‘‘కష్టపడి కనిపెట్టి’’ వోటరన్నలు, వోటరమ్మలకు వెల్లడి చేయనక్కరలేదు. ‘టిక్కెట్టు’ వచ్చిన అత్యధిక శాతం అభ్యర్థుల కాళ్లు పట్టి కిందికి గుంజడానికి ప్రతి రాజకీయ పక్షంలోను టిక్కెట్టు ఆశించి భంగపడినవారు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ ‘‘టిక్కెట్ల కుమ్ములాట’’ బహిరంగంగా ‘‘బొమ్మలాట’’గా మారి వోటరులను అలరిస్తోంది, మరికొన్నాళ్లపాటు ఈ ఉచిత వినోదం విస్తరించనున్నది..
క్యామ మల్లేశ్ అనే నాయకుడు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడట! ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి తనను పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలంటే, భక్తచరణ్‌దాస్‌కు మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని దాస్ ప్రతినిధులు మల్లేశ్ ప్రతినిధులను కోరారట. ఇదీ మల్లేశ్ బహిరంగంగా చేసిన ఆరోపణ. ఇలా కాంగ్రెస్ వారు కాని ఇతర పార్టీల వారు కాని తమ సొంత పక్షం వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం సంస్థాగత స్వేచ్ఛకు నిదర్శనం కాబోలు..! ఈ మితిమీరిన స్వేచ్ఛ అన్ని పార్టీలనూ ఆవహించి ఉంది. కానీ అంతర్గత ప్రజాస్వామ్యం మాత్రం దాదాపు అన్ని పార్టీలలోను ‘మృగతృష్ణ’లోని నీరు. అంతర్గత ప్రజాస్వామ్యం ఇలా శూన్యం కావడానికి ప్రధాన కారణం సిద్ధాంత నిబద్ధత లేకపోవడం, వైయక్తిక విధేయత, వ్యక్తి పూజ ప్రబలడం. ఒకే కుటుంబం వారు తరతరాలుగా ఒక్కొక్క రాజకీయ పార్టీని గుప్పెట్లో పెట్టుకొని ఉండడం నడుస్తున్న చరిత్ర! అందువల్ల అధి నాయకునికి మిగిలిన పార్టీ కార్యకర్తలందరూ కట్టుబానిసలు! అధి నాయకుని దయ ఉండడం మాత్రమే లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి- తదితర ఎన్నికలలో ఆయా పార్టీల వారు ‘టిక్కెట్టు’పొందడానికి ఏకైక మార్గం! స్థానిక కార్యకర్తల అభీష్టం కానీ, పార్టీ సాధారణ సభ్యుల అనుమతి కానీ అవసరం లేదు! ఒక జిల్లాశాఖకు అధ్యక్షుడుగా ఉన్న ‘నాయకుని’కి జిల్లాలోని ఒక శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం లేకపోవడం అంతర్గత ప్రజాస్వామ్య రాహిత్యానికి ఒక నిదర్శనం మాత్రమే!
