సంపాదకీయం

చదువుల చెఱ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐమాకు ‘ఎగ్జామ్స్’... ఐ మాకు ‘ఎగ్జామ్స్’... అని ఇల్లంతా తిరిగి గంతులేస్తోంది నాలుగేళ్ల పాప! ఇంకా ఒకటవ తరగతికి కూడా రాని ఆ పాపకు ‘ఎగ్జామ్స్’ అంటే అవగాహన కూడా ఉన్నట్లు లేదు.. ఆ చిట్టిపాపకు తెలిసిందల్లా ఒక్కటే... ‘ఎగ్జామ్’ - ‘పరీక్షలు’ - అయిపోగానే ‘హాలీడేస్’ వస్తాయన్నది! హాలీడేస్ - సెలవులు - వస్తే స్కూల్‌కు - కానె్వంట్‌కు - వెళ్లనక్కర లేదు. వీపుమీద పుస్తకాల మూట, కాళ్లకు ‘బూట్ల’ మోత, చేతిలో వాటర్ బాటిల్. టిఫిన్ బాక్స్ వీపుమీద ఉన్న ‘బ్యాగ్’లోనే ఉంది... ఈ ‘తతంగం’న్ని మోసుకొని నడవనక్కరలేదు! ‘టీచర్’ బెదరింపులకు గురికానక్కరలేదు. రోజంతా ఇంటిలో ఉండవచ్చు, ఎగరవచ్చు, గంతులేయవచ్చు, పరిగెత్తవచ్చు, ఆడుకోవచ్చు.. అందువల్ల ‘హాలీడేస్’ అంటే నాలుగేళ్ల పాపకు, మూడేళ్ల బాబుకు అంత ఇష్టం. పరీక్షలు కాగానే సెలవులు వస్తాయి మరి!! ఐదేళ్లవరకూ బడి ‘బడితె’కు గురికాకుండా నిశ్చింతగా బాలబాలికలు మనగలగడం గతం.. రెండేళ్లు నిండగానే ‘ప్లేక్లాస్’ - ఆటల తరగతి - పేరుతో బుడతలను ‘బడి’పాలు చేస్తున్న నగర జీవితం వర్తమానం... ఇంటికి దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ‘బడి’ నిర్బంధానికి గురి అవుతున్న రెండేళ్ల పాపల ‘మనోభావాల’ను అంచనా వేయగల చదువు మాత్రం ఎవ్వరికీ రాదు, తల్లిదండ్రులకు రాదు, అధ్యాపకులకు అసలే రాదు! రెండేళ్లకు ‘ప్లేక్లాస్’, మూడేళ్లకు పూర్వం శిశు తరగతి, అంటే ‘ఎల్‌కెజి’... నాలుగేళ్లకు ఉత్తర శిశు తరగతి అంటే ‘యూకేజీ’.. ఐదేళ్లకు ఒకటవ తరగతిలో చేరేలోగా ఊహ తెలియని చిన్నారులు ‘కృత్రిమ’ విద్యలలో కూరుకొనిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు... ఐదవ ఏట ఐదవ నెలలో ఐదవ శుభ దినాన శిశువులకు అక్షరాభ్యాసం చేయించాలన్నది అనాదిగా భారతీయ పద్ధతి, జీవన సంస్కారం. అంతవరకు పాపలను బాబులను యథేచ్ఛగా తిరగనివ్వాలి, ఆడనివ్వాలి! ‘‘రాజవత్ పంచ వర్షాణి...’’ - ఐదేళ్లు నిండే వరకు శిశువులను రాజులవలె, రాణుల వలె ఎదగనివ్వాలన్నది కూడ ఈ జీవన సంస్కారం! ఈ జీవన సంస్కారం భారతదేశమంతటా ఇప్పుడు పాశ్చాత్య భావదాస్యగ్రస్తమైంది, ‘కానె్వంటు’గ్రస్తమైపోయింది. ‘శుకత్రిశతి’ అన్న కావ్యం రచించిన టిహెచ్ నటరాజరావు అన్న కవి చెప్పినట్లు, ‘‘మమీ డాడీ మోజున, మమీ కానె్వంటు జైళ్ల మాడ్చెదరెపుడున్, అమ్మో రాతలు మోతలు, తుమ్మేందుకు వీలు లేని తొందర చిలకా!’’ అన్నది వ్యక్తం కాని శిశువుల అంతరంగం... అందువల్లనే ‘పరీక్షలు’ తరువాత ‘సెలవులు’ వస్తాయన్నది శిశువుల అవగాహన! ‘బడి’ అంటే శిశువులు హడలెత్తిపోతున్నారు మరి...
తరగతి గదిలో అధ్యయనం - నేర్చుకోవడం -, అధ్యాపనం - నేర్పించడం చక్కగా జరిగినట్టయితే బడి వేళల తరువాత మళ్లీ ‘ట్యూషన్ల’ పేరుతో విద్యార్థులను గంటల తరబడి కూలేయవలసిన పనిలేదు. కానీ ఇప్పుడు నగరాలలో పది గంటలపాటు పిల్లలను బడికి బందీలుగా చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల పిల్లలు నాలుగున్నర గంటల పాటు, మాధ్యమిక ఉన్నత పాఠశాలల పిల్లలు ఐదున్నర గంటలపాటు బడిలో చదివితే చాలు... ఇళ్లకు వెళ్లిన తరువాత గంటసేపులో ‘హోమ్‌వర్క్’ పూర్తయిపోతుంది. ఈ పద్ధతి దశాబ్దుల తరబడి అమలు జరిగింది. పల్లెలలోను పట్టణాలలోను ఉదయం ఏడున్నర నుంచి పదిన్నర గంటల వరకు పాఠశాలల గది చేరి, మళ్లీ మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర గంటల వరకు బడి... అతని తరువాత ఆటలు ఆడించేవారు! ఆ పద్ధతి పోయింది. ఏకబిగిన పది గంటల నుంచి నాలుగున్నర వరకూ ప్రాథమిక పాఠశాలలో బోధనను నిర్వహించడం మొదలైంది. కానీ కార్పొరేట్ స్కూళ్లు పెరిగిన తరువాత ఉదయం తొమ్మిది లోపే ‘స్కూళ్లు’ మొదలవుతున్నాయి. సాయంత్రం పాఠశాలలు ముగిసిన తరువాత ‘స్టడీ’ అవర్స్ పేరుతో బుడతలను రాత్రి ఏడు గంటల వరకూ నిర్బంధానికి గురి చేస్తున్నారు. ఆటలు లేవు. పాటలు లేవు. గతంలో ప్రతి విద్యాలయానికి అనుబంధంగా సువిశాల క్రీడా ప్రాంగణం ఉండేది. ఆ మైదానంలో పిల్లల చేత ‘డ్రిల్లు’ - శారీరక వ్యాయామం - చేయించేవారు, ఆటలు ఆడించేవారు. ఆకాశం కింద, ఆరుబయట ప్రదేశాలలో చెట్ల నీడలో ప్రకృతి ఒడిలో చిన్నపిల్లలు కనీసం గంట సేపు అలా గడిపేవారు. ఇప్పుడు ఆటస్థలాలు లేవు, శరీర క్షమతను పెంచగల వ్యాయామం లేదు, ఆటలు లేవు! పిల్లలు నిరంతరం నాలుగు గోడల మధ్య బందీలు... ఆదివారం సెలవులలో ‘శరీర శ్రమ’ అవసరం లేని ‘క్రికెట్’ తప్ప పిల్లలు మరో ఆట ఆడటం లేదు. పిల్లల మనోవికాసాన్ని బౌద్ధిక ప్రగతిని ‘దృశ్య మాధ్యమాల’లోని విచిత్ర వికృత నికృష్ట కార్యక్రమాలు నియంత్రిస్తున్నాయి. నిర్దేశిస్తున్నాయి!!
ఇలా బడిపిల్లల బతుకులు వీపుమీద బరువులో తలలో ఉద్రిక్తతతో మనస్సులో ఉత్కంఠతో ఇరుకైన ఊపిరాడని వాణిజ్య - కార్పొరేట్ - పథం వెంట తొక్కిసలాటగా సాగిపోతున్నాయి. ఈ చదువుల ‘బరువు’ గురించి ఓ విద్యార్థి తెలంగాణ మంత్రి కె.తారక రామారావుకు ఫిర్యాదు చేశాడట! తమను ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ‘బోధన’కు గురిచేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన ఈ తొమ్మిదవ తరగతి విద్యార్థి మంత్రికి నివేదించాడట! ఈ ‘చదువుచెఱ’ నుంచి ‘బాల్యాని’కి విముక్తి కలిగించడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రప్రభుత్వం ఇప్పుడైనా నడుం బిగించాలి! విద్యాభ్యాసం ఒక క్రీడగా కొనసాగడం భారతీయత, అది చిన్నారులపాలిట గోడగా మారి ఉండడం వాణిజ్య - కార్పొరేట్ - వికృతి! కోట్ల రూపాయలను సక్రమంగాను, అక్రమంగాను ఆర్జించడమే లక్ష్యమైన వాణిజ్య పాఠశాలల యాజమాన్యాలు పోటీపడి ‘చదువుల’ను, సంస్కార రాహిత్యమైన కృత్రిమ విద్యను పిల్లల నెత్తిన రుద్దుతున్నారు! మానసికమైన ఒత్తిడికి గురికాని రీతిలో పిల్లలు హాయిగా అభ్యసించగల పరిస్థితులు మళ్లీ నెలకొల్పడం ప్రభుత్వాల బాధ్యత! రానున్న రోజులలో ప్రపంచంలో అత్యధిక శాతం యువజనులు ఉండే దేశంగా మన దేశం రూపొందనుంది! కానీ చదువుకాని చదువులు చదివి కేవలం ఆర్థిక జీవులుగా రూపొందుతున్న యువజనులు స్వార్థపు ముద్దలుగా మారనున్నారు. మానవీయ సంస్కార స్వభావులుగా భరతమాత వరాలబిడ్డలుగా యువజనులు ఎదగగల ‘విద్యల విప్లవం’ ఎప్పుడు వస్తుంది??
పాఠశాలలలో సాయంత్రం నాలుగున్నర గంటల తరువాత బోధించరాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013 సెప్టెంబర్‌లో ఆదేశించింది. పిల్లలకు భారం తగ్గించాలని ప్రభుత్వాలు కూడా సూచించి ఉన్నాయి! అయినప్పటికీ వాణిజ్య విద్యాలయాల యాజమాన్యాలు మాత్రం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రభుత్వాలు చర్య తీసుకోకపోవడం అంతుపట్టని వ్యవహారం. అనేక దేశాలలో ప్రాథమిక పాఠశాలలు వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తుండడం ప్రచారం కాని వాస్తవం. అలాకాకపోయినా ఐదురోజులు మాత్రమే రోజునకు ఐదు గంటల చొప్పున ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు పనిచేసే వ్యవస్థను అమలు జరపాలి!