రాష్ట్రీయం

రాములోరి కల్యాణంపై కరోనా నీడలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నీడలు జగదభిరాముని కల్యాణ వేడుకలపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామనవమి వేడుకలపై ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామస్వామి కల్యాణ వేడుకలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏప్రిల్ 2న స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు వేదపండితులు ఇప్పటికే నిర్ణయించారు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3న శ్రీరామ పట్ట్భాషేకం జరగాల్సి ఉంది. సుమారు లక్ష మంది సమక్షంలో ఈ వేడుకలు ఏటా జరుగుతున్నాయి. శిల్పకళా శోభితమైన మిథిలా కల్యాణ మండపంలో ఏటా శ్రీరామనవమి నాడు భక్తులు వేయికళ్లతో చూస్తుండగా జానకిరాముల కల్యాణాన్ని వైభవంగా జరిపించడం దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. నవమి నాడు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించి స్వయంగా కల్యాణం వీక్షించే సంప్రదాయం ఉంది. అలాగే శ్రీరామనవమి, పట్ట్భాషేకం ఉత్సవానికి గవర్నర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో లక్షలాది మంది మధ్య కల్యాణం నిర్వహిస్తారా.. అనే సందేహాలు వ్యక్తవౌతున్నాయి. ఒకవైపు కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈనేపథ్యంలో తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. థియేటర్లు, బార్లు, పబ్‌లు మూసివేయడంతో పాటు ఈ నెలాఖరు వరకే వివాహ వేడుకలు జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాపులు, ఉత్సవాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతుల్లేవని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సుమారు లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించే శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించడం సాధ్యమేనా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో మరో వారం రోజులు వేచిచూసి ఈ నెలఖారులోగా పరిస్థితిని అంచనా వేసి శ్రీరామనవమిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు నిత్యం భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పక్షం రోజులుగా భద్రాచలానికి భక్తుల తాకిడి భారీగా తగ్గింది. సాధారణంగా శని, ఆదివారాల్లో సుమారు 50వేల మంది భక్తులు రామయ్యను దర్శించుకుంటారు. అయితే ఈ నెల మొదటి నుంచి ఆలయంలో క్యూలైన్లు బోసిపోతున్నాయి. నవమి నాడు ప్రపంచంలో ఎక్కడ సీతారాముల కల్యాణం నిర్వహించాలన్నా భద్రాద్రి రామాలయ వేడుకనే ప్రామాణికంగా తీసుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రా భద్రాద్రిగా భావించే ఒంటిమిట్ట కోదండరామ కల్యాణానికి కరోనా షాక్ తగిలింది. ఇక్కడ లక్షలాది మంది సమక్షంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని రద్దుచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి వల్ల జన సమూహం మధ్య ఇలాంటి ఉత్సవాల నిర్వహణ సాధ్యపడదని పేర్కొంది. దీంతో భద్రాచలంలోనూ సీతారాముల కల్యాణాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి నివేదికలు కోరినట్లు సమాచారం. సంప్రదాయం ప్రకారం కల్యాణాన్ని భక్తుల సమక్షంలోనే నిర్వహించాలా.. భక్తుల్లేకుండా సాదాసీదాగా నిర్వహించాలా?.. అనే అంశాలపై నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. కోదండరాముని బ్రహ్మోత్సవాలు యథావిథిగా జరుగుతాయని, కల్యాణం ఎలా నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆలయ వైదిక కమిటీ అంటోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ఉద్ధృతితో ఇప్పటికే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు సైతం భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశాలు లేవని, దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని కల్యాణం, పట్ట్భాషేకం మహోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే దేవస్థానం రూ. 2కోట్ల వ్యయంతో నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 25 నుంచి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం కూడా ప్రారంభించారు. అయితే భక్తులు రాకుండా కల్యాణం, పట్ట్భాషేకం జరిపితే ఆలయ ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు వేచిచూస్తామని అధికారులు తెలిపారు.

*చిత్రం... భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం