సంపాదకీయం

‘వాగ్దాన’ లక్ష్యం..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న ‘వాగ్దాన ప్రచారం’లో సమానత్వం నెలకొని ఉంది. జనం శాశ్వతంగా ఆర్థిక వైకల్యానికి గురికాగల వ్యవస్థను ఏర్పరచడానికి ఈ వాగ్దాన పరంపర దోహదం చేస్తోంది. ‘ఆర్థిక వికలాంగులైన’ ప్రజలు నిరంతర ప్రభుత్వ సహాయం కోసం పడిగాపులు పడి ఉండేందుకు దోహదం చేయగల సామాజిక స్థితిని శాశ్వతంగా వ్యవస్థీకరించడానికి అన్ని ‘పార్టీల’ వాగ్దానాలు దోహదకారులు.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరమ్ ప్రాంతాలలో ‘మత ప్రదానం’- పోలింగ్- ముగిసింది. తెలంగాణ, రాజస్థాన్ ప్రాంతాలలో ఏడవ తేదీన ‘మత ప్రదానం’ జరుగనుంది. కానీ అన్ని రాష్ట్రాలలోను ‘వాగ్దాన’ స్వభావం మాత్రం ఒకే విధంగా ఉంది, ‘ప్రగతి’ నివేదిక స్వరూపం ఒకే విధంగా ఉంది. తెలంగాణ సహా అన్ని ప్రాంతాలలోను ప్రభుత్వ పక్షాలు ‘‘మీకు ఈఈ సహాయాలు చేశాము, ఈఈ సహాయాలు చేయబోతున్నాము’’ అని వాగ్దానాలు చేశాయి. ప్రతిపక్షాల వారు ‘‘ఈ ప్రభుత్వం మీకు సహాయం చేసింది ‘సున్న’.. దగా చేసింది! మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈఈ సహాయాలు చేయగలం...’’ అని హోరెత్తిస్తున్నారు! ఉభయ పక్షాలు ‘‘కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు’’ చెబుతున్నాయన్నది జనం చెబుతున్నమాట! కానీ ఈ వాగ్దాన పరంపరలో ప్రజలు ఆర్థిక స్వయం సమృద్ధ జీవనులు కారాదన్నది ప్రధానమైన అంశం. ప్రభుత్వం ‘బిచ్చం’ పెట్టకపోతే తమ బతుకులు గతుకుల గుంటలలో కూరుకొని పోతాయన్న ‘భ్రాంతి’ని, 'భయాన్ని’ ప్రజలకు కల్పించడానికి అన్ని రాజకీయ పక్షాలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయి. ప్రజల జీవన వ్యవహారాలలో ప్రభుత్వ ప్రమేయం లేకపోవడం ఆదర్శ స్థితి అన్నది ఉత్కృష్ట రాజకీయ సిద్ధాంతం! ఇలాంటి వ్యవస్థ ఏర్పడడానికి ప్రభుత్వాలు కృషి చేయడం ‘మంచి పరిపాలన’- గుడ్ గవర్నెన్స్- స్వభావం! ప్రభుత్వం ఆర్భాటంగా అన్ని రంగాలలోను కనిపించరాదు, పరిపాలన ప్రభావం మాత్రమే అన్ని రంగాలలోను ప్రస్ఫుటించాలి! ఇదీ ‘పాలన ధర్మం’. ఈ ధర్మం సమాజంలో సహజ వికాసాన్ని సమకూర్చుకున్నప్పుడు ప్రజలందరూ హాయిగా జీవిస్తారు. ఈ జన జీవన ప్రస్థాన రథానికి ఆర్థికప్రగతి, సాంస్కృతిక సుగతి రెండు చక్రాలు! ప్రజలు, శారీరక స్వస్థత, బౌద్ధిక పరిపుష్టి కలిగిన ప్రజలు, తమంత తాముగా శ్రమించి స్వయం సమృద్ధిని సాధించడం ఈ జీవన ప్రస్థాన రథం. ఇలా సంపాదించుకునేవారు ఆర్థిక సాంస్కృతిక సంపదను తాము మాత్రమే అనుభవించడం అమానవీయ వికృతి! ‘‘మేము సంపాదించుకుంటున్నాము, మేము అనుభవిస్తున్నాము...’’అన్నది ఈ అమానవీయ చిత్తవృత్తి! ‘‘మేము సంపాదిస్తాము, సంపాదించాము, ఇతరులను సమాదరిస్తాము, పోషిస్తాము..’’అన్నది సంస్కృతి! సంపాదించేవారు సంపన్నులు- సంపాదించలేని వారిని సమాజాన్ని సమాదరించడం యుగయుగాల భారతీయ సంస్కృతి.. విదేశీయ దురాక్రమణదారులు ఈ మానవీయ మహోజ్వల సంస్కృతిని అటకెక్కించి వెళ్లారు. అటక మీది నుంచి దించే ప్రయత్నం జరుగకపోవడం రాజకీయ నిర్వాహకుల దశాబ్దుల వైఫల్యం...
