సంపాదకీయం

నేర ప్రతినిధులకు గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు సభ్యులకు శాసనసభ్యులకు వ్యతిరేకంగా దాఖలైన నేరపూరిత అభియోగాలను విచారించడానికి పనె్నండు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం న్యాయప్రక్రియ వేగవంతం కావడానికి దోహదం చేయగల పరిణామం! దేశమంతటా రాజకీయ నేరస్థుల సంఖ్య గత నాలుగు దశాబ్దులుగా పెరిగిపోతుండడం ఈ నిర్ణయానికి నేపథ్యం. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెల్లడి అయిన వివరాల ప్రకారం రెండు వందల ఇరవై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు వ్యతిరేకంగా వివిధ నేరాలకు సంబంధించిన అభియోగాలు న్యాయస్థానాలలో దాఖలై ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన పదమూడు వందల యాబయి ముగ్గురు శాసనసభ్యులకు వ్యతిరేకంగా దాఖలైన నేరసంబంధ అభియోగాలు కూడ న్యాయస్థానాలలో అపరిష్కృతంగా ఉండడం విస్మయకరం. అభియోగాలు సత్వరం పరిష్కారం కాకపోవడం కొత్త విషయం కాదు. ఇంతమంది చట్టసభల సభ్యులు, చట్టాలను రూపొందిస్తున్నవారు స్వయంగా చట్టాలను ఉల్లంఘించడం కూడా కొత్త విషయం కాదు. ఈ పదహైదు వందల ఎనబయి ఒక్క మంది ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా దాదాపు పదమూడు వేల రెండు వందల అభియోగాలు దాఖలై ఉన్నాయట! ఈ ఒక్కొక్క ప్రజాప్రతినిధి సగటున తొమ్మిది నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయన్నది విస్మయకరమైన సమాచారం. నాలుగవ వంతునకు పైగా పార్లమెంటు సభ్యులు ఇలా నేరస్థులన్న అభియోగాలకు గురికావడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ! పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థగా అంతర్జాతీయ గరిమను గడించుకున్న మనదేశం లో ఇంతమంది నేరగ్రస్తు లు, అభియోగగ్రస్తులు చట్టసభలలోకి చొరబడి ఉండడం సిగ్గుచేటైన వ్యవహారం, మన రాజ్యాంగ ప్రక్రియలోని డొల్లతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్య దేశాలలో అతి పెద్దదైన మనదేశం ఇతర దేశాలకు అనుసరణీయమైన ఆదర్శంగా భాసించాలి. భాసించగలదన్న జాతీయ నిష్ఠాపరుల దేశభక్తుల ఆశలు ఇలా అడియాసలు అవుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజావంచన చేస్తున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన సౌశీల్యవంతులైన ప్రజాప్రతినిధులు మంత్రి పదవులను నిర్వహించేవారు. ఈ మంత్రులు దుర్ఘటనలు సంభవించినప్పుడు, తమ మంత్రిత్వ విభాగాలలో అవినీతి పుట్టలు పగిలినప్పుడు - వాటితో తమకు సంబంధం లేకపోయినప్పటికీ తమ పదవులను పరిత్యజించేవారు! నైతికబాధ్యతను వహించేవారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీవంటివారు ఇలాంటి ఆదర్శవంతులు... 1995లో తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తన నిజాయితీ, నైతికనిష్ఠ నిగ్గుతేలేవరకు న్యాయస్థానాలు తన నిర్దోషిత్వాన్ని ధ్రువపరిచే వరకు మళ్లీ ఎన్నికలలో పోటీ చేయబోనని కూడా అద్వానీ ప్రకటించడం దేశ ప్రజలను ఆశ్చర్య చకితులను చేసిన ఘటన..
కానీ లాల్‌బహదూర్ శాస్ర్తీవంటివారి నుండి లాల్‌కృష్ణ అద్వానీ వంటి వారి నుంచి ప్రజాప్రతినిధులు ఎలాంటి స్ఫూర్తిని పొందడం లేదన్నది ధ్రువపడిన వాస్తవం! అభియోగగ్రస్తులైన రాజకీయ వేత్తలు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టాలు రూపొందకపోవడం మన ప్రజాస్వామ్య ప్రక్రియలో నిహితమైన వైపరీత్యం. న్యాయస్థానాలలో దోషులుగా నిర్థారితమైనవారు మాత్రమే నిర్దిష్టకాలం పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదన్నది అమలు జరుగుతున్న నిబంధన. రెండేళ్లు అంతకంటె ఎక్కువకాలం కారాగృహ నిర్బంధ శిక్షను పొందినవారికి మాత్రమే ఈ అనర్హత కూడ వర్తిస్తోంది. అందువల్ల అభియోగగ్రస్తులైన తమకు వ్యతిరేకంగా దాఖలయిన అభియోగాలపై న్యాయస్థానాలు తీర్పు చెప్పేవరకు యథావిధిగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ‘కోర్టు’లు విచారిస్తున్న అభియోగాలపై తుదితీర్పులు తొందరగా వెలువడకుండా రకరకాల పద్ధతుల ద్వారా జాప్యం చేయగలుగుతున్నారు. అందువల్ల పదేళ్లు.. ఇరవై ఏళ్లు గడిచినప్పటికీ న్యాయస్థానాలలో విచారణ ప్రక్రియ పూర్తికావడం లేదు. ఈలోగా అభియోగగ్రస్తులు నిర్లజ్జగా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.. ఎన్నికయిపోతున్నారు...
నవంబర్ ఒకటవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తరువునకు ఈ ‘విలంబన క్రీడ’ నేపథ్యం.. రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా దాఖలయి ఉన్న అభియోగాల సత్వర విచారణకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయమూర్తులు రంజన్ గగోయి, నవీన్ సిన్హా అప్పుడు ఆదేశించారు. ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు లభ్యతపై ఆధారపడి ఉంటుందన్న కేంద్రప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు తిరస్కరించారు. కేంద్రప్రభుత్వమే ఇందుకోసం ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం అప్పుడు ఆదేశించింది. డిసెంబర్ పదమూడవ తేదీలోగా ఈ ప్రణాళికను సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది, సిద్ధం చేసినట్టు డిసెంబర్ పనె్నండవ తేదీననే కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించడంతో అభియోగ అవినీతిగ్రస్తులైన, నేరారోపణలకు గురి అవుతున్న ప్రజాప్రతినిధుల గుండెలలో బహు శా ‘దడ’ మొదలై ఉంటుం ది. ఎందుకంటె ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ప్రతి అభియోగాన్ని సంవత్సరకాల వ్యవధిలోగా విచారించి తీర్పు చెప్పాలన్నది కేంద్రం సిద్ధం చేసిన ‘న్యాయప్రక్రియ’లోని ప్రధాన అంశం. ఏడాదిలోగా అభియోగాలు ప్రత్యేక న్యాయస్థానంలో ధ్రువపడకపోయినట్టయితే ‘కథ’ వేఱు... కానీ ధ్రువపడినట్టయితే ఈ ప్రజాప్రతినిధుల పదవులు రద్దయిపోతాయి. వారు ‘అప్పీలు’ దాఖలు చేసుకున్నప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు వారు మళ్లీ పోటీ చేయడానికి వీలుండదు. 2013వ సంవత్సరానికి పూర్వం ఉండిన నియమావళిలో మార్పు రావడం ఇందుకు కారణం...
ప్రజాప్రతినిధులు మొదటి న్యాయస్థానంలో అభియోగం ధ్రువపడి, దోషులుగా నిర్ధారితులయిన వెంటనే వారు తమ పార్లమెంటు పదవులను, శాసనసభ పదవులను కోల్పోతారని 2013 జూలై 10వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది, అంతవరకూ ఉండిన వెసులబాటు నియమావళిని రద్దు చేసింది. ప్రజాప్రాతినిధ్యపు చట్టంలోని ఈ ‘వెసులుబాటు’ ప్రకారం ఉన్నత సర్వోన్నత న్యాయస్థానాలలో ‘అప్పీలు’ పరిష్కారం కానంతకాలం ఈ ‘దోషులు’ చట్టసభలలో కొనసాగడానికి వీలుండేది, సర్వోన్నత న్యాయనిర్ణయం వెలువడేవరకు మళ్లీ మళ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి వీలుండేది. సర్వోన్నత న్యాయస్థానం ఈ వెసులుబాటును రద్దు చేసింది. ఈ సర్వోన్నత న్యాయ నిర్ణయాన్ని వమ్ము చేయడానికై అప్పటి ప్రభుత్వం చట్టాన్ని సవరించడానికి విఫలయత్నం చేయడం వేరే కథ.. కానీ కొత్తగా ఏర్పడనున్న పనె్నండు ప్రత్యేక న్యాయస్థానాలకు సంవత్సరం వ్యవధిలో ఇన్ని అభియోగాలను విచారించడం సాధ్యమా అన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న!!