కొంచెం ఇష్టం కొంచెం కష్టం

గురువారం మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే ఏడుపు మొదలుపెట్టింది మా శ్రీపూజిత. అది మాకు మామూలే. మంగళవారం, గురువారం అదలాగే ఏడుస్తుంది. కారణం వున్నా లేకపోయినా ఏదో వంకపెట్టుకుని ఏడుస్తుంది. ఎందుకంటే ఆ రెండు రోజులూ సాయంత్రం నాలుగింటికి సంగీతం టీచరు ప్రహర్షిత వచ్చి పాఠం చెప్తుంది. రెండింటినుంచే ఇది ఏడుపు మొదలుపెడుతుంది. వాళ్ళమ్మ గదమటం, పోట్లాడటం అదింకా శోకాలు పెట్టి ఏడవటం. విసిగిపోతున్నాం.
అదేం ఖర్మమో తరతరాలుగా మాకు సంగీతం అచ్చి రావటంలేదు. మా అందరివీ కోకిల కంఠాలు. త్యాగరాయ కృతులు నేర్పించి కచేరీ ఇప్పించాలని మావాళ్ళ కోరిక. కచేరీ మాట దేవుడెరుగు అసలు పాఠం సాగితేగా!
మా ముందు తరం వాళ్ళూ నేర్చుకున్నారు. సంగీతం మాట ఎలా వున్నా పాఠం మొదలుపెట్టి స్వరజతుల దాకా రాకుండానే పెళ్లిళ్లయి వెళ్లిపోతున్నారు పిల్లలు అని మురిసిపోయేవాళ్లట మా పెద్దవాళ్లు.
ఆ తరువాత మాకు శేషమ్మగారని ఓ పెద్దావిడ సంగీతం చెప్పేది. ఆవిడ మాకు దూరపుబంధువు కూడానుట. కొద్దిరోజులకే ఆవిడ ఆరోగ్యం పాడైపోయింది. పాట తక్కువ, దగ్గెక్కువాగా వుంది. మన వూరు వెళ్లి గుళ్ళో పూజ సామాన్లు తోముకో అని చెప్పి పంపించేశారు తాతయ్యగారు. నేర్చుకున్నవే సాధన చేసుకోండి అన్నారు. మళ్ళీ ఎవరినైనా చూస్తాం సంగీతం చెప్పటానికి అన్నారు. అలాగే సాధన చేసుకునే వాళ్ళం.
మరుసటి నెలలోనే ఓ అబ్బాయి వారం కోసం వచ్చాడు మా ఇంటికి. మాటల్లో అతనికి సంగీతం వచ్చని తెలుసుకుని మరి ఇకనేం? వారాలొద్దు, రెండు పూటలా మనింట్లోనే తిను, ఇక్కడే వుండు. బదులుగా మా పిల్లలకి సంగీతం చెప్పు అన్నారుట. అతని పేరు పార్వతీశం. పార్వతన్నయ్యా అని పిలిచేవాళ్ళం.
మళ్ళీ మొదలయ్యాయి మా సంగీతం పాఠాలు. మాది జాయింట్ ఫ్యామిలీ. బోలెడుమందిని వుండేవాళ్ళం. ఆపిన దగ్గరనుంచీ మొదలుపెట్టాలి అందరికీ. మాటలు తిన్నగా రాని చెల్లెళ్ళ మొదలుకుని పెళ్లీడుకొచ్చిన అక్కలదాకా అన్ని వయసులవాళ్లూ సరిగమల మొదలుకొని వర్ణాలదాకా రకరకాల పాఠాలు. దానికితోడు తరతరాలుగా అచ్చొచ్చిన హార్మనీ పెట్టె. అదీ బస్సు హారనులాగా మోగేది.
అల్లరీ ఎక్కువే. ఎవరికివాళ్ళం మా పాఠం వదిలేసి పక్కవాళ్లకి చెప్తున్నది పాడేవాళ్లం. మా పార్వతన్నయ్యని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులనీళ్లు తాగించేవాళ్ళం.
ఆ మాటే మా బామ్మదగ్గర మొరపెట్టుకునేవాడు మా పార్వతన్నయ్య. ఓరి వెర్రిమొహమా? ఈ మాత్రం దానికి ఇంత గొడవెందుకూ? పక్కవాళ్ళ పాఠం వీళ్ళకి చెప్పి వీళ్ళ పాఠం పక్కవాళ్లకి చెప్పేస్తే సరిపోదుట్రా పార్వతీ.. అంది మా బామ్మ.
నా ఖర్మ నాకు ఈ సంగీతం పాఠం నుండి విముక్తి లభిస్తే బావుండు అని తల బాదుకున్నాడు పార్వతన్నయ్య. మరుసటి నెలలోనే అతని కోరిక తీరింది.. అదెలాగంటే మా పెద్దక్కయ్యకి పెళ్లిచూపులు.
‘‘పార్వతీ.. రారా వేణుగోపబాలా సాధన చేయించరా సీత చేత’’ అంది బామ్మ. ఆవేల్టికి అది తడబడితే మీరు అందుకోండి అని మాకూ చెప్పింది.
అల్లాగే జరిగింది. పెళ్లిచూపుల్లో అది తడబడటం మేము అందుకోటం మాతోపాటు మిగిలినవాళ్లుకూడా ఎవరికొచ్చింది వాళ్లు పాడటం నానా ఖంగాలీ అయిపోయింది. పెద్దవాళ్ళు మా అందరినీ గదమటం చిన్న పిల్లలు ఏడవటం ఇదంతా చూసి మా సీతక్కయ్య కూడా ఏడిచింది. పిల్ల బానేవుంది గానీ పాట కచేరీతో బెదిరిపోయాడు పిల్లాడు. నాకొద్దని మొత్తుకుంటున్నాడు, మేము నచ్చచెప్పాం. పాట లేకుండా మళ్లీ చూపించండి అని మధ్యవర్తులు చెప్పారట. మావాళ్ళు మమ్మలనందరినీ గదిలో పారేసి పెళ్లిచూపులు చూపించి ఓకే అనిపించుకున్నారు.
ఆడపిల్లలు చక్కగా సంగీతం నేర్చుకుని మనకు పేరు ప్రతిష్టలు తెస్తారని ఆశపడ్డాం. ఇట్లా పరువు తీస్తారనుకోలేదు. పాట మనకు అచ్చిరాలేదు. ఇక సంగీతం వద్దులే అని మాన్పించారు. పార్వతన్నయ్యకి వేరే పని చూపించారు. దాంతో మా సంగీత శిక్షణ అటక ఎక్కింది.
మా పెద్ద బావగారు మాత్రం చాలా బెదిరిపోయారు. పెద్దల్లుడి హోదాలో మా అందరి పెళ్లిళ్లకి నడుము కట్టుకుని నిలబడేవారు. మా ఇంట్లో ఎవరి పెళ్లిచూపుల్లో అయినా సంగీతం వచ్చా? అని అవతలివాళ్ళు అడగ్గానే ఠకీమని లేచి రాదండీ రాదు. పాడరు. నాదీ పూచీ అని ముందుజాగర్త పడేవారు పాపం. అలా మా తరం గడిచిపోయింది. పిల్లల తరం వచ్చింది. షరా మామూలే. మా అమ్మాయికి సంగీతం నేర్పించాలని చూసాను. మొదటిసారి అచ్చిరాలేదు. మళ్లీ ప్రయత్నించాను. మా అమ్మాయి చక్కగా పాడుతుంటే సంగీతం నేర్చుకున్నావా అమ్మా... అనేవారు. కొత్త మాస్టారు వద్ద నేర్చుకున్నానండీ. అలంకారాల దాకా నేర్చుకునేసరికి మా మాస్టారికి గుండె పోటొచ్చి పోయారు పాపం.. అని చెప్పేది. వాళ్ల మొహాల్లో రంగులు మారిపోయేవి. మళ్లీవస్తాం అని అదే పోత పోయేవాళ్లు. అలా చెప్పకే, నీకు పాఠం చెప్పటం మొదలుపెట్టాక ముందే ఆయనకీ రెండుసార్లు గుండెపోటు వచ్చిందట అని ఎంత చెప్పినా అర్థం అయ్యేది కాదు దానికి. అలా నేను పిలిపించటం, అది వెళ్ళగొట్టటం- ఇక విసుగేసి ఊరుకున్నా.
