రాష్ట్రీయం

ఘనంగా శ్రీవారి పార్వేట ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం కనుమ పండుగ సందర్భంగా పార్వేట ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రాతఃకాలారాధన పూర్తయిన తరువాత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచ్చిలో వేంచేయగా ఆయన వెంట మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామి సైతం పార్వేట మండపానికి చేరుకున్నారు.
అనంతరం మండపంలో పుణ్యాహవచనం జరిగిన తరువాత మంచెలో వేంచేశారు. శ్రీ స్వామివారికి ఆరాధన, నివేదన, హారతులు పట్టారు. ఉభయదారులైన తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదల తరువాత స్వామివారు మండపం నుంచి ప్రాంగణంలోకి వచ్చారు. శ్రీకృష్ణస్వామివారిని మాత్రమే సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకి వేంచేపు చేసి పాలు, వెన్న ఆరగింపు తరువాత హారతి అనంతరం శ్రీ మలయప్ప స్వామివారి సన్నిధికి వెళ్లారు.
తరువాత గొల్ల సమర్పించిన పాలు, వెన్న శ్రీ మలయప్ప స్వామివారికి నివేదన, హారతి ఇచ్చి గొల్లకు బహుమానం అందజేశారు. తరువాత శ్రీ మలయప్ప స్వామివారు కొంత దూరం ముందుకు పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణం వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇలా మూడుసార్లు స్వామివారి వేటను తిలకించడానికి భక్తులు పార్వేట మండపానికి వేలాదిగా తరలివచ్చారు. పార్వేట ఉత్సవం పూర్తయిన తరువాత మహాద్వారం వద్దకు వచ్చిన మలయప్ప స్వామి హాథీరాంజీవారి బెత్తాన్ని తీసుకుని సన్నిధిలోకి వేంచేయడంతో పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసినట్లయ్యింది. ఈ ఉత్సవంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి హరీంద్రనాధ్, బొక్కసం ఇన్చార్జ్ గురురాజ స్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
'చిత్రం...పార్వేట మండపంలో కనువిందుగా నిర్వహిస్తున్న స్వామివారు వేటాడే దృశ్యం