రాష్ట్రీయం

శార్వరి ఇక లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రముఖ రచయిత, సాహితీవేత్త, మాజీ పాత్రికేయులు, యోగా నిపుణులు శార్వరి కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. తెలుగునాట శార్వరిగా సుపరిచితులైన వాసిలి రామకృష్ణశర్మ స్వస్థలం గుంటూరు జిల్లా కోపల్లె. తెనాలి హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తూ చిన్నవయస్సులోనే కథారచన ప్రారంభించారు. గుంటూరు ఎసి కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. ఆ తరువాత తెనాలి విఎస్‌ఆర్ కళాశాలలో ఇంగ్లీషు ట్యూటర్‌గా చేరారు. అనంతరం 1958లో మద్రాసు ‘ఆంధ్రప్రభ’లో పాత్రికేయునిగా చేరి, అంచలంచెలుగా ఎదిగి ఆ సంస్థలోనే ఉద్యోగ విరమణ చేసేవరకు పనిచేశారు. దాదాపు 70 ఏళ్లుగా రచనావ్యాసంగంలో మమేకమైన ఆయన చివరివరకు అక్షరప్రస్థానాన్ని విరమించలేదు. యోగాపై ఆయనకున్న సాధికారత అంతాఇంతా కాదు. యోగా, తాత్వికతపై దాదాపు వంద గ్రంథాలు రచించిన ఆయన వందలకొద్దీ కథలు కూడా రాశారు. జ్యోతిషంపై మక్కువతో హస్తసాముద్రికంపై పరిశోధన చేసి ‘జ్యోతిష సాముద్రికం’, ‘హస్త సాముద్రికం’ పుస్తకాలు ప్రచురించారు. శార్వరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె గతంలోనే మరణించారు. కాగా పెద్ద కుమారుడు వాసిలి వసంత్‌కుమార్ రచయితగా సుప్రసిద్ధులు.
బహుముఖ ప్రజ్ఞాశాలి
‘‘యోగ పాఠమ్ముల నూర్జిత సాధనన్ చెప్పి మెప్పించెడు జీవశక్తి.. ఆర్త సేవాదృష్టి అంతరజ్వాలగా వెలిగించుకొను యోగలలితమూర్తి’’ అంటారు.. కాని, పావుకోళ్లు వేసుకోరు.. రుద్రాక్షలు వేసుకోరు.. పెద్ద పెద్ద కాషాయ బట్టలు తొడుక్కోరు.. కమండలం ధరించరు, విభూతులు పెట్టుకోరు.. చాలా సాదాసీదాగా ఉంటారు.. ఆయనే శార్వరి. ఇంట పెట్టిన పేరు రామకృష్ణ శర్మ. ప్రపంచం పట్టించుకున్న పేరు ‘శార్వరి’.
మూడు దశాబ్దాల క్రియేటివ్ రైటింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి నాలుగున్నర దశాబ్దాలుగా యోగసాహిత్యానికే తన కాలాన్ని, కలాన్ని పరిమితం చేసుకున్నారు శార్వరి. ఎనభై అయిదేళ్ల శార్వరి జీవన ప్రస్థానంలో ఏడు పదులకు పైబడ్డ సాహిత్య ప్రస్థానం ఉంది. కథకుడిగా, కవిగా, నవల, నాటక రచయతగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, యోగ సాహిత్యకర్తగా, దార్శనికుడుగా మనం చూడవచ్చు. 1990 నుండి జరుగుతున్న అక్షర ప్రస్థానంలో శార్వరి కలం యోగ- తాత్విక రచనలకే అంకితమైపోయి ఓ వంద తాత్విక- యోగ గ్రంథకర్తగా కీర్తిపతాక కావటం మనం చూస్తూనే ఉన్నాం.
శార్వరీయ అక్షర ప్రపంచం
కథానికా ప్రపంచంలో శార్వరి కొన్ని వందల కథలు రాసినప్పటికీ పుస్తక రూపంలోకి వచ్చిన కథలు కొన్ని పదులు మాత్రమే. ఆ కథా సంపుటాలే స్వర్గసీమ, ఎర్రభూతం, మంజరీ ద్విపదలు. శార్వరి కథలు రాయడమే కాదు... కథలు ఎలా రాయాలో కూడా రాశారు.
1969-70లలో శార్వరి జీవితం మలుపు తిరిగింది. అయిదవ సంతానం భానుప్రియ మరణం శార్వరి దంపతులను పట్టి కుదిపేసింది. తమలో గూడు కట్టుకుంటున్న చీకటిని చెరిపేయటానికి శార్వరి యోగ మార్గంలో ప్రవేశించారు. ఆ బాటలో యోగ సాహిత్యంగా వందకు పైగా పుస్తకాలు ఆయన కలంనుండి వెలువడ్డాయి. 1971లో వచ్చిన శార్వరి ‘ద డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా’ పుస్తకం. ఇదే పుస్తకం తెలుగులో అనుసృజనగా ‘మాస్టర్ యోగదర్శిని’ అయింది. అరవిందఘోష్ ఆంగ్ల కావ్యం ‘సావిత్రి’ తెనిగించాలనే సంకల్పం శార్వరికి కలిగింది. ఈ అనువాద- అనుసృజన ఏడేళ్లపాటు సాగి- మహోదయం, అనే్వషణ, స్పందన, యోగ విభూతి, నిర్వాణం, పరనిర్వాణం, మహాపరనిర్వాణం, దివ్యజ్ఞానం, దివ్యజీవనం- అనే తొమ్మిది భాగాలుగా వచన కవితారూపంలో శార్వరి లేఖిని నుండి వెలువడింది.
నవలా రచయితగా చేయి తిరిగిన రోజుల్లోనే శార్వరి ‘‘చంఘిజ్‌ఖాన్’’ పేరిట ఒక చారిత్రక నవల రాసారు. మళ్లీ దాదాపు యాభై ఏళ్ల తర్వాత గత రెండేళ్లలో- చాణక్య, సామ్రాట్ అశోక, ప్రియదర్శి, కర్ణ మహాభారతం నవలలను చారిత్రక, తాత్వికాంశాల ప్రధానంగా రచించారు. సమకాలీన సమాజంలో శార్వరి ఎప్పటికీ చిరంజీవులు.