డైలీ సీరియల్

పూలకుండీలు 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మాటలు విన్న శాంతమ్మ మనసులో ‘‘అయ్యో! దేవుడు లాంటి నా పెనిమిటిని ఎన్ని రకాలుగా మోసం జెయ్యాలో అన్ని రకాలుగా మోసం చేస్తున్నాను గదా!’’ అన్న ఆలోచన సొరచేప ముల్లులా గుండెల్లో గుచ్చుకుంటుంటే బాధతో కన్నీళ్ళు తుడుచుకోసాగింది.
ఆ తరువాత కొంతసేపటికి ‘‘సరే, నేను రేపొద్దునే్న వస్తాగాని అప్పటిదాకా నీకేదన్నా అవసరమైతే వాడుకోడానికుంచు’’ అంటూ ప్యాంట్ వెనుకజేబులో నుండి పర్సు బైటికి తీసి, దాన్లో నుండి ఓ ఐదొందల కొత్త నోటు శాంతమ్మ చేతికి అందించాడు వెంకటరెడ్డి.
మొహమాటపడుతూనే ఆ నోటు అందుకున్న శాంతమ్మ దాన్ని దిండుకింద పెట్టుకుంది.
ఇక బైటికి వెళ్ళబోతు మళ్లీ అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినవాడిలా ‘మర్చేపోయాను మీ ఆర్‌ఎంపి లింగయ్య డబ్బుల విషయం గురించి మీకేమన్నా ఫోన్ చేశాడా?’’ అదోమాదిరిగా కనుబొమ్మలు విరుచుకుంటూ అడిగాడు వెంకటరెడ్డి.
‘‘ఏ డబ్బులు?’’ అర్థం కానట్టు అడిగింది శాంతమ్మ.
‘‘అదే నీకొచ్చే మూడు లక్షల గురించి’’ ఎలుగుబంటు మాదిరిగా తల ఆడిస్తూ అన్నాడు వెంకటరెడ్డి.
‘‘ఏం చెప్పలేదే!’’ ఓ వంక అతని మాటల వెనుక ఆంతర్యం ఏమై వుంటుందోనన్న ఆలోచన చేస్తూ మరోవంక బదులిచ్చింది శాంతమ్మ.
‘‘ఏం చెప్పలేదా!?’’ గుమ్ములకొద్ది ఆశ్చర్యాన్ని గుమ్మరిస్తూ అనుకొచ్చాడు వెంకటరెడ్డి.
‘‘నిన్నటినుంచి అతనసలు నాకు ఫోనే చెయ్యలేదు?’’ ఇంకా పొడిగిస్తే ఏం వినాల్సొస్తుందోనన్న భయం మెదడు పొరలను నెమ్మదిగా తొలుచుకొస్తుంటే అనుకొచ్చింది శాంతమ్మ.
‘‘కావాలనే చెప్పలేదేమో’’ సందిగ్ధంగా అనుకొచ్చాడు వెంకటరెడ్డి.
‘‘అదేంది!?’’ అంది శాంతమ్మ అతని ముఖ కవళికల్లో మార్పును గమనిస్తూ...
‘‘ఏముంది నీకొచ్చే డబ్బుల్లోనుండి యాభై వేలు కమీషన్ కింద మేం తీసుకుంటాం. అసలీ విషయం నీకెప్పుడో చెప్పాల్సి వుండె. ఇప్పటిదాకా చెప్పలేదంటే అతనే్నమనుకోవాలో నాకర్థంగావట్లేదు!’’ ఇంతదూరం వచ్చి ఇన్ని టెస్టులు చేయించుకొని, భర్తను కూడా వెంటనే బయలుదేరి రమ్మంటూ ఫోన్ చేసిన తరువాత నువ్వు ఇంకెక్కడికి పోతావులే అన్న ధీమాను తన ప్రతి పదంలోనూ వ్యక్తం చేస్తూ మాటలనే తూటాలుగా పేలుస్తూ చెప్పుకొచ్చాడు వెంకటరెడ్డి.
‘‘కమీషనా!? మునిమాపువేళ డొంకదారిన వంటరిగా వస్తుంటే రక్తపింజర ఒకటి నోరు తెరచుకొని ఎదురైనట్లుగా ఒక్కసారిగా భయ విహ్వలత్వానికి లోనైన శాంతమ్మ బేలగా చూస్తూ లోగొంతుకతో వెంకటరెడ్డిని ప్రశ్నించింది.
‘‘ఔను’’ అదో అతి సాధారణ విషయమైనట్టు చాలా నింపాదిగా అన్నాడు వెంకటరెడ్డి.
‘‘మరి తనో యాభై వేలు తీసుకుంటాం అన్నాడు గదా? అవి మీ లెక్కలోకి రావా!?’’ ఆశ్చర్యం నుండి కొంత తెప్పరిల్లుతూ అడిగింది శాంతమ్మ దుఃఖాన్ని అదిమిపట్టుకుంటూ...
‘‘అతని లెక్క అతనిదే మా లెక్క మాదే’’ శాంతమ్మ వంక విసుగ్గా చూస్తూ గట్టిగా అన్నాడు వెంకటరెడ్డి.
‘‘ఎంత అన్యాయం!’’ ఆ మాటలు వింటూనే తన్లో తను గొణుక్కోసాగింది శాంతమ్మ.
‘‘అన్నాయమేంటమ్మా! అన్యాయం విషయం బయటకు పొక్కకుండా దేశం మీదబడి మీలాంటివాళ్ళను వెదికి పట్టుకొని, ఖర్చులు పెట్టుకొని ఇంతదూరం తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించేదెందుకు? మీ అవసరాలు తీరుతాయి, మాకూ నాలుగు పైసలొస్తాయనే గదా? లేకుంటే మీలాంటోళ్ళందరికీ సేవ చేసేటందుకు మేమన్న పచ్చోళ్ళమనుకున్నావా? లేకపోతే మాదేమన్న స్వచ్ఛంద సంస్థ అనుకుంటున్నావా? ఒకవేళ మాకు కమీషన్ ఇవ్వడం నీకిష్టం లేకపోతే చెప్పు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు పాల్వంచలో మీ ఆర్‌ఎంపి లింగయ్య ఇచ్చిన మా పదివేలూ మాకిచ్చి నీ దారిన నువ్వు హాయిగా పోవొచ్చు.
నువ్వు కాకపోతే నీలాంటోళ్ళు దేశం మీద కో అంటే కోటిమంది దొరుకుతారు. ఏదో పేదదానివని ఆ లింగయ్య ఒక్కతీరుగా బ్రతిమాలితే పోనీలెమ్మని నిన్ను పిలిపించాంగాని, మాకు మనుషులు దొరక్కగాదు దేశం గొడ్డుబోయిందనీగాదు’’ ఎదుటివాళ్ళను మానసికంగా ఎలా లొంగదీసుకోవాలో బాగా ఎరిగివున్న వెంకటరెడ్డి, శాంతమ్మ మనసు చదివినట్టే దబాయిస్తూ మాట్లాడాడు.
వెంకటరెడ్డి మాటలను విన్న శాంతమ్మ ఒక్కసారిగా సాలెగూటిలో చిక్కుకున్న ఈగలాగా నిస్సహాయంగా తల నేలకు వాల్చుతూ ‘‘ఈ దొంగ బాడకావులు ఇట్లా ఎంతమందిని మోసంజేసి డబ్బులు గుంజుతున్నారో గదా!’’ అనుకుంట ఆలోచనలో కూరుకుపోయింది.
శాంతమ్మ ఏం చెబుతుందో చూద్దాం అన్నట్టు కొంతసేపు ఎదురుచూసిన వెంకటరెడ్డి ఆఖరికి తానే మళ్లీ నోరు విప్పుతూ ‘‘ఏ సంగతీ చెప్పకుండా ఆట్లా బెల్లంగొట్టిన రాయి మాదిరిగా నిలబడిపోయావేంది?’’ అన్నాడు.
‘‘నలుగురి దగ్గర ఎట్లా తీసుకుంటే నా దగ్గర కూడా అట్లనే తీసుకోండి’’ సాలె గూట్లో చిక్కుకున్న కందిరీగ తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం రెక్కల్లో బలం ఆవిరైపోయేదాకా తారట్లాడినా సాధ్యం కాకపోవటంతో ఇంక విధిలేక తల వాల్చినట్టుగా నెమ్మదిగా చెప్పింది శాంతమ్మ.
‘‘అది ఆ మాటన్నావ్ బాగుంది. మా మీద ఆ మాత్రం నమ్మకముంచు నీకు లాభం జరుగుద్ది’’ గోడమీద బల్లి అరిచినట్టుగా కిచ కిచమని నవ్వుతూ మెట్లమీదుగా కిందికి దిగి వెళ్లిపోయాడు వెంకటరెడ్డి.

11
వెంకటరెడ్డి అంచనా గురి తప్పలేదు.
అతను చెప్పినట్టే మూడవ రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఎల్లయ్య ముంబై నుండి నేరుగా హైదరాబాద్ హాస్పిటల్‌కి చేరుకున్నాడు.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు