సంపాదకీయం

జైట్లీ జాణతనం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయ భూమికపై సర్వ సమగ్ర ఆర్థిక వికాసం నూతన వార్షిక ఆదాయ వ్యయ ప్రణాళిక-బడ్జెట్-ఇతివృత్తం! 2016-2017వ ఆర్థిక సంవత్సరానికి రూపొందిన బడ్జెట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాటకు ప్రతిబింబంగా ప్రస్ఫుటించింది. ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన కర్షక సమ్మేళనంలో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం, 29వ తేదీన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌లో ప్రతిధ్వనించింది! ఈ ధ్వని, ప్రతిధ్వనులకు వ్యవసాయ నిష్ఠ నేపథ్యం! వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థ, భూ గర్భ జలాలు, సేంద్రీయ వ్యవసాయం, వ్యవసాయ ఋణాలు, పంటల బీమా, గ్రామీణ ఉపాధి ఇబ్బడి ముబ్బడి మెరుగుపరచడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుం బిగించిందన్నది బడ్జెట్ స్వరూప సౌందర్యం...సూటు బూటు నగరాలకు సంకేతాలు, పేదరికం వ్యవసాయ క్షేత్రం-గరీబీ, ఖేత్-గ్రామాలకు ప్రతీకలు! నగర ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థను గ్రామ ప్రాబల్య వ్యవస్థగా వికేంద్రీకృతం చేయడానికి తాము సంకల్పించినట్టు మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం వారు ప్రచారం చేసుకొనడానికి ఈ కొత్త బడ్జెట్ పత్రం ప్రాతిపదికగా మారింది! ప్రభుత్వం స్వదేశీయ పథం వెంట ఆర్థిక వ్యవస్థ పునఃప్రస్థానానికి బహుశా రంగం చేసిందనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం! గ్రామీణ సంక్షేమం, గ్రామీణ ప్రగతి ఈ స్వదేశీయ ఆర్థిక శకటానికి రెండు చక్రాలు! సేంద్రీయ వ్యవసాయాన్ని 2016-17లో మరో ఐదు లక్షల ఎకరాలకు విస్తరింపచేయాలన్న బడ్జెట్ లక్ష్యం ఈ స్వదేశీయ స్ఫూర్తికి ఒక ఉదాహరణ మాత్రమే! గ్రామీణ పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా ఖర్చు చేయగల నిధులను 238 శాతం మేర రెండు లక్షల ఎనబయియేడు కోట్లకు పెంచడం పెరిగిన వ్యవసాయ స్ఫూర్తికి నిదర్శనం! రైతులకు వాణిజ్య బ్యాంకుల ద్వారా లభిస్తున్న ఋణాల పరిమాణం ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలనుంచి తొమ్మిది లక్షల కోట్లకు పెరగడం, మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు పెరగడం వ్యవసాయ సంక్షేమానికి చిహ్నం! నీటిపారుదలను, భూగర్భ జల నిక్షేపాలను పెంపొందించడానికి ప్రధాని పల్లెబాటల పథకం వంటి వౌలిక సదుపాయాలకు నిధులు పెరగడం ప్రగతికి అద్దం! 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రతిజ్ఞ ఇది. కృషి కేంద్ర బడ్జెట్ అనడానికి తిరుగులేని ప్రమాణం! అయితే ఈ స్వదేశీయ స్ఫూర్తి వెనుకనుండి ప్రపంచీకరణ భూతం తొంగి చూస్తుండడం విధాన నిహిత వైరుధ్యాలకు చిహ్నం!
ప్రభుత్వేతర భాగస్వామ్యం ప్రధానంగా విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ప్రమేయం పెరుగుతోందన్నది ఈ వైరుధ్యాలకు ప్రాతిపదిక! కొత్తగా మరో ఐదు లక్షల ఎకరాలలో ఈ ఏడాది సేంద్రీయ వ్యవసాయం చేయించడం స్వదేశీయత! కానీ బడ్జెట్‌లో కేవలం రూ. 412 కోట్లు సేంద్రీయ వ్యవసాయానికి కేటాయించడం కొండంత రాగం తీసి గోరంత గీతం పాడిన చందం...వ్యవసాయదారుల ఆదాయాన్ని ఆరేండ్ల తర్వాత రెట్టింపు చేయగలిగినప్పటికీ అప్పటికి ద్రవ్యోల్బణం ప్రాతిపదికగాను, ప్రపంచీకరణలో భాగంగా రూపాయి విలువ పడిపోవడం ద్వారాను జీవన వ్యయం రెండున్నర రెట్లు పెరిగి ఉంటుంది! అందువల్ల రైతుల ఆదాయం ఉల్బణం ద్వారా ఎలాగూ రెట్టింపు అవుతుంది! ద్రవ్యోల్బణం ద్వారా కాక వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల ప్రాతిపదికగా కర్షకుల ఆదాయం రెట్టింపు కావాలి! అది జరగడానికి ప్రధాన అవరోధం ప్రపంచీకరణం! ఈ అవరోధాన్ని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదు! వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో వందశాతం విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని అనుమతించాలని నిర్ణయించినట్టు అరుణ్ జైట్లీ ప్రకటించడం ఈ అవరోధం మరింతగా బలపడుతోందనడానికి సాక్ష్యం..! బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం ప్రతి సంవత్సరం క్రమంగా తగ్గిపోతుండడం కూడ ప్రపంచీకరణ వైపరీత్యం పెరుగుతుండడానికి నిదర్శనం! క్రమంగా ప్రణాళికా వ్యయం,ప్రణాళికేతర వ్యయం, అన్న తేడాను తొలగించి వేస్తారట! వౌలిక, పారిశ్రామిక, ఉత్పాదక రంగాలలోప్రభుత్వ భాగస్వామ్యం అడుగంటిపోయి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ప్రాబల్యం విస్తరించిపోతుండడానికి ఇది సంకేతం!
మొత్తం వార్షిక వ్యయం 2013-14లో దాదాపు పదిహేనున్నర లక్షల కోట్ల రూపాయలు. ఇందులో ప్రణాళికా వ్యయం దాదాపు నాలుగున్నర లక్షల కోట్లుమాత్రమే! గత ఏడాది-2014-15లో వార్షిక వ్యయం పదిహేడు లక్షల కోట్లకు పెరిగింది. అయినప్పటికీ ప్రణాళికా వ్యయం మాత్రం నాలుగున్నర లక్షల కోట్లు...ఈ ఏడాది-2015-16లో వార్షిక వ్యయం దాదాపు పద్దెనిమిది లక్షల కోట్లకు పెరిగింది. ప్రణాళికా వ్యయం మాత్రం కేవలం పదిహేను కోట్లు పెరిగి నాలుగు లక్షల అరవై ఐదు కోట్లకు చేరింది. మొత్తం వ్యయం ప్రణాళికా వ్యయం శాతం బాగా తగ్గిపోయిందనడానికి ఈ గణాంకాలు సాక్ష్యం. ప్రణాళికేతర వ్యయం ఉత్పత్తులకు దోహదం చేయదు. ప్రణాళికా వ్యయం ఉత్పత్తులకు దోహదంచేస్తుంది. ప్రణాళికేతర వ్యయం జీత భత్యాల రూపంలోను, నిర్వహణ రూపంలోను ఎప్పటికప్పుడు ఖర్చయిపోతుంది! రానున్న 2016-17 సంవత్సరంలో వ్యయం దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు. ఇందు ప్రణాళికా వ్యయం ఐదున్నర లక్షల కోట్లు! ఈ ఏడాదితో పోల్చినపుడు ప్రణాళికా వ్యయం శాతం పెరిగినప్పటికీ గత మూడేళ్లుగా సగటు ప్రణాళికా వ్యయం తగ్గడం ప్రపంచీకరణ బలపడుతుండడానికి సంకేతం! ఇలా ప్రపంచీకరణ పరిధి ప్రభా వం విస్తరిస్తున్న వాస్తవాన్ని మరపింపచేయడం జైట్లీ జాణతనం...రక్షణరంగానికి కేటాయింపులను పెంచాలన్న వాస్తవాన్ని ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేదని ఈ బడ్జెట్‌ద్వారా ధ్రువపడింది! ప్రస్తుత సంవత్సరంలో రక్షణకు రెండు లక్షల నలబయి ఏడు వేల కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రెండులక్షల ఇరవై రెండు వేల కోట్లకంటె ఇది పదకొండు శాతం ఎక్కువ. ఇరవై నాలుగు వేల కోట్లు అదనంగా కేటాయించారు. వచ్చే ఏడాది-2016-17లో రెండు లక్షల యాబయి ఎనిమిది వేల కోట్లను కేటాయించారు. పెరుగుదల పదిశాతం కంటె తక్కువ. కేవలం పదకొండు కోట్లను పెంచారు. చైనా ప్రభుత్వం ఆధికారికంగా ప్రతి ఏడు సగటున పదిహేను శాతం సైనిక వ్యయాన్ని పెంచుతోంది! చైనా దురాక్రమణ వ్యూహం విస్తరిస్తున్న నేపథ్యంలో మన ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచకపోవడం ప్రమాద ధ్యాస లోపించిందనడానికి తార్కాణం...
వ్యవసాయ రంగానికి మాత్రమే కాదు మధ్యతరగతి వారికి నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చగల అనేక ప్రతిపాదనలను జైట్లీ తన ప్రసంగంలో ఆవిష్కరించాడు! అనుసూచిత కులాలు, అనుసూచిత సముదాయాలవారు పారిశ్రామిక యజమానులుగా ఎదగడానికి దోహదం చేయగల పథకం సామాజిక న్యాయసాధనకు సోపానమార్గం! ఐదు లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం కలవారికి పన్ను చెల్లింపులో కొంత రాయితీ కూడ లభించింది! పొగాకు ఉత్పత్తుల మీద, శీతల పానీయాల మీద పన్నులు పెంచడం హర్షణీయం. ఈ రెండూ జనజీవనాన్ని వ్యాథిగ్రస్తం చేస్తున్న విష పదార్ధాలు...అంతా బాగుంది కానీ ఇదంతా, ఈ ప్రగతి ప్రస్థానమంతా ప్రపంచీకరణ పరిధిలోనే పరిక్రమిస్తోంది! ఈ వైపరీత్యం ప్రాధాన్యం సంతరించుకొనకుండా జాగ్రత్తగా నిరోధించడం బడ్జెట్ ప్రసంగంలో ధ్వనించిన అరుణ్‌జైట్లీ గడుసుతనం. ప్రపంచీకరణ మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వంనుండి ఈ ప్రభుత్వానికి లభించిన వారసత్వం....