సంజీవని

పీర్ ప్రెషర్‌ని తట్టుకోవడమెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీర్ ప్రెషర్ అంటే..
పీర్ గ్రూపులు అంటే సుమారుగా ఒకే వయసు ఉన్న స్నేహ బృందం. ఈ బృంద సభ్యులు ఒకే క్లాసులో కలిసి చదువుకునేవారు కావచ్చు లేక కలిసి ఆడుకునేవారు కావచ్చు. ఒకేచోట కలిసి పనిచేసేవారు కావచ్చు. ఒకేచోట కలిసి నివసించేవారు కావచ్చు.
పీర్ గ్రూప్ సభ్యులకు ఒకే ఆసక్తులు, ఒకే హాబీలు, ఒకే విలువలు ఉండవచ్చు. సాధారణంగా జీవిత సంఘటనల పట్ల ఒకే దృక్పథం ఉంటుంది. ఒకరి సాంగత్యంలో, సాన్నిహిత్యంలో మరొకరు సంతోషంతో, సంతృప్తితో జీవిస్తారు. కౌమార బాలల శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యంమీద పీర్ గ్రూపుల సానుకూల ప్రభావం ఉండొచ్చు లేక ప్రతికూల ప్రభావం ఉండొచ్చు.
**
లైంగిక అవయవాల నిర్మాణం, విధుల గురించి తెలియకపోవడం అనారోగ్యానికి కారణమవుతుంది. చాలామంది కౌమార బాలలు తమ లైంగిక అవయవాల్ని డర్టీ అవయవాలుగా భావించి వాటిని చూసుకోవడానికి కూడా విముఖంగా వుంటారు. లైంగిక అవయవాల చుట్టూ ఉన్న అసంఖ్యాకమైన అపోహల్ని బాల్యంలోనే స్నేహితులనుండో, అశాస్ర్తియమైన కథనాల నుండో తెలుసుకోవడంవలన తిరిగి సవరించుకోలేని హానికి గురవుతారు.
కౌమార బాలలకు లైంగిక అంశాలపట్ల చాలా ఎక్కువ కుతూహలం ఉంటుంది. కాని తగిన పరిజ్ఞానం ఉండదు. సాహసం ఉంటుంది కాని నష్టానికి గురయే ప్రమాదం వెన్నంటే ఉంటుంది. చాలామంది కౌమార బాలలు పీర్ ప్రెషర్ లేక స్నేహబృందపు ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం వలన, లైంగికత చుట్టూ వున్న అపోహలవలన ప్రమాదకర ప్రవర్తనల్ని అలవరచుకుంటారు.
లైంగిక అవయవాల నిర్మాణం, విధుల గురించి, లైంగిక వ్యాధుల గురించి సరైన పరిజ్ఞానం లేకపోవడం, సెక్స్‌పట్ల కుతూహలం, పీర్‌ప్రెషర్‌ని తట్టుకునేందుకు సరైన నైపుణ్యాలు లేకపోవడం లైంగిక వ్యాధులు, హెచ్‌ఐవి, ఎయిడ్స్, కోరని గర్భాల ప్రమాదంలో పడేస్తాయి. అపాయకర గర్భస్రావాల వలన తరువాత పిల్లలు పుట్టకపోవచ్చు. చాలా అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి వుంటాయి.
ఆరోగ్యకరమైన, బాధ్యాతాయుతమైన, సంతోషప్రదమైన, ఆత్మన్యూనతలేని లైంగిక జీవితాన్ని గడపడానికి అవసరమైన విషయాల్ని కౌమార బాలలు తెలుసుకోవాలి.
సంచలనాన్ని కోరే ప్రవర్తన, థ్రిల్, గ్రేట్ ఫన్
కౌమార దశలో హార్మోన్ సంబంధిత శారీరక మార్పులే కాక ప్రేమ, అసూయ, కోపం, భయం మొదలైన భావోద్వేగాలు కూడా చాలా బలంగా ఉంటాయి. కౌమార బాలలు నిరంతరం ప్రయోగాలు చెయ్యాలనుకుంటారు. తమాషాల్ని అనుభవించాలనుకుంటారు. థ్రిల్ కలగడం, గ్రేట్ ఫన్ ఉండడం చాలా ముఖ్యం అని భావిస్తారు. కొద్ది సమయంపాటు థ్రిల్‌ని కలిగించే పనుల్ని పదే పదే చెయ్యడంవలన అది కొంతమందికి అలవాటుగా మారుతుంది.
సిగరెట్ తాగడం, జూదమాడడం, మత్తుమందులు, మద్యం సేవనం, రేష్‌గా వాహనాల్ని నడపడం, ఏక్సిడెంట్స్ చెయ్యడం, ఎవరితో పడితే వారితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం- మొదలైనవి సంచలనాన్ని కోరే ప్రవర్తనలు. ఈ ప్రవర్తనలు కౌమార బాలల ఆరోగ్యానికి, ఎదుగుదలకు, అభివృద్ధికి హానికరం.
ఆధునిక కాలంలో మరికొన్ని ప్రవర్తనలు, పరిమితి లేకుండా తినడం, దుస్తుల్ని, వస్తువుల్ని విచ్చలవిడిగా కొనడం, విపరీతంగా డబ్బుఖర్చుపెట్టడం, లాటరీలు, బెట్‌ల ఊబిలో పడడం, హింసాత్మక చర్యలకు పాల్పడడం, కుటుంబ సభ్యులు సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే ఇంట్లోనుండి పారిపోవడం లేక ఆత్మహత్యా ప్రయత్నాలు చెయ్యడం కూడా హానికర ప్రవర్తనలోకి వస్తాయి. ఈ పనులవలన తమ విలువ, ఆత్మగౌరవం హీనపడతాయనే ఎరికతో వాటిని నివారించడానికి మంచి హాబీలను అలవరచుకోవడానికి సమాజ సేవలో పాలు పంచుకోవడానికి ప్రయత్నించాలి.
పీర్ గ్రూపుల సానుకూల ప్రభావాలు
- క్రమం తప్పకుండా బడికి వెళ్ళి అన్ని కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొనడం
- చదువులో మంచి ఫలితాల్ని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం
- మంచి హాబీలను అభివృద్ధి చేసుకోవడం
- కొన్ని విలువలను, లక్ష్యాలను నిర్మించుకోవడానికి దోహదపడే అభిప్రాయాల్ని, దృక్పథాల్ని అభివృద్ధి చేసుకోవడం. ఉదా- పొగ తాగకూడదు, పరీక్షలో కాపీ చెయ్యకూడదు, కలెక్టర్ అవ్వాలి, పేదవారిని గౌరవించాలి మొదలైనవి.
- తమ జీవితం తాలూకు నిర్ణయాలను తీసుకోవడానికి ఎక్కువ స్వతంత్రం కలిగి ఉండడం
- తాము చేసే పనులకు గ్రూపు ఆమోదం ఉండడం వలన ఆత్మవిశ్వాసం పెరగడం
- స్వతంత్రంగా వ్యవహరిస్తూనే ఒకరి ఆసరా, సహాయం తను తీసుకోవడానికి, తను మరొకరికి ఆసరానివ్వడానికి, సహాయపడటానికి సిద్ధంగా ఉండటం.
పీర్ ప్రెషర్‌ని తట్టుకోవడమెలా?
కౌమార బాలలు పీర్‌ప్రెషర్ గురించి తెలుసుకుని ఉండాలి. దీర్ఘకాలంలో హాని కలిగించే ప్రతికూల ప్రవర్తనల విషయంలో స్నేహితుల ఒత్తిడికి నో, వద్దు, కాదు అని దృఢంగా, స్థిరంగా చెప్పగల నైపుణ్యలను పెంపొందించుకోవాలి.
ఆమోదయోగ్యమైన లేక ఆమోదయోగ్యం కాని ప్రవర్తనల పరిణామాలను గుర్తించి తమకు తాము ఒక వౌలిక విలువల వ్యవస్థను నిర్మించుకోవాలి.
- చాలామంది కౌమార బాలలకు తమ కుటుంబం, సంస్కృతి, విశాల సమాజానికి సంబంధించిన మంచేదో, చెడేదో తెలుసు. సరదా లేక తమాషా కోసం చేసే పని ఏ ప్రమాదానికి దారితీస్తుందో, ఏ హానిని కలగజేస్తుందో వారు గుర్తించడం అవసరం. స్వీయ అవగాహన, విచక్షణతోకూడిన ఆలోచన దృఢంగా ఉండడానికి, స్నేహితుల ఒత్తిడిని నో అని స్థిరంగా చెప్పేందుకు దోహదపడుతుంది. స్నేహ బృందంతో స్నేహాన్ని పోకొట్టుకోకుండానే నో అని చెప్పేందుకు మంచి భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఉండాలి.
స్నేహం అంటే తన స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోడం కాదు అని గుర్తించాలి. కౌమార బాలలు తాత్కాలిక ఆనందాల్ని వాయిదా వెయ్యడం నేర్చుకోవాలి. ప్రమాదకర ప్రవర్తనలకు నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి.

**
ప్రతికూల ప్రభావాలు

బడి ఎగ్గొట్టి స్నేహ బృందంతో కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లడం
డబ్బుని, సమయాన్ని వృధా చెయ్యడం
స్నేహితులతో కలిసి ఇంటినుండి పారిపోవడం, దొంగతనంగా తీసుకువెళ్ళిన డబ్బుతో జల్సా చెయ్యడం.
తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దవారిని ఎదిరించి మాట్లాడడం, లక్ష్యపెట్టకపోవడం, హేళన చెయ్యడం, సమంజసంకాని కోరికల్ని కోరడం, నిందాపూర్వక వ్యాఖ్యలు చెయ్యడం.
అత్యంత ప్రమాదకరమైన ప్రవర్తనల్ని అలవరచుకోవడం.
మత్తుమందులు, మద్యం వ్యసనం
జూదమాడడం, దొంగతనం చెయ్యడం, పిరికిగా, బలహీనంగా కనపడేవారిని మాటలతో చేష్టలతో వేధించడం.
ఈవ్ టీజింగ్, ఎవరితోపడితే వారితో లైంగిక సంబంధాల్ని పెట్టుకోవడం, పబ్లిక్ ఆస్తుల్ని ధ్వంసం చెయ్యడం, మానభంగం, హత్య మొదలైనవి.
ఒక స్థాయిలో స్నేహితులు ఒత్తిడి లేక పీర్ ప్రెషర్ కారణంగా చేసే చెడు పనులు తరువాత అలవాటుగా మారతాయి.
**
సర్దుబాటు సమస్యలు
కౌమార దశలో తల్లిదండ్రులతో, స్నేహితులతో మనస్పర్థలు, క్షణికోద్రేకాలు, కోపంతో అరవడాలు, పోట్లాటలకు దిగడాలు, సంఘర్షణల్ని పరిష్కరించుకోలేకపోవడం వంటి సర్దుబాటు సమస్యలు ఉంటాయి. సెక్స్ గురించి సరైన సమాచారం తెలియకపోవడంవలన కూడా సర్దుబాటు సమస్యలు తలెత్తుతాయి. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల విషయంలో తాము కోరుకునేదానికి, అమలులో ఉన్న సాంప్రదాయాలు, నిషేధాలకు మధ్య ఉన్న సంఘర్షణ కూడా సర్దుబాటు సమస్యలకు కారణం.
తమ సంపదను ప్రదర్శించడం, పొగ తాగడం, మద్యపానం, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, అర్థరాత్రి పార్టీలు, కొన్ని సమాజాల్లో ఆడ, మగ స్వేచ్ఛగా కలిసి తిరగడం, స్నేహ బృందపు ఒత్తిడులు కూడా కొన్ని సంఘర్షణలకు కారణమవుతున్నాయి. ఇలాంటి సంక్షోభాలు వచ్చినపుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆసరానివ్వడం, సరైన మార్గాన్ని చూపడం ద్వారా మానసిక ఆరోగ్య సమస్యల్ని నివారించవచ్చు.

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441