మనది పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం! కానీ రెండు వైపరీత్యాలు మాత్రం మన వ్యవస్థను నిలదీస్తున్నాయి. మొదటిది- శాసనసభలలోను లోక్‌సభలోను, ‘సంఖ్యా బాహుళ్యం’- మెజారిటీ- పొందగలిగిన అధికార పక్షానికి ‘వోట్ల బాహుళ్యం’- మెజారిటీ వోట్లు రావడం లేదు. 1952 నుంచి జరిగిన ఏ లోక్‌సభ ఎన్నికలలో కూడ గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పటుచేసిన పార్టీకి యాబయి శాతం వోట్లు లభించలేదు. ఇందుకు ఎన్నికల పద్ధతిలో విప్లవాత్మకమైన మార్పులు జరగాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. అది వేఱు కథ.. రెండవ వైపరీత్యం ఈ ‘టిక్కెట్లు’ ఇచ్చే పద్ధతి. ‘టిక్కెట్టు’-అభ్యర్థిత్వం-ను పార్టీల అధిష్ఠానం ఇవ్వడం సంస్థాగత ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ప్రతి నియోజకవర్గంలోను ‘పార్టీ అభ్యర్థి’ని ఆయాపార్టీలకు చెందిన ‘క్రియాశీల’ లేదా ‘ప్రాథమిక’ సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలి! ఇదీ నిజమైన సంస్థాగత ప్రజాస్వామ్యం. అనేక ప్రజాస్వామ్య దేశాలలో ఈ పద్ధతి అమలులో ఉంది. అమెరికా ‘కాంగ్రెస్’- పార్లమెంట్-లోని ప్రతినిధుల సభ- లోక్‌సభ-లో నాలుగువందల ముప్పయి ఐదు నియోజకవర్గాల సభ్యులున్నారు. ప్రతి నియోజకవర్గంలోను ‘డెమొక్రాటిక్ పార్టీ’ లేదా ‘రిపబ్లికన్ పార్టీ’ తరఫున పోటీచేయగల అభ్యర్థులను ఈ ‘పార్టీ’ల ‘అభిష్ఠానవర్గం’ నిర్ధారించడం లేదు, ‘టిక్కెట్ల’ను ఇవ్వడం లేదు. సంస్థాగతమైన ఎన్నికల ద్వారా ప్రతి నియోజకవర్గంలోను పార్టీ అధికార అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఒక పార్టీ తరఫున ఒక నియోజకవర్గంలో పోటీచేయాలని భావించేవారు ముందు ఈ ‘ప్రాథమిక స్పర్థ’- ప్రైమరీ-లో పాల్గొనాలి. ఒక పార్టీ ఒక నియోజకవర్గంలో నిర్వహించే ఈ ‘ప్రైమరీ’లో పార్టీకి చెందిన సాధారణ సభ్యులందరూ వోట్లు వేస్తారు, అభ్యర్థిని ఎన్నుకొంటారు. అలా ఎన్నికయిన అభ్యర్థులు ఆ తరువాత ప్రతినిధుల సభకు జరిగే ఎన్నికలలో పార్టీ తరఫున పోటీచేస్తారు. అందువల్ల అభ్యర్థులు కాదలచుకున్నవారు తమ నియోజకవర్గంలోని సాధారణ సభ్యుల మద్దతు కోసం మాత్రమే ప్రయత్నిస్తారు! ‘అధిష్ఠానం’ వారి అనుగ్రహం కోసం కాదు. అమెరికా ‘సెనేట్’- రాజ్యసభకు, రాష్ట్రాల ‘కాంగ్రెస్’ ఉభయ సభల- విధాన మండలి-కు పోటీ చేసే ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడ ఇలా ‘ప్రైమరీ’ల ద్వారా ఎన్నిక అవుతున్నారు.
ఇలాంటి ‘సంస్థాగత ప్రాథమిక స్పర్థ’ను నిర్వహించడం ద్వారా మన దేశంలో కూడ అన్ని పార్టీల లోక్‌సభ, శాసనసభల అభ్యర్థులను ఎందుకని ఎన్నిక చేయరు? ప్రస్తుతం మన దేశంలోని పార్టీలలో సంస్థాగత ప్రజాస్వామ్యం లేదు, అంతర్గత నాయక స్వామ్యం మాత్రమే కొనసాగుతోంది! టిక్కెట్ల కొట్లాటకు ఈ అధిష్ఠాన ఆధిపత్య స్వామ్యం, అగ్ర నాయకుని ‘అభీష్టం’ కారణం! కార్యకర్తలు, సభ్యులు కేవలం ‘ఇటుకలు’, ‘రాళ్లు’.. కార్యకర్తల - క్యాడర్- ప్రాతిపదికగా ఏర్పడే పార్టీ ‘మెట్ల వరుస’- సోపాన పంక్తి! పై మెట్టు కూలిపోయినా ‘పంక్తి’కి ఢోకా లేదు, పార్టీ కొనసాగుతుంది. అగ్ర నాయకుని ఆధిపత్యం ఆధారంగా ఏర్పడిన పార్టీలు గూటానికి వేలాడే నిచ్చెన వంటివి... కొక్కీ- నాయకుడు- ఊడిపోతే ‘నిచ్చెన’- పార్టీ- కూలిపోతుంది, పాతాళ పతనం అవుతుంది!!