రచ్చ బండ

ముఖ్యమంత్రికి ఉపఎన్నికల సవాలు!

  • 18/02/2012

ఉప ఎన్నికల సమరం మొదలవుతోంది. తెలంగాణలోను, సీమాంధ్రలోను సెంటిమెంట్ల ప్రభావం ఉన్న నేపధ్యంలో ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సవాలు కానున్నాయి. ఉప ఎన్నికల్లో విజయం సాధించడం అన్నది నల్లేరు మీద బండి నడక కాదన్న విషయం ముఖ్యమంత్రి నల్లారికి తెలుసు. ఇప్పటికే ముఖ్యమంత్రిపై మంత్రుల్లో సీనియర్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్న తరుణంలో ఉప ఎన్నికల ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా లేక పోయినా కిరణ్ మీద దాడికి సిద్ధమవుతారు. ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన తర్వాత త్వరలోనే మరో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది.ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి భవిష్యత్తుకు పరీక్ష కానున్నాయి. కాంగ్రెస్ నాయకులకు పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ప్రత్యర్థిని చిక్కుల్లో పెట్టేందుకు పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీసేందుకు కూడా వెనుకాడని మనస్తత్వం కాంగ్రెస్ నాయకులది! అధిపత్యం సాధించడమే వారికి ప్రధానం. ఇందుకోసం వారు దేనికైనా తెగిస్తారు.
ఇప్పుడు ఉపఎన్నికలు జరగనున్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినవి రెండు స్థానాలు ఉండగా, తెలుగుదేశం పార్టీ గెలిచినవి నాలుగు స్థానాలు ఉన్నాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ సభ్యుడు గెలుపొందారు. వాస్తవానికి ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీకి, ఈ సారి తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ధీమాతో ఉన్న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు భవష్యత్తుకే అసలు పరీక్ష. ఉపఎన్నికలు జరగబోయే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు తెలంగాణ ప్రాంతంలో ఉండగా ఒక స్థానం సీమాంధ్రలో ఉంది. తెలంగాణలో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందే ప్రకటించడం ద్వారా ఈ ఉప ఎన్నికల్లో ప్రజల దృష్టి ఆ పార్టీ మీద పెద్దగా పడకుండా జాగ్రత్త పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేది ఒకే ఒక్క స్ధానం నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే. పోటీ చేస్తున్న ఈ ఒక్క స్థానంలో గెలుపొందడం ఖాయమన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. అదే జరిగినట్లయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో నూరు శాతం విజయం సాధించినట్లవుతుంది.
ఉప ఎన్నికలు జరగబోయే ఏడు స్ధానాల్లో కనీసం మూడింటినైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. గతంలో తాము గెలుచుకున్న నాలుగు స్ధానాల్లో కనీసం రెండు, మూడు స్థానాలు గెలుచుకున్నా పార్టీ కార్యకర్తల్లో భవిష్యత్తు మీద ఆశ ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్ధానాలకు, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ సొంత జిల్లా కావడం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేసింది వైఎస్ భార్య, కుమారుడు కావడంతో ఇక్కడ కాంగ్రెస్ ఓటమి చెందినా వైఎస్ పట్ల సానుభూతి అని చెప్పి కాంగ్రెస్ తప్పించుకుంది. అలాగే బాన్సువాడలో కూడా తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి సమాధాన పడాల్సి వచ్చింది. కానీ ఇపుడు జరుగుతున్న ఏడు అసెంబ్లీ స్ధానాలకు, త్వరలో జరగనున్న పదిహేడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో ఇటువంటి సాకులు చెప్పడం సాధ్యం కాదు. తెలంగాణలో సెంటిమెంట్ గతంలో ఉన్నంత ఇప్పుడు లేదని, అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న జగన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోందని కాంగ్రెస్ నాయకత్వం చెప్పడమే అందుకు కారణం.
తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ ఇద్దరూ కాంగ్రెస్‌కు, తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి శత్రువులు. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న విషయం బహిరంగ సత్యం. ఇప్పుడు జరగబోయే ఏడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లో తెలుగుదేశం, తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ద్వారా రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని అనుసరించవచ్చు. అయితే ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నంత మాత్రాన విజయం సాధిస్తామన్న నమ్మకం లేదు.
ఉప ఎన్నికల్లో భారమంతా ముఖ్యమంత్రి కిరణ్ మీదనే పడనుంది. ఒకవేళ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ గెలుపు కాంగ్రెస్‌ది, సోనియాగాంధీ నాయకత్వానిది అని చెప్పే కాంగ్రెస్ నాయకులు ఓటమి చెందితే మాత్రం దాన్ని ముఖ్యమంత్రికే అంటగడతారు. ఈ పరిస్థితిలో విజయాన్ని తనకు ఆపాదించకపోయినా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రికి పెద్ద ఊరటే. ఈ ఉపఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరగనున్న పదిహేడు అసెంబ్లీ స్ధానాలకు జరిగే ఉపఎన్నికలపైనా పడుతుంది. ఒక విధంగా మొత్తం 24 నియోజకవర్గాలకు ఒకటే సారి ఉపఎన్నికలు జరిగి ఉంటే ముఖ్యమంత్రికి బాగుండేదేమో? ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క చోటైనా కచ్చితంగా గెలుస్తామని ధీమాగా చెప్పే స్థితిలో కాంగ్రెస్ నాయకులు లేరు. కాబట్టి ఫలితాల వ్యతిరేక ప్రభావం ముఖ్యమంత్రి మీద ఒకసారి మాత్రమే పడుతుంది. కానీ ఇప్పుడు ఏడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాల మీద దీన్ని మరచిపోయే సమయంలో పదిహేడు అసెంబ్లీ స్ధానాల ఫలితాల ప్రభావం ముఖ్యమంత్రి మీద పడుతుంది. ముఖ్యమంత్రి వ్యతిరేకులు ఎదురు చూస్తున్నది కూడా ఇందుకోసమే. ఇప్పటి వరకు కిరణ్‌కు వ్యతిరేకంగా అధిష్ఠానం వద్ద చెబుతున్న కారణాలు ముఖ్యమంత్రిని మార్చాలని అధిష్ఠానం ఆలోచన చేసేంత బలమైనవి కావు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర లోపే సమయం ఉంటుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపైనే అధిష్ఠానం దృష్టిపెట్టవచ్చు. అపుడు ఎటువంటి మార్పులకైనా ఆలోచన చేయవచ్చు. అధిష్ఠానానికి అటువంటి ఆలోచన రాకుండా చేయడం అన్నది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల్లో ఉంది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading