రాష్ట్రీయం

వేద పరిరక్షణ, ప్రచారానికి టీటీడీ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: వేదాలు సాక్షాత్తు భగవంతుని స్వరూపాలని, సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేద పరిరక్షణ, ప్రచారానికి టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ అదనపు ఈఓ ఏ.వి.్ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని ధర్మగిరిలో గల శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో 28వ అఖిలభారత శ్రీవేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
మార్చి 1వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈఓ మాట్లాడుతూ వేదవిద్యను ప్రచారం చేసేందుకు తిరుపతిలోని వేద విశ్వ విద్యాలయంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వేద పాఠశాలలను టీటీడీ నిర్వహిస్తోందన్నారు. పలు పథకాల ద్వారా వేద పారాయణదారులకు, వృద్ధ పండితులకు ఆర్థికసాయం అందిస్తున్నదని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వేద పండితులు వాటిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వేదసదస్సులో భాగంగా పరీక్షల కోసం దేశం నలమూలల నుండి 727మంది విద్యార్థులు, 104మంది పరీక్షాధికారులు విచ్చేశారని, వీరందరికి చక్కటి సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి 5గ్రాముల బంగారు పతకం, ద్వితీయశ్రేణిలో నిలిచిన వారికి 10గ్రాముల వెండి పతకం బహుమానంగా అందిస్తామని, వీటితో పాటు నగదు బహుమతి, సర్ట్ఫికెట్ పండిత శాలువా ప్రదానం చేస్తామన్నారు. సుమారు 2కోట్ల రూపాయల వ్యయంతో ఈ వేద సదస్సును టీటీడీ నిర్వహిస్తోందని, వేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వేద మంత్రం శ్రీనివాసునికి ప్రీతికరం:
విద్యా శంకర సరస్వతి స్వామీజీ
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదమంత్రోచ్ఛరణ ప్రీతికరమైందని, ఆది వరాహక్షేత్రమైన తిరుమలలో వేదవిద్యను అభ్యసించడం విద్యార్థుల పూర్వజన్మ సుకృతమని తమిళనాడులోని శ్రీరంగం వద్ద గల నెరూరుకు చెందిన విద్యానరసింహ ఆశ్రమ పీఠాధిపతి విద్యా శంకర సరస్వతి స్వామీజీ ఉద్ఘాటించారు. స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ వేదోక్తంగా చేసే ఏ పని అయినా ధర్మబద్ధంగా ఉంటుందన్నారు. వేదంలో ధారణ ప్రధానమని, విద్యార్థులు శ్రద్ధగా వేదవిద్యను సాధన చేయాలని సూచించారు. శ్రద్ధ వలన జ్ఞానం, జ్ఞానం వలన కైవల్యం సిద్ధిస్తాయని తెలిపారు. లౌకిక విద్య కొంతకాలం మాత్రమే గుర్తుంటుందని, వైదిక విద్య శరీరం ఉన్నంత వరకు ఉంటుందని వివరించారు. పరీక్షలంటే విద్యార్థులకు భయం ఉండకూడదని, వీటి వలన మరింత ప్రకాశవంతులవుతారని పేర్కొన్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ మాట్లాడుతూ వేద పరిరక్షణకు టీటీడీ విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. వేదపారాయణ పథకం, కుమార అధ్యాపక పథకం, ఆహితాగ్నుల పరిరక్షణ పథకం, వృద్ధ ఆగమ పండితుల పరిరక్షణ పథకం తదితర పథకాల ద్వారా ఆర్థికసాయం అందిస్తోందని, ఆయా పథకాల్లో పండితుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. దేశవ్యాప్తంగా పలు వేద పాఠశాలలకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు.
తన తండ్రి సుందరాచార్యులు ఈ వేద పాఠశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారని, చిన్నప్పటి నుండి ఈ సదస్సులతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్, సదస్సు కార్యదర్శి కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని వార్షిక నివేదికను వినిపించారు. 1969వ సంవత్సరంలో టీటీడీ ఈ సదస్సులను ప్రారంభించిందని, ఇప్పటివరకు 1213 మంది అభ్యర్థులు పరీక్షల్లో ఉతీర్ణులయ్యారని తెలిపారు. ప్రస్తుతం వేద పాఠశాలలో వేద, ఆగమ, స్మార్త, దివ్యప్రబంధం, సంస్కృతం కలిపి 18 విభాగాల్లో కోర్సులున్నాయన్నారు. ఈ సదస్సులు జరిగే ఆరు రోజుల పాటు శ్రౌతయాగాలు తూర్పున రుగ్వేదం, పశ్చిమాన యజుర్వేదం, దక్షిణాన సామవేదం, ఉత్తరాన అధర్వణ వేదాలతో హవనాలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 27 నుండి 29వ తేదీ వరకు వేదంరామాయణం, వేదంమహాభారతం, వేదంభాగవతం అనే అంశాలపై సహస్ర అవధాని మాడుగుల నాగఫణిశర్మ ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వీఎస్‌ఓ మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్‌ఆర్ రెడ్డి, క్యాటరింగ్ అధికారి జిఎల్‌ఎన్ శాస్ర్తీ, వేద పాఠశాల అధ్యాపకులు దీక్షితులు, సీతారామాచార్యులు, మోహనరంగాచార్యులు, భట్టాచార్య, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
*చిత్రం... తిరుమలలో జరుగుతున్న వేద విద్వత్ సభలో ప్రసంగిస్తున్న టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి