అర్చన పర్యాటకం

సూర్యారాధన మన సంప్రదాయం. మహిమాన్వితుడు; ప్రత్యక్ష దైవమయిన సూర్యభగవానుని ఆరాధన వైదిక సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. మాఘశుద్ధ సప్తమినాడు వచ్చే పవిత్ర పర్వదినమే రథసప్తమి. ఈ సప్తమినాడు ఆకాశంలో గ్రహనక్షత్రాల సమూహమంతా ఓ రథాకారంలో కనిపిస్తాయి కనుక ఇది రథసప్తమిగా విశిష్టత పొందింది. ఈ రోజుననే సూర్యుని రథచక్రం ఉత్తర దిశకు మళ్లుతుంది. మకర సంక్రమణం నాడు రాశిమారినా దిక్కు మార్పిడి జరిగేది మాత్రం రథసప్తమిరోజునే్న. అందుకే సూర్యారాధనకు ఇది విశిష్ట దినం. ఈ విశేషాన్ని బాగా ఎరిగున్నవాడు కనుకనే భీష్మ పితామహుడు సూర్యుడి రథచక్రం రథసప్తమినాడు ఉత్తర దిశకు తిరిగిందని నిశ్చయించుకుని ఆ మరునాడు అనగా అష్టమి నాడు తన ప్రాణాలను పరమేశ్వరునిలో లీనం చేశాడు.
సమస్త జీవజాలానికీ సూర్యుడే ప్రాణదాత. సకల ప్రాణులూ సూర్యుడిమీదనే ఆధారపడి ఉన్నాయని అంటోంది రుగ్వేదం. సూర్యుడు ఉదయిస్తూ చీకట్లను పటాపంచలు చేస్తాడు. ఇది మనమందరం ప్రత్యక్షంగా చూస్తూన్న నిత్య సత్యం. సూర్యోదయానికి కొంచెం ముందు కల్గేది ఉషోదయం. ఈ ఉషఃకాంతి కిరణాలు సంపదను; సంతానాన్ని, దీర్ఘాయువును; రక్షణను కలుగజేస్తాయని కూడా రుగ్వేదం తెలియచెబుతోంది.
వర్ఛస్సు, దానితోపాటు దృష్టి, మంచి జ్ఞానంకోసం సూర్యుడు ఉపాసింపబడుతూన్నట్లు శుక్ల యజుర్వేదంలోని కొన్ని మంత్రాలు తెలియజేస్తూన్నాయి. సూర్యుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, బలాన్ని ప్రసాదిస్తాడని సామవేదం గానం చేస్తోంది.
సూరీడు ఉష్ణరూపంలో సుఖ ప్రసవాన్ని కలుగజేస్తాడనీ, ఆదిత్య రూపంలో కామెర్ల రోగాన్నీ, సవితృరూంలో సర్వ శస్త్ర బాధలనూ నివారిస్తాడని; ఉదయభానుడు గోవులకు రోగాలను కల్గించే క్రిమికీటకాలను చంపి గోసంపదను వృద్ధి చేస్తాడని అధర్వవేదం పలుకుతోంది.
రథసప్తమి పర్వదినాన వేకువనే నిద్రలేచి తెల్ల జిల్లేడు ఆకులను హృదయం, భుజాలు, శిరస్సు, మెడపైన, రెండు పాదాలమీద ఉంచుకొని స్నానం చేయడంవల్ల సమస్త వ్యాధులు తొలగిపోతాయన్నది వేదోక్తి. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఈ పర్వదినాన సరియైన గురువునుండి మంత్రదీక్ష తీసుకున్నా, కొత్త నోములు పట్టినా విశేష ఫలప్రదమని శాస్తవ్రచనం. ఈ జన్మలో చేసిన పాపం; జన్మజన్మాంతరాలలో చేసిన మహాపాపం; మనస్సుతో, మాటలతో, శరీరంతో తెలిసి తెలియక చేసిన ఏడు విధములైన పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమికి ఉంది.
సూర్యుడు తన కిరణాలద్వారా శరీరరోగాలను నయం చేస్తాడు. అందుకు ‘పాయత్యేషః’ అని పిల్వబడ్డాడు. విశ్వమానవాళికి కావలసిన వర్షం ప్రసాదిస్తాడు. కనుక ‘ఘనవృష్టి’ అని అంటారు. ప్రజలంతా నీరు లేకుంటే మాడిపోతారన్న తాపత్రయంతో తన ప్రతాపాన్ని తగ్గించి నీటికి మిత్రుడిలా ఉంటూ సముద్రపు నీటిని పీల్చినంత పరిమాణంలో నదీ జలాన్ని పీల్చడు. అందుకై ‘అపాంమిత్రః’గా కీర్తింపబడ్డాడు. ప్రపంచమంతా వర్షం కురిసిన తడితో ఉంటే క్రిములు, వ్యాధులు ప్రబలుతాయని తెలిసి చక్కటి ఎండనిస్తాడు. తద్వారా ‘ఆతపీ’ అయ్యాడు. ఎవరి జాతకంలోనైనా లోపం ఉంటే వారు గ్రహ జపాలను చేసుకొంటే సర్వగ్రహాలనూ అదుపులో ఉంచుతాడు. కనుక ‘నక్షత్ర- గ్రహ- తారణామధీపం’’ అని సంబోధించి పిలుస్తారు. సర్వానికిసాక్షిగాఉండీ లోకసాక్షి అని కీర్తింపబడ్డాడు.
- యం.సి.శివశంకర శాస్ర్తీ
Add new comment