సంపాదకీయం

మాతృభాషకు ‘మారాకు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవ తరగతి వరకు తెలుగును విధిగా బోధించాలన్న తెలంగాణ ప్రభు త్వ నిర్ణయం మాతృభాష పరిరక్షణ కృషికి మరో శ్రీకారం. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్ల మాధ్యమ బోధన మొదలైన తరువాత తెలుగు సీమలో మాతృభాష కొడిగట్టడం నడుస్తున్న వైపరీత్యం. దశాబ్దులుగా ఆంగ్ల మాధ్యమ బోధన వ్యవస్థీకృతమై ఉన్న ప్రభుత్వేతర పాఠశాలల్లో తెలుగు భాష వినబడడం లేదు. ‘శిశు’-కిండర్ గార్టెన్ -కెజి- తరగతులలో చేరుతున్న నోరు తిరగని మూడేళ్ల పిల్లల చేత ఆంగ్ల పదాలను మప్పించడం భారత జాతీయ జీవన పద్ధతిని పరిమార్చడానికి అమలుజరుగుతున్న కుట్రలో భాగం. ఈ ‘కుట్ర’ను 1947వ సంవత్సరానికి పూర్వం మన దేశంపై పెత్తనం చెలాయించిన బ్రిటన్ దురాక్రమణదారులు ప్రారంభించారు. 1947 తరువాత బ్రిటన్ దొరల బౌద్ధిక వారసులు ఈ కుట్రను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచంలో మరెక్కడా లేని విచిత్రస్థితి మన దేశంలోని వివిధ ప్రాంతాలలో, ప్రధానంగా తెలుగు ప్రాంతాలలో నెలకొని ఉంది. విద్యా మాధ్యమంగా ప్రతి దేశంలో స్వజాతీయ సంస్కృతి నిష్ఠ వికసించింది, వికసిస్తోంది. భారతదేశంలో సైతం బ్రిటన్ దురాక్రమణ నడికొనే వరకు ఇదే జరిగింది. కానీ క్రీస్తుశకం 1834లో బ్రిటన్ మేధావి థామస్ బాబింగ్టన్ మెకాలే ‘ఆంగ్ల మాధ్యమ ఉన్నత విద్యాబోధన’కు మన దేశంలో శ్రీకారం చుట్టిన తరువాత మన ఉన్నత విద్యావంతులలో స్వజాతీయ సంస్కృతి నిష్ఠ వికసించడం ఆగింది, మోడు వారింది. ఉన్నత విద్యావంతులలో అధిక శాతం స్వజాతీయ స్వభావానికి, భారత జాతీయ స్వభావానికి దూరం కావటం చరిత్ర. విద్యాధిక్యం, స్వజాతీయ సాంస్కృతిక నిబద్ధత విలోమ నిష్పత్తికి గురికావడం శతాబ్దికి పైగా నెలకొన్న వికృతి. అంటే విద్యాస్థాయి పెరిగేకొద్దీ స్వజాతీయ స్వభావం సన్నగిల్లిపోవడం అధికారిక భారతీయులలో దశాబ్దుల తరబడి ప్రస్ఫుటించిన ప్రభావం. బ్రిటన్ దురాక్రమణకు పూర్వం మన దేశంలో ప్రాథమిక విద్యాబోధన ప్రాంతీయ మాతృభాషలలో జరిగింది. ఉన్నత విద్యాబోధన జాతీయ మాతృభాష సంస్కృత భాషామాధ్యమంగా జరిగింది..
అనాదిగా కొనసాగిన ఈ విద్యా సంప్రదాయాన్ని బ్రిటన్‌వారు పరిమార్చారు, భారతీయుల జీవన స్వభావం నుండి భారత జాతీయతను తొలగించడానికి అంకురార్పణ చేశారు. ఉన్నత విద్యాబోధన సంస్కృత భాషామాధ్యమంగా సాగిన సహస్రాబ్దులపాటు విద్యాధికులైన భారతీయులు ‘్భరతీయులు’గా జీవించారు. ఉన్నత విద్యాబోధన ఆంగ్ల భాషామాధ్యమంగా జరగడం మొదలైన తరువాత విద్యాధికులైన భారతీయులలో అత్యధికులు ‘ఆంగ్లేయుల’వలె, ఐరోపావారి వలె ప్రవర్తించడం మొదలుపెట్టారు. ‘నమస్తే, నమస్కారం, శుభోదయం’-అని చెప్పడం మానేసి, ‘గుడ్ మార్నింగ్’, ‘గుడ్ ఈవెనింగ్’ అని కులకడం నేర్చుకున్నారు. అది మొదలు.. విషవృక్షం వేళ్లూనడం, విస్తరించడం తరువాత దశాబ్దులపాటు నడచిన కథ! ఇది 1947 నాటికి పూర్వం జరిగిన ప్రహసనం! బ్రిటన్ విముక్త భారతదేశంలో ప్రాథమిక విద్యను సైతం ఆంగ్ల భాషామాధ్యమం ద్వారా మప్పడం మొదలైంది, తొండ ముదిరి ఊసరవెళ్లిగా మారింది. ఉన్నత విద్యాబోధన మాధ్యమంగా సంస్కృత భాషను తొలగించి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాక క్రమంగా సంస్కృత భాష సన్నగిల్లిపోయింది. ప్రాథమిక విద్యాబోధన మాధ్యమంగా ప్రాంతీయ మాతృభాషలను తొలగించి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాక ప్రాంతీయ భారతీయ మాతృభాషలు మొత్తం అంతరించిపోవడానికి రంగం సిద్ధమైంది. ఇదే పద్ధతి కొనసాగితే భారతీయ భాషలు అంతరించి అమెరికాలో వలె, ఇంగ్లాండులో వలె ‘ఆంగ్లం’ ఏకైక భాషగా ఉండే భారతదేశం- కొత్త భారతదేశం- అవతరించడానికి ఎంతో కాలం పట్టదు.. తెలుగు వెలుగు కొడిగట్టడానికి ఇదీ నేపథ్యం!
కొడిగట్టిన దీపం మలిగిపోకుండా నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నడుం బిగించడం హర్షణీయ పరిణామం! పనె్నండవ తరగతి వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోను, ప్రభుత్వేతర పాఠశాలలలోను తెలుగును నిర్బంధ బోధనాంశం చేయనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లోప్రకటించింది. కానీ తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలలో మాతృభాషాబోధన అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన తరువాత పదవ తరగతి వరకూ మాత్రమే తెలుగును విధిగా బోధిస్తే చాలునన్నది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. పదవ తరగతి వరకు తెలుగు అక్షరాలను, తెలుగు వాక్యాలను, తెలుగు నుడికారాన్ని, తెలుగు ఉచ్ఛారణను స్పష్టంగా, స్వచ్ఛంగా నేర్చుకున్న విద్యార్థులు ఆ తరువాత కూడ తెలుగు భాషా సాహిత్యాలను చదవడం అలవాటు చేసుకోవచ్చు! ప్రస్తుతం ‘ఇంగ్లీషు మీడియమ్’లో చదువులూ, తెలుగు అక్షరాలు తెలియని విద్యార్థులు మాట్లాడుతున్న తెలుగు భయంకర సాంకర్యానికి గురవుతోంది. ‘రెండు మూడు డాక్టర్లను కన్సల్ట్ చేశాము’ అన్నది సంకరమైన తెలుగు నుడికారానికి మచ్చుతునక! అందువల్ల ‘శిశు’-కిండర్ గార్టెన్- స్థాయి నుంచి పదవ తరగతి వరకు తెలుగు నేర్పించడం ప్రాథమిక విద్యావ్యవస్థలో భాగం కావాలి. తెలుగు మాట్లాడిన పిల్లల చేత ‘ఐడోంట్ స్పీక్ టెల్గూ..’- నేను తెలుగు మాట్లాడను-అని వందసార్లు, రెండువందల సార్లు వ్రాయించే దారుణమైన పైశాచికమైన పద్ధతులను ప్రభుత్వేతర పాఠశాలల వారు, వాణిజ్య- కార్పొరేట్- పాఠశాలల నిర్వాహకులు విడనాడాలి. విడనాడని ఆంగ్లేయుల తొత్తులను కఠినంగా శిక్షించడానికి కొత్తగా రూపొందించనున్న చట్టంలో తెలంగాణ ప్రభుత్వం నియమావళిని పొందుపరచాలి! అర్థం లేని, మన దేశపు జీవన విధానంలో పొసగని ‘ఆంగ్ల పద్యాల’ను మూడేళ్ల, ఐదేళ్ల పిల్లలచేత అనాలోచితంగాను, అమాయకంగాను, దుర్బుద్ధి పూర్వకంగాను, నిర్లిప్తంగాను వల్లెవేయిస్తున్న ‘కానె్వంట్’ నిర్వాహకులు చిన్నపిల్లల మనస్సులలో భారతదేశం పట్ల చులకన భావాన్ని, ఇంగ్లాండు, ఐరోపాల పట్ల గొప్ప భావాన్ని నింపుతున్నారు. అందువల్ల ఈ ‘కానె్వంటు’లలో సుమతీ శతకంలోని, వేమన శతకంలోని, జానపద సాహిత్యంలోని, సంప్రదాయ సాహిత్యంలోని పద్యాలను, పదాలను చిన్న పిల్లలకు నేర్పించాలన్న నిబంధనను కూడ కొత్త చట్టంలో పొందుపరచాలి! భాషకు లిపి స్వరూపం. మన ‘లిపి’లోని కొన్ని అక్షరాలను హత్యచేసిన విదేశీయ భావదాసులు తెలుగు భాషామతల్లి స్వరూపానికి వైకల్యం కల్పించారు. యాబయి ఆరు అక్షరాలనూ చిన్నపిల్లలకు నేర్పించాలి! నూటనాలుగు ఆంగ్ల అక్షరాలను నెత్తికెత్తుతున్నవారు, యాబయి ఆరు తెలుగు అక్షరాలలో కొన్నింటిని ఎందుకు తొలగిస్తున్నారు? లిపిని చెఱచడానికి జరిగిన, జరుగుతున్న కుట్రను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడైన నిరోధించాలి, తెలుగు లిపిని సర్వ సమగ్రంగా పునరుద్ధరించి పిల్లలకు నేర్పాలి!!
తెలుగును భాషగా నేర్పడం మాత్రమే చాలదు. కనీసం ఎనిమిదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంగా అన్ని పాఠ్యాంశాల బోధన జరగాలి. దేశమంతటా ఇలా భారతీయ భాషల మాధ్యమంగా మాత్రమే ఎనిమిదవ తరగతి వరకు విద్యాబోధన జరగాలని నిబంధనను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైన చట్టం చేయాలి, రాజ్యాంగాన్ని సవరించాలి. అప్పుడు మాత్రమే విద్యార్థుల నోళ్ల నుండి ‘టాటా’, ‘బయ్ బయ్’ అన్న అర్థం లేని పదాలుకాక, ‘జయ్ జయ్’ అన్న సార్ధకమైన పదాలు వెలువడుతాయి.