సంజీవని

హృద్రోగాల్లో ఆహార జాగ్రత్తలు (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: గుండె జబ్బు వచ్చినపుడు ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా?
-కాత్యాయనీ రామం, కొత్తగూడెం
జ: గుండె జబ్బులు వచ్చాక ఆహార జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టటం అనేది చేతులు కాలాక ఆకులు పట్టడం లాంటిది. గుండె జబ్బులు మధ్యతరగతిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి జీవన విధానం, ఆలోచనా విధానాలే గుండె జబ్బులకు కొంత కారణం అవుతున్నాయి.
ధనికవర్గానికి ఇన్సూరెన్సులు, పెద్ద ఉద్యోగులకు రీఎంబర్సుమెంటులు, అల్పాదాయ వర్గాలకు ఆరోగ్యశ్రీలు ఉన్నాయి. మధ్యతరగతివారికి ఏవీ లేవు. వాళ్ళ గురించి ఎవరికీ ఆలోచన కూడా లేదు. వైద్యం మధ్యతరగతికి అందని ద్రాక్ష అవుతోంది. కాబట్టి, ఈ మధ్య తరగతి తమ ఆరోగ్య భద్రత గురించి తామే ఆలోచించుకోవాలి.. మన ప్రభుత్వాల దృష్టిలో మధ్యతరగతికి గౌరవప్రద పౌరసత్వం లేదు. వారి గురించి ఎలాంటి సంక్షేమ పథకాలూ ప్రభుత్వం దగ్గర లేవు.
మధ్యతరగతి ఆలోచనా విధానం కూడా ఉన్నత వర్గాలను అనుకరించే పద్ధతిలో సాగుతోంది. అందువలన కలిగే సమస్యలను డబ్బుతో ధనికులు ఎదుర్కోగలరు. కానీ, తాహతు లేకపోవటాన మధ్యతరగతి ప్రజలు వ్యాధితో సహజీవనం చేస్తూ కాలం గడిపేయవలసి వస్తుంది. రోగాల నిర్మూలనకు డబ్బు వెదజల్లటం కన్నా, గుండెని పదిలంగా ఉంచే జాగ్రత్తలను అలవాటు చేసుకోగలగటం విజ్ఞత! అన్ని తరగతుల ప్రజలకూ ఇది వర్తించే అంశమే! మధ్యతరగతికి మరీ అవసరం.
గుండె జబ్బులు, బీపీ, షుగరు, జీర్ణకోశ వ్యాధులు, కీళ్ళనొప్పులు, ఎలర్జీ వ్యాధులు ఇవన్నీ ఆహార విహారాలతో ముడిపడి పెరిగే వ్యాధులు. ఆహారం గురించి మాట్లాడకుండా కేవలం మందు చీటీలతో ఈ వ్యాధులను అదుపు చేసుకోగలగటం అసాధ్యం. మామూలు వ్యాధి దీర్ఘవ్యాధిగా మారటానికి ఇలా మందులమీద మాత్రమే ఆధారపడటం కారణం. పచ్చి మిరపబజ్జీల బండిమీద దండయాత్ర చేసే వ్యక్తికి ఏ వైద్యుడైనా కడుపులో మంట తగ్గించగలడా?
ఆహార సూచలు కూడా దేశీయంగా ఉండాలి. మూడు కప్పుల అన్నం తినండీ, ఒక కప్పు కూర తినండీ.. ఇలా కొలతలతో భోజనం చేస్తే తక్కువ తింటామనేది అపోహ మాత్రమే! తినకూడనిది కొంచెమే తిన్నా అపకారమే! అందుకనే, ఎంత తిన్నారన్న దానికన్నా ఏం తిన్నారన్నదానిమీద దృష్టి పెట్టాలి.
విదేశీ తరహా వంటకాలకు, మన వంటకాలకూ చాలా తేడా ఉంది. 100 గ్రాముల వంకాయ కూరలో ఇన్ని కేలరీలు, ఇన్ని పోషకాలు ఉన్నాయని ఒక లెక్క చెప్పటానికి వీల్లేదు. ఒకావిడ వండిన వంకాయ కూరలో చింతపండు పులుసు, ఇంకొకరు వండిన కూరలో అల్లం వెల్లుల్లి మషాలాలు దట్టించి ఉంటాయి. నూనెలో వేసి నరకంలో పాపులను వేయించినట్టు, నల్లగా బొగ్గు ముక్కల్లా మాడ్చి, వంకాయ బొగ్గులు, బెండకాయ బొగ్గులమీద ఉప్పు, కారం చల్లి ‘ఇదే కూర’ అన్నట్టుగా వండిన దానిలో పోషక విలువలు ఎన్ని మిగులున్నాయో, ఎన్ని హానికారకాలు కొత్తగా పుడుతున్నాయో ఆధునిక వైద్యశాస్త్రం బాధ్యతగా ప్రజలకు వివరించవలసి ఉంది. సైన్సు సామాన్యుణ్ణి చేరాలి. స్వచ్ఛ భారతదేశంలో స్వచ్ఛ ఆహారం ఒక ముఖ్య అంశం. స్వచ్ఛత అంటే, విషదోషరహితం అని అర్థం. మన ఆహారంలో అతిగా పెరుగుతున్న విషదోషాల గురించి అవగాహన పెంచుకోవాలి. వాటికి ఎంత దూరంగా ఉండగలిగామన్నదే ప్రశ్న.
పది రూపాయలు పెట్టి బంగాళా దుంపల చిప్స్ కొనుక్కొని తినేకన్నా, ఒక యాపిల్ కాయ కొనుక్కొని తొక్క తీసి తింటే ఎంతో మేలు కదా.. రంగునీళ్ళూ, కొన్ని విష రసాయనాలు కలిసిన కూల్‌డ్రింకులు తాగేకన్నా, పాల ప్యాకెట్టు కొని, తోడుపెట్టి, చిక్కని మజ్జిగ చేసుకొని తాగితే అంతకన్నా ఆరోగ్యకరమైనది ఇంకొకటి వుండదు.
దిష్టికోసం బూడిద గుమ్మడికాయని గుమ్మాలకు వ్రేలాడకట్టడం అనేది శక్తిమంతమైన ఒక ఓషధిని మనం అవమానపరుస్తున్నట్టు! అది గొప్ప ఔషధ విలువలు కలిగిన కూరగాయ. దాన్ని ఆహార ద్రవ్యం అనే సంగతి మరచిపోవటం దాన్ని అవమానించటమే కదా! బూడిద గుమ్మడిని కడిగి, పైన తొక్క తీసి, తురిమి, కొద్దిగా పెరుగు కలిపి తాలింపు పెట్టుకొంటే కమ్మని పెరుగు పచ్చడి తయారౌతుంది. ఇందులో కొద్దిగా అన్నం కలుపుకుని ఉదయానే్న టిఫిన్ల బారినపడి ఆరోగ్యాన్ని చెడగొట్టకోకుండా ఉండొచ్చు. అవును! ఇడ్లీ, అట్టు, పూరీ బొంబాయి రవ్వ ఉప్మా, మైసూరుబజ్జీ, పునుగు, వడ ఇలాంటివన్నీ పండగకో పబ్బానికో తినవలసిన సరదా వంటకాలు. వీటిని రోజూ తినటం ఆరోగ్యదాయకమైన అలవాటు కాదు. పెరుగు లేదా చల్లన్నం అన్ని వయసులవారికీ ఉదయం పూట తినదగిన ఆహారం. ఉదయాన్న చల్లన్నం తినటం నామోషీ అనుకోవాల్సిన పనిలేదు. ప్రొద్దునే్న బజ్జీలు, పునుగులూ తిన్నంత మాత్రాన మనం నాగరికులం కాలేము. ఇడ్లీ, గారె, చట్నీ సాంబారులకన్నా చల్లన్నమే మిన్న! తేలికగా అరుగుతుంది.
వరి బియ్యానికి ప్రాధాన్యత తగ్గిస్తే, కేలరీలు అదుపులో ఉంటాయి. 40లు దాటిన స్ర్తి పురుషులు రోజూ తినే వరి అన్నంలో సగం తగ్గించి, బదులుగా ఎక్కువ కూరగాయల్ని, గోధుమ, రాగి, జొన్న, సజ్జ, అరికలు లాంటి తృణధాన్యాలను తినటం శ్రేయస్కరం. గోధుమ, రాగి, జొన్న, సజ్జలను విడివిడిగా పిండి పట్టించి, గోధుమ+రాగి గానీ, గోధుమ+జొన్నగానీ, గోధుమ+సజ్జగానీ కలిపి, రెండు లేక మూడు పుల్కాలు ముందుగా తిని అప్పుడు అన్నం తింటే, సగం బియ్యాన్ని తగ్గించగలిగినట్టే అవుతుంది!
చింతపండుతో కాచుకునే సాంబారు, పులుసు, పచ్చిపులుసు వీటికన్నా కందిపప్పు, పెసరపప్పులతో ‘కట్టు’ కాచుకుంటే, అది పేగులను బలసంపన్నం చేస్తుంది. అజీర్తిని కలిగించదు.
బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, ఇతర ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పొన్నగంటికూర, కొయ్య తోటకూర, గలిజేరు ఆకు, లేత ముల్లంగి దుంపలు, క్యారెట్, బీట్‌రూట్, చాలా పరిమితంగా అల్లం, వెల్లుల్లి.. ఇవి తినదగినవి. వంట గదిలో చింతపండు పెత్తనాన్ని తగ్గించగలిగేవారికి వ్యాధులు దూరంగా ఉంటాయి. అతిగా పులుపు వాడకంవలన సమస్తమైన అనారోగ్యాలకు తలుపులు తెరవటమే అవుతుంది. పులుపు ఎక్కువగా వస్తే, అతిగా ఉప్పూ కారాలు కూడా వేసి వండవలసి వస్తుంది. అందుకని పులుపు మీద వ్యామోహాన్ని వదులుకోవటం అన్ని వయసులవారికీ ఆరోగ్యదాయకమే! గుండె జబ్బులతో బాధపడేవారికి మరీ ఎక్కువ జాగ్రత్త అవసరం.
శరీరానికే కాదు, మెదడుకూ తగినంత వ్యాయామం ఉంటేనే గుండె జబ్బుల్లోంచి త్వరగా బయటపడగలుగుతాం. కొద్దిగా ఆలోచనలు తగ్గించుకోవాలని వైద్యులు చెప్తారు. ఓ 100 గ్రాములు తగ్గించగలుగుతామా? ఆలోచనలను తగ్గించుకోవాలని వైద్యులు చెప్పేది, బుర్రని సోమరిగా ఉంచుకోమని కాదు. మనసును రాపాడి, బాధించే ఆలోచనలను తగ్గించుకోవాలని! అలాంటి ఆలోచనల్లోంచి బయటపడాలంటే, మనసుకు వేరే వ్యాపకం కలిగించుకోవాలి! అది కొత్త సమస్యలకు దారితీయని మంచి వ్యాపకం అయి ఉండాలి. ఎప్పుడూ ఏదో ఒక పనిగా బిజీగా వుండే వ్యక్తులు మానసిక వత్తిడి నుంచి తప్పించుకోగలుగుతారు.
హృద్రోగాలకు క్షుద్రవైద్యాలు ఉండవు. గుండె భద్రంగా ఉండే ఆహార విహారాలు, ఆలోచనలు మాత్రమే శరీరానికి మేలు చేస్తాయి. మందుల మీద మాత్రమే ఆధారపడాలనుకొంటే గుండె జబ్బులకు అరకొర చికిత్స చేస్తున్నట్టే లెక్క!
రక్తంలో పేరిన కొవ్వు రక్తప్రసారానికి లాకులు వేసి, గుండె జబ్బులకు తలుపులు తెరుస్తుంది. కాబట్టి, కొవ్వును తగ్గించే ఉపాయాలను తెలుసుకొని శ్రద్ధగా పాటించడం అవసరం. కొవ్వు లేనివీ, కొవ్వెక్కించేవి మానేయండి! కొవ్వు పెరగకుండా ఉండాలంటే ఉదయాన్న టిఫిన్లు మానేసి మజ్జిగ లేదా పెరుగు అన్నం తినాలి. వేపుడు కూరలు మానాలి. షుగరు వ్యాధి లేకపోయినా ఉన్నంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయలు ఎక్కువ, అన్నం తక్కువగా ఉండేలా కూరలు వండే తీరు మార్చుకోవాలి.
నల్ల మేక మాంసం, పక్షి మాంసాలు గుండెకు బలానే్న కలిగిస్తాయి. కానీ వాటిని అతిగా మషాలలతోనూ, నూనెతోనూ, చింతపండుతోనూ వండి, గుండెకు హాని కలిగించేలా చేసుకుంటున్నాం. మాంసం తినవద్దని డాక్టర్లు చెప్పేది అందుకే! వండే తీరుని మార్పు చేసుకుంటే శాకాహారం మాంసాహారం రెండూ మేలు చేసేవే! అపకారం అనేది చింతపండు, అల్లం వెల్లుల్లి మషాలాలు, నూనె పోసి లేదా నూనెలో వేసి వండటం, ఊరుగాయ పచ్చళ్ళు ఇవి మాత్రమే హానికరమైనవి. వీటికి ప్రాధాన్యత తగ్గిస్తే గుండెమీద వత్తిడి తగ్గుతుంది.
ఈ ఆహార జాగ్రత్తలన్నీ గుండె జబ్బులు రాకముందూ, వచ్చాక కూడ ఉపయోగపడేవే!

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com