రాష్ట్ర వార్తలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 22: ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని విశాఖపట్నం రైల్వేజోన్ సాధన సమితి ప్రతినిధులు పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీకి బుధవారం వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడకు వచ్చిన కమిటీ బృందాన్ని సాధన సమితి ప్రతినిధులు కలిసి పెండింగ్‌లో ఉన్న అనేక రైల్వే సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్ళారు. విశాఖపట్నం పోర్టుట్రస్టు, గంగవరం పోర్టు, భీమిలి పోర్టు, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, హెచ్‌పిసిఎల్, ఐటి రంగంతో పురోభివృద్ధి సాధిస్తున్న విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయన్నారు. మళ్ళింపు మార్గంలో నడుస్తున్న రైళ్ళను విశాఖకు తీసుకురావాలన్నారు. రైల్వేపరంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. ఇవన్నీ జరిగితే ఈస్ట్‌కోస్ట్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌కు తగిన న్యాయం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బిజెపి, టిడిపి నాయకులు రామకోటయ్య, వాసుపల్లి గణేష్‌కుమార్ కమిటీ చైర్మన్ టి.ఆర్.బాలుతో మాట్లాడుతూ డిఫెన్స్, అగ్రికల్చర్ వంటి భారీ పరిశ్రమలు విశాఖ కేంద్రంగా ఉన్నాయని, వీటితో పాటు పోర్టులున్నాయని వీటి ద్వారానే సరకు రవాణా నిమిత్తం అవసమయ్యే బోగీలు అందుబాటులో లేవన్నారు. దీనివల్ల ఆదాయం కోల్పోతోందన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని, ప్రత్యేక జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీరుతాయన్నారు. దువ్వాడ మీదుగా మళ్ళింపు మార్గంలో నడుస్తున్న రైళ్ళను విశాఖకు తీసుకురావాలన్నారు. దీనిపై స్పందించిన కమిటీ చైర్మన్ బాలు సంబంధితాధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు, బొబ్బిలి ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మికి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు.
Add new comment