అందువల్ల యథావిథిగా ఈ ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో జరుగుతున్న వాగ్దానాలలో ఈ ‘సాంస్కృతిక సుగతి చక్రం’ ప్రసక్తిలేదు. అందువల్ల జనజీవన రథం ఒక చక్రం లేకుండా ఒంటి చక్రంతో కుంటాలన్నది అధికాధిక అధికార, విపక్ష రాజకీయవేత్తల అభీష్టం. విద్యార్థులకు గడ్డపెరుగుతో సన్న బియ్యంతో భోజనం పెట్టడం భౌతిక సంక్షేమానికి నిదర్శనం, ‘ల్యాప్‌టాప్’లను ఉచితంగా సరఫరా చేయడం పరాకాష్ఠ. కానీ కాపీ కొట్టకుండా కష్టపడి చదివి నైతిక నిష్ఠకల విద్యావంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఏయే ‘పార్టీ’ ఏమేమి ప్రణాళికలను రూపొందించింది? అవినీతిపరులైన ఉద్యోగులు, దోచుకుంటున్న రాజకీయవేత్తలు, అక్రమాలకు పాల్పడుతున్న న్యాయమూర్తులు, పాఠాలు చెప్పని పంతుళ్లు, ప్రొఫెసర్లు, వోటును అమ్ముకుంటున్న ‘ఎన్నికల’ వ్యాపారులు ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తున్నారు??.. నైతికతను మప్పని పాఠశాలల నుండి బయటికి వస్తున్నారు, సౌశీల్యం నేర్పించని కళాశాలల నుండి విశ్వవిద్యాలయాల నుంచి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు లైంగిక శృంగార వేదికలుగా మారాయి. సోదరీ సోదరుల వలె మెలగవలసిన విద్యార్థినీ విద్యార్థులు ప్రేయసీ ప్రియుల వలె ‘సహజీవన’ యాత్రకు పూనుకుంటున్నారు. విద్యాలయాలలో నైతిక నిష్ఠను పెంపొందించే పాఠ్య ప్రణాళికలను బోధించకపోవడం దేశంలోని అన్ని రంగాలలోను అవినీతిపరులు, అనైతిక వర్తనులు, విబుధ దైత్యులు, దేశ విద్రోహులు తిష్ఠవేసి ఉండడానికి వౌలిక కారణం... విద్యాస్వభావ ప్రక్షాళనకై ఏయే పార్టీల వారు ఏమేమి వాగ్దానాలు చేశారు..??
ఇలా ఒక చక్రం లేని సమాజ సమష్టి జీవన రథపు రెండవ చక్రాన్ని కూడ ప్రభుత్వాలు రథానికి ఉండనివ్వడం లేదు, తాము ధరించారు. అందువల్లనే ‘‘్భతిక, ఆర్థికప్రగతి సాధించవలసిన బాధ్యత సైతం మీకు లేదు, ఆ బాధ్యతను మేము నిర్వహిస్తున్నాము, నిర్వహించాము, నిర్వహించబోతున్నాము...’’అని రాజకీయ పక్షాలవారు వోటర్లకు భరోసా ఇస్తున్నారు. నిరుద్యోగ భృతిని పోటీపడి వెయ్యి, రెండు వేలు, మూడు వేల వరకూ పెంచుతున్న అధికార పక్షాలకు, ప్రతిపక్షాలకు నిరుద్యోగ నిర్మూలన గురించి పెద్దగా ధ్యాస లేదు. అంటే నిరుద్యోగ రహిత సమాజం ఎప్పటికైనా ఏర్పడుతుందన్న విశ్వాసం లేదు, ప్రభుత్వ సహాయాన్ని నిరంతరం పొందడమన్న ప్రవృత్తి ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని హరింపచేస్తోంది, విజయసాధన నిష్ఠను నశింపచేస్తోంది, అలసత్వాన్ని అకర్మణ్యతను పెంచుతోంది! బిచ్చం పెట్టడం వల్ల జనం ప్రగతిని సాధించబోరు, బిచ్చం పెట్టించుకోవలసిన అవసరం లేని స్వయం సమృద్ధ ప్రజలు, బిచ్చం పెట్టగల ప్రజలు విశ్వాసానికి సజీవ విగ్రహాల వలె వెలుగొందే సమాజం పునర్ వ్యవస్థీకృతం కావాలి. ఇలాంటి స్వయం సమృద్ధ సమాజం ఏర్పడడానికి ఏయే పక్షం ఏయే వాగ్దానం చేస్తోంది?? ఇలాంటి స్వయం సమృద్ధ సమాజం ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ నగరంలో, ఈ గ్రామంలో లక్షల ఏళ్లపాటు పరిఢవిల్లింది... విదేశీయ మతోన్మాద ‘జిహాదీ’ల దాడుల వల్ల, బ్రిటన్ దోపిడీ మూకల బీభత్స ‘‘పాలన’’వల్ల శతాబ్దులపాటు ఈ స్వయం సంవృద్ధి సమాజ వ్యవస్థ ధ్వంసమైంది, ‘ప్రపంచీకరణ’ ఫలితంగా దీని అవశేషాలు సైతం చెఱగిపోయాయి.
అందువల్ల స్వయం సమృద్ధ సమాజ పునర్ నిర్మాణం ప్రజాస్వామ్య ప్రక్రియకు లక్ష్యం కావాలి. మహాత్మాగాంధీ ‘గ్రామ స్వరాజ్యం’ ‘రామరాజ్యం’ గురించి కన్న సుందర స్వప్నం ఇది. దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి దార్శనికులు కోరిన ‘సురాజ్యం’ ఇది, అంత్యోదయం ఇది. ఎప్పుడో అప్పుడు ఈ దిశగా జాతీయ జీవనప్రస్థానం కావాలి. ప్రతి ఎన్నికల సమయంలోను జరుగుతున్న వాగ్దానాలు జనం తమ ‘కృషి’పట్ల కాక ప్రభుత్వ సహాయం పట్ల విశ్వాసాన్ని పెంచుకొనడానికి దోహదం చేస్తున్నాయి. ‘‘సంపదను పెంచాము, పేదలకు పంచాము’’ అన్నది జనం చెప్పవలసిన మాట! ప్రభుత్వం, ప్రభుత్వ నిర్వాహకులు జనంలో భాగం! కానీ ఈ మాటను ప్రభుత్వం చెబుతోంది. అంటే ‘‘ప్రభుత్వం వేఱు, ప్రజలు వేఱు’’అన్న భ్రాంతి ధ్వనిస్తోంది. ప్రభుత్వ సహా యం కేవలం తాత్కాలికం కావాలి, సహాయం అవసరం లేని ప్రజల సంఖ్య వంద శాతం కావడానికి క్రమంగా దోహదం చేయాలి. ఎన్నికల వాగ్దానాలు ‘‘సహాయగ్రస్తులను’’ వందశాతానికి పెంచడానికి దోహదం చేయరాదు!