సంజీవని

మాంసాహారం మంచిదేనా? (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: గుండె జబ్బులున్నవారు మాంసాహారం తినవచ్చా? వివరంగా తెలియపరచగలరు?
కావూరు విద్యాధరరావు, జంగారెడ్డిగూడెం
జ: గుండె జబ్బులకూ, నూనెలకూ, కొవ్వు పదార్థాలకు వైరం గురించి చర్చ జరిగినంతగా గుండె జబ్బులమీద మాంసాహార చెడు ప్రభావం గురించి గొప్ప చర్చ జరగలేదు. మాంసం ఎంత మంచిదో అంత అపకారి కూడా! ఉపకారాలనూ అపకారాలనూ తూకం వేసి చూస్తే త్రాసు మొగ్గు అపకారం వైపే ఎక్కువ మొగ్గుతుంది. ఆ ఉపకారాలు ఇతర శాకాహార ద్రవ్యాల ద్వారా పొందగలిగే ఉంటాయి! కాబట్టి కొద్దిపాటి ఉపకారాల కోసం ఎక్కువ అపకారం చేసే మాంసం మీద వ్యామోహాన్ని తగ్గించుకోవటమే ఉత్తమం. గుండెలో తేడాలు కనిపించాయని తేలిన తరువాత మాంసాహారాన్ని త్యజించటం మరీ ఉత్తమం.
ఈ సృష్టిలో వైద్యానికి పనికిరాని ద్రవ్యమే లేదనేది ఆయుర్వేద సిద్ధాంతం. ప్రతీ ద్రవ్యానికి దాని రస గుణ వీర్య విపాక, ప్రభావాలను ఆయుర్వేద శాస్త్రం విపులంగా వివరించింది. ప్రాణంలేని ఖనిజాలకు, లవణాలకు, పాషాణాలకూ ఉన్నట్టే, ప్రాణం ఉన్న మొక్కలకు, జంతువులకూ ఇతర ద్రవ్యాలకూ దేని ప్రభావం దానికుంటుంది.
ఇది మంచిది, ఇది మంచిదికాదంటూ ముద్రలు వేసి ఉప్పు ముట్టుకోరాదు, పులుపు అంటుకోరాదు లాంటి సిద్ధాంతాలను టీవీలలో ఊదరగొట్టడాన్ని ఆయుర్వేదం అంగీకరించదు. మొక్కలకు దేని గుణాలు దానికున్నట్టే జంతువులకూ, జంతు మాంసాలకూ వాటి గుణాలు వాటికున్నాయి. మాంసం చెడ్డది అనే ప్రకటన సరైనది కాదు. ఫలానా మాంసానికి ఫలానా గుణం ఉందని ఆయుర్వేదం విస్పష్టంగా చెప్పింది.
మాంసం కఠినంగా అరిగే ఆహారం. అందరి జీర్ణాశయం ఒకే తీరులో ఉండదు. జఠరాగ్ని బలాన్ననుసరించి ఆహారం అరుగుదల ఆధారపడి ఉంటుంది. పర్వతాలు ఫలహారం చేయగలవారికి ఏది పెట్టినా ఏమీ కాదు. అగ్నిబలం తక్కువగా ఉన్నవారికి, జీర్ణాశయం బలహీనంగా ఉన్నవారికి, మాంసాహారం మాత్రమే కాదు, కఠినంగా అరిగేలా వండిన శాకాహారం కూడా అపకారం చేస్తుంది. ఇది సాధారణ ఆరోగ్య సూత్రం.
భీముడికి విషం పెట్టినా అతను చావలేదు. అతనికి వృకోదరుడనే పేరు కూడా ఉంది. తోడేలు వంటి ఆకలి కలిగినవాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. సృష్టిలో అత్యధిక జీర్ణశక్తి కలిగిన జంతువు తోడేలే! అందుకే దాని నడుము సన్నగా ఉంటుంది. భీముడు కూడా అలాగే తోడేలు వంటి నడుము కలిగినవాడు. గొప్ప జీర్ణశక్తి ఉంటే పొట్ట రాదు. స్థూలకాయం కలగదన్నమాట. అంతటి జీర్ణశక్తి ఇప్పటి మనుషులకు లేదు. రానురానూ జీర్ణశక్తి మరింత సన్నగిల్లుతోంది కూడా! ఈ పరిస్థితిలో మాంసాహారం పట్ల పునరాలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఆవు, ఎద్దు, గాడిద, గుర్రం, గొర్రె లాంటి జంతు మాంసాలలో కార్నిటైన్ అనే పదార్థం ఉంటుంది. అది గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను మూసుకొనిపోయేలా చేస్తుంది. తద్వారా గుండె దెబ్బతింటుందని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. మాంసం ద్వారా పేగుల్లోకి చేరిన కార్నిటైన్ అక్కడ ఉండే బాక్టీరియా ప్రభావంవలన ‘ట్రై మిథలమైన్ యన్‌ఆక్సయిడ్’(టిఎమ్‌ఎఓ)గా మారుతుంది. మాంసం, గ్రుడ్లు, పాల పదార్థాలలో ఈ కార్నిటైన్ మోతాదు ఎక్కువగా ఉంటుందని అది ఎక్కువౌతున్నకొద్దీ గుండె జబ్బు ప్రమాదం మరింత పెరుగుతుందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. దానివలన ఆయుఃప్రమాణం 6-7 సంవత్సరాలకు పడిపోతాయనేది భయపెట్టే హెచ్చరిక! యూరోపియన్ హార్ట్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.
మనిషి వౌలికంగా మాంసాహారి. ప్రయత్న పూర్వకంగా శాకాహారిగా మారాడు. బహుశా జైన బౌద్ధ ధర్మాలు ఇందుకు కారణం కావచ్చు. జీవకారుణ్యం శాకాహార భోజనానికి ముఖ్యాంశం. వైద్య కారణాలు కూడా తోడ్పడుతున్నాయి. ఒకప్పుడు మన పూర్వులు బాగానే తిన్నారు కదా.. అప్పుడు లేని ప్రమాదాలు ఇప్పుడెందుకు వస్తున్నాయనే సందేహం రావచ్చు. ఆనాటి సామాజిక పరిస్థితులు, జీవన విధానాలకూ నేటికీ చాలా తేడా ఉంది. ఈ తరం మనుషులకు పూర్వం ఉన్నంత శారీరక శ్రమ లేదు. కల్తీ ఆహార పదార్థాలు, విషపూరిత ఆహారాల వాడకం ఎక్కువయ్యింది. అందుకని పేగులు బలహీనపడి జీర్ణశక్తి మందగిస్తోంది. విష దోషాల ప్రభావం శరీరంమీద త్వరగా కనిపిస్తోంది.
మనుషుల్లో మార్పులు వచ్చినట్టే జంతువుల్లో కూడా కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. ఇప్పటి గొడ్లకు, గొర్రెలకు, మేకలకూ పూర్వకాలపు వాటికి చాలా తేడా వుంది. ఆ ప్రభావం వాటి మాంసంలో కూడా ఉంటుంది. జంతువులకు మాంసం పెరుగుదల కోసం హార్మోన్లు ఇతర ఉత్ప్రేరకాలను ఇంజెక్షన్లు ఇస్తున్నారు. వాటి మేతలలో కూడా ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అవి జంతు మాంసం మీద చెడును కలిగించే అంశాలే!
ప్రాసెస్డ్ మీట్: వివిధ రసాయనాలతో నిలవబెట్టిన మాంసాహారం. రెడ్ మీట్: ఎర్రగా ఉండే పచ్చి మాంసం. వైట్ మీట్: ఉడికించిన తరువాత ఎరుపు తగ్గి తెల్లగా ఉండే మాంసం.. ఇవన్నీ హానికారకాలవుతున్నాయి.
విశ్వవ్యాప్తంగా అసలైన మైనారిటీలు ఎవరంటే, మాంసం తిననివారేననాలి! విశ్వమానవులు మాంసాహారులే! విదేశాలతో పోలిస్తే, భారతదేశపు మాంసాహారులు నూరు శాతం మాంసాహారులే కాదు. కూర, పప్పు, పచ్చడి లాంటివి తింటూ పక్కన మాంసం కూరని నంజుకునే శాఖాహారమాంస భోజనం చేసేవారే మన దేశంలో ఎక్కువ. శాక మాంస భోజనాన్ని మెడిటేరియన్ భోజనం అంటారు. తేలికపాటి మాంసం, గుడ్డులోని తెల్లసొన పరిమితంగా తినేవారికి పైన చెప్పుకున్నంత ప్రమాద స్థితి కలగకపోవచ్చు.
కఠినంగా అరిగే మాంసాలు మన దేశీయులకు సరిపడేవి కాదు. వాటికి ప్రాధాన్యత తగ్గించటమే మంచిది. మాంసం వండినట్టుగా, కూరగాయల్ని కూడా అతిగా మసాలాలు, నూనెలు పోసి వండకుండా తేలిగ్గా అరిగేలా వండుకోవటం విజ్ఞత!

**
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు