సంపాదకీయం

గురునానక్ ‘బాట’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ మహాపురుషులను సంస్మరించుకునే ఉత్సవాలను నిర్వహించడానికి విదేశాల ప్రభుత్వాల అనుమతిని అర్థించవలసి వస్తోంది. శిక్కు మతాన్ని ప్రారంభించిన స్వజాతీయ ధర్మాచార్యుడు నానక్ దేవ్ ‘సార్ధ పంచశతతమ’ జయన్తి ఉత్సవం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. అఖండ భారత జాతీయ సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. బ్రిటన్ దురాక్రమణ ఫలితంగాను, అంతకు పూర్వం వందల ఏళ్లపాటు కొనసాగిన ‘జిహాదీ’ మతోన్మాదుల దాడుల కారణంగాను ‘అఖండ భారత్’ ముక్కలు చెక్కలైంది. అందువల్ల ఒకప్పటి భారత భూభాగాలు ఇప్పుడు విదేశాలుగా ఏర్పడి ఉన్నాయి. ఈ విదేశాలలోని స్వజాతీయ స్ఫూర్తి కేంద్రాలను సందర్శించడానికి అందువల్ల విదేశాల ప్రభుత్వాల అనుమతి తీసుకోవడం అనివార్యం అయింది. కైలాస పర్వతాన్ని మానస సరోవరాన్ని సందర్శించడానికి భారతీయులకు చైనా దురాక్రమణ దారుల అనుమతి అనివార్యం అయింది. మానస సరోవరం, కైలాస పర్వతం టిబెట్‌లో ఉన్నాయి. టిబెట్ చైనా దురాక్రమణలో ఉంది. అందువల్ల ఒకప్పుడు ‘అఖండ భారత్’లో ఉండిన కైలాస పర్వతం, మానస సరోవరం ఇప్పుడు చైనావారి అక్రమ అధీనంలో ఉన్నాయి. బంగ్లాదేశ్‌లోని శక్తిపీఠాలను సందర్శించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించాలి. ప్రవేశ అనుమతి పత్రం- వీసా- కావాలి! ఇలా అనేకానేక హైందవ జాతీయ స్థలాలు, స్మారక కేంద్రాలు, నదులు, పర్వతాలు విదేశాలలోకి చేరిపోవడానికి బ్రిటన్ తదితర విదేశాల శతాబ్దుల దురాక్రమణ వికృత, విషాద నేపథ్యం. నానక్ దేవ్ గురువు కలియుగం 4571- క్రీస్తుశకం 1469-వ సంవత్సరంలో పంజాబ్‌లో జన్మించాడు. ఆయన జన్మించి 549 ఏళ్లు పూర్తయ్యాయి. అందువల్ల ఏడాది పొడవునా ఆ మహనీయుని 550వ జయన్తి మహోత్సవాలు జరగనున్నాయి. గురునానక్ దేవ్ ఇరవై ఏళ్లపాటు నిరంతర దేశ సంచారం చేశాడు. ఆ తరువాత ‘రావీ’ నది ఒడ్డున ఉన్న ‘కర్తార్‌పూర్’ ప్రధాన కేంద్రంగా నానక్ దేవ్ తన ధార్మిక కలాపాలను కొనసాగించాడు. ఈ కర్తార్‌పూర్ పంజాబ్‌లో ఉంది, దేశ విభజన సమయంలో పంజాబ్‌లోని అధిక ప్రాంతాలు పాకిస్తాన్‌లో చేరిపోయాయి. అందువల్ల కర్తార్‌పూర్ పాకిస్తాన్‌లో ఉంది. అందువల్ల గురుదేవుడైన నానక్ స్మారక మందిరాన్ని దర్శించుకొనడానికై క్రీస్తుశకం 1947 నుంచీ పాకిస్తాన్ ప్రభుత్వం వారి అనుమతి అవసరమైంది. కర్తార్‌పూర్‌లోని గురునానక్ దేవ్ మందిరం సందర్శన కోసమే కాదు, పాకిస్తాన్‌లో ‘జిహాదీలు’ ధ్వంసం చేసిన తరువాత కూడ మిగిలిన ఉన్న దేవాలయాలను, గురుద్వారాలను సందర్శిస్తున్న భారతీయులకు పాకిస్తాన్ ప్రభుత్వం వారి అనుమతి అనివార్యమై ఉంది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అనుమతిని ప్రసాదించడంలో నిలకడ లేని విధానాన్ని అనుసరిస్తోంది. అందువల్ల పాకిస్తాన్‌లోని ‘అవశేష’ హిందువులకు, మనదేశం నుండి వెడుతున్న యాత్రికులకు అవరోధాలు, అవమానాలు ఎదురౌతున్నాయి. మన దేశపు సరిహద్దుల నుంచి రావీనదీ తీరంలోని కర్తార్‌పూర్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్లమేర రహదారిని నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు అంగీకరించడం అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం వారి ఔదార్యానికి చిహ్నం. డెబ్బయి ఏళ్లకు పైగా పట్టించుకోని పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడైనా పట్టించుకుంది. మన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని ‘డేరాబాబా నానక్’ తీర్థ స్థలం నుంచి రావీ నది సమీపంలోని సరిహద్దు వరకు మన ప్రభుత్వం రహదారిని నిర్మించడానికి గురువారం నిర్ణయించింది. సరిహద్దు నుంచి ‘గురుద్వారా దర్బార్ సాహెబ్’- కర్తార్‌పూర్‌లోని నానక్ స్మృతి కేంద్రం-వరకు పాకిస్తాన్ ప్రభుత్వం రహదారిని నిర్మిస్తుందట. ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రహదారి నిర్మాణం మొదలవుతుందట! ఇలా ‘డేరాబాబా నానక్’ నుంచి సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న ‘గురుద్వారా దర్బార్ సాహెబ్’ వరకు రహదారి ఏర్పడడం వల్ల మన దేశం నుండి వెడుతున్న యాత్రికులకు ‘సమయం’, ‘దూరం’తగ్గిపోతాయి. ప్రస్తుతం లాహోర్‌కు వెళ్లి అక్కడి నుంచి అనేక గంటలపాటు ఈ యాత్రికులు ప్రయాణించవలసి వస్తోంది. ఈ ‘‘మేలు చేయడానికి’’ పూనుకున్న సమయంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం బుధ, గురువారాలలో లాహోర్‌లోని ‘గురుద్వారాల’ సందర్శనకు వెళ్లిన భారతీయులకు ఈ మందిరాలలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ నిషేధాన్ని మన ప్రభుత్వం శుక్రవారం నిరసించింది కూడ.. ఇదీ పాకిస్తాన్ ప్రభుత్వం తీరు!
గురునానక్ దేవుడు ఐదువందల నలబయి తొమ్మిది ఏళ్లనాడు జన్మించే నాటికి విదేశీయ ‘జిహాదీ’ బీభత్సకారుల దురాక్రమణ నెలకొని ఉంది. దేశంలోని అత్యధిక భూభాగం జిహాదీల మతోన్మాదగ్రస్తమై ఉంది. పాలకులుగా చెలామణి అయిన ఈ ‘జిహాదీ’లు అనాది హైందవ జాతీయులను నిర్మూలించడానికి నిరంతరం యత్నించారు. హైందవ జాతీయ తత్త్వానికి, జిహాదీల మతోన్మాదానికి మధ్య క్రీస్తుశకం 712లో మొదలైన సంఘర్షణ నానక్‌దేవుని కాలం నాటికి పరాకాష్ఠకు చేరింది. అనాదిగా దేశంలో పుట్టిపెరిగి పెంపెల్లిన స్వజాతీయ తత్త్వం భారతీయత, హిందుత్వం! అనేక మతాల సంపుటంగా సర్వమత సమభావ భూమికపై ఈ హైందవ జాతీయతత్త్వం వికసించింది. విదేశాల నుంచి వ్యాపించిన యూదు, ఫారసీ, క్రైస్తవ, ఇస్లాం మతాలకు కూడ అందువల్ల భారతదేశంలో స్వజాతీయ మతాలతోపాటు సమాన ప్రతిపత్తి లభించడం చరిత్ర. కానీ జిహాదీలు ఈ చరిత్రను చెఱచడానికి పూనుకున్నారు. ఎందుకంటె ‘ఇస్లాం’ తప్ప మరో ‘మతం’ ప్రపంచంలో ఉండరాదన్నది ‘జిహాదీ’ల ప్రవృత్తి! అందువల్ల ఇస్లామేతర మతాలన్నింటినీ నిర్మూలించాలన్నది ‘జిహాదీ’ల లక్ష్యం. అన్ని మతాలను పరిరక్షించి, సమాన భూమికపై అన్ని మతాలూ వికసించడానికి దోహదం చేయడం భారతీయ ప్రవృత్తి, హైందవ జాతీయ స్వభావం! ఇలా సర్వమత సమభావ వ్యవస్థకూ, దాన్ని ధ్వంసం చేయదలచుకున్న ‘జిహాదీ’ల మతోన్మాదానికీ మధ్య మొదలైన సంఘర్షణ నానక్‌దేవుని ఉద్యమానికి నేపథ్యం! సర్వమత సమభావ హైందవ జాతీయ తత్త్వరక్షణ నానక్‌దేవుని సాంస్కృతిక ఉద్యమ లక్ష్యం.. అందుకే...
‘‘నీచమైన కాళరాత్రి
నృత్యం చేస్తూ ఉన్నది,
సత్యమనే చంద్రరేఖ
కనబడకుండా ఉన్నది,
ఈ చీకటి రాజ్యంలో
దారి తెలియడం లేదు.....
మరో కొత్త బాట వైపు
మనసును మళ్లిస్తాను!’’
- అని నానక్ దేవుడు ప్రకటించాడు. ఈ వినూతన ధర్మపథం శిక్కు మతం.. సర్వమత సంపుటమైన హైందవ జాతీయ సమాజ పరిరక్షణ గురునానక్ లక్ష్యం, శిక్కు గురువుల లక్ష్యం, శిక్కు మతం సర్వమత సమభావ జాతీయ వ్యవస్థను మరింత పరిపుష్టం చేసిన మరో విలక్షణ వైవిధ్యం..
ఇలా స్వజాతీయ సమాజ రక్షణకై నానక్ దేవుని నుంచి గోవిందసింగ్ వరకు పది మంది శిక్కు గురువులు జరిపిన ధార్మిక ఉద్యమం, సాంస్కృతిక సంఘర్షణ చరిత్రలో సముజ్వల ఘట్టం. గోవిందసింగ్ గురువర్యుడు స్వయంగా చెప్పినట్టు భరతమాత నుదుటి బొట్టును రక్షించిన సైనిక దళం శిక్కు మతం..