సంజీవని

మీకు మీరే డాక్టర్ (మెనోపాజ్ కష్టాలకు ఆయుర్వేద చికిత్స)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:ఆడవాళ్లకు నడి వయస్సులో ఏర్పడే మెనోపాజ్ లాంటి సమస్యలకు ఆయుర్వేదంలో మంచి చికిత్స వున్నదా?
-సుంకు సుభద్రమ్మ, మదనపల్లె
జ:12-13 ఏళ్ళ తెలిసీ తెలియని వయసు ఆడపిల్లల్లో, ఋతుక్రమం ప్రారంభం అవటం మానసిక శారీరక ఆవేదన కారణం అయినట్టే, నెలసరి ఆగిపోబోయే ముందు కూడా అలాగే ఇబ్బందులను కలిగిస్తుంది. కొందరు ఆడవాళ్లు అదృష్టవంతులు. గుట్టు చప్పుడు కాకుండానే నెలసరులు ఆగిపోతాయి. చాలామందిలో అవి ఆగేముందు అనేక సమస్యలు తలెత్తుతుంటాయి.
ఆయుర్వేద వైద్య విధానం హార్మోన్ల కోణంలో కాకుండా వయో ధర్మాన్ననుసరించి దెబ్బతినే ధాతు సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఋతు బంధానికి చికిత్స సూచించింది. నిజానికి మెనోపాజ్ అనేది ఒక వ్యాధి కాదు. అది వయో ధర్మమే! ఋతుక్రమం వచ్చే జంతు జాలాలన్నింటికీ ఏర్పడే పరిస్థితే. కానీ, మనుషుల్లోనే అది ఇబ్బందుల్ని సృష్టిస్తుంటుంది. ఆ సమయంలో వచ్చే బాధలన్నింటికీ ఈస్ట్రోజెన్ లోపమే కారణం అనటానిక్కూడా వీల్లేదు. దేశంలో 80 శాతం మంది మహిళల్లో మెనోపాజ్ బాధలకు హార్మోన్ల చికిత్స అవసరం కాకపోవచ్చు. కానీ, అవసరం అయినపుడు వాటిని వాడక తప్పదు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పుడు హార్మోన్లంటే అపోహ పడనవసరం లేదు.
సాధారణంగా 40-50 ఏళ్ళ మధ్య ఎప్పుడైనా ఋతుక్రమం ఆగిపోవచ్చు. కొందరిలో 55 ఏళ్ళక్కూడా మెనోపాజ్ రావచ్చు. ఆ వయసులో ఉద్యోగం చేసే స్ర్తిలకు ప్రమోషన్లు వగైరా అదనపు బాధ్యతలు తోడై, పని వత్తిడి, మానసిక వత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, వియ్యాలవారూ- అనేక కొత్త సమస్యలతో చుట్టుముడుతుంటారు. అంతకు మునుపటి ఓపిక, సహనం తగ్గిపోతుంటాయి. భర్త రిటైర్‌మెంట్, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. వీటన్నింటి ప్రభావంవలన అనేక మానసిక లక్షణాలు కలగవచ్చు. మెనోపాజ్ కూడా వాటికి తోడౌతుంది. ధాతువుల సమతుల్యత దెబ్బతినటానికి ఇవి అన్నీ కారణాలే! చాలామందిలో ఋతుక్రమం ఆగిన తరువాత కూడా శారీరక మానసిక బాధలు అధికంగా వుంటాయి.
ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన రసాయన చికిత్సలు మెనోపాజ్‌మీద బాగా ఉపయోగపడతాయి. గుండె దడ, నిద్రపట్టకపోవడం, ఎముకలు బలహీనం కావటం, మానసిక లక్షణాలు. ఇవి తీవ్రంగా ఉన్నప్పుడు ఆయుర్వేద ఔషధాలు మంచి ఫలితాలిస్తాయి. గర్భాశయాన్ని బలసంపన్నం చేసే గర్భాశయ పోషక లేదా ఉత్తేజక ఔషధాలు అనేక ఉన్నాయి.
పుష్యానుగ చూర్ణం, లక్షాది చూర్ణం, అశోకారిష్ట, లోధ్రాసవం, చందనాసవం, లోహసవం, బలారిష్ట, భృంగరాజాసవం, అశ్వగంధారిష్ట, శంఖభస్మ లాంటి ఔషధాలతో పాటు శక్తివంతంగా పనిచేసే కొన్ని రసౌషధాలు కూడా ఉన్నాయి. శరీర తత్వాన్ని బట్టి, బాధల్ని బట్టి వైద్యులు తగిన ఔషధాలని నిర్ణయిస్తారు. మా పరిశీలనలో ప్రదరాంతకలోహం, బాలసూర్యోదయం అనే ఔషధాలు మంచి ఫలితాలిస్తున్నట్టు గమనించాము.
సంతోషకరంగా మెనోపాజ్ రావాలని మహిళలంతా కోరుకుంటారు. అందుకు తగిన ముందస్తు చర్యలు కూడా తప్పనిసరి అవుతాయి. మానసికంగా ప్రశాంతతను కల్పించుకోవటం, పని ఒత్తిడిని తగ్గించుకోవటం, నొవ్వక నొప్పించక అన్నట్టు తలలో నాలుకలాగా వ్యవహరించటం మెనోపాజ్‌ని సుఖవంతం చేస్తుంది. యాభై ఏళ్ళొచ్చాక చింతపండు, అల్లం వెల్లుల్లి లాంటి వేడి చేసే వాటిని తగ్గించి తింటూ ఉంటే మెనోపాజ్ బాధలు తలెత్తకుండా ఉంటాయి.
లేత బూడిద గుమ్మడికాయతో కూర, పప్పు, పులుసు, పెరుగు పచ్చడి లాంటి వంటకాలు తరచూ తింటూంటే మెనోపాజ్‌లో మేలు చేస్తుంది. ఒక క్యారెట్ లేదా బీట్‌రూట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ మూడింటినీ జ్యూస్ తీసుకుని రోజూ ప్రొద్దునే్న తప్పకుండా తాగండి. మెనోపాజ్ బాధలు నెమ్మదిస్తాయి. జాజికాయ, జాపత్రి సమానంగా తీసుకుని మెత్తగా దంచిన పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి భద్రపరచుకోండి. రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు వేడి వేడి పాలలో ఈ పొడిని పావు చెంచా మోతాదులో కలుపుకుని తాగుతుంటే దడ తగ్గుతుంది. నిద్రపడుతుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు