సంజీవని

మెడనొప్పి నివారణ (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: బ్యాంకులో పనిచేస్తున్నాను, మెడనొప్పి విపరీతంగా ఉంటోంది. నివారణ చెప్పగలరు?
-వై.లక్ష్మీదామోదరం, నెల్లూరు
జ: వెన్నుపాము లేకపోతే శరీరం లేదు. శరీరానికి నిజమైన వెన్నుదన్ను వెన్నుపామే! వెన్నుపాము ఒంటిస్తంభం మేడలాంటిది. వెన్నుపాము అనే ఈ స్తంభానికి రెండు కాళ్ళు, రెండు చేతులూ ఒక తల వ్రేలాడుతున్నాయి. కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా శరీరం ఉంటుంది. కాబట్టి శరీరం అంతా వెన్నుపాముతోనే ముడిపడి ఏర్పడింది.
వెన్నుపాము అనే ఈ స్తంభం ఒంటిరాతితో కట్టింది. రాయికీ రాయికీ మధ్య సిమెంటు ఉన్నట్టే, వెన్నుపూసల మధ్య మెత్తని ఎముక పదార్థం ఉంటుంది. దాన్ని డిస్క్ అంటారు. ఈ డిస్కులమీద వెన్నుపూసలు ఆడుతూ ఉంటాయి. శరీరం కదలికలకు అనుగుణంగా వెన్నుపూసలు కదుల్తాయి. మెదడునుంచి బయలుదేరిన నరాలన్నీ రెండు పాయల జడలాగా అల్లుకొని ఈ వెన్నుపూసల రంధ్రాల గుండా డిస్కుల ద్వారా శరీరం మొత్తానికి వ్యాపిస్తాయి.
ఒక్కోసారి ఈ డిస్కులు అణిగిపోవటం, పక్కకి జరిగిపోవటం లాంటి సమస్యలు ఏర్పడి, పై వెన్నుపూస, కింది వెన్నుపూస మీదకు వాలిపోవచ్చు. దీనివలన వెన్నుపాములోపల కండరాలు, నరాలు కూడా గాయపడతాయి. గాయపడిన వెన్నుపూసల మధ్యన నరం (నెర్వ్)నలిగి, ఆ నరం ఎంతమేర వెడుతుందో అంతమేరా నొప్పి పుడుతుంది. అది మెడ వెన్నుపూసల్లో జరిగితే మెడనొప్పి, నడుము వెన్నుపూసలమధ్య జరిగితే నడుమునొప్పి కలుగుతాయి.
మెడభాగంలోని వెన్నుపూసలమధ్య జరిగినప్పుడు, మెడనొప్పి, పోటు, తిమ్మిరి, మెడ కండరాలు బలహీనపడటం కలుగుతాయి. దీన్ని సర్వికల్ స్పాండైలోసిస్ అంటారు. సర్వికల్ అంటే, మెడ భాగం. స్పాండైలోసిస్ అంటే వెన్నుపూసల మధ్య ఎడం తగ్గిపోయి, వెన్నుపూసలు ఒకదానికొకటి గుద్దుకున్నట్టు అవటం.
శరీరంలో ఎక్కువ వత్తిడి పడే వెన్నుపూసల్లో స్పాండైలోసిస్ త్వరగా ఏర్పడుతుంది. దీన్ని ‘పదే పదే కలిగే వత్తిడి గాయం’ అంటారు. కంప్యూటర్ల ముందు కదలకుండా కూర్చొనేవారికి, బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేసేవారికీ మెడనొప్పి కలగవచ్చు. ఎక్కువసేపు కూరలు తరగటం లాంటి పనులు కూడా స్పాండైలోసిస్‌కు కారణం కావచ్చు. మేడమీంచి కిందపడటం లాంటి పెద్ద సంఘటనలు ఈ వ్యాధి రావటానికి కారణం కావాలని లేదు. నేలమీద పడిన పెన్నునో కాయితాన్నో వంగి అందుకొంటే చాలు, నడుములోనో, మెడలోనో స్పాండైలోసిస్ రావటానికి!
మెడ కండరాలు స్తంభించి అటూ ఇటూ మెడను తిరగనీయకపోవటం, భుజాల్లోకి, చేతుల్లోకి ప్రవహిస్తున్నట్టు (రేడియేటింగ్ పెయిన్) నొప్పి, తిమ్మిరి, సూదులతో గుచ్చుతున్నట్టనిపించటం, స్పర్శ తెలియకపోవటం, చేతులు కదల్చలేకపోవటం, గుండెనొప్పి కావచ్చుననే భయం కలగటం లాంటి లక్షణాలు ఈ మెడనొప్పి వ్యాధిలో కన్పిస్తాయి.
నొప్పి తగ్గటానికి వాడే మందులు ఆ డిస్కుని యధాపరిస్థితికి తేవటానికో, కిందికి వాలిపోయిన వెన్నుపూసను పైకి జరిపి దాని స్థానంలో కూర్చోబెట్టడానికో ఉద్దేశించినవి కావు. కడుపులోకి వేసే మందులతోనే ఈ రిపేరంతా జరుగుతుందనేది అపోహ. మరి చికిత్స పరమార్థం ఏమిటి?
మెడనొప్పి తీవ్రంగా ఒకసారి, తక్కువగా ఒకసారి, పెద్దగా లేదని ఇంకోసారి ఇలా వివిధ స్థాయిల్లో వస్తున్నపుడు, నొప్పి లేని సమయంలో మెడ లోపల డ్యామేజీ లేదని అర్థం కాదు. అక్కడ డ్యామేజీ అక్కడే ఉన్నా నొప్పిలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయంటే, నొప్పిని ప్రేరేపించే ఇతర కారణాలేవో ఉంటున్నాయని మొదట మనం గమనించాలి. అలాంటి ఇతర కారణాలను ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ (నొప్పి పెంపులు) అంటారు.
ఈ నొప్పి పెంపులన్నీ మన ఆహార విహారాల్లోనే ఉన్నాయి. ఇవి శరీరంలో వాతాన్ని వికటింపజేస్తాయి. వికటించిన వాతదోషం ఎముకలు- కండరాల వ్యవస్థను, నాడీ వ్యవస్థను అనేక ఇబ్బందులకు గురిచేసి నొప్పుల్ని తెచ్చిపెడుతుంది. వాత వికారాలను కలిగించే వాటిలో ముఖ్యమైనది అజీర్తి. కఠినంగా ఆహార పదార్థాలను అరిగించగల స్థాయిలో జీర్ణశక్తి లేనప్పుడు కడుపులో సక్రమంగా జీర్ణంకాని ఆహారం వాతవికారాన్ని కలిగిస్తుంది. వాతం అదుపులో ఉంటే, నొప్పి కూడా అదుపులో ఉంటుంది. అందుకని, అజీర్తి నివారించుకుని, వాత దోషాన్ని ఉపశమింపజేయటం, ఎముకలను బలసంపన్నం చేయటం, ఎముకలలో ఏర్పడిన వాపును తగ్గించటం, కండరాలు సాగి స్వేచ్ఛగా కీళ్లు కదిలేలా చూడటం, వీటితోపాటు నొప్పిని ప్రేరేపించే ఆహార విహారాలు, మానసిక ఒత్తిడి వీటిని అదుపులో పెట్టడం ఆయుర్వేద చికిత్సలో ముఖ్యాంశాలు.
ఆందోళన, చింత, శోకం, భయం, దుఃఖం ఇవన్నీ నొప్పిని పెంచి పోషించే అంశాలే! వాతవ్యాధులు ఏవి వచ్చినా మొదటగా మనసను సంతోషంగా ఉంచుకోవాలి. రోగి తన జీవన విధానంతోపాటు ఆలోచనా విధానం కూడా మార్చుకోవలసి వుంటుంది. ఇది జరగకుండా డాక్టర్‌ను, మందులను మారుస్తూ ఉంటే ఉపయోగం ఉండదు.
మెడకు తగిన మృదువైన వ్యాయామం ఇవ్వండి. పులుపు మానండి. అల్లం వెల్లుల్లి మషాలాల వాడకాన్ని బాగా తగ్గించండి. అదేపనిగా కదలకుండా కూర్చోకుండా గంటకోసారి లేచి మెడని కదిలిస్తూ ఉండండి.
మలబద్ధతను సరిచేసుకోండి. కర్పూర తైలం లాంటివి మెడకు పట్టించి ఉప్పు కాపు పెట్టుకుంటే మెడ కండరాలు సడలి నొప్పి ఉపశమిస్తుంది. అర్థరాత్రి దాకా టీవీలకు అంటుకొని కూర్చోవటం మానాలి. అతిగా ప్రయాణాలు, మెడమీద వత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.
మడత మంచం, నులకమంచం, పడక కుర్చీల మీద కాకుండా బల్లపక్క మీద మెత్తటి పరుపు వేసుకుని దిండు లేకుండా పడుకోండి. క్రమం తప్పకుండా మెడను కదిల్చే వ్యాయామాలు చేయండి.
అన్నింటికన్నా ముఖ్యం మెడనొప్పిని తేలికగా తీసుకోండి. అదే తేలిక పడుతుంది. ఇది రెస్టు ఇస్తే తగ్గే వ్యాధి కాదు. కదలకుండా కూర్చోవటం వలన కూడా నొప్పి పెరుగుతుంది. తీవ్రమైన నొప్పి తగ్గాక, మృదువ్యాయామాలతో తగ్గించుకోవటం ఉత్తమం.
పసుపుని ఆహారంలో ఎక్కువగా వాడుకుంటే వెన్నుపూసలమీద ఒత్తిడి తగ్గుతుంది. పసుపుతో కూడుకున్న ఒక ఆహార ద్రవ్యం ఫార్ములా క్షేమ కుతూహలం అనే గ్రంథంలో ఉంది. ఒక చెంచా ఇంగువ, 2 చెంచాల అల్లం ముద్ద, 4 చెంచాల మిరియాలపొడి, 8 చెంచాల జీలకఱ్ఱ, 16 చెంచాలు కొట్టిన పసుపు, 32 చెంచాలు ధనియాల పొడి ఈ మోతాదులతో కలిసి తగినంత ఉప్పు చేర్చుకుంటే ఆ పొడిని వేసవారం అంటారు. మెడనొప్పి, నడుమునొప్పి, మోకాళ్లనొప్పులు, ఇతర వాత వ్యాధుల్లో ఈ వేసవారం పొడి ఔషధంలా పనిచేస్తుంది. ఈ వేసవారం పొడిని కూరల్లో కూరకారంగా, చారుల్లో చారుపొడిగా, సాంబారులో సాంబారుపొడిగా ఉపయోగపడుతుంది. రుచికరం, ఆరోగ్యకరం. అన్ని వాతవ్యాధుల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఆహారంలో విషదోషాలను తగ్గించి జీర్ణశక్తిని సరిచేస్తుంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com