సంపాదకీయం

మన్‌మోహన వారసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రభుత్వేతరులకు అమ్మివేయడం ఈ సంవత్సరం మరింతగా పుంజుకోవడం ప్రపంచీకరణ ప్రభావం గొప్పగా విస్తరించ బోతున్నదనడానికి మరో నిదర్శనం. ఇలా తెగనమ్మడం వల్ల లభిస్తున్న ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు వార్షిక ఆదాయ వ్యయాల ఖాతాలలో జమ కట్టుకుంటున్నాయి. తద్వారా కొత్త పన్నులు విధించకుండా సాలుసరి లోటును పూడ్చుకుంటున్నాయి. ప్రభుత్వం ఆధీనంలోని భూములను కూడ అమ్మిపారేసి ఈ రెవిన్యూ ఖాతాలోని జమకట్టుకుంటూ ఉండడం అనేక రాష్ట్రాలలో నడచిపోతున్న ఆర్థిక నీతి. ఇలా ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రభుత్వేతరులకు అమ్మడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం 35 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించిందట. ఐదువందల ముప్పయి కోట్ల డాలర్లని చెప్పడం ఈ మహా పరిణామాన్ని అంతర్జాతీయ సమాజంతో అనుసంధానం చేయడంలో భాగం. ప్రభుత్వ భూములను ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవడం సరళీకరణలో భాగమైపోయింది. సరళీకరణ అని అంటే పారిశ్రామిక రంగలోను, పంపిణీ సేవల రంగంలోను ప్రభుత్వం భాగస్వామ్యం తగ్గిపోయి ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం పెరగడమన్నది దశాబ్దుల అనుభవం. ఈ సరళీకరణ వల్ల మన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వేతర సంస్థల ప్రాధాన్యం పెరుగుతుందని 1990 దశకం ఆరంభంలో మురిసిపోయారు. ఎందుకంటె ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం పెరగడం వల్ల వికేంద్రీకృత ప్రగతి వికసిస్తుందని, ప్రతిదానికి ప్రభుత్వం వారి ఆంక్షలు వర్తించే ‘‘లైసెన్స్ రాజ్యం’’ అంతరిస్తుందని సరళీకరణ శాస్తవ్రేత్తలు డప్పులు కొట్టి చాటించారు. కానీ ఈ మురిసిపోవడం ఎక్కువకాలం కొనసాగలేదు. సరళీకరణను వాణిజ్య ప్రపంచీకరణతో అంటుకట్టేశారు. ఫలితంగా విస్తరిస్తున్న సంకర ఆర్థిక వ్యవస్థ విదేశీయ వాణిజ్య సంస్థలు మనదేశంలోకి చొరబడి పోవడానికి యథేచ్ఛగా మన ప్రజలను దోపిడీ చేయడానికి దోహదం చేస్తోంది. అందువల్ల సరళీకరణ మరింత సరళతరం అవుతున్న కొద్దీ ఈ విదేశీయ సంస్థలు మన జుట్టును తమ పిడికిళ్లలో మరింత గట్టిగా బిగించి పట్టుకోగలుగుతున్నాయి. ఇలా పట్టుకునే ప్రక్రియ పేరు విదేశీయ ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యం, ఇంగ్లీషు భాషలో దీని పేరు ఫారెన్ డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్-ఎఫ్‌డిఐ- ఆర్థిక మంత్రిగా మన్‌మోహన్ సింగ్ ఈ ప్రక్రియను 1994లో ఆరంభించి వెళ్లారు 2004లో ప్రధానమంత్రిగా తిరిగి వచ్చి 2014 మే 26 వరకు పటిష్ఠంగా ప్రతిష్ఠించాడు. మన్‌మోహన్ సింగ్ ఆర్థిక నీతిని అత్యంత చిత్తశుద్ధితో 1998వ 2004వ సంవత్సరాల మధ్య ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వలోని జాతీయ ప్రజాస్వామ్య సంఘటన-ఎన్‌డిఎ- ప్రభుత్వం వారు అమలు జరిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం వారు మరింత ధ్యేయ నిష్ఠతో మన్‌మోహనీయ ఆర్థిక నీతిని అమలు జరుపుతున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను క్రమంగా తెగనమ్మి వేయడం ఇలా మన్‌మోహనీయ ఆర్థిక నీతిని అమలు జరపడంలో భాగం. మన్‌మోహన్ సింగ్ అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్త. బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా వంటి దేశాల ప్రభుత్వాధినేతలు ఈ అంతర్జాతీయ స్థాయిని ఘనంగా గుర్తించి మన్‌మోహన్ సింగ్‌ను ప్రశంసించారు. అందువల్ల సంకుచిత జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు కాక విస్తృత అంతర్జాతీయ హితాన్ని సాధించడం మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వ ఆర్థిక నీతికి పదేళ్లు పునాది రాయి అయింది. ‘‘అంతర్జాతీయ ప్రయోజనం అని అంటే అమెరికా, చైనా వంటి ఆధిపత్య విస్తరణ వాదుల అక్రమ లాభం అన్న ప్రచారం గురించి మన్‌మోహన్ సింగ్ పట్టించుకొనకపోవడం చరిత్ర. అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రయోజనం గురించి ఎరిగినవాడు. భారత ప్రధాని అమెరికా ప్రయోజనం గురించి తెలిసినవాడు’’ అని మన్‌మోహన్ సింగ్ గురించి జరిగిన వ్యాఖ్యలు కూడ ఇప్పుడు చరిత్ర. ఈచరిత్ర పునరావృత్తి అవుతున్న భయాందోళనలు ప్రస్తుతం ఆవహించి ఉండడం నడుస్తున్న చరిత్ర. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండిన సమయంలో ప్రభుత్వ సంస్థల వాటాలను అమ్మివేయడం పెద్ద ఎత్తున మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వపు ఆస్తుల విక్రయ-డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్- మంత్రిత్వశాఖను కూడ ఏర్పాటు చేశారు. ప్రభ్వురంగ సంస్థల వాటాలను స్వదేశీయ ప్రభుత్వేతర సంస్థలకు మాత్రమే విక్రయించడం సరళీకరణ. విదేశీయ సంస్థలకు కట్టబెట్టడం ప్రపంచీకరణ.
