సంజీవని

కాఫీ కాలకూటమే! (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: కాఫీ ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు. నిజమేనా? ఎంత త్రాగవచ్చు?
-నళినీ మనోహర్, జగిత్యాల
జ: తెలుగువారిది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ప్రొద్దునపూట మజ్జిగ (చల్ల) అన్నం, మధ్యాహ్నం ఘనాహారం, రాత్రికి స్వల్పాహారం తరతరాలుగా మన ఆహారపు అలవాటు. స్వల్పాహారం వేరు, అల్పాహారం వేరు. స్వల్పాహారం అంటే తేలికగా అరిగే పదార్థాలతో ఆకలి తీర్చుకోవటం. అల్పాహారం అంటే ఇడ్లీ, పూరీ, ఉప్మా, బజ్జీ, పునుగు లాంటి వాటితో కలిపి కాఫీ టీలు త్రాగి ఆకలిని చంపుకోవటం. ఆకలి తీర్చటం మంచిదా? చంపటం మంచిదా?
ఆకలి వేస్తే కాఫీగాని, టీ గానీ త్రాగటం అనేది ఆకలిని చంపే అలవాటే! ఆకలి లేదండీ, ఏది తిన్నా అరగట్లేదండీ, పైత్యం ఎక్కువయ్యిందండీ అని బాధపడుతుంటారు.
కాఫీవలన కలిగే దోషాలకు పాలు, పంచదార విరుగుడుగా ఉంటాయని భావించటం వలన ‘పాల కాఫీ’, ‘పాల టీ’లు మనకు అలవాటయ్యాయి. కాఫీ, టీలను పాలు, పంచదార కలిపి తాగే అలవాటు భారతీయులకే ఎక్కువ! తక్కిన ప్రపంచం అంతా కాఫీ పొడి లేదా టీ పొడిని కషాయం కాచుకుని మాత్రమే తాగుతున్నారు. చాలామంది పంచదార కూడా వేసుకోకుండా తాగుతారు. అలా త్రాగితే, కాఫీ, టీలు మంచివే అవుతాయా?
ఆ మధ్య ఒక వైద్య నివేదిక ఇలా ప్రకటించింది: ‘‘కాఫీ తాగితే ఎవరూ చచ్చిపోరు. చావుకు కారణం ఎవరి విషయంలోనూ కాఫీ కానే కాదు. కాఫీ త్రాగేవారందరికీ హార్ట్‌ఎటాక్ రాకపోవచ్చు. తాగని ఒకడు హార్ట్ ఎటాక్‌తో చనిపోవచ్చు. చావుకీ, కాఫీకి సంబంధం లేదు. కాబట్టి, కాఫీ తాగితే హార్ట్‌ఎటాక్ రాదు. వచ్చినా చచ్చిపోయే పరిస్థితి రాదు..’’ అని! ఇలాంటి వాక్యాల్ని ఎవరైనా సూత్రీకరిస్తే అది కాఫీ కంపెనీలకు మేలు చేసేందుకు తయారుచేసిన నివేదిక అవుతుంది.
కేన్సరు వ్యాధి వచ్చి మరణించిన వ్యక్తుల్లో చాలామంది కాఫీ తాగనివారున్నారు. కాబట్టి, చావుకి కేన్సరుకీ ఏమీ సంబంధం లేదని సూత్రీకరించిన నివేదికలు కూడా వున్నాయి. మానసిక వ్యాధులకు, పార్కిన్‌సోనిజం లాంటి వ్యాధులకూ కాఫీవలన మేలు జరుగుతుందని చెప్పిన నివేదికలూ ఉన్నాయి. విషదోషాల విరుగుడు ద్రవ్యాలు (యాంటీ ఆక్సిడెంట్లు) కాఫీలో ఎక్కువగా ఉంటాయని కూడా కొందరు పేర్కొన్నారు. కాఫీ తాగితే ప్రోస్టేట్ కేన్సరు రాదనీ, షుగరు వ్యాధి అదుపులో ఉంటుందని అనేవాళ్ళూ ఉన్నారు. మెదడులో నిక్షిప్తమై ఉన్న మనసును అక్కడ స్రవించే కొన్ని రసాయనాలు రూపొందిస్తాయి. వాటిలో కలిగే తేడాలవలన మనోవేదనలు కలుగుతాయి. కాఫీ దీన్ని నివారిస్తుందన్నవారు ఉన్నారు. కాఫీని అతిగా తాగితేనే చేటు కలుగుతుందని, మితంగా ఉంటే మేలు చేస్తుందని కాఫీవాదుల వాదన! రోజు మొత్తంమీద ఒక చెంచా నుండి రెండు చెంచాల కాఫీ పొడివరకూ తీసుకొనేవారికి పెద్దగా అపకారం జరగకపోవచ్చని వీరి వాదన.