ఇదుగో ఇప్పుడు మనవరాళ్ళ తరం నడుస్తోంది. అదేవిటో ప్రత్యేకమైన శిక్షణట. నర్సరీనుంచే ఐఐటి కోచింగులాగా మొదటినుంచే టీవీ ప్రోగ్రాములలో పాటల పోటీలకు పాడేలా నేర్పుతారుట సంగీతం. మా పిల్లకీ అదే కోచింగు నడుస్తోంది. రెండు నెలలు అయింది పాఠం మొదలుపెట్టి. పిల్ల ఏడవా.. టీచరు ఏడవా... వాళ్ళిద్దర్నీ చూసి తల్లి ఏడవా... ఈ గోల తప్పించి సంగీతం అర అంగుళం ముందుకి సాగటంలేదు. పరిచయం దగ్గరే ఆగిపోతోంది బండి.
అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపూజిత. నేను గ్లోరి కానె్వంట్‌లో ఎల్‌కెజి చదువుతున్నా. నేను శ్రీమతి దూర్వాసుల ప్రహర్షిత గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నా. మా తాతగారు జన్నాభట్ల యాజ్ఞ్యవల్క్య శర్మగారి ప్రోద్బలంతో సంగీతం నేర్చుకున్నా... అని పరిచయం చేసుకోవాలిట. పిల్లసన్నాసికి నోరు తిరగక అఘోరిస్తోంది. భోరున ఏడుస్తుంది.
అదికాదు తల్లీ.. ముందు సరళీ స్వరాలతో మొదలుపెట్టి సంగీతం నేర్పి ఆ తరువాత అది ప్రోగ్రాము ఇచ్చే స్థాయికి వచ్చాక అప్పుడు ఈ పరిచయ కార్యక్రమం పెట్టుకోవచ్చు కదమ్మా అంటే టీచరు వినదు. సిలబస్‌నే ఫాలో అవుతుందిట.
ఈ ప్రోగ్రాం గొడవ ఏమిటే మామూలుగా సంగీతం నేర్పించు అంటే తల్లి వినదు. ఇప్పుడు మామూలు సంగీతం నేర్పించి ఆ తరువాత మళ్లీ ప్రోగ్రాం కోసం ట్రైనింగు ఇవ్వాలంటే కష్టం కదండీ. అయినా ఇప్పుడు అంతా ఇదే పద్ధతి నడుస్తోంది అంటుంది.
ఏతావతా మంగళవారం, గురువారం మా ఇంట్లో మారెమ్మ జాతర. ఆ పాఠానికి నెలకి వెయ్యి. నాకు ఓర్పు నశించిపోయింది. చూడమ్మా, అసలే మనింట్లో సంగీత శిక్షణ అచ్చిరాదు. తరతరాలుగా మొదలుపెట్టటం, మానెయ్యటం తప్పించి కీర్తనలదాకా ఎవరం రాలేదు. పాటలు రేడియోలో విని పాడేసాం.. కచేరీలూ గట్రా ఇవ్వలేదు గానీ ఫలాన ఆవిడ బాగా పాడుతుంది అని పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడిదీ ఆ మాత్రం పాడలేక పోదు. నేను నేర్పుతాను. సంగీతం సంగతి దేవుడెరుగు ఈ ఏడుపు చూడలేకపోతున్నాను అన్నాను కోడలితో. అదింకా సణుగుతూ వుంటే నేనే కలగచేసుకుని మా గతం అంతా వివరించి చెప్పి ఆ ప్రహర్షితను మర్యాదగా సాగనంపాను. తనకి ఇక ముందు సంగీతం పాఠం ఉండదనీ, పరిచయ కార్యక్రమం ఉండదనీ తెలుసుకుని మా పిల్ల సన్నాసి తెగ సంబరపడిపోయింది. చా లొత్తా లొత్తాలా దావాత్తిత్తా లిత్తాలా?... అని సరాదగా కంఠం విప్పి ఇల్లెగిరిపోయేలా పాడడం మొదలుపెట్టింది. *
Add new comment