దేశాల సరిహద్దులు చెరిగిపోవాలన్న ప్రచారానికి ఇదే ప్రాతిపదిక. సరిహద్దులతో పాటు వర్ధమాన దేశాల ఆర్థిక సార్వభౌమత్వం చెరిగిపోతోందన్నది క్రమంగా ప్రస్ఫుటిస్తున్న వాస్తవం. అయినప్పటికీ కూడా దాదాపు అన్ని రంగాలను విదేశీయ సంస్థలకు అప్పగించే దిశగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కొనసాగుతోంది. ఎఫ్‌డిఐకి అవకాశం ఉన్న అన్ని రంగాలలోని ప్రభుత్వ సంస్థల వాటాలను విదేశీయ సంస్థలు కొనేయడానికి అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థల వాటాలను అమ్మడం వల్ల గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి ఇరవైరెండు వేల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే లభించిందట. ఈ ఏడాది ఈ రాబడి ఇలా అత్యధిక వృద్ధి పలుకడం ప్రభుత్వం వారు ఘనంగా చాటుకుంటున్న అంశం. వచ్చే ఏడు యాబయివేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంస్థల వాటాలను అమ్మేస్తారట. ఇలా అమ్ముతూ పోతే క్రమంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రభుత్వేతర సంస్థలుగా మారిపోవడం ఖాయం. అలా జరగదన్న భ్రమను కల్పించడానికై గరిష్ఠంగా నలబయి తొమ్మిది శాతం వాటాలను అమ్ముతామని, డెబ్బయి ఆరుశాతం వాటాలను అమ్ముతామని ప్రభుత్వాలు గత ఇరవయ్యేళ్లుగా ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో కంటె ప్రభుత్వేతర సంస్థల నిర్వహణలో వాణిజ్య సంస్థలు లభసాటిగా నడుస్తున్నాయన్నది అనుభవం. అందువల్ల నష్టాలు వచ్చిన సంస్థలను, నష్టాలవల్ల దివాలా తీసి మూతపడిన ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించడం వల్ల నిజమైన జాతీయ ప్రగతి సాధ్యం కాగలదు. అదికూడ స్వదేశీ సంస్థలకు మాత్రమే అప్పగించాలనడం ఆర్థిక విజ్ఞత. కానీ లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను మాత్రమే ప్రభుత్వేతరుల పాలు చేస్తున్నారు. ఇదంతా సామాన్య ప్రజల ధ్యాసలేని వ్యవహార మన్న ధీమాతో మాత్రమే ప్రభుత్వాలు ఇలా అమ్మిపారేస్తున్నాయి. మన్‌మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు దేశాన్ని దివాలా తీయిస్తున్నట్టు ఆర్భాటించిన భాజపా అధికారం చేపట్టిన తరువాత ఆయనగారి విధానాలనే కొనసాగిస్తున్నప్పుడు ప్రభుత్వం మారినందువల్ల ప్రయోజనం ఏమిటి?
ప్రభుత్వరంగ సంస్థల వాటాలను ప్రభుత్వ భూములను విక్రయించడం వల్ల లభిస్తున్న ఆదాయాన్ని మూలధనంగా పరిగణించి శాశ్వత నిధిగా ఉంచాలి. ఆ నిధిపై వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే రెవిన్యూ బకాయిలకు జమ కట్టుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేయడంలేదు. ఏ యేటికాయేడు వార్షిక ఆదాయంగా అమ్మకాల సొమ్మును జమకట్టుకొని ఖర్చు పెట్టేస్తున్నారు. ఇదేం ఆర్థిక నీతి??