జాతీయ వార్తలు

లౌకికవాదానికి వక్రభాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక అశాంతికి అదే కారణం
42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చారు
ఈ ఆలోచన అంబేద్కర్‌కు ఎన్నడూ లేదు
అందరి హక్కులకూ పూర్తి రక్షణ
రాజ్యాంగంపై చర్చలో రాజ్‌నాథ్ ఉద్ఘాటన

న్యూఢిల్లీ, నవంబర్ 26: అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగం పట్ల నిబద్ధతమై గురువారం లోక్‌సభలో జరిగిన విస్తృత స్థాయి చర్చ అధికార విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దారితీసింది. రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకికవాదం అన్న భావనను విపక్షాలు తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేశాయని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అన్న పదాన్ని చేర్చాలన్న ఆలోచన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఎన్నడూ లేదని చర్చను ప్రారంభించిన రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అయితే 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో ఈ పదాన్ని చేర్చారని గుర్తు చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠిలో సామ్యవాదం, లౌకికవాదం అన్న మాటల్ని చేర్చారని, అందుకు తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. అంబేద్కర్ మాత్రం ఈ రెండు పదాల్ని రాజ్యాంగ పీఠికలో చేర్చాలని ఏ కోశానా ఆలోచించలేదు. అందుకు కారణం ఈ రెండు భావనలూ రాజ్యాంగ స్ఫూర్తిలో భాగం కావడమే’నని కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య రాజ్‌నాథ్ తెలిపారు. సెక్యులరిజం అన్న పదాన్ని హిందీలో ‘్ధర్మ నిరపేక్షత’గా అనువదించడాన్ని వ్యతిరేకించిన ఆయన ఈ మాటకు అసలు అర్థం ‘పథ నిరపేక్షత’అని వివరించారు. లౌకికవాదానికి అధికారిక హిందీ అనువాదం ఇదేనని, దీనే్న ఉపయోగించాలని స్పష్టం చేశారు. దేశంలో సెక్యులరిజం అన్న మాటను చాలా తీవ్ర స్థాయిలోనే తప్పుడు భావనల్లో దుర్వినియోగం చేశారని..ఈ ధోరణికి స్వస్తి పలకాలని హోం మంత్రి పిలుపునిచ్చారు. ఈ దుర్వినియోగం కారణంగానే సామాజికంగా ఎన్నో సందర్భాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని తెలిపారు. ఓ పక్క లౌకిక వాద భావన తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతున్నప్పుడు సామాజిక సామరస్యాన్ని పరిరక్షించడం కష్టసాధ్యమన్నారు. రిజర్వేషన్ అంశాన్ని కూడా రాజకీయం చేశారని పేర్కొన్న హోం మంత్రి ‘రిజర్వేషన్ కల్పన అన్నది రాజ్యాంగ నిబంధన. దీనిపై తదుపరి చర్చకు ఎలాంటి ఆస్కారం లేదు’అని ఉద్ఘాటించారు. సామాజిక, రాజకీయ అవసరం కాబట్టే ఆర్హులైన వారికి రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు కల్పించడం జరుగుతోందన్నారు. కుల,వర్గ, మతంతో నిమిత్తం లేకుండా భారత్‌లో జన్మించిన ప్రతిఒక్కరూ భారతీయులేనని, వారి భద్రత, రక్షణకు తమ ప్రభుత్వం కంకణ బద్ధమై పనిచేస్తుందని తెలిపారు. మత అసహన ధోరణులపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కూడా హోం మంత్రి రాజ్‌నాథ్ పరోక్షంగా ధ్వజమెత్తారు. ‘ఎంతగా వివక్షకు, అవమానానికి గురైనా అంబేద్కర్ ఎప్పుడూ కూడా దేశాన్ని వదిలి వెళ్లాలనుకోలేదు’అని పేర్కొన్నారు. ముస్లింలలో 72తెగలు నివసిస్తున్న ఏకైక దేశం భారత దేశమని, ఇతర దేశాల్లో ఎన్నో రకాలుగా వేధింపులకు గురవుతున్నప్పటికీ యూదులు, జొరాష్ట్రియన్లు భారత్‌లోనే సురక్షితంగా ఉన్నారని హోం మంత్రి తెలిపారు. అంబేద్కర్‌కు ఘన నివాళులర్పిస్తూ దేశ నిర్మాణంలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని శ్లాఘించారు. రాముడ్ని మించిన ప్రజాస్వామ్యవాది మరొకరు లేరని, ఎవరోఏదో అన్నందుకు తన భార్య సీతకే అగ్నిపరీక్ష పెట్టారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అంబేద్కర్ అలోచనలు, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభావితం కావడం వల్లే ప్రధాని మోదీ జనధన యోజన, స్వచ్ఛ్భారత్, బేటీ బడావో బేటీ పడావో వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని తెలిపారు.