సంజీవని

నెయ్యలాంటి నిజం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు కొన్ని బ్రహ్మ పదార్థాలున్నాయి. వాటిల్లో కొన్ని విశ్వామిత్ర సృష్టి అనదగినవి కూడా ఉన్నాయి. నేతి బీరకాయల్లోనే కాదు సాక్షాత్తు నెయ్యిలో కూడా నెయ్యి లేనపుడు అది బ్రహ్మ పదార్థమే అవుతుంది.
మనం బజార్లో కొని తెచ్చుకుంటూన్న పాలు, పాలు కావు- నెయ్యి నెయ్యి కాదు. నూనె నూనె కాదు. తేనె తేనె కాదు. ప్రకృతి సిద్ధంగా ఉత్పత్తి అయ్యేవి కూడా కృత్రిమం అయిపోతున్నాయి. కల్తీదారులు బరితెగిస్తున్నా అదుపు చేయాల్సిన యంత్రాంగానికి వాటి మీద అదుపు లేదు. స్వీట్ షాపునకు వెడితే నీలం రంగు కారప్పూస, ఆకుపచ్చ బూందీ, నల్లరంగు పులిమిన కేకులు, ఎర్రరంగు వేసిన మిఠాయిలు అమ్ముతున్నారు. ఆఖరికి తెల్లగా కనిపించే వాటికి వేసింది కూడా తెల్లరంగేనట! ప్రజలు ఇలా వండితేనే తింటున్నారని సమాధానం! ఆఖరికి వడియాలక్కూడా రంగులేమిటండీ? ఇవి ఈ యుగంలో దొరికే బ్రహ్మ పదార్థాలు. వాటిని మనకోసం అపర విశ్వామిత్రులు సృష్టిస్తున్నారు. విశ్వానికి అమిత్రులు! మనం ఎగబడి వాటినే ఎందుకు కొంటున్నాం అన్నదే ప్రశ్న.
మనది మాహిష మండలం. ఆది నుండి తెలుగు నేల గేదెలకు స్థావరం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కన్నా తెలుగింట పాలు, పెరుగు, మజ్జిగలకు ప్రాధాన్యం ఎక్కువ. దాలిగుంటలో సన్నసెగన చిక్కటిపాలు కాచి, తోడుపెట్టి చక్కగా చిలికి వెన్న తీసి ఆ మజ్జిగని ఎంతో కమ్మగా త్రాగేవారు. నేతి వాడకంలో మన దేశం మిన్న అయితే, దేశం మొత్తంమీద తెలుగువారు ఎక్కువ నెయ్యి వాడతారు.
పట్టెడు కూడు లేకపోయినా ప్రతి ఇంట్లోనూ గ్లాసు చల్ల తప్పకుండా ఉండేవి. ఆ రోజుల్లో పాల ఉత్పత్తులు నాణ్యంగానూ, స్వచ్ఛంగానూ ఉండేవి. ఇప్పుడు చల్లకవ్వాలు ఇళ్ళలోంచి మాయమైపోయాయి. పెరుగు తోడుకోగానే ఫ్రిజ్‌లో పెట్టేస్తున్నారు. ఎంగిలి కంచానే్న ఫ్రిజ్‌లోకి తీసుకువెళ్లి పెరుగు వడ్డించుకుంటున్నారు. బయటకు తెస్తే దాని చల్లచదనం తగ్గిపోతుందని! చల్లని పెరుగు ఎక్కువ కొవ్వునీ, కేలరీలను షుగరునీ పెంచుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. మజ్జిగ చేయటం, వెన్న తియ్యటం మానేశాక షుగరు, స్థూలకాయం పెరిగేవిధంగా పాలు పెరుగుల్ని తీసుకోవటం మొదలుపెట్టాం. ఇంట్లో నెయ్యి తయారుచేసుకోవటాన్ని మానేశాం. బజార్లో నేతిమీద నమ్మకం లేదు. కానీ నెయ్యి లేకుండా ముద్ద దిగదు. చివరికి బజారు నేతికే బలైపోతున్నాం!
నెయ్యి ‘యానిమల్ ఫ్యాట్’ అని, రక్తనాళాలను మూసేసి గుండె జబ్బులు తెస్తుందనీ అందరికీ భయం. నిజమైన స్వచ్ఛమైన పాలలో కన్నా కల్తీ పాలలో, నెయ్యిలో, నూనెలో ఎక్కువ కొవ్వు ఉంటుంది. నూనె, నెయ్యి రెండింటిలోనూ కొవ్వు పదార్థాలే ఉన్నా ఆ రెండింటి గుణాలకూ చాలా వ్యత్యాసం ఉంది. శరీరానికి నెయ్యి మృదుత్వాన్నిస్తుంది. మోటారు మరలలో లూబ్రికేషన్ కోసం ఆయిల్ ఉపయోగపడినట్టే నెయ్యి శరీరానికి ఉపయోగపడుతుంది. అన్నంలో నాలుగు చుక్కలు నెయ్యి వేసుకు తింటే కడుపులో జఠరాగ్ని పెరుగుతుంది. తీసుకున్న ఆహారం బలంగా అరుగుతుంది. నూనె కూడా ఇలానే లూబ్రికెంటుగానే ఉపయోగపడుతుంది. కానీ, అది జఠరాగ్నిని చంపుతుంది. నేతికీ, నూనెకీ ఈ తేడాని అర్థం చేసుకోవాలి. నెయ్యి నూనెలు ఒకటి కావు. రెంటికీ ఒకే సూత్రం వర్తించదు. జీర్ణశక్తిని చంపే ద్రవ్యాలే స్థూలకాయాన్ని ఎక్కువ పెంచుతాయి.
ఇంట్లో చిలికి వెన్న తీసి కాచిన తాజా నెయ్యిని పరిమితంగా వాడుకుంటే నెయ్యికి అంతగా భయపడాల్సిన పనిలేదు. నెయ్యి పేగులను దృఢతరం చేస్తుంది. నూనె పేగులకు చెరుపు చేస్తుంది. నెయ్యి చలవనిస్తుంది. నూనె వేడి చేస్తుంది. నెయ్యి వాత పిత్త కఫ ధాతువులను సమస్థితిలో ఉంచుతుంది. నూనె, ఈ మూడింటినీ వికారింపచేసి అనేక వాత వ్యాధులను, పైత్య వ్యాధులనూ తెస్తుంది. నేతిని కొన్ని చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. నూనెని గరిటతో పోసుకోవాల్సి వస్తుంది.
‘ఘృత మబ్దాత్పరం పక్వం హీన వీర్యత్సమాప్నుయాత్’ అని భావప్రకాశ వైద్య గ్రంథంలో ఒక సూత్రం ఉంది. నేతిని కాచిన ఒక ఏడాదికి అది పూర్తిగా నిర్వీర్యం అయి, విషతుల్యం అవుతుందని దీని భావం. కాచిన తరువాత రోజు గడుస్తున్నకొద్దీ నెయ్యి తన శక్తిని కోల్పోతూ వస్తుంది. షాపింగ్ మాల్సులో 1+1 ఫ్రీలకు ఆశపడి అవసరానికి మించి నెయ్యి కొని నిలవబెట్టుకుంటే ఆ నెయ్యి విషపూరితం కాగలదు. అందుకని తక్కువ రోజులకు సరిపడినంత నెయ్యి కొనండి. తయారీ తేదీ గమనించి కొనండి.
ఏ రోజుకు ఎంత నెయ్యి కావాలో అంతే నెయ్యిని చిన్న నేతి గినె్నలోకి తీసుకుని వేడి చేయండి. నేతిని పదే పదే కాచినందువలన అందులో ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పెరిగి అది చివరికి కేన్సరుకు దారితీస్తుంది.
నేతికి వనస్పతులూ, రిఫైండ్ ఆయిల్సూ ఎంతమాత్రమూ ప్రత్యామ్నాయం కాదు. వాటి గుణాలు వేరు. పిల్లలకు, వృద్ధులకు నేతినే తగినంత అందించాలి కదా! నెయ్యిని తినకూడని పదార్థం అనటం సబబు కాదు. కల్తీ వ్యాపారులు నేతిని బ్రహ్మపదార్థంగా మారిస్తే వైద్యులు ఒక నిషిద్ధ పదార్థంగా మారుస్తున్నారు.
శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి తప్పును నెయ్యిమీదకు నెట్టటం అన్యాయం. జీర్ణశక్తి బలంగా లేకపోవటం కొవ్వు వ్యాధులు కలగటానికి ముఖ్య కారణం. శరీర శ్రమ తగ్గిపోయి, మానసిక శ్రమ పెరిగిపోవటం కొవ్వు వ్యాధులకు కారణం. వాటిని సరిచేసుకోకుండా నేతి గురించే మాట్లాడుతున్నారు. డైటింగ్ పేరుతో నెయ్యి వేసుకోవటం మానేసి, నూనెలను మాత్రం అపరిమితంగా వాడుతున్నవారి సంఖ్య ఎక్కువ. నెయ్యి, నూనెల్లో ఎంత కల్తీ జరిగిందో తెలియటం చాలా కష్టం. కమ్మని వాసన నేతి నాణ్యతకు గ్యారంటీ కాదు. కాబట్టి నేతి విషయంలో మనం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- నేతిని గురించిన అపోహలు, భయాలూ వదిలేయండి.
- సాధ్యమైనంత వరకూ ఇంట్లో చల్ల చిలికి వెన్న తీసి కరిగించిన నేతినే వాడుకోండి.
- బజార్లో లూజుగాఅమ్మే నెయ్యి కొనబోయే ముందు దాని నాణ్యత గురించి ఆలోచించండి.
- పౌచ్ ప్యాకెట్లలో అమ్మే బ్రాండెడ్ నేతి ప్యాకెట్ల వాడకాన్ని ఎవరికివారు స్వంత పూచీమీద స్వకీయమైన నమ్మకంతో కొనుక్కోండి.
- కల్తీ కలిస్తే తెలుగువాళ్ళు కొనరు అనే భయం కల్తీదారులకు కల్పించాలి. కొన్ని అవసరాలకు ప్రత్యామ్నాయం వెదకి పాటించటం మంచిది. ఇంకోదిక్కు లేదన్నట్టు కల్తీపదార్థాలను కొనటాన్ని జనం ఆపకపోతే ఈ దేశంలో కల్తీ ఆగదు. ఈ వ్యాసం వ్రాస్తున్న సమయానికి ఒక కల్తీ నేతి వ్యాపారిని అరెస్టు చేసి అతని కల్తీ యంత్రాలను పట్టివేసినట్లు వార్త వచ్చింది. అతన్ని ఈ ఏడాదికాలంలో మూడుసార్లు అరెస్టుచేశారని, ప్రతిసారి బెయిల్‌మీద వచ్చి అదే కల్తీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడని ఆ వార్తలో ఉంది. కల్తీ వస్తువులు, పదార్థాలు కొనేవాళ్ళు ఎవరూ లేకపోతే కల్తీదారుడు కల్తీకి పాల్పడలేడు కదా! తెలిసి తెలిసి కల్తీలను కొనటం మానాలి.
- పాత నేతి జాడీలో కొత్త నెయ్యి కలపకండి. పాత నెయ్యి అయిపోయాక గినె్న కడిగి తుడిచి అప్పుడు కొత్త నెయ్యి పొయ్యండి.
-చేతికి జిడ్డు అంటుకుంటోందంటే ఆ పూట భోజనంలో నెరుూ్య, నూనెల వాడకం ఎక్కువైందని అర్థం.
- భార్యా, భర్తా ఇద్దరు పిల్లలూ ఉన్న ఒక పరిమిత కుటుంబం నెలకు 2 ప్యాకెట్లు నూనె కొంటోన్నదంటే, మనిషికి 450 గ్రాముల వరకూ నూనె వాడుతున్నట్టు లెక్క! ఈ 450 గ్రాముల నూనె వాడకాన్ని 350 గ్రాములకు తగ్గించగలిగితే, నెలకు ఆ 100 గ్రా. నూనె బదులు మంచి నెయ్యిని వాడుకోవచ్చు. నెరుూ్య నూనెల వాడకం ఇంత పరిమితంగా ఉండాలి. ఇది నేతి కొవ్వు భయానికి కాదు, వాటిలో కలిసిన కల్తీ భయానికి తీసుకోవలసిన జాగ్రత్త.
- అన్నంలో నెయ్యి వేసుకోండి- పోసుకోకండి.
- ఆవు నెయ్యికి ఇవే సూత్రాలు వర్తిస్తాయి.
నెయ్యిని అభిఘరించిన అన్నమే తినాలి. దేవుడికి ఏది పెడతామో దానే్న ప్రసాదంగా తీసుకుంటాం. కల్తీ నెయ్యి, నూనెలతో వండటం, కల్తీ దీపారాధన నూనెని ఎక్కువ ఖరీదుకు కొనటం ఇవి దేవుడికి ప్రీతిని కలిగించవు కదా!

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com