సంజీవని

స్థూలకాయం.. కొత్త సంగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: ఒబేసిటీ ఏర్పడింది. ఇంత శరీరానికి సరిపడినంత తినకపోతే ప్రాణాపాయం అంటున్నారు. తింటున్నకొద్దీ ఒళ్లు పెరుగుతూనే ఉంది. దీన్ని కంట్రోల్ చేసుకోవటం ఎలాగో చెప్తారా?
వి.ప్రసాదరావు, అనంతపురం
జ: అన్నం ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఈ తినటం ఎప్పుడాపాలి.. ఇవన్నీ మనకు మనమే చేస్తున్నామని అనుకుంటాం. కానీ, మన మెదడు చెప్తేనే మనకు ఆకలౌతోందనీ, కడుపు నిండిందనీ అనిపిస్తుంది. మెదడు నుంచి సంకేతాల రూపంలో వచ్చే ఆజ్ఞల పుణ్యమే ఇదంతా! తినటం ఆపమని మెదడు చెప్పకపోతే కడుపు నిండిన భావన కలగదు. సమాచార లోపానికి సంబంధించిన విషయం ఇది. దీని వలన షుగరు వ్యాధి, స్థూలకాయం ఏర్పడుతున్నాయి. మెదడు సహకారం ఉంటేనే ఆహారాన్ని పరిమితం చేసుకోగలుగుతామనీ, షుగురూ, స్థూలకాయ సమస్యల్ని ఎదుర్కోవటం సాధ్యం అవుతుందనీ దీని భావం. కడుపు నిండిన తృప్తి కడుపు నిండక మునుపే కలిగిన అపకారమే! మెదడు పంపే సంకేతాలను బట్టే ఇదంతా జరుగుతోంది.
ఇతరులు వడ్డిస్తే ఎక్కువ తింటామనీ, మనకు మనమే వడ్డించుకుంటే తక్కువ తింటామనీ అనుకుంటాం. ఇది అపోహ. మెదడు ఇంకా చాల్లే అని చెప్పకపోతే స్వంతంగా వడ్డించుకునే వాడికి స్వేచ్ఛ ఇచ్చినట్టే అవుతుంది.
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలం వైద్య కళాశాల నరాల వైద్య విభాగం వారు రిచర్డ్ హుగనీర్ నాయకత్వంలో ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఆకలినీ, ఆహార సేవననీ నియంత్రించే ఒక నాడీ కణాన్ని (నెర్వ్ సెల్) గుర్తించారు. ఈ నాడీ కణంలో ఒజిటి అనే ఎంజైమ్ ఆకలి నియంత్రణ చేస్తోందని కనుగొన్నారు. ఎంపిక చేసిన ఎలుకలలో ఈ ఓజిటిని తొలగించినపుడు అవి ఎక్కువ సేపు, ఎక్కువ కేలరీలను తినటాన్ని గమనించారు.
తినటాన్ని ఆపవలసిందిగా ఆదేశించే యంత్రాంగం సరిగా పనిచేయకపోతే స్థూలకాయం, షుగరు వ్యాధి, కీళ్లనొప్పుల్లాంటి రోగాలకు దారులు తెరిచినట్టే అవుతుంది. కడుపు నిండిందని, ఆహారం ఇప్పటికే ఎక్కువయ్యిందనే గ్రహింపు మనకు మన మెదడు చెప్పందే తెలియదు. అలా చెప్పే యంత్రాంగం బలంగా ఉంటే స్థూలకాయాన్ని, షుగరు వ్యాధిని జయించటం తేలికేనన్నమాట.
మెదడూ, మనసు, జీర్ణక్రియ ఈ మూడూ వాత ధాతువు కారణంగానే స్థిరంగా నడుస్తున్నాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. వాత ధాతువు సక్రమంగా పనిచేయకపోతే వాతదోషం ఏర్పడుతుంది. దోషంగా మారిన వాతంవలన మనసు, జీర్ణకోశాలు మన అదుపు లేకుండా పోతాయి. వాత దోషం షుగరు వ్యాధికీ, స్థూలకాయానికీ దారితీస్తుంది.
మెదడు నుండి శరీరాంగాలన్నింటికీ సమాచారం (సిగ్నలింగ్) సక్రమంగా చేరాలి. ఈ సమాచార వ్యవస్థని నడిపించేదే వాత ధాతువు. శరీర వ్యాపారం సక్రమంగా సాగాలంటే మెదడు సమాచారం ఎక్కడా ఆగకూడదు. వికారం చెందకూడదు. శరీరంలో ఏ అంగానికి సంబంధించిన సమాచారాన్నయినా వాతం ఒక ధాతువుగా కాకుండా దోషంగా మారి నిర్వహిస్తుంటే ఆ అంగంలో వ్యాధి ప్రవేశించినట్టే లెక్క. అందుకని ప్రయత్న పూర్వకంగా వాతాన్ని అదుపులో పెట్టగలిగితే సమాచార వ్యవస్థ చెడకుండా వుంటుంది. స్థూలకాయం, షుగరు వ్యాధి మన అదుపులోకి వస్తాయి.
విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో స్థూలకాయుల సమస్య ఎక్కువ. అక్కడి జనాభాలో దాదాపు 40 శాతంమంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. మన దేశంలో అంతే సంఖ్యలో షుగరు రోగులు కనపడుతున్నారు. దీనికి వాత దోష వికారమే కారణం.
అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్న మానవ శరీర నిర్మాణం చాలా సంక్లిష్టమైంది. మెదడు లోపల ఉన్న ఒక సూక్ష్మకణంలో లోపం ఏర్పడటానికి దారితీసే పరిస్థితుల్నీ, అందుకు కారణాల్నీ గుర్తించగలిగితేనే ఈ పరిశోధన వలన ప్రయోజనం కలుగుతుంది.
నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడమే వాత వికారం. నాగరికత పేరుతో మనం తింటున్న చాలా ఆహార పదార్థాలు ఈ వాత దోషాన్ని పెంచేవిగానే ఉన్నాయి. అతిగా పులుపు, అతిగా అల్లం వెల్లుల్లి మషాలా, అతిగా నూనె ఇలాంటివెన్నో నాడీ వ్యవస్థను దెబ్బతీసే వాటిని ఇష్టంగా తింటున్నాం. వాటి దెబ్బ తగలకుండా ఉండదు కదా! ఊరుగాయలు, రంగులు కలిపిన ఆహార పదార్థాలు, నెయ్యి, నూనె, తేనె, పసుపు, కారం, ఇంకా గోధుమ పిండి లాంటి నిత్యావసర వస్తువుల్లో కలిసే కల్తీల ప్రభావం మెదడుమీద నేరుగా పడుతుంది. ప్రొద్దున పూట తినే తిఫిన్లతో మొదలుపెట్టి, రాత్రిపూట తినే టిఫిన్లవరకూ వాటిలో నాడీ వ్యవస్థను దెబ్బతీసే అంశాలు ఎన్ని ఉన్నాయో గమనించుకుని జాగ్రత్తపడటం అవసరం. సంప్రదాయంగా మనం వండుకునే ఇడ్లీ, పూరీ, ఉప్మా, బజ్జీ పునుగులు షుగరునీ, స్థూలకాయాన్నీ పెంచేవిగానే ఉంటాయి. వాటికి బదులుగా రాగి, జొన్న, సజ్జ, గోధుమలకు సంబంధించిన వంటకాలు తింటూ ఉంటే నాడీ వ్యవస్థ బలంగా ఉంటుంది.
కొందరికి తీపంటే ప్రాణం, కొందరికి పులుపంటే తగని మోజు. ఒకాయన పచ్చిమిరప బజ్జీని ఆవకాయతో తింటాడు. గరిటెడు పెరుగు, పెద్ద చెంచాడు ఉప్పు కలుకుని తినే వాళ్లున్నారు. కానీ చేదు వగరు రుచుల్ని ఎందరో దగ్గరకు రానివ్వరు. ఈ ఇష్టా యిష్టాలన్నీ మెదడు సంకేతాలవలన జరుగుతున్నవే! మనోబలంతోనే వాటిని అదుపు చేసుకోవాలి. వగరు చేదు రుచులకు వాతాన్ని అదుపు చేసే గుణం ఉంది. ఆహారంలో వగరు లేదా చేదు రుచి గలిగిన పదార్థాలను కూడా తీసుకుంటూ ఉంటే, నాడీ వ్యవస్థ బలంగా ఉంటుంది.
ఆహారాన్ని పరిమితంగా తీసుకోవటానికీ, జిహ్వచాపల్యాన్ని అణచుకోవటానికీ మానసికంగా సన్నద్ధం కావటమే ఈ సమస్యకు పరిష్కారం. మనోబలం ఉంటే నాడీ వ్యవస్థ అనుకూలంగా పనిచేస్తుంది. ఆదర్శాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించుకోవటంలోనే ఆరోగ్యం ఉంది.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,