సంపాదకీయం

నిగ్గుతేలిన నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కా మసీదు పేలుడు దుర్ఘటనకు సంబంధించి అభియోగంలో అసీమానంద స్వామి, మరో నలుగురు నిందితులు నిర్దోషులన్న నిజం నిగ్గుతేలడం సత్యానికి సంభవించిన విజయం, తరతరాల జాతీయ స్వభావానికి సంభవించిన విజయం. భారతీయులు బీభత్సకారులు కాకపోవడం ఈ జాతీయ స్వభావం, భారతీయులు తమదికాని మతం వారిని కాని, విదేశీయ విజాతుల వారిని కాని హత్య చేయకపోవడం ఈ జాతీయ స్వభావం, భారతీయులు విదేశాలలోకి చొరబడి అన్యమత, అన్యజాతీయ ప్రజల మత, ధార్మిక, సాంస్కృతిక సామాజిక స్ఫూర్తి కేంద్రాలను ధ్వంసం చేయకపోవడం ఈ జాతీయ స్వభావం. భారతీయులు ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు తరతరాలుగా ఆశ్రయం ఇచ్చి, అన్నం పెట్టి సమాదరించడం ఈ జాతీయ స్వభావం. భారతీయులు ఇతర దేశాల నుంచి కాలక్రమంలో వచ్చి చేరిన మతాలను స్వజాతీయ మతాలతో సమానంగా సంభావించి సంరక్షించడం ఈ జాతీయ స్వభావం. ఈ సర్వమత సమభావం అనాదిగా ఈ దేశంలో వికసించింది. ‘ఏకం సత్ విప్రాః బహుధావదన్తి’- ‘సత్యం ఒక్కటే, పండితులు ఆ సత్యాన్ని పలువిధాలుగా వివరిస్తున్నారు’- అన్న వేద విజ్ఞానం ఈ సర్వమత సమభావ వికసనానికి ప్రాతిపదిక! సర్వమత సమభావ తత్త్వం జాతీయ స్వభావమైంది, భారతీయ వౌలిక తత్త్వమైంది, సనాతన- శాశ్వత- సంస్కృతిగా ప్రస్ఫుటించింది, హిందుత్వమైంది! సర్వమత సమభావం మాత్రమే కాదు, సర్వ వైవిధ్య సమభావం హైందవ జాతీయ స్వభావంగా వికసించడం చరిత్ర. ఇదే ‘వసుధైక కుటుంబ’ వాస్తవం!- ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం! ఈ జాతీయతను అంతర్జాతీయ సమాజంలో అవమానించడానికి, ఈ దేశాన్ని విదేశాలలో అప్రతిష్ఠపాలు చేయడానికి ఈ దేశంలో పుట్టిపెరిగిన రాజకీయవేత్తలు కొందరు యత్నిస్తుండడం దశాబ్దుల వైపరీత్యం.. ఈ వైపరీత్యంలో భాగం మక్కా మసీదు పేలుడు బీభత్సంలో అసీమానందను తదితర నిర్దోషులను ముడిపెట్టడం. 2007 మే నెల 18వ తేదీన భాగ్యనగరం -హైదరాబాద్- పాతబస్తీలోని మక్కామసీదు ప్రాంగణంలో జరిగిన పేలుడు ఫలితంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బీభత్సకాండ, ఆ తరువాత సంఘ విద్రోహులు జరిపిన విధ్వంసకాండ, దగ్ధకాండ భాగ్యనగర వాసులను విస్మయ చకితులను చేసింది, దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ బీభత్సకాండను జరిపిన, జరిపించిన అసలు దోషులను పసికట్టడంలోను, పట్టుకొనడంలోను ఘోరంగా విఫలమైన ప్రభుత్వం వారు నిర్దోషులైన అసీమానందను తదితరులను నేరస్థులుగా నిరూపించడానికి విఫలయత్నం చేశారు..
2007 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన రాజకీయవేత్తల ఒత్తిడితో, ప్రేరణతో మాత్రమే ఈ ఐదుగురు నిర్దోష నిందితులను నేరపరిశోధక విభాగాల వారు ఈ అభియోగంలో ఇరికించారన్నది సోమవారం హైదరాబాద్ నాలుగవ మహానగర ‘సెషన్స్’ న్యాయమూర్తి కె.రవీందర్‌రెడ్డి చెప్పిన తీర్పుతో ధ్రువపడిన వాస్తవం! అసీమానందస్వామి, దేవేంద్ర గుప్త, లోకేశ్ శర్మ, భరత్ మోహన్‌లాల్, రతేశ్వర్, రాజేందర్ చౌదరి నిర్దోషులన్నది న్యాయస్థానం చేసన నిర్ధారణ. పదకొండేళ్లపాటు జరిగిన సుదీర్ఘమైన దర్యాప్తుల తరువాత కూడ నేర పరిశోధక విభాగాల వారు నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు సంపాదించి న్యాయస్థానానికి నివేదించ లేకపోయారు. ఈ వైఫల్యం ఆశ్చర్యకరం కాదు, సహజం.. ఎందుకంటె నేరం చేయనివారికి వ్యతిరేకంగా నేరం చేసినట్టు సాక్ష్యాధారాలు సహజంగానే ఉండవు. పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలో ఉసిగొల్పుతున్న జిహాదీ మృగాలు దేశమంతటా దశాబ్దులపాటు జరిపిన మారణకాండలో మక్కామసీదు పేలుళ్లు భాగం. జిహాదీలు మసీదులో ఎందుకు పేలుళ్లు జరుపుతారు? ఇస్లాం మతాన్ని ప్రపంచంలో ఏకైక మతంగా ప్రతిష్ఠించడం జిహాద్ లక్ష్యం. జిహాదీలు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామేతరులను శతాబ్దుల తరబడి హత్యచేయడం చరిత్ర. ఇస్లాం మతానికి చెందిన జిహాదీలు మక్కామసీదులో పేలుళ్లు జరపలేదని మన దేశంలోని కమ్యూనిస్టు ఉగ్రవాదులు కొందరు 2007లోనే కుతర్కాన్ని వెలయించారు! ఈ కుతర్కం ప్రాతిపదికగా అసలు దోషులను వదలిపెట్టి అమాయకులైన అసీమానంద ప్రభృతులను అభియోగంలో ఇరికించారు ప్రభుత్వం వారు..
పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ముఠాలవారు మక్కామసీదు పేలుళ్లకు ముందు, ఆ తరువాత భాగ్యనగరంలోను దేశమంతటా కూడ బీభత్సకాండ జరుపుతూనే ఉన్నారు. మక్కామసీదులోనూ వారే పేలుళ్లు జరిపించడం ‘ధ్రువపడని’ వాస్తవం. ఇలా జరిపించడం ద్వారా, ప్రాణాలను బలికొనడం ద్వారా, ప్రజలలోను, నేరపరిశోధక విభాగాలలోను గందరగోళం సృష్టించడం ‘జిహాదీ’ల ఎత్తుగడ. జిహాదీ ముఠాలతో సంబంధం లేని, ఇస్లాం మత వ్యతిరేకులు ఇతర బీభత్సముఠాలు కూడ దేశంలో హత్యాకాండ, విధ్వంసకాండ జరిపిస్తున్నాయన్న భ్రమను కల్పించడం జిహాదీల ఎత్తుగడ, పాకిస్తాన్ ప్రభుత్వ షడ్యంత్రం! ‘వోట్లు సీట్లు రాజకీయం’ నడిపిస్తున్నవారు ఈ ఎత్తుగడలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తుండడం మరో దౌర్భాగ్యం! జిహాదీలు ఇస్లాం మతస్థులు కావచ్చు, కానీ జిహాదీ బీభత్సకారుల పైశాచిక కాండలో కాని, రాక్షస ప్రవృత్తిలో కాని మన దేశంలోని కోట్లాది ఇస్లాం మతస్థులకు సంబంధం లేదు. ఇతర మతస్థులవలెనే ఇస్లాం మతస్థులు కూడ ‘జిహాదీ’ల అన్యమత విధ్వంసక ప్రవృత్తిని, పైశాచిక కాండను నిరసిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కానీ ‘జిహాదీ’లను నిర్బంధిస్తే, శిక్షిస్తే దేశంలోని ఇస్లాం మతస్థులు బాధ పడతారన్నది దేశంలోని అనేక మంది రాజకీయవేత్తల వికృత మనస్తత్వం. ఇలాంటి వికృత మానసిక ప్రవృత్తి కలవారు నిజానికి ఇస్లాం మతస్థులను అవమానిస్తున్నారు- వారిని జిహాదీల మద్దతుదారులని భ్రమించడం ద్వారా-!
ఇలా భ్రమిస్తున్న రాజకీయవేత్తలు ‘హిందూ టెర్రరిస్టు’ అన్న పదాన్ని కల్పించారు! ‘హిందూ రాడికల్స్’ను కల్పించారు. హిందువులలో కూడ ‘టెర్రరిస్టులు’ ఉన్నారని చెప్పడం వల్ల దేశంలోని సామాన్య ముస్లింలు సంతసించి తమకు వోట్లువేస్తారన్నది ఈ నికృష్ట రాజకీయంలో భాగం! 2004-2014 సంవత్సరాల మధ్య కేంద్రంలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను ప్రభుత్వాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు ‘హిందూ టెర్రరిస్టు’లు - అన్న పదాన్ని ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ, పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్ వంటివారు ఈ కాంగ్రెస్ నాయకులు! అసీమానంద వంటి వారిని నకిలీ అభియోగాలతో ఇరికించడం వీరి పన్నాగం! న్యాయస్థానం తీర్పుతో ఈ పన్నాగం భగ్నమైంది. ప్రజలకు తెలిసిన వాస్తవం మరోసారి నిగ్గుతేలింది.