సంజీవని

నీళ్లే ప్రాణం.. నిర్లక్ష్యం హానికరం ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:రోజూ ఎక్కువగా నీళ్లు త్రాగటం మంచిదేనా? మనం త్రాగుతున్న నీళ్ళు సురక్షితమేనా?
-శ్యాంప్రసాద్, నెల్లూరు
శరీరానికి నాణ్యమైన ఆర్ద్రని లేదా ద్రవత్వాన్ని అందించటానికి మనం చేయాల్సింది చాలా వుంది. మనం జీవించటానికి ఆహారం ఎంత అవసరమో నీరూ అంతే అవసరం. శరీరంలో ఆమ్లత్వం, క్షారత్వం రెండూ సమాన స్థాయిలో ఉంటేనే శరీరానికి నాణ్యమైన నీరు అందినట్టు! ద్రవ పదార్థాలు ఏవి వాడినా నీటిని వాడటంతో సమానమే!
ఆఖరికి పప్పులోనూ, పచ్చళ్ళలోనూ, పులుసుల్లోనూ ఉండే ద్రవం కూడా శరీరంలో నీరుగానే పరిణమిస్తుంది. ద్రవం ఎక్కువగా కలిగిన ఆహారం తీసుకుంటే నీరు తీసుకున్నట్టే!
మన తెలుగు ప్రజలు ఆదినుండీ మజ్జిగకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడంటే ఇంటికొచ్చిన అతిథికి అరకప్పు కాఫీ లేదా టీ ఇచ్చి మర్యాదలు చేస్తున్నాంగానీ, 50, 60 ఏళ్ళ క్రితంవరకూ ఎండనపడి అలిసివచ్చిన అతిథికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేయటమే తెలుగువారి అలవాటు. దాహం తీరడానికి నీళ్ళు త్రాగటం అంటే తెలుగువాడికి నామోషీయే! ఆ రోజుల్లో. కమ్మని చల్ల (మజ్జిగ) త్రాగేవారు. చలివేంద్రాల్లో కుండెడు నీళ్ళు పెట్టి ఎంపీ అయిపోవాలని ఇపుడు చూస్తున్నారు. కాని చలివేంద్రాలంటే చల్ల ఇచ్చే కేంద్రాలే ఆ రోజుల్లో. గ్రామీణ సంస్కృతి బతికున్న రోజులు కాబట్టి పాడి పంటల సమృద్ధి ఉండేది కాబట్టి, చల్ల త్రాగటం ఒక ఘనత ఆ రోజుల్లో. ఇప్పటికీ మజ్జిగని దాహం అనటం అక్కడక్కడా మనం చూస్తాం.
భూమీద నివశిస్తోన్న సమస్త జీవరాశికీ నీరు అవసరం. రోజు మొత్తంమీద రెండున్నర లీటర్ల నీరు కనీసం తాగాలని వైద్యశాస్త్రం చెప్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సగటు వాడకం. మంచు దేశాల వారికన్నా ఉష్ణమండల ప్రాంతానికి చెందిన మన శరీరంలోంచి చెమట ద్వారా నీరు ఎక్కువగా బయటకు పోతోంది కాబట్టి, శీతల ప్రాంతాలవారికన్నా, మనకు మరో రెండు లీటర్ల వరకూ నీరు ఎక్కువ అవసరం కావచ్చు. ఇరవై నాలుగ్గంటలూ ఏసిల్లో జీవించేవారికి, తారు డబ్బాలు పుచ్చుకుని ఎండలో రోడ్లు వేసే కూలీలకు, ఆరుగాలం శ్రమించే రైతులకు ఒకే సిద్ధాంతం వర్తించదు. ఎంత నీరు మల మూత్రాల ద్వారా, చెమట ద్వారా బయటకు పోతోందో అంత నీటిని మళ్లీ మనం శరీరానికి ఇచ్చి ఆ లోపాన్ని పూడ్చాలి. అలాగని అతిగానూ, ఆబగానూ, నీళ్ళు త్రాగటమే ఒక ఉద్యమంలా చేసే అత్యుత్సాహపరుల ప్రచారం కూడా అపకారం చేస్తుంది. అతిగా నీళ్ళు పోస్తే జీర్ణశక్తి, మూత్రపిండాలు చెడతాయి.
నీరు త్రాగబోయేముందు దాని స్వచ్ఛత గురించి మనం తప్పనిసరిగా ఆలోచించాలి. బజార్లో దొరికే మినరల్ వాటర్ గురించి గుడ్డినమ్మకం కూడా మంచిది కాదు. మన శరీరంలోంచి విసర్జించబడుతున్న నీటిలో మన ఆహార పదార్థాలలోని రసాయనాలు, మనం వాడుతున్న మందుల అవశేషాలు కూడా ఉంటాయి. వీటిలో నశించిపోనివి చాలా ఉంటాయి. నశించకపోవటంవలనే కదా మల మూత్రాల ద్వారా బయటకు పోతున్నాయి..? ఇవి భూమిని చేరి, భూమిలోపలి నీటిలో కలిసి మళ్లీ మనల్ని చేరుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను, మన శరీర వ్యర్థాలను, మనం వాడి వదిలేస్తున్న వ్యర్థాలను నదుల్లోకీ, కాలవల్లోకీ తీసుకెళ్లి కలుపుతోంది ప్రభుత్వమే! నదీ జలాలు, కాలువల ద్వారా అవి తిరిగి మన కడుపులోకి చేరుతున్నాయి.
నదుల్లోనూ, సరస్సుల్లోనూ, బావుల్లోనూ వుండే నీటిలో రసాయన ఔషధాల శాతం 1990కన్నా ఎక్కువగా పెరిగింది. మూర్ఛవ్యాధిలో వాడే ఔషధాలూ, స్టిరాయిడ్లూ, నొప్పుల బిళ్లలూ ఇళ్లలో వాడే దోమల, బొద్దింకల మందులూ, చేతులు శుభ్రం చేసుకునే యాంటీసెప్టిక్ ద్రావకాలు మొదలైన ద్రవ్యాలలో ఉండే కనీసం 38 రసాయనాలు త్రాగునీటిలో కనిపిస్తున్నాయని అక్కడి నిపుణులు చెప్తున్నారు. ఈ రసాయనాలు సూక్ష్మమైన అణువుల్లా వుంటాయి. అందువల వాటిని వాటర్ ప్లాంట్లలో తొలగించడం సాధ్యం కాదని చెప్తున్నారు. మనం త్రాగే ఒక లీటరు నీటిలో ఒక మిల్లీ గ్రాము వరకూ విష రసాయనం ఉంటే, రోజూ మొత్తంమీద మనకు తెలీకుండానే మంచినీటి ద్వారా కనీసం 4-5 మిల్లీగ్రాముల మోతాదులో మన శరీరంలోకి చేరుతున్నాయి. రోజూ ఇంత మోతాదులో అనవసరంగా ఆ మందుల్ని మనం మింగుతున్నట్టే లెక్క కదా!
‘ఆర్వో’ పరికరాల ద్వారా వచ్చే మినరల్ వాటర్ చాలా శుద్ధమైందనీ అనటానికి లేదు. అవి సూక్ష్మరూపాన వుండే ఈ రసాయన వ్యర్థాలను ఎంత తొలగించగలవో నిర్థారణ లేదు. వినియోగదారుడికి చేరుతున్న నీటిలో శుద్ధత ఎంత అనేది పెద్ద ప్రశ్న. క్లోరినేషన్, ఓజోనేషన్, హైడ్రోజెన్ పెరాక్సైడ్ లాంటి రసాయనాలతోనూ, కార్బనుతోనూ, అల్ట్రావొయలెట్ కిరణాలతోనూ నీటిని శుద్ధి చేయడం అనేది కొంతవరకే ఉపయోగపడుతోంది. మనం త్రాగుతున్నది పేరుకి మంచినీరేగానీ అందులో మంచి అనేది నేతి బీరలో నెయ్యి అన్నంత నిజం! మనకోసం మనం ఏదైనా కొత్తగా ఆలోచించటం ప్రారంభించకపోతే జాతి మనుగడ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. పట్టణీకరణాన్ని అభివృద్ధిగా ప్రభుత్వాలు భావిస్తున్నంతకాలం ఈ పరిస్థితి తప్పదు. మంచినీళ్ళు అందకపోవడానికి నేరాన్ని ప్రజల మీదకు నెట్టేసి, ప్రభుత్వాలు తమ బాధ్యతని తప్పించుకోలేవు.
‘‘ఆ ఊరు వెళ్తే అక్కడి నీళ్ళు పడదలేదండీ..’’ అంటుంటారు చాలామంది. నీళ్ళు పడకపోవటానికి, రకరకాల చర్మ వ్యాధులు, జీర్ణకోశవ్యాధులు వగైరా రావటానికి నీటిలో రహస్యంగా కలిసిన రసాయనాలు కారణం కావచ్చు. పళ్ల రసాలు, గేదె నుండి నేరుగా పిండిన పాలు, నీరు ఎక్కువగా కలిగిన కూరగాయల రసాలూ ఇలాంటివి పచ్చి మంచినీళ్ళకన్నా చాలావరకూ నయం అయినప్పటికీ, విష రసాయనాల బెడద వాటికీ ఉంది. అందుకని, విషదోషాలను హరించే వాటిని (యాంటీ ఆక్సిడెంట్లు) ద్రవ రూపంలో తీసుకోవటానికి ప్రయత్నించటం మంచిది. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లలో ఈ విషదోషహరాలు సమృద్ధిగా దొరుకుతాయి. గోంగూర, తోటకూర, పొన్నగంటి కూర, కొయ్య తోటకూర, పుదీనా, కొత్తిమీర, మునగాకు, మెంతాకు మొదలైన ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
చిక్కుళ్ళు, రాజ్మా, కిడ్నీబీన్స్, టమాటో, బాదం, అక్రోట్, వేరుశెనగ, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి, యాపిల్, కర్బూజా, కేరట్, ముల్లంగి- ఇలాంటివాటిలో అందుబాటులో వున్నవి జ్యూస్ తీసుకోండి. ఈ జ్యూసును కమ్మగా ఉండేలా చేసుకుని రోజూ తీసుకుంటూ ఉంటే అవి ఈ విషదోషాలను చాలావరకూ ఎదుర్కోగలుగుతాయి. మజ్జిగ మీద తేరుకున్న నీటిని ఎక్కువగా త్రాగండి. ధనియాలుగానీ, జీలకర్రగానీ, వాముగాని, దాల్చిన చెక్కగానీ తగినంత మోతదులో నాలుగైదు గ్లాసుల నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ నీటిని మంచినీటికి బదులుగా త్రాగండి. నిజానికి ఇలా మరగకాచిన వాము వాటర్, దాల్చిన వాటర్, జీరా వాటర్, ధనియా వాటర్ మనకు తెలీకుండానే శరీరంలోని జీవకణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
నెయ్యినీ, నూనెనీ, తేనెనీ, పాలనీ, నీళ్లనీ నమ్మలేని స్థితి దాపురించింది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు