సంజీవని

సైనసైటిస్‌కు ఆవిరితో అడ్డుకట్ట (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: సైనసైటిస్ వ్యాధి చాలా నెలలుగా బాధిస్తోంది. ఎన్ని మందులు వాడినా అప్పటికప్పుడు తగ్గి మళ్లా వస్తోంది. నివారణ చెప్పగలరు?
-జె.జనార్దన్, తిరుపతి
జ: జలుబు రాకుండా చూసుకోగలగటం మీద సైనసైటిస్ చికిత్స ఆధారపడి ఉంది. జలుబుకు కారణమయ్యే పనులు చేస్తూన్నంతకాలం జలుబు వస్తూనే వుంటుంది. జలుబును అశ్రద్ధ చేస్తే అది సైనసైటిస్ వ్యాధికి దారితీస్తుంది. దీర్ఘకాలం సైనసైటిస్ వ్యాధితో బాధపడేవారు జలుబు సంగతి ముఖ్యంగా పట్టించుకోవాలి.
ముక్కులోపలనుండి గాలి ఊపిరితిత్తుల్లోకి నడిచే దారి మన బుగ్గల దగ్గర ఘాట్‌రోడ్డులాగా మెలికలు తిరిగి ఉంటుంది. ఈ మెలిక దారుల్ని సైనస్‌లంటారు. జలుబు ఏర్పడినపుడు ఈ సైనస్ మార్గంలో కఫం చేరడంతోముక్కు దిబ్బడ వేస్తుంది. బాగా ఖాండ్రించి చీదితే కొంత దిబ్బడ వదులుతుంది. లేదా ఖాండ్రించి లోపలికి పీలిస్తే గొంతులోకి, అక్కణ్ణించి కడుపులోకి పోతుంది. ఒక దశలో ఎంత ఖాండ్రించినా కఫం కదలకుండా బిగుసుకుపోయి, నోటితో గాలి పీల్చుకోవాల్సి వస్తుంది.
అలా సైనస్‌ల లోపల పేరుకుపోయిన కఫం ఎక్కువ రోజులపాటు నిలవ వుంటే అక్కడ పుండై, నెమ్మదిగా చీము పట్టడం మొదలౌతుంది. దీనే్న సైనసైటిస్ అంటారు. దీనే్న జన సామాన్యం ‘‘నాకు సైనసు ఉన్నదండి’’ అంటుంటారు. ఇది జలుబును అశ్రద్ధ చేయటంవలన జరిగే ఒక ఉపద్రవం. అంటే సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇది దీర్ఘకాలం పాటు బాధించవచ్చు. దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు. ఆధునిక వైద్యం యాంటిబయాటిక్ ఔషధాలు అందుబాటులోకొచ్చాయి. ఇవి చికిత్సను వేగవంతం చేశాయి. ముక్కులోకి మందుని చుక్కల రూపంలో వేయటం, కడుపులోకి తగిన ఔషధాలు వాడటం ద్వారా ఈ సైనసైటిస్ వ్యాధి చికిత్స సాధ్యమే!
ఆయుర్వేద పద్ధతిలో వైద్యుడి సలహా మీద ‘త్రిభువనకీర్తి రస’ 250 మి.గ్రా. మాత్రల్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఒక్కొక్కటి చొప్పున వేసుకొని రెండు మూడు చెంచాల అల్లం రసం తాగితే సైనసైటిస్ వదులుతుంది. ముక్కులోకి అణుతైలం నాలుగు చుక్కలు వేసుకోవటం వలన చీము తగ్గుతుంది. దశమూలక్వాథ చూర్ణం ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దాన్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి, చిటికెడు ఉప్పు, తినే షోడా కూడా కలిపి, బాగా మరిగించి ఆ ఆవిరిని పీల్చటంవలన ముక్కు దిబ్బడ వదులుతుంది. అయొడిన్ లేని మామూలు ఉప్పుని మాత్రమే ఇందుకు వాడండి. దశమూల కషాయం ఆవిరిని రోజుకు రెండుసార్లు పట్టడంవలన ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ కషాయాన్ని ముంచిన తెల్ల జేబురుమాలును ఒత్తిలాగా చేసి ముక్కులోపలికి బాగా ఎక్కించి తీయటం రెండు లేక మూడు పర్యాయాలు చేస్తే దశమూల కషాయం వాత, కఫ దోషాల్ని తగ్గిస్తుంది. దీనివలన ముక్కులో అవరోధాలు తగ్గి, గాలి ధారాళంగా నడవటమే కాకుండా తలనొప్పి, శిరోభారం తగ్గుతాయి. హాయిగా అనిపిస్తుంది.
ముక్కు దిబ్బడను వదిలించటానికి ఆవిరి పట్టడాన్ని (స్టీమ్ ఇన్‌హలేషన్) అన్ని వైద్య శాస్త్రాలూ అంగీకరిస్తున్నాయి. అయితే తాజా పరిశోధనలు లేత జలుబులోనే గానీ దీర్ఘవ్యాధిగా మారిన సైనసైటిస్ వ్యాధిలో అంతగా పనిచేయకపోవచ్చు. ఔషధ సాయం లేకుండా నీళ్లను మాత్రమే మరిగించి ఆవిరిపట్టడంవలన పెద్దగా ఉపయోగపడదని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు. ఉత్త నీటి ఆవిరికన్నా ఉప్పు నీటిని ముక్కులో చుక్కలుగా వేయటంవలన ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ‘‘సెలైన్ నాసల్ స్ప్రే’’లు కూడా దొరుకుతున్నాయి. ఈ పద్ధతిని నాసల్ ఇరిటేషన్ అంటారు. ముక్కులో దిబ్బడకు కారణం అయిన కఫాన్ని (మ్యూకస్) ఈ ఉప్పు నీటి ద్రావణం వెళ్ళగొడుతుందని పరిశోధకులు నమ్ముతున్నారు. ఈ ఉప్పునీటి ద్రావణంలో ముంచిన దూదిని తిరిపెట్టి వత్తిలా చేసి చంటిపిల్లలకు ముక్కు దిబ్బడ వేసినపుడు ముక్కులో ఉంచితే కొంత కఫాన్ని ఇది పీల్చేస్తుంది.
* * *
కీళ్ళవాతానికి విముక్తి మీ చేతుల్లోనే!
ప్ర: వాతంచేసే ఆహార పదార్థాల గురించి వివరంగా చెప్పండి
-ప్రసాదరావు జొన్నాదుల, మధిర
జ: మన దైనందిన జీవిత విధానంలోగానీ ఆహార పదార్థాల్లోగానీ, వాతం చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకనే కీళ్ళనొప్పుల్లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. అతి చల్లటి పదార్థాలు, అతి పుల్లని పదార్థాలు, చల్లగాలిలో తిరగటం, భోజన వేళల్ని సరిగా పాటించకపోవటం, అర్థరాత్రి దాకా టీవీలకు అంటుకుపోవటం, గ్యాసు ట్రబుల్, మలబద్ధత, గతుకుల రోడ్లమీద ప్రయాణం, నిరంతరం టెన్షన్లో జీవించడం, అసంతృప్తి, దిగులు, ఇవన్నీ వాతాన్ని పెంచేవిగా వుంటాయి.
ఈ అలవాట్లన్నీ మన లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలు. మన జీవన విధానమే వాత దోషాన్ని పెంచేదిగా ఉంటోంది. వాత శరీరతత్వం ఉన్నవారికి కొద్దిపాటి వాతం చేసే ఆహార పదార్థం కూడా కొంపలంటేంత హడావిడి చేస్తుంది. ‘‘రాత్రి పెరుగున్నంలో నలకంత గోంగూర నంజుకున్నానంతే! తెల్లారేసరికి కీళ్ళన్నీ పట్టేశాయి’’ అని కొందరు అంటుంటారు. ఇందుకు వారి శరీరతత్వం వాత ప్రధానమైనది కావటం, వారి జీవన విధానం వాతాన్ని పెంచేదిగా ఉండటం, వారి ఆహార విహారాలన్ని వాత వ్యాధుల్ని తెచ్చిపెట్టేవిగా వుండటమే ముఖ్య కారణాలు. కీళ్ళవాతం తగ్గాలంటే జీవన విధానంలో మార్పు రావాలన్నమాట. మానసిక ప్రశాంతత, వేళాపాళా పాటించటం, మలబద్ధత లేకుండా రోజూ కాల విరేచనం అయ్యేలా చూసుకోవటం, జీర్ణశక్తిని పదిలపరచుకోవటం- ఇవి కీళ్ళ వాతంలో జాగ్రత్తపడవలసిన అంశాలు. ఏవి తింటే తేలికగా అరిగి ఎలాంటి ఇబ్బందులు పెట్టవో అవి వాతాన్ని తగ్గిస్తాయి. ఏవి కష్టంగా అరుగుతాయో అవి వాతాన్ని పెంచుతాయి. ఈ అరుగుదల అనేది వ్యక్తి జీర్ణశక్తిమీద ఆధారపడి ఉంటుంది. తన జీర్ణశక్తికి తగ్గట్టుగా తేలికైన ఆహారాన్ని తీసునేవాళ్ళకు వాతం అదుపులో ఉంటుంది.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com