పశ్చిమగోదావరి

ఇసుక చుట్టూ ‘పచ్చల’ హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*రీచ్‌లలో సామన్యులకు లేని చోటు
*హవా అంతా కాంట్రాక్టర్లదే
*ఉచితమంతా అనుచితమే
ఏలూరు, మార్చి 7 : మధ్యతరగతి మనుషులు ఇల్లుకట్టుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగా వెతుక్కోవాల్సింది ఇసుక ఎక్కడ దొరకుతుంది? ఎంతకు దొరకుతుంది? అన్నదే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానాన్ని ఉచితంగా మార్చేయడంతో సామాన్య మధ్య తరగతి ప్రజానీకం ఇటీవలి వరకు కొనసాగిన ధరలు చూసి బెంబేలెత్తి ఉచిత విధానం అమలులోకి వచ్చిందని ఊపిరి పీల్చుకుని ఇళ్ల నిర్మాణాలకు పురమాయింపులు మొదలుపెట్టారు. కానీ అసలు రీచ్‌లలోకి వెళ్లి ఇసుక తీసుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే సరికి ఈ ఉచితం ఎంత అనుచితంగా అమలవుతుంది అన్నది తేటతెల్లమవుతుంది. వాస్తవంగా చూస్తే గతంతో పోలిస్తే కొంతవరకు ధరలు తగ్గుముఖం పట్టినా ఉచితం మాత్రం ఎక్కడా కనుచూపు మేరలో లేదనే చెప్పుకోవాలి. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన నేపధ్యంలో జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే దాదాపు అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తాయి. వాస్తవానికి ఆయా ప్రాంతాల్లోని రీచ్‌లు స్థానిక ప్రజాప్రతినిధుల లేక కొంతమంది కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే కొనసాగడం బహిరంగ రహస్యం. ఇంతకుముందు డ్వాక్రా మహిళలకు ఇసుక రీచ్‌లను అప్పగించిన సమయంలోనూ వీరి హవానే నడిచింది. అప్పట్లో మహిళలకు బాధ్యతలు అప్పగించినా పచ్చచొక్కాలదే రీచ్‌లలో రాజ్యంగా మారిందని విపక్షం తీవ్రస్థాయిలో ఆరోపణలు కురిపించింది. ఇక ఆ దశ ముగిసి ఉచితం విధానం తెరపైకి వచ్చినా జిల్లాలోని రీచ్‌లలో దాదాపుగా ఇంతకుముందు హవా నడిపించిన వారిదే రాజ్యంగా కొనసాగుతోందంటే అతిశయోక్తి కాదు. కొన్ని చోట్ల పూర్తిస్థాయిలో ఈ రీచ్‌లు ఆయా నేతల కనుసన్నల్లో నడుస్తుండగా మరికొన్ని చోట్ల నేతలు, కాంట్రాక్టర్ల ఆధీనంలో ఈ రీచ్‌లు ఉండిపోయాయి. ఆ రకంగా చూస్తే ఏలూరులో ఒక మధ్య తరగతి వ్యిక్తి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది నేతల అనుచరులను సంప్రదిస్తేనే లభ్యమయ్యే పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే రీచ్‌లు వున్న ప్రాంతాల్లోని నేతలదే ఇప్పుడు హవా నడుస్తోందని చెప్పాలి. అయితే మరో విధంగా చూస్తే గతంలో 20 నుంచి 24 వేల రూపాయల వరకు లభ్యమైన పది టైర్ల లారీ ఇసుక ఇప్పుడు దాదాపుగా 16 నుంచి 18 వేల రూపాయలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఆ విధంగా చూస్తే రేటు తగ్గడం తప్ప ఉచితం అన్న అంశం దాదాపు ఎక్కడా ప్రస్తావనకే రాదు. దీనికి మించి ఇటీవలి కాలంలో ఈ రీచ్‌లలో తమ బలాన్ని మరింత పటిష్టపరచేందుకు ఆయా నేతలు, కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున కసరత్తును ముందుకు తీసుకువెళ్లారు కూడా. ఒక విధంగా చూస్తే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న కాంట్రాక్టులు, ఇతరత్రా ప్రభుత్వ పనులు నేతల అనుచర గణానికి, అనుకూలమైన కాంట్రాక్టర్లకు లభించాయనడం దాదాపుగా బహిరంగ రహస్యమే. అలాంటప్పుడు తమ ప్రాంతాల్లో వున్న ఇసుకపై గుత్త్ధాపత్యాన్ని సాధించుకుంటేనే రానున్న రోజుల్లో కాంట్రాక్టు పనులు సులభంగా ముందుకు వెళ్లే పరిస్థితి వుంటుందని ముందుగానే ఊహించి ఆయా ప్రాంతాల్లో తమ స్థానాన్ని మరింత సుస్థిరపరచుకున్నారనే చెప్పాలి. ఆ విధంగా సామాన్య, మధ్య తరగతికి ఈ ప్రాంతాల్లో దాదాపు ప్రవేశమే వుండదంటే అతిశయోక్తి కాదు. ఇక రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో గృహ నిర్మాణం కూడా భారీ ఎత్తున చేపట్టే అవకాశాలు వున్నాయి. దానికి సంబంధించి పధకం రూపకల్పన, మార్గదర్శకాల నిర్ధారణ వంటి ప్రక్రియలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ముగిసి అసలు పనులు ప్రారంభించడానికి మరికొంతకాలమే మిగిలి వుందన్న అంచనాలు కూడా లేకపోలేదు. అలాంటప్పుడు రానున్న కాలంలో ఇసుకకు భారీ ఎత్తున డిమాండ్ పెరిగే అవకాశాలు స్పష్టంగా వున్నాయి. ఈ పరిణామం కూడా నేతలను, అనుచరులను, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేసిందనే చెప్పాలి. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రీచ్‌లలో ఆదిపత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద ఉచిత ఇసుక విధానాన్ని పరిశీలిస్తే ప్రాధమికంగానే ఎన్నో సందేహాలు తలెత్తుతుండగా ఉచితం ఎంత వరకు ఆచరణ సాధ్యమన్న అంశంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఇక క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఉచిత ఇసుక విధానం అన్నది ప్రభుత్వ రికార్డులకే మిగులుతుందా? అన్న అనుమానాన్ని కూడా కలిగించకమానదు.