కాఫీలో కహ్వీయోల్, కెఫెస్టోల్ అనే నూనె పదార్థాలు గుండె జబ్బులు, ఎసిడిటీలకు కారణం అవుతాయి. కాఫీని తట్టుకోగలిగే శక్తి వయోవృద్ధుల పేగులకు ఉండదు. కాబట్టి వృద్ధులు, జీర్ణకోశ వ్యాధుల్తో బాధపడేవారూ కాఫీ బారినుండి బయటపడటమే మంచిదని, కాఫీలోంచి కెఫీనుని తీసేసినా కూడా పేగుల్లో యాసిడ్ పెరుగుతుందనీ, కాబట్టి కాఫీ సుగుణాలు గానీ, దుర్గుణాలు గానీ కేవలం కెఫీన్ చుట్టూ తిప్పితే ఉపయోగం లేదని మరికొన్ని నివేదికలు చెప్తున్నాయి.
కాఫీ తాగితే ఉత్తేజమయ్యే కొన్ని ఎంజైములు లివరులో ఉంటాయి. వాటి పనితీరుని బట్టి కాఫీ కలిగించే ఉత్తేజం ఆధారపడి వుంటుంది. కాఫీ అతిగా తాగేవారికి ఇనుము వొంటబట్టదని, అందువలన కాఫీ ప్రియుల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని ఒక నివేదిక చెప్తోంది. లివరు మీద కాఫీ చెడు ప్రభావం కలిగించడమే ఇందుకు కారణం. కాబట్టి లివరు కేన్సరుకు కాఫీ కొంతవరకూ కారణం అయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. నిద్రపట్టకపోవడం, గుండెల్లో దడగా ఉండటం, గొంతులోకి పుల్లని నీళ్ళని ఎగజిమ్మే ‘రిప్లెక్స్ ఈసోఫాగైటిస్’ లాంటి బాధలున్నవారికి కాఫీ అతిగా తాగితే ఆ బాధలు పెరుగుతాయి.
అయితే పాలు కలిపిన కాఫీ తాగితే ఈ చెడు లక్షణాలు కొంత తగ్గుతాయని రోజుకి అనేక కప్పులు తాగేప్పుడు, కాఫీవలన కాకుండా, అందులో కలిపిన పాలవలన ఎక్కువ కొవ్వు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా వుంది! కాబట్టి, పాలు కలిపిన కాఫీని అతి తక్కువ మోతాదులో, అతి తక్కువసార్లు తాగటంవలన మేలు సంగతి ఎలా వున్నా కీడు మాత్రం తక్కువ జరుగుతుందనేది వాస్తవం. ప్రొద్దునే్న కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందనీ, విరేచనం కాదనీ అనే ఎక్కువమందికి వాళ్ళు మనసులో అలాంటి భ్రమలు పెట్టుకోవడమే కారణం. ‘‘ఇవ్వాళ ఇంకా కాఫీ తాగలేదు కాబట్టి ఈపాటికి నాకు తలనొప్పి రావాల’’నే భావన నొప్పి భావనని ప్రేరేపిస్తుంది. కాఫీ తాగకపోయినా తలనొప్పి రాదనే ఆత్మవిశ్వాసం దాన్ని నివారించగలుగుతుంది. ముఖ్యంగా మైగ్రైన్ తలనొప్పి మనసుకు సంబంధించిన వ్యాధి. కాబట్టి, కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందనేది నొప్పిని తెచ్చిపెట్టుకునే ఒక ఆలోచన మాత్రమే!
కాఫీలో విరేచనం అయ్యేలా చేసే గుణం ఏమీ లేదు. మలబద్ధత అనేది శరీర తత్వం వలన కొంత, ఆహార విహారాలవలన కొంత, రోజూ టాయిలెట్‌కు వెళ్ళే అలవాటు లేకపోవటంవలన కొంత.. ఇవన్నీ మలబద్ధతకు కారణాలు. కాఫీ అమృతం ఎంతమాత్రమూ కాదు. అలాగని అంటరాని విషమూ కాదు. సామాజిక జీవన వ్యవస్థలో కాఫీ ఒక భాగం. కాఫీ బారినుండి బయటపడాలంటే సంకల్ప బలం కావాలి. కాఫీ తాగే అలవాటు లేని కారణంగా ఫలానా జబ్బు వస్తుందనేది వైద్య శాస్త్రంలో ఎక్కడా లేదు. కాఫీ తాగితే ఫలానా జబ్బు తగ్గిపోతుందని, తిరిగి రాకుండా ఉంటుందని కూడా ఎక్కడా లేదు.
13-14 శతాబ్దాలలో ఇథియోపియాలో పెరిగే కాఫీ మొక్కల్ని ఉత్తేజకారకమైన ద్రవ్యంగా అరబ్బు ప్రపంచం తొలిసారిగా గుర్తించింది. ఇథియోపియోలో ఒక సూఫీ యోగి ఈ కాఫీ చెట్లమీద చేరిన పక్షులు కాఫీ గింజలను తిని అనూహ్యమైన ఉత్తేజాన్ని పొందటం గమనించాడు. ఈ సూఫీ మత గురువులు రాత్రి తెల్లవారులూ ధ్యానంలో ఉండటానికి తగిన ఉత్తేజాన్ని కాఫీ కలిగిస్తున్నట్లు కనుగొన్నారు. వేయించి నీళ్ళలో వేసి కాచిన కాఫీ కషాయం సువాసనతో కూడిన ఉత్తేజాన్ని కల్గిస్తుందని తెలుసుకున్నారు. కాఫీ గింజల ప్రభావం అలా లోకానికి వెల్లడయ్యింది.
డచ్చివాళ్ళు భారతదేశంలో ప్రవేశించాక, అనుకూలమైన చోట్ల కాఫీ తోటలు మనవాళ్ళ చేత వేయించారు. కర్ణాటకలోని చిక్‌మగుళూరులో డచ్చివారి కాఫీ గింజలు మొదట మొలకెత్తాయి. కన్నడ, కొడగు ప్రాంతాలలో విస్తారంగా కాఫీ తోటలు పెంచారు. శ్రీలంకను (ఆనాటి సిలోను) జయించి అక్కడ కాఫీ పెంపకం ప్రారంభించారు.
చిక్కటి కాఫీ కషాయాన్ని తీసుకొని వడగట్టి, ఆ కషాయంలో నీరంతా మరిగిపోయేలా మళ్లీ కాచినట్లయితే చివరికి మెత్తటి గుజ్జులాంటిది మిగులుతుంది. దీన్ని ‘కాఫి ఘనసారం’ అంటారు. ఈ గుజ్జుని ఎండిస్తే వచ్చే మెత్తని పొడిని ‘ఇన్‌స్టెంట్ కాఫీ’ అంటారు. బ్రూ, నెస్కఫె, సన్‌రైజ్ బ్రాండ్ల పేరుతో ఇది మనకు బాగా దొరుకుతుంది. నీళ్ళలో వేయగానే కరిగిపోతుంది. కాఫీకన్నా ఎక్కువ శక్తిమంతంగా వుంటుంది. కాఫీ సారం అంతా ఇందులో ఉంటుంది కదా! మామూలు కాఫీలో ఉండే కెఫీన్ ఒక మనసును ఉత్తేజపరిచే సైకోయాక్టివ్ రసాయనం. అది ఇన్‌స్టెంట్ కాఫీలో మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో చాలామందికి కాఫీ ఒక ఉదయరాగం! అది అతిగా జరిగినప్పుడు హృదయం గాయం అవుతుంది. కాఫీ నూరు శాతం మాదకద్రవ్యం. వెర్రిగా త్రాగటం మానుకోకపోతే కాలకూటమే!

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com