సంజీవని

వేడిని తగ్గించే ఉపాయాలు (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: మూత్రానికి వెడ్తుంటే కారం చల్లినట్టు మంట పుడుతోంది. ఒళ్లంతా మంటలుగానే ఉంటుంది. పరీక్ష చేయిస్తే ఏ జబ్బూ లేదన్నారు.
-శిలార్ (నందిగామ)
జ: మూత్రంలో మంట పుడుతోందంటే ఆమ్ల గుణాలు పెరిగాయని అర్థం. శరీరంలో ఆమ్లం ఎక్కువైనప్పుడు కలిగే బాధల్ని జన సామాన్య భాషలో వేడి చేయటం అంటారు. వేడి పెరిగినప్పుడు కడుపులో మంట, గొంతులో మంట, కళ్లల్లో మంట, అరికాళ్లు - అరచేతులూ మంట, మలమూఅతాల్లో మంట - ఇలా ఒళ్లంతా మండిపోతున్నట్టు అనిపించటానే్న వేడి చేయటం అంటారు. వేడి అనేది శరీరంలో మితిమీరే కొద్దీ జీవకణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. రక్తహీనత, వీర్యంలో జీవకణాలు నశించిపోవటం, రక్తనాళాల వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంది. మూత్రపిండాలు, జీర్ణాశయం, కాలేయం ఇలాంటి సున్నిత అవయవాలు అతి వేడి వలన త్వరగా దెబ్బతింటాయి. కాబట్టి మూత్రంలో మంట పదేపదే అలవాటుగా వస్తున్నట్లయితే వెంటనే వేడిని తగ్గించే చర్యలు తీసుకోవడం అవసరం.
వేడి వలన కండరాలు కొంకర్లు పోవటం (హీట్ చ్రాంప్స్), తిమ్మిర్లెక్కటం, కండరాల్లో నులినొప్పి లాంటి బాధలు కలగవచ్చు. వేడి ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో కండరాలు పట్టేయటం లాంటి బాధలు సహజంగా ఉంటాయి. కండరాలు అకస్మాత్తుగా కుంచించుకోవటం వలన ఈ పట్టేయటం ఏర్పడుతుంది. దానే్న మజిల్ క్రాంప్స్ అంటారు. తెలుగు నేల మీద వాతావరణం, సామాజిక పరిస్థితులు, ఆహార విహారాలు తప్పనిసరిగా వేడిని పెంచేవిగానే ఉన్నాయి. మనం నిత్యం అశ్రద్ధ చేసేదీ ఈ వేడినే!
ఎప్పుడూ జ్వరం వచ్చినట్టుగా ఉండటం, జలుబు, దగ్గు, ఆయాసం, మలమూత్రాల్లో మంటలు, కడుపులో యాసిడ్ పెరగటం, వడకొట్టినట్టు శోష, మాటిమాటికీ చిరుచెమటలు, గుండెల్లో దడ, దప్పిక, కళ్ళు బూజర్లుగా కనిపించటం, తల తిరుగుడు, బీపీ పెరిగినట్టనిపించటం ఇవన్నీ వేడి వలన కలుగుతున్న లక్షణాలే! నడి రాత్రి వేళ గొంతు, ముక్కుల్లోకి పుల్లగా, కారంగా, ఘాటుగా ఉండే నీళ్లు ఎగజిమ్మటాన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. వేడి పెరిగినందువలన కలిగే లక్షణం ఇది. వేడిచేస్తే కీళ్లలో వాపులు, నొప్పులు పెరుగుతాయి. ముఖ్యంగా గౌట్ వ్యాధిలో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాంతి, వికారం, మలమూత్రాలు పుల్లని వాసనతో వెళ్లటం, అతిగా చెమట, శరీరంలోంచి దుర్గంధం మొదలైన లక్షణాలన్నీ వేడి వలన కలిగేవే! ప్రథమ కోపం, చిరాకు, అసహనం, తానొక్కడే సమర్థుడనే భావం కూడా అతి వేడి ఉన్నవారిలో కనిపిస్తుంది. అతి వేడి వలన లైంగిక శక్తి బాగా తగ్గిపోతుంది. త్వరగా ముగిసిపోవడానికి వేడి ఒక కారణం. వీర్యంలో జీవకణాలు త్వరగా నశించిపోవడానికి వేడి కారణం కావచ్చు.
రక్తంలో పిత్త దోషం పెరిగినప్పుడు దాని ప్రభావం వలన చర్మం మీద బొబ్బలు, ఎర్రగా పొక్కినట్టు అవటం, చర్మం పగుళ్లు బారటం, పొట్టు రేగటం జరగవచ్చు. వేడి శరీర తత్వం ఉన్నవారిలో మొటిమల బాధ కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
పిత్తదోషం వలన ఈ బాధలు కలుగుతాయని ఆయుర్వేదం చెప్పింది. వాతపిత్త కఫాలనే ధాతువుల సమతుల్యత వలన శరీర జీవన క్రియలు సక్రమంగా నడుస్తున్నాయి. ఆ సమతుల్యతలో తేడాలు ఏర్పడినప్పుడు ఈ ధాతువులే దోషాలుగా మారి జీవన నిర్మాణ క్రియలను అడ్డుకుంటూ ఉంటాయి. పిత్తదోషం శరీరంలో అమితమైన వేడిని పుట్టిస్తుంది. ఈ వేడి అనేక బాధలకు కారణమవుతుంది. వేడిని అలానే కొనసాగిస్తూ ఉంటే, చిన్నచిన్న లక్షణాలే ముదిరి పెద్ద వ్యాధులుగా మారతాయి. వేడి ఎక్కువగా ఉందనుకొన్నప్పుడు వెంటనే చలవ చేసే పదార్థాలను తీసుకుంటూ, వేడి చేసేవి తినకుండా ఆపుతూ శరీరాన్ని మళ్లీ సమస్థితికి తెచ్చుకోవటం అవసరం.
మనం తీసుకునే ఆహార పదార్థాలలో పులుపు, అల్లం, వెల్లుల్లి, మసాలాలు, నూనెలో వేపిన పదార్థాలు, ఊరుగాయలూ వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉదయానే్న మనం ఎంతో ఇష్టంగా తినే టిఫిన్లలో అధిక భాగం వేడి చేసేవిగానే ఉంటాయి. ఆఖరికి ఇడ్లీని కూడా కారప్పొడి, అల్లం చట్నీ, శనగ చట్నీ, సాంబారు లాంటి వేడిచేసే ద్రవ్యాలతో తింటాం కాబట్టి, అది కూడా వేడిని పెంచేదిగానే ఉంటుంది.
తరచూ వేడి చేస్తున్నదంటే వేడి శరీర తత్వం ఉన్నదని అర్థం. ఇలాంటి వారు పులుపు, అల్లం వెల్లుల్లి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. చింతపండు వెయ్యని పప్పుచారు లేదా సాంబారుని మన వాళ్లు కట్టు అంటారు. పెసరకట్టు, కందికట్టు చలవనిస్తాయి.
పులుపు లేకుండా రసం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కరుబూజ, దానిమ్మ, కమలా, కీరదోస ఇలాంటివి వేడిని తగ్గించటంలో ప్రముఖంగా పని చేస్తాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ వేడి చేస్తాయి. మజ్జిగ చలవ చేస్తాయి. ఉప్పు, పులుపు, కారపు రుచులు వేడిని పెంచుతాయి. తీపి, వగరు, చేదు చలవనిస్తాయి. సొరకాయ చలవ చేసేదే! కానీ, వేడిచేసే చింతపండు రసం పోసి వండటం వలన సొరకాయ పులుసు కూర వేడి చేసేదిగా మారిపోతుంది. తినేదేమో పులుసుని, తిట్టేదేమో సొరకాయనీ అవుతుంది. చాలామంది మాకు సొరకాయ పడదండీ.. జలుబు చేస్తుందంటూ ఉంటారు. ఇక్కడ జలుబుకు కారణం చలవనిచ్చే సొర కాదు, వేడిచేసే చింతపండు.
కేరెట్, ముల్లంగి, యాపిల్ లేదా తరుబూజ లేదా పుచ్చకాయ ఈ మూడింటిని సమానంగా తీసుకుని జ్యూస్ తీసుకుని రోజూ ఒక గ్లాసు చొప్పున తాగుతుంటే వేడి తగ్గుతుంది.
ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా దంచిన పొడి ఒక చెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలుపుకుని రోజూ తాగితే శరీరంలో వేడి సమస్థితికి వస్తుంది.
నీరుల్లిపాయలు వేడిని తగ్గిస్తాయి. వెల్లుల్లి శరీరంలో వేడిని, పిత్తదోషాన్ని పెంచుతుంది. చింతపండు వేడి చేస్తుంది. దానిమ్మ, టమోటా, ఉసిరికాయ తొక్కు పచ్చడి (నల్ల పచ్చడి) ఇవి చలవ చేస్తాయి. చింతపండుకు బదులుగా తేలికగా వీటిని వాడుకోవచ్చు.
వేడి చేసే స్వభావం ఉన్న వ్యక్తులు ఉదయం పూట టిఫిన్లకు బదులుగా మజ్జిగ అన్నం తినటం సర్వశ్రేష్ఠం. పులుపులేని పండ్లు ఎక్కువగా తీసుకోవటం మంచిది. సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి గింజలతో సహా ఆ నీళ్లను తాగుతుంటే చలవ కలుగుతుంది. సుగంధి పాల వేళ్లు మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. ఈ వేళ్లలోపల చెక్క తీసేసి, పైన ఉండే బెరడు మాత్రమే తీసుకుని శుభ్రం చేసి, మెత్తగా దంచిన పొడిని నీళ్లలో కానీ, పాలలో గానీ వేసి మరగకాచి రోజూ ఒక గ్లాసు చొప్పున రెండు పూటలా తాగుతుంటే బాగా చలవ చేస్తుంది. చర్మానికి శోభనిస్తుంది. రక్తంలో పిత్తదోషాన్ని నివారిస్తుంది. కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తుంది.
మంచి గంథం చెక్కని సాన మీద అరగదీసి, ఒక చెంచా గంథంలో ఒక పలుకు పచ్చకర్పూరం కలిపి కొన్ని నిమిషాలు ఆరనిస్తే, ఉండలు కట్టుకోవడానికి వీలుగా ఆరుతుంది. బఠాణి గింజంత పరిమాణంలో మాత్రలు చేసుకుని పూటకు రెండు చొప్పున రెండు పూటలా మింగేయటమే! మంచి గంథం వొంటికి పూసుకున్నప్పుడు ఎంత చలవనిస్తుందో కడుపులోకి తీసుకున్నా అంతే చలవనిస్తుంది! గంథం పొడితో ఈ ప్రయోగం చేయకండి. మంచి గంథం చెక్కని అరగదీసిన గంథానికే ఈ గుణం ఉంటుంది.
